Deputy Tehsildar
-
రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దార్ మృతి
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దార్ మృతి చెందారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొహెడకు చెందిన కొమ్మిశెట్టి బాలకృష్ణ (47) ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన కారులో షిరిడీకి వెళ్లారు. దైవ దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణమయ్యారు. బుధవారం కర్ణాటకలోని బసవ కల్యాణి ప్రాంతానికి చేరుకున్నారు. తెల్లవారుజామున రోడ్డుపై ప్రమాదం జరగడంతో బాలకృష్ణ కారును ఆపారు. ఇంతలో టైర్ల లోడుతో వస్తున్న లారీ డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టింది. లారీలోని టైర్లు కారుపై పడ్డాయి. దీంతో బాలకృష్ణ ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందారు. భార్య విజయ, కొడుకు భార్గవ్, కూతురు శ్రీజ, తోడల్లుడి కొడుకు, డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, యాచారం, కందుకూరు, జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో వివిధ హోదాల్లో ఆయన పని చేశారు. బాలకృష్ణ మృతిపై రెవెన్యూ అధికారులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిత్యం తమతో కలివిడిగా ఉంటూ సందడి చేసే బాలకృష్ణ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం బాధగా ఉందన్నారు. అలాగే.. బాలకృష్ణ మృతితో ఆయన స్వగ్రామం అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొహెడలో విషాదఛాయలు అలముకున్నాయి. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాకులు క్యామ మల్లేష్ సంతాపం తెలిపారు. -
రేషన్ డీలర్ కోసం గాలింపు
పెనమలూరు: విధి నిర్వహణలో ఉన్న డిప్యూటీ తహసీల్దార్ (డీటీ) గుమ్మడి విజయ్‌కుమార్‌పై ఈనెల 17న దాడికి కారకుడైన రేషన్ డీలర్ లుక్కా అరుణ్‌బాబు కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత డీలర్ తన కుటుంబ సభ్యులతో పారిపోయిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన తర్వాత అరుణ్‌బాబు గురించి ఆరా తీస్తే అతను పక్కా టీడీపీ వ్యక్తిగా స్పష్టమైంది. అంతేకాక.. స్థానికంగా టీడీపీ నాయకుడిగా చలామణి అవుతున్నాడు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి పేదలకు రేషన్ పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ అరుణ్‌బాబు పచ్చచొక్కా వేసుకుని రేషన్ అక్రమాలకు తెరలేపాడు. ఇతనికి టీడీపీ అగ్రనేతలతో కూడా సత్సంధాలున్నాయని చెబుతున్నారు. టీడీపీ హయాంలోనే నియామకం నిజానికి.. లుక్కా అరుణ్‌బాబును టీడీపీ హయాంలో నిబంధనలు అతిక్రమించి మరీ కృష్ణాజిల్లా పెనమలూరు డీలర్‌గా నియమించారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా ఉంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు నాటి టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌తో ఫొటోలు కూడా దిగాడు. పార్టీ జెండాను భుజంపై వేసుకుని టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడని తెలిసింది. ఈ నేపథ్యంలో.. పార్టీ అండ చూసుకుని రేషన్‌ను పక్కదారి పట్టిస్తున్నాడు. విషయం తెలుసుకున్న డిప్యూటీ తహసీల్దార్ గుమ్మడి విజయ్‌కుమార్ తనిఖీ చేయగా 330 కిలోల బియ్యం, 152 ప్యాకెట్ల పంచదార మాయం చేశాడని తేలింది. డీలర్ లుక్కా అరుణ్‌బాబు గుట్టురట్టు కావడంతో అతనిని కాపాడేందుకు బోడె ప్రసాద్, అతని అనుచరులు అధికారులపై దాడిచేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి అదృశ్యమైన డీలర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. దాడిలో 9 మందికి రిమాండ్ ఇక డిప్యూటీ తహసీల్దార్‌పై దాడి కేసులో తొమ్మిది మందికి కోర్టు రిమాండ్ విధించింది. నిందితులు వంగూరు పవన్, చిగురుపాటి శ్రీనివాసరావు, దొంతగాని పుల్లేశ్వరరావు, కొల్లిపర ప్రమోద్, కిలారు ప్రవీణ్, బోడె మనోజ్, కాపరౌతు వాసు, కిలారు కిరణ్‌కుమార్, వెలివెల సతీష్‌లను పెనమలూరు పోలీసులు అరెస్టుచేసి నిందితులను గురువారం విజయవాడ రైల్వే కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినట్లు సీఐ ఎం.సత్యనారాయణ తెలిపారు. -
