detergent
-
సామాన్యుడికి బిగ్ రిలీఫ్.. హమ్మయ్యా, రెండేళ్ల తర్వాత వాటి ధరలు తగ్గాయ్!
దేశంలోని ప్రముఖ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) సంస్థలలో ఒకటైన హిందుస్థాన్ యూనిలీవర్ (HUL) కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. తన ఉత్పత్తులలో.. ప్రొడక్ట్‌ని బట్టి 2 నుంచి 19 శాతం మేర ధరలు తగ్గించినట్లు తెలిపింది. అధిక ద్రవ్యోల్బణం, పెరిగిన ముడిసరుకు ఖర్చుల మధ్య గత రెంవత్సరాలుగా ధరలను పెంచిన హెచ్‌యూఎల్ సంస్థ.. ఇటీవల ముడి సరుకు ధరలు అదుపులోకి రావడంతో పలు ప్రాడెక్ట్లపై ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం సామాన్యడికి కాస్త ఊరటనిస్తుంది. కాగా కరోనా మొదలుకొని అన్నీ రంగాలు డీలా పడడంతో దాని ప్రభావం చాలా వరకు సామాన్యలపై పడింది. ఈ క్రమంలో ఉద్యోగాల కోత, నిత్యవసరాలు, ఇంధన ధరలు ఇలా అన్ని పెరుగుతూ ప్రజలకు భారంగా మారిన సంగతి తెలిసిందే. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ముడిసరుకు ధరలు గరిష్ట స్థాయిలో పెరిగాయి. దీంతో గత నాలుగు త్రైమాసికాల్లో, ఎఫ్ఎంసీజీ కంపెనీలు 8-15 శాతం మేర ధరలను పెంచాయని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. తాజా ప్రకటనతో.. సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్, రిన్ డిటర్జెంట్ పౌడర్, లైఫ్‌బోయ్ సబ్బు, డోవ్ సోప్ వంటివి ఉత్పత్తుల ధరలు తగ్గాయి. అయితే, కొందరి డిస్ట్రిబ్యూటర్ల ప్రకారం, అన్ని ధర తగ్గించిన వస్తువులు ఇంకా మార్కెట్లోకి అందుబాటులో లేదని తెలిపారు. సవరించిన ధరలు కలిగిన స్టాక్ నెలాఖరుకు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఫేస్బుక్ సంచలన నిర్ణయం: 12వేల మంది ఉద్యోగులు ఇంటికి! -
ఇంటిప్స్
నాన్‌స్టిక్ పాత్రలు, పెనాలను సులభంగా శుభ్రం చేయాలంటే... వాటిలో వేడినీటిని పోసి పది నిమిషాలసేపు అలాగే ఉంచి తర్వాత క్లీనింగ్ పౌడర్‌తో కాని డిటర్జెంట్‌తో కాని కడగాలి. షూస్ మీద మొండి మరకలు ఉండి వదలకపోతే వాటి మీద ఆఫ్టర్ షేవ్ లోషన్ కొద్ది చుక్కలు వేసి తుడవాలి. -
గచ్చు అందం రెట్టింపు..!
సాక్షి, హైదరాబాద్: గ్రానైట్, మార్బుల్ కొత్తలో ఇట్టే ఆకట్టుకుంటాయి. నిర్వహణలో శ్రద్ధ లేకపోతే గచ్చుపై మురికి పేరుకుపోయి వికారంగా కనిపిస్తాయి. ఇలాంటి సమస్యలు వద్దనుకుంటే నిర్వహణలో నిర్లక్ష్యం వహించకూడదు. మల్లెకన్నా తెల్లనిది మార్చుల్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంత ప్రత్యేకత గత పాలరాతిని ఎంత ఇష్టంగా ఎంచుకుంటామో.. శుభ్రపరిచే విషయంలోనూ అంతే ఇష్టాన్ని కనబర్చాలి. ఠి ఫ్లోర్ మీద పడిన దుమ్ము, ధూళిని ఎప్పుడూ మెత్తని గుడ్డతో తుడవాలి. నీళ్లతో కడగాలనిపిస్తే గోరువెచ్చని నీటిని వాడండి. ఈ నీటిలో తక్కువ శక్తిగల డిటర్జెంట్ పౌడర్లను వాడాలి. ఎట్టి పరిస్థితుల్లోను ఎక్కువ వేడి గల నీటిని వినియోగించవద్దు. మరకల్ని తొలగించేందుకు పదునైన సాధనాలను వాడరాదు. ఠి నేలను కడిగాక మెత్తటి పేపర్ టవల్‌తో తుడిస్తే సరిపోతుంది. మార్కెట్లో నాణ్యమైన మార్బుల్ క్లీనర్లు దొరకుతున్నాయి. ధర తక్కువని నాసిరకం క్లీనర్లను వాడితే ఖరీదైన మార్బుల్ వెలవెలబోతుంది. ఠి మార్బుల్ కాంతులు