బైడెన్, ట్రంప్ మధ్యేనా పోరు?
రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ బైడెన్, ట్రంప్ మధ్యే పోరు ఉండబోతున్నట్టు కనబడుతోంది. ఆ ఇద్దరిలోనూ ప్రస్తుతానికైతే ప్రజాభిప్రాయ సర్వేలు ట్రంప్‌కు స్వల్పంగా ఎక్కువ ఆదరణ చూపుతున్నాయి. నవంబర్ నాటికి ఇది తలకిందులవుతుందని బైడెన్ వర్గం నమ్ముతోంది. ఎవరు గెలిచినా, అమెరికాకు ప్రధాన పోటీదారుగా చైనాను నిలపడంలో, అమెరికాకు ప్రయోజనం చేకూర్చని వాణిజ్య ఒప్పందాల విషయంలో ఇరువురిదీ ఒకే బాట. కాకపోతే వాతావరణ విధానం, వలసలు, సుంకాలు, ప్రజాస్వామ్యం వంటి అంశాల్లో ముఖ్యమైన తేడాలు ఉంటాయి. వాణిజ్యం, వలసల విషయంలో భారత్ నాటకీయ మార్పులను ఎదుర్కోవాల్సి ఉంటుంది; అదే సమయంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా తనను తాను సర్దుబాటు చేసుకోగలుగుతుంది.
భారతదేశం ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో, అమెరికాలో కూడా ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఇప్పటికైతే అధ్యక్ష అభ్యర్థులుగా ప్రస్తుత అధ్యక్షుడు, డెమొక్రాట్ అయిన జో బైడెన్, మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అయిన డోనాల్డ్ ట్రంప్ ఉండేట్టే కనబడుతోంది. బైడెన్ వృద్ధాప్యం సహా, ద్రవ్యోల్బణం, సరిహద్దు భద్రత, పశ్చిమాసియా విధానంపై ఆయన తీరు మీద ఓటర్లు అసంతృప్తిగా ఉండటంతో, ప్రజాభిప్రాయ సర్వేలు ప్రస్తుతానికి ట్రంప్‌కు స్వల్పంగా ఎక్కువ ఆదరణ ఉన్నట్టు చూపుతున్నాయి. అయితే ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు, తక్కువ నిరుద్యోగం, రుణ విముక్తి, చట్టపరంగా ట్రంప్ ఎదుర్కొంటున్న కష్టాలు వంటివి... నవంబర్ నాటికి ప్రజలు ఎన్నికలకు వెళ్లే సమయా నికి ఆటుపోట్లను తిప్పికొట్టగలవని బైడెన్ వర్గం నమ్ముతోంది.
ఈ ప్రారంభ దశలోనే, అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంచనా వేయడం నిష్ఫలమే అవుతుంది. అయినప్పటికీ కొన్ని రాష్ట్రా లలో తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాలలో ఫలితం ఇప్పటికే తేలినట్టయింది. ఇక మొత్తం ఫలితం దాదాపు ఆరు కీలకమైన ‘స్వింగ్ స్టేట్స్’(ఊగే రాష్ట్రాలు) ద్వారా, పది లక్షల కంటే తక్కువ ఓట్ల ద్వారా మాత్రమే నిర్ణయించబడుతుంది. పరిశీలకులు విధానపరమైన చిక్కు లను అంచనా వేయడం ప్రారంభించడం వివేకం. అయితే విధాన పరమైన నిర్ణయాలు అలాగే కొనసాగవచ్చు, కాకపోతే వాణిజ్యం, వలస విధానంలో కొన్ని నాటకీయ మార్పులు ఉండవచ్చు.
అనేక అంశాల విషయంలో– ట్రంప్, బైడెన్ హయాంలు రెండింటిలోనూ గత ఎనిమిది సంవత్సరాలుగా గణనీయమైన కొనసాగింపు ఉంది. ఒకటి: అమెరికా అగ్రగామి వ్యూహాత్మక పోటీదారుగా చైనా ఉంటుందని చాలావరకు అర్థమైపోయింది. దీనివల్ల ఇండో–పసిఫిక్ ప్రాంతంలో అమెరికా దేశీయ, ఆర్థిక, భద్రతా విధానాలలో మార్పు లకు దారితీసింది. రెండు: నయా ఉదారవాదం లేదా ప్రపంచీకరణ స్ఫూర్తితో ఇకపై పరస్పర సంబంధం లేని మార్కెట్ ప్రాప్యతను అందించకూడదని అమెరికా విశ్వసిస్తోంది.