కీచక డీటీ సస్పెన్షన్
విజయనగరం గంటస్తంభం : ఆయన బాధ్యత గల అధికారి. కార్యాలయానికి ఎవరూ వచ్చి నా మంచిగా, మర్యాదగా మాట్లాడి పని చేసి పంపాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. బాధ్యత మరిచి, కామ పురాణాన్ని వినిపించి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, లైంగికంగా వేధించడం ఆయన నైజం. ఈ విషయం కలెక్టర్ దృష్టికి రావడంతో సదరు డీటీపై కలెక్టర్ వివేక్‌యాదవ్ వేటు వేశారు. సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే... నెల్లిమర్ల హెడ్‌క్వార్టర్ డిప్యూటీ తహసీల్దారు(హెచ్‌డీటీ) షేక్ ఇబ్రహిం కార్యాలయానికి వివిధ పనులపై వచ్చే మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడుతూ లైంగికంగా వేధించే విధంగా మాట్లాడేవారు. మహిళా ఉద్యోగులపై ఆయన ప్రవర్తన అదే విధంగా ఉండడంతో కలెక్టర్ వివేక్‌యాదవ్‌కు ఫిర్యా దు అందింది. దీంతో వర్కింగ్ ప్లేస్ మహిళా వేధింపులు జిల్లా కమిటీని దీనిపై విచారణ చేయాలని ఆదేశించారు. కమిటీ చైర్మన్, కేఆర్సీ ఎస్డీసీ ఆర్.శ్రీలత, సభ్యులుగా ఉన్న విపత్తుల నిర్వహణ డీపీఎం పద్మావతి, కలెక్టరేట్ సీ సెక్షన్ సూపరిండెంటెంట్ అంజనీకుమారి విచారణ చేశారు. విచారణలో వేధింపులు నిజమని తేలడంతో కమిటీ కలెక్టర్‌కు నివేదిక సమర్పించింది. దీంతో ఆయనను సస్పెన్షన్ చేస్తూ కలెక్టర్ వివేక్‌యాదవ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. డీటీపై గతంలో కూడా లైగింక వేధింపులు ఫిర్యాదులు ఉన్నాయి. దీనిపై ఒకసారి సస్సెన్షన్‌కు గురయ్యారు. గతంలో భోగాపురం హెచ్‌డీటీగా పని చేస్తున్న సమయంలో ఇదే విధంగా మహిళా ఉద్యోగులను లైంగింకంగా వేధిస్తున్నారన్న ఫిర్యాదు అందింది. దీనిపై అప్పట్లో విచారణ చేయగా నిజమని తేలడంతో సస్పెన్షన్ వేటు వేశారు. ఇలా రెండుసార్లు ఆయనపై ఇలాంటి ఆరోపణలు రుజువైనా సస్పెన్షన్లతో సరిపెట్టడం విమర్శలకు తావి స్తోంది. కఠిన నిర్ణయాలు తీసుకోవాలని మహిళా ఉద్యోగులు కోరుతున్నారు. -
ఏసీబీ వలలో రెవెన్యూ చేప
సరుబుజ్జిలి(శ్రీకాకుళం) : ఓ పక్క ఏసీబీ అధికారుల దాడులు విస్తృతంగా జరుగుతున్నా అధికారులు లంచాలు తీసుకోవడం మానడం లేదు. తమను ఎవరు పట్టిస్తారులే అని మొండిగా వ్యవహరించి చిన్న పనికీ డబ్బులు గుంజుతుండడంతో ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నారు. జిల్లాలో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఓ అధికారి ఏసీబీ అధికారులకు శుక్రవారం చిక్కాడు. సరుబుజ్జిలి తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఎం.నాగేంద్రప్రసాద్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. రూ. 10 వేలు (అన్నీ రూ. 