వెలసిపోవద్దనుకుంటే కాఫీ, టీ వంటి ఇతరత్రా ద్రవ పదార్థాలను నేల మీద పడకుండా జాగ్రత్త పడితే మంచిది. నిత్యం మెరవాలంటే.. గట్టిదనానికి మారుపేరు గ్రానైట్. నిర్వహణ కూడా సులువే. ఈ ఫ్లోరింగ్ ఎప్పటికప్పుడు మెరిసిపోతూ ఉండాలంటే.. పాత్రలను తోమే డిటర్జెంట్ పౌడరును కలిపి గోరు వెచ్చని నీటితో ప్రతిరోజు కడిగి మెత్తటి బట్టతో తుడిస్తే గ్రానైట్ ఫ్లోర్ తళతళమెరుస్తుంది. ఠి వంట గదిలో కూరగాయలు, తదితరాలను కోసేందుకు గ్రానైట్ ఐల్యాండ్‌ను వాడొద్దు. అలాచేస్తే గీతలు పడి అసహ్యంగా కనిపిస్తుంది. ఠి గ్రానైట్‌ను కడిగే నీటిలో నాసిరకం డిటర్జెంట్ పౌడర్లను వాడొద్దు. అవి గ్రానైట్‌ను కాంతి విహీనం చేస్తాయి. ఠి మార్కెట్లో స్టోన్ పాలిష్ లభిస్తున్నాయి. వీటితో అప్పుడప్పుడు ఫ్లోర్‌ను పాలిష్ చేయించండి. -
డిటర్జెంట్ల తయారీలోకి జీసీసీ!
సాక్షి, విశాఖపట్నం: గిరిజన సహకార సంస్థ (జీసీసీ) డిటర్జెంట్ సబ్బుల తయారీలోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే జీసీసీ వివిధ రకాల స్నానపు సబ్బులను తయారు చేస్తోంది. తాజాగా గిరిజనుల కోసమే డిటర్జెంట్ (బట్టలు ఉతికే) సబ్బులను ఉత్పత్తి చేసి విక్రయించడానికి సన్నాహాలు పూర్తి చేసింది. విజయనగరంలో ఉన్న జీసీసీ సబ్బుల తయారీ యూనిట్ ప్రాంగణంలోనే ఈ డిటర్జెంట్లను కూడా తయారు చేయనున్నారు. మార్కెట్లో గిరిజనులు ఇతర రకాల డిటర్జెంట్ సబ్బులను రూ.15–20కు (100 గ్రాములు) కొనుగోలు చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని వివిధ సంతల్లో 70 శాతానికి పైగా అసలును పోలిన నకిలీ డిటర్జెంట్ సబ్బులనే విక్రయిస్తుంటారు. మార్కెట్లో పేరున్న బ్రాండ్ల సబ్బుల్లా కనిపించేలా రేపర్లను (పై కవర్ల) ముద్రించి విక్రయిస్తున్నారు. వీటిలో నాణ్యత లేకున్నా గత్యంతరం లేక గిరిజనులు కొనుగోలు చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన డిటర్జెంట్ సబ్బులను తయారు చేసి, గిరిజనులకు తక్కువ ధరకు విక్రయించాలని జీసీసీ ఉన్నతాధికారులు యోచించారు. దీంతో విజయనగరంలో ఉన్న సబ్బుల తయారీ యూనిట్లో వీటిని ప్రయోగాత్మకంగా ఉత్పత్తి చేశారు. వాటి నాణ్యతను నిర్ధారించుకున్నాక ఇప్పుడు తయారీకి సిద్ధమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నెలకు సగటున రెండు లక్షల డిటర్జెంట్ సబ్బుల వినియోగం జరుగుతున్నట్టు జీసీసీ అధికారులు అంచనాకు వచ్చారు. దీంతో ఆ మేరకు ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. వీటిని జీసీసీకి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డీఆర్ (డొమెస్టిక్ రిక్వైర్మెంట్) డిపోల ద్వారా విక్రయించాలని నిర్ణయించారు. వంద గ్రాముల సబ్బు రూ.5 ధరకే విక్రయిస్తారు. దీనివల్ల గిరిజనులకు ఆర్థికంగా లబ్ధి చేకూరనుంది. గిరిజనుల కోసమే..: ఈ సబ్బులను బయట మార్కెట్లో కాకుండా గిరిజన ప్రాంతాల్లోని డీఆర్ డిపోల్లోనే విక్రయిస్తాం. బయటి సబ్బుల కన్నా నాణ్యంగా, తక్కువ ధరకే అందిస్తాం. విజయనగరం యూనిట్‌కి నెలకు 6లక్షల సబ్బుల తయారీ సామర్థ్యం ఉంది. ఇప్పటికే వీటిని ప్రయోగాత్మకంగా తయారు చేశాం. త్వరలో అమ్మకాలు చేపడతాం. – ఏఎస్‌పీఎస్ రవిప్రకాష్, ఎండీ, జీసీసీ -
లిక్విడ్ డిటర్జెంట్లతో పిల్లలకు ప్రమాదం!