అమెరికాకు అనుకూలంగా క్రీడా మైదానాన్ని మార్చని వాణిజ్య ఒప్పందాలు ఇకపై కుదిరే ప్రశ్నే లేదు. మూడు: అమెరికా పాలకవర్గం ప్రత్యక్ష, బహిరంగ సైనిక యాత్రలకు వ్యతిరేకంగా ఉంది. దీనిని విమర్శకులు ‘ఎప్పటికీ సాగే యుద్ధాలు’గా అభివర్ణిస్తున్నారు. నాలుగు: సమస్యలు ఉన్నప్పటికీ, చాలావరకు ఇజ్రాయెల్, గల్ఫ్ అరబ్ దేశాలకు అమెరికా మద్దతుగా స్థిరంగా ఉంది.
కీలకమైన తేడాలు
అయితే పొత్తులు, వాతావరణ విధానం, వలసలు(ఇమ్మిగ్రేషన్), టారిఫ్‌లు, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై బైడెన్, ట్రంప్ మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. ట్రంప్, అమెరికా మిత్రదేశాలను ఫ్రీలోడర్లుగా (ఇతరుల ఔదార్యాన్ని అవకాశంగా తీసుకునేవారు) విమర్శిస్తున్నప్పటికీ, బైడెన్ మాత్రం యూరప్, ఇండో–పసిఫిక్‌లో మిత్రులే ఫస్ట్ అనే విధానాన్ని అవలంబించారు. ట్రంప్ విజయం ఉత్తర అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో), ఉక్రెయిన్ కు అమెరికా మద్దతు విషయంలో ప్రత్యేక చిక్కులను కొనితెస్తుంది.
డెమొక్రాటిక్ పునాదికి ముఖ్యమైన వాతావరణం, పర్యావరణ విధానాలపై బైడెన్ దేశీయ పరిశ్రమకు, క్రియాశీల వాతావరణ దౌత్యం కోసం భారీ రాయితీలకు మద్దతు ఇచ్చారు. ట్రంప్ ఆ సబ్సిడీలను రద్దు చేయక పోవచ్చు (ఇది రిపబ్లికన్ నియోజకవర్గాలకు ప్రయోజనం చేకూరు స్తుంది) కానీ ఆయన కచ్చితంగా అంతర్జాతీయ వాతావరణ ఒప్పందాలను వెనక్కి తీసుకుంటారు.
వ్యత్యాసం ఉన్న మరొక అంశం వలసలు. వీటిని రిపబ్లికన్లు అడ్డుకోవాలని కోరుకుంటారు. కానీ డెమొక్రాట్లు సులభతరం చేయా లని ఆశిస్తున్నారు. మెక్సికన్ సరిహద్దులో అక్రమ వలసలను అరికట్ట డానికి రిపబ్లికన్ పాలనాయంత్రాంగం ఉద్దేశపూర్వకంగా క్రూరమైన విధానాన్ని అవలంబిస్తుంది. వాణిజ్య అసమతుల్యతలను ఎదుర్కోవ డానికీ సుంకాలు, ఇతర చర్యలను అమలు చేయడానికి ట్రంప్ సుము ఖత వ్యక్తం చేశారు. చివరగా, బైడెన్ తన ప్రాపంచిక దృక్పథాన్ని ప్రజాస్వామ్యం వర్సెస్ నిరంకుశత్వాలను చూపుతుండగా, ట్రంప్ పాలనాయంత్రాంగం మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యం, మానవ హక్కుల గురించి తక్కువ శ్రద్ధ చూపుతుంది.
ఆసియాతో సహా కొన్ని అమెరికన్ మిత్రదేశాలు, భాగస్వాములు ఇప్పటికే రెండవసారి ట్రంప్ అధ్యక్ష పదవికి సంబంధించిన చిక్కు లను అంచనా వేస్తున్నారు. తన ఎజెండా విషయంలో ట్రంప్, ముఖ్యంగా సైనిక సహాయం, వాణిజ్యం, ఇమ్మిగ్రేషన్‌పై ఎక్కువ నిబ ద్ధతతో ఉంటారు; వాటి అమలులో గొప్ప వృత్తిపరతత్వం కూడా కన బరుస్తారు. 2016లో, ట్రంప్ ఏమాత్రం సన్నద్ధత లేకుండా ఎన్ని కలలో విజయం సాధించడం పట్ల తనకు తానే ఆశ్చర్యపోయినట్లు కాకుండా, మళ్లీ అధికారంలోకి తిరిగి వచ్చినప్పుడు తన విజన్‌ని అమలు చేయడంలో మరింత నైపుణ్యం కలిగిన కార్వ నిర్వహణ ఉండ నుంది.
