బడిపిల్లల భద్రతకు రవాణా శాఖ చర్యలు
నేటి నుంచి అమలు
హైదరాబాద్: బడిపిల్లల భద్రతపై రవాణాశాఖ దృష్టి సారించింది. విద్యార్థుల కోసం బస్సులు నడిపే విద్యాసంస్థలపై పలు నిబంధనలు విధించింది. భద్రతాలోపాలకు తావు లేకుండా స్కూల్ బస్సులు, డ్రైవర్లు, పయనించే విద్యార్ధులు, బస్సులో ఉండే సహాయకుల వివరాలను రవాణాశాఖ వెబ్సైట్లో నమోదు చేయాలని విద్యాసంస్థలను ఆదేశించింది. విద్యాసంస్థ పేరు, విద్యాశాఖ అనుమతి వివరాలు, బస్సు రిజిస్ట్రేషన్ నంబర్, డ్రైవర్, సహాయకులు, బస్సుల్లో పయనించే విద్యార్థుల పేర్లు, ఫొటోలు, చిరునామాలు నమోదు చేయాలని సూచించింది.
వివరాలు నమోదు చేసిన విద్యాసంస్థల బస్సులకే రవాణా అధికారులు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేస్తారు. ఫిట్నెస్ లేని బస్సులు, అనుభవం కొరవడిన డ్రైవర్ల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో రవాణాశాఖ అప్రమత్తమై ఈ చర్యలు చేపట్టింది. తెలంగాణ అంతటా ఈ నిబంధనలు శనివారం నుంచి అమలవుతాయని హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ రఘునాథ్ తెలిపారు.