అమెరికాః లిక్విడ్ లాండ్రీ డిటర్జెంట్ లతో పిల్లలకు ప్రమాదం అంటున్నారు వైద్య నిపుణులు. లిక్విడ్ డిటర్జెంట్ల లో భారీగా రసాయనాలను వినియోగిస్తారని అందుకే ఆ లిక్విడ్స్ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలు చూపించడమే కాక మరణానికి కూడ దారితీస్తాయని చెప్తున్నారు. డిటర్జెంట్ లిక్విడ్స్ వినియోగం పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు, గుండెజబ్బులను వ్యాపింపజేయడంతోపాటు.. ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆన్ లైన్ జనరల్ పిడియాట్రిక్స్ లో ప్రచురించిన తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. లిక్విడ్ డిటర్జెంట్లు పిల్లలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని అమెరికాలో నిర్వహించిన సర్వేలు చెప్తున్నాయి. జనవరి 2013 నుంచి డిసెంబర్ 2014 వరకు అమెరికాలోని పాయిజన్ కంట్రోల్ సెంటర్లు అందుకున్న సుమారు 62,254 ఫోన్ కాల్స్ ద్వారా ఎక్కువ శాతం లాండ్రీ, డిష్ వాష్ డిటర్జెంట్ ప్యాకెట్లతో ఆరేళ్ళలోపు పిల్లలకు తీవ్ర ఆనారోగ్యాలు చేకూరుతున్నట్లు తెలుసుకున్నారు. రెండేళ్ళ అధ్యయన కాలంలో ఈ సమస్య 17 శాతం పెరిగినట్లుగా కూడ చెప్తున్నారు. పాయిజన్ కంట్రోల్ సెంటర్లకు డిటర్జెంట్ లిక్విడ్లతో పిల్లలకు కలుగుతున్న నష్టాలపై రోజుకు 30 కన్నా ఎక్కువ కాల్స్ వచ్చేవని, లిక్విడ్ డిటర్జెంట్ లకు ఎక్స్పోజ్ అయిన పిల్లల్లో కనీసం రోజుకు ఒక్కరైనా ఆస్పత్రిలో చేరే పరిస్థితి ఉందని చెప్తున్నారు. అంతేకాదు డిటర్జెంట్ల వల్ల ఏకంగా ఇద్దరు పిల్లల మరణాలు కూడ నమోదైనట్లు అధ్యయనకారులు కనుగొన్నారు. అయితే లిక్విడ్ లాండ్రీ డిటర్జెంట్లలో ప్రమాదకర రసాయనాలు ఉంటాయని, అవి పిల్లలకు హాని కలిగిస్తాయన్న విషయాన్ని చాలా కుటుంబాలు గుర్తించలేకపోయాయని, నేషన్వైడ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ స్టడీ సహ రచయిత, టాక్సాలజీ ఛీఫ్ మార్సెల్ కాస్వెంట్ సూచించారు. ఆరేళ్ళ లోపు వయసున్న పిల్లలు ఇంట్లో ఉంటే వారు లాండ్రీ డిటర్జెంట్లకు ఎక్స్పోజ్ అవ్వకుండా ఆయా కుటుంబాలు శ్రద్ధ వహించాలని అధ్యయనకారులు సూచిస్తున్నారు. అంతేకాక తక్కువ టాక్సిక్ వినియోగించే సంప్రదాయ డిటర్జెంట్లను వినియోగించాలని సలహా ఇస్తున్నారు. అయితే డిటర్జెంట్లను మాత్రం పిల్లలకు సాధ్యమైనంత దూరంగానే ఉంచాలని హెచ్చరిస్తున్నారు.