సరుకు ఫుల్..డిమాండ్ నిల్
ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు శనివారం పెసలు భారీగా అమ్మకానికి వచ్చాయి. ఇదే అదనుగా భావించిన ఖరీదుదారులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ధర భారీగా తగ్గించి కొనుగోలు చేశారు. వ్యాపారులు, మార్కెట్ వర్గాలు ఊహంచని రీతిలో దాదాపు నాలుగు వేల క్వింటాళ్ల పెసలను రైతులు అమ్మకానికి తెచ్చారు. ఈ సీజన్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఇంతభారీగా సరుకు ఎప్పుడూ అమ్మకానికి రాలేదు.
మార్కెట్లోని ప్రధాన యార్డు ( అపరాల యార్డు)లో ఉన్న 12 షెడ్లలో అమ్మకానికి వచ్చిన పెసలను దించారు. సరుకు భారీగా రావడాన్ని గమనించిన వ్యాపారులు గురువారం వరకు క్వింటాల్ రూ.6,000 నుంచి రూ.6,500 వరకు పలికిన పెసల ధరను ఏకంగా రూ. 1,500 వరకు తగ్గించారు. రూ.4,500 నుంచి రూ.5,000 వరకు మాత్రమే ధర పెట్టారు. జిల్లాలో పెసర సాధారణ విస్తీర్ణం 8,883 హెక్టార్లు కాగా ఈ ఏడాది వర్షాభావ పరస్థితులు నెలకొనటంతో 6,050 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. వర్షాలు అనుకూలంగా లేక పోవటంతో సాగు చేసిన పైరు నుంచి కూడా ఆశించిన పంట దిగుబడి రాలేదు. ఈ నేపథ్యంలో పెసలకు బాగా డిమాండ్ ఉంది. రాష్ట్రవ్యాప్తంగా క్వింటాల్ పెసలు రూ. 6 వేలకు పైగానే ధర పలుకుతోంది.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మాత్రం ఆ ధర లేదు. జెండా పాట బాగానే నిర్వహించారు. శనివారం జెండాపాట రూ.6వేలు పలికింది. కానీ అధికమొత్తం సరుకును రూ. 4500 నుంచి 5,000కు మించి ధర పెట్టలేదు. ధరలో భారీ వ్యత్యాసం ఏమిటని రైతులు ప్రశ్నిస్తే.. సరుకు నాణ్యత లేదని, తేమ శాతం ఎక్కువగా ఉందని వ్యాపారులు కుంటిసాకులు చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. ఖమ్మం నగరంలోని దాల్మిల్ వ్యాపారులు ఈ పెసలు కొనుగోలు చేస్తున్నారు.
దాల్ మిల్ వ్యాపారులు కొద్దిమంది మాత్రమే ఉండటంతో వారంతా రింగై కమీషన్ వ్యాపారుల ద్వారా సరుకును కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో పంట అంత ఆశాజనకంగా లేకపోయినా పొరుగు జిల్లాలైన వరంగల్, నల్లగొండ, కృష్ణా జిల్లాల నుంచి ఖమ్మం మార్కెట్కు సరుకు అమ్మకానికి వస్తోంది. అసలే అంత ంతమాత్రం దిగుబడి వస్తోందని ఆవేదన చెందుతుంటే తీరా ఇక్కడికి వచ్చాక రూ.1500 ధర తగ్గించి కొనుగోలు చేయడమేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు.