
అలబామా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అలాబామా ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి డౌగ్ జోన్స్ విజయం సాధించారు. గత 25 ఏళ్లుగా అధికార రిపబ్లికన్ పార్టీకి కంచుకోటగా ఉన్న అలబామాలో డెమొక్రాట్లు విజయం సాధించడం ఇదే తొలిసారి. ట్రంప్ మద్దతుతో బరిలోకి దిగిన రిపబ్లికన్ అభ్యర్థి రాయ్ మూర్‌ను ఓడించి.. డౌగ్ జోన్స్ విజయం సాధించారు. అయితే, ఈ ఎన్నికల ఫలితాలను అంగీకరించడానికి మూర్ ససేమిరా అంటుండటం గమనార్హం.
హోరాహోరీ పోరు..!
సంప్రదాయవాద ఓటర్లు అధికంగా ఉన్న అలబామాలో గత 25 ఏళ్లలో ఒక డెమొక్రాట్ అభ్యర్థి విజయం సాధించడం ఇదే తొలిసారి. ఇక్కడ తాజా ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. అయితే, ట్రంప్ మద్దతుతో బరిలోకి దిగిన రాయ్ మూర్‌కు వ్యతిరేకంగా లైంగిక వేధింపులు ఆరోపణలు వెలుగుచూడటం, బాలికలపై ఆయన లైంగిక వేధింపులు పాల్పడ్డట్టు కథనాలు రావడం రిపబ్లికన్లను కుదిపేసింది. ఈ క్రమంలో ఉదారవాద డెమొక్రాట్లకు బ్లాక్ ఓటర్ల అండ లభించడంతో డౌగ్ జోన్స్ విజయం సాధించినట్టు భావిస్తున్నారు.
అలబామాలో డెమొక్రాట్ విజయం.. డొనాల్డ్ ట్రంప్‌కు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఈ విజయంతో అమెరికా సెనెట్ పెద్దలసభ (అప్పర్ చాంబర్)లో రిపబ్లికన్ పార్టీ మెజారిటీ 51-49కి తగ్గిపోయింది. వచ్చే ఎడాది జరగనున్న కాంగ్రెషనల్ ఎన్నికల్లో పెద్దలసభలో రిపబ్లికన్లు మెజారిటీ కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే.. అధ్యక్షుడు ట్రంప్ అజెండా అమలుకు సెనెట్ ఆమోదం లభించడం కష్టమే.
Comments
Please login to add a commentAdd a comment