రిపబ్లికన్ పార్టీకి చెందిన చాలా శ్రేణులు ఆయన వెనుకే ఉంటారు. మాజీ వాణిజ్య సంధానకర్త రాబర్ట్ లైట్ థైజర్, మాజీ జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓ’బ్రియన్, దేశీయ విధాన సలహాదారు స్టీఫెన్ మిల్లర్... వాణిజ్యం, విదేశాంగ విధానం, ఇమ్మిగ్రేషన్ విధానాన్ని రూపొందించడంలో కీలక పాత్రలు పోషిస్తున్న వారిలో ఉన్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే కేటా యించాల్సిన చాలా ప్రభుత్వ కీలక పదవులకు సన్నాహాలు జరుగు తున్నాయి. సొంత పార్టీలోని ట్రంప్ విమర్శకులు సైతం పాలనా యంత్రాంగంలో చేరే అవకాశం గురించి ఆయన్ని సంప్రదిస్తున్నారు.
ఇండియాపై ప్రభావం ఉంటుందా?
ఎన్నికల ఫలితాల వల్ల భారతదేశానికి ఎలాంటి చిక్కులు ఎదుర వుతాయి? రక్షణ లేదా సైనిక సహాయం కోసం వాషింVýæ్టన్పై ఆధారపడే అమెరికా మిత్రదేశాలు లేదా అమెరికన్ మార్కెట్ ప్రాప్యతపై ఆధార పడే ప్రధాన వాణిజ్య భాగస్వాములతో పోలిస్తే, ఎన్నికల ఫలితం న్యూఢిల్లీపై కాస్త తక్కువగానే ఉంటుంది. అనేక అంశాలలో, భారత దేశం తనను తాను భారాన్ని పంచుకునేందుకు సిద్ధంగా ఉన్న భాగ స్వామిగా చూపించుకుంటూ, 2017–2021ల మధ్యలానే ట్రంప్ లావాదేవీలకు తనను తాను సర్దుబాటు చేసుకోగలుగుతుంది.
ఏది ఏమైనప్పటికీ, న్యూఢిల్లీ కనీసం రెండు అంశాలలో– వాణిజ్యం, వలసల విషయంలో నాటకీయ మార్పులను ఎదుర్కో వాల్సి ఉంటుంది. అమెరికాతో భారతదేశ వాణిజ్య మిగులు దృష్ట్యా, సుంకాలను అంచనా వేయవలసి ఉంటుంది. పైగా కొన్ని కఠినమైన చర్చలు అనివార్యం అవుతాయి. అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా రక్షణ కల్పిస్తూనే, చైనా నుండి రిస్క్ లేకుండా చూసుకోవడం గురించిన భాగస్వామ్య అవగాహన, ఇప్పటికే ప్రపంచంలోని ఇతర పెద్ద ఆర్థిక వ్యవస్థలైన భారతదేశం, జపాన్, బ్రిటన్, యూరప్‌ల మధ్య చర్చలను రేకెత్తిస్తోంది.
భారత్ విషయంలో వలస సమస్య మరింత నాటకీయంగా ఉంటుంది. చట్టపరమైన వలసదారులు– శాశ్వత నివాసితులు, అధిక నైపుణ్యం కలిగిన నిపుణులు, విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపార వేత్తల ప్రాసెసింగ్‌లో మందగమనం కొనసాగవచ్చు. ఎక్కువ తనిఖీ లను ఎదుర్కోవాల్సి రావొచ్చు. కఠినమైన నిర్బంధాలను ఎదుర్కొనే పత్రాలు లేని వలసదారుల సంఖ్య పెరగవచ్చు. ట్రంప్ విధానాల రూపురేఖలను ఇప్పటికే ఊహించవచ్చు. అయినప్పటికీ, ఆయన విజయం సాధించిన పక్షంలోనూ భారతదేశం చాలా ఇతర దేశాల కంటే ప్రత్యక్షంగా తక్కువ ప్రభావితం కావచ్చు.
ధ్రువ జయ్శంకర్
వ్యాసకర్త ‘ఓఆర్ఎఫ్ అమెరికా’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)