'ముస్లిం జనాభా పెరుగుదలను నిరోధించండి'
రాంచీ: మత సంబంధమైన జనాభా సంఖ్య విషయమై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మరో తాజా చర్చకు తెరలేపింది. తాజా జనాభా గణన లెక్కల్లో ముస్లిం జనాభా పెరిగిన నేపథ్యంలో భౌగోళిక వర్గ జనాభా అసమతుల్యత సమస్యను పరిష్కరించేందుకు జాతీయ జనాభా విధానాన్ని పునఃసమీక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మత వర్గాల ఆధారంగా జనాభా లెక్కలపై చర్చించేందుకు ఆరెస్సెస్ ఇటీవల సమావేశమైంది.
భారతీయ మూలాలున్న (హిందు, బౌద్ధులు, జైనులు, సిక్కులు) మతవర్గాల జనాభా 1951లో 88శాతం ఉండగా.. ప్రస్తుతం అది 83.8శాతానికి పడిపోయిందని, అదే సమయంలో ముస్లిం జనాభా భారీగా పెరిగిందని, ముఖ్యంగా ఈశాన్య భారతంలో అసాధారణరీతిలో వారి జనాభా పెరుగుతున్నదని ఆరెస్సెస్ పేర్కొంది. అన్ని మతాలవారికి ఏకీకృత జనాభా విధానాన్ని అమలుచేయాలని ప్రభుత్వాన్ని కోరింది. 'ఒక వ్యక్తి కుటుంబనియంత్రణను పాటించకుండా మతం అడ్డుపడితే.. దేశంలోని అన్ని వనరులను పరిగణనలోకి తీసుకొని మనం జాతీయవాద దృక్పథంతో ఒక విధానం తీసుకురావాల్సిన అవసరముంది' అని ఆరెస్సెస్ జాయింట్ జనరల్ సెక్రటరీ కృష్ణ గోపాల్ తెలిపారు. ఉమ్మడి పౌరస్మృతిని అమలుచేయాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో స్పష్టం చేసిందని ఆయన గుర్తుచేశారు.
ఒక వర్గం జనాభా పెరుగుదల రేటుపై ఆరెస్సెస్ గతంలో కూడా పలుసార్లు ఆందోళన వ్యక్తం చేసింది. ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, బిహార్లలో అక్రమ వలస, మతమార్పిడులు అంశంపై నిరసన వ్యక్తంచేసింది. అయితే, ప్రస్తుతం బిహార్ ఎన్నికలు జరుగుతుండటం, కేంద్రంలో బీజేపీ మెజారిటీ సర్కార్ ఉండటంతో ఈ అంశంపై ఆరెస్సెస్ మరింత తీవ్రతతో తీర్మానాన్ని రూపొందించింది. ముస్లిం జనాభా పెరుగుదల రేటును నియంత్రించాల్సిన అవసరముందని పేర్కొంది.