2 వేల నోట్లే) లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర తన బృందంతో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో మాటువేసి చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం కరణం రాజేంద్ర విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. సరుబుజ్జిలి మండలంలో నందికొండ గ్రామానికి చెందిన గుర్రాల ఈశ్వరరావు నందికొండ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 4/1లో 2.50 ఎకరాల భూమికి నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) కోసం గత 3 నెలలుగా సరుబుజ్జిలి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయితే ఇక్కడ పనులు చేయడంలేదని, పని జరగాలంటే లంచాలు డిమాండ్ చేస్తున్నట్టు తమ కార్యాలయానికి ఫిర్యాదు చేశాడని చెప్పారు. లంచాలు ఇవ్వడానికి ఇష్టపడని బాధితుడు ఈశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తహసీల్దార్ కార్యాలయంపై దాడులు నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ నాగేంద్రప్రసాద్‌ను పట్టుకున్నట్టు తెలిపారు. పట్టుబడిన ఉద్యోగి నుంచి పూర్వాపరాలు విచారించి కేసు నమోదు చేసి, విశాఖపట్నం ఏసీబీ కోర్టులో సరౌండ్ చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రమేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. తహసీల్దార్ వివరణ ఏసీబీ దాడులు విషయమై స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోని తహసీల్దార్ జేమ్స్ ప్రభాకర్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా అడ్డదారుల్లో పనులు చేయాలని తమపై ఒత్తిళ్లు చేస్తున్నారని ఆయన అన్నారు. తప్పుడు పనులు చేయనందుకు లేనిపోని ఆరోపణలు చేసి ఉద్యోగులను బలిచేస్తున్నారని వివరించారు. ఉద్యోగులు పరుగులు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు జరుగుతున్న సమయంలో పలు శాఖల అధికారులు ఉలిక్కిపడ్డారు. దీంతో తామెక్కడ ఉరిలో పడతామన్న భయంతో తమ సీట్లు వదిలి బయటకు పరుగులు తీశారు. మరికొంతమంది తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది సెల్ఫోన్లు ఆపు చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రెండవసారి దాడులు స్థానిక తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు రెండవ సారి దాడి చేశారు. గతంలో దాడిచేసిన సంఘటనలో నాటి తహసీల్దార్ భాస్కరరావు, ఆర్ఐ ప్రవీణ్‌కుమార్‌ను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కావాలనే బలిచేశారు నేను విధుల్లోకి వచ్చాక ఇక్కడ కార్యాలయంలో జరుగుతున్న తెరచాటు వ్యవహారాలకు చెక్ పెట్టాను. కొంతమంది కక్షకట్టారు. నందికొండ రెవెన్యూ పరిధిలోని హైలెవల్ కాలువ సమీపంలోని భూములకు నిరభ్యంతర పత్రం కోసం కొంతమంది దరఖాస్తు చేశారు. దరఖాస్తును సర్వేయర్, ఆర్ఐ, వీఆర్వోల పరిశీలన కోసం పంపించాను. తప్పుడు ధ్రువీకరణపత్రాలు అందించాలని ఒత్తిడి చేశారు. మూత్ర విసర్జన కోసం బయటకువెళితే బలవంతంగా జేబులో డబ్బులు పెట్టి కావాలనే ఇరికించారు. – ఎం.నాగేంద్రప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్, సరుబుజ్జిలి కాళ్లరిగేలా తిరుగుతున్నా... అధికారులకు లంచాలు ఇవ్వనిదే పనులు జరగడంలేదు. నందికొండ రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 4/1లోని రెండున్నర ఎకరాల భూమికి నిరభ్యంతర ధ్రువీకరణపత్రం కోసం 3 నెలలుగా తిరుగుతున్నాను. రూ. 80 వేలు ఇవ్వనిదే పనిచేయమని డిప్యూటీ తహసీల్దార్ చెప్పడంతో విసిగి రూ. 10 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చేందుకు అంగీకరించి, ఏసీబీకి ఫిర్యాదు చేశాను. అవినీతిని అరికట్టకపోతే సామాన్యులకు న్యాయం జరగదు. – గుర్రాల ఈశ్వరరావు, ఫిర్యాదుదారు, నందికొండకాలనీ -
ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహశీల్దార్
కాజీపేట్: లంచం తీసుకుంటూ కాజీపేట్ డిప్యూటీ తహశీల్దార్ ఏసీబీకి దొరికాడు. ఓ రైతు నుంచి రూ.6 లక్షలు లంచం తీసుకుంటుండగా డిప్యూటీ తహశీల్దార్ అనిల్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. హన్మకొండ టీచర్స్ కాలనీ ఫేస్-2 లో ఉన్న ఆయన ఇంట్లో ప్రస్తుతం తనిఖీలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.