సాక్షి, విశాఖపట్నం: గిరిజన సహకార సంస్థ (జీసీసీ) డిటర్జెంట్ సబ్బుల తయారీలోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే జీసీసీ వివిధ రకాల స్నానపు సబ్బులను తయారు చేస్తోంది. తాజాగా గిరిజనుల కోసమే డిటర్జెంట్ (బట్టలు ఉతికే) సబ్బులను ఉత్పత్తి చేసి విక్రయించడానికి సన్నాహాలు పూర్తి చేసింది. విజయనగరంలో ఉన్న జీసీసీ సబ్బుల తయారీ యూనిట్ ప్రాంగణంలోనే ఈ డిటర్జెంట్లను కూడా తయారు చేయనున్నారు. మార్కెట్లో గిరిజనులు ఇతర రకాల డిటర్జెంట్ సబ్బులను రూ.15–20కు (100 గ్రాములు) కొనుగోలు చేస్తున్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లోని వివిధ సంతల్లో 70 శాతానికి పైగా అసలును పోలిన నకిలీ డిటర్జెంట్ సబ్బులనే విక్రయిస్తుంటారు. మార్కెట్లో పేరున్న బ్రాండ్ల సబ్బుల్లా కనిపించేలా రేపర్లను (పై కవర్ల) ముద్రించి విక్రయిస్తున్నారు. వీటిలో నాణ్యత లేకున్నా గత్యంతరం లేక గిరిజనులు కొనుగోలు చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన డిటర్జెంట్ సబ్బులను తయారు చేసి, గిరిజనులకు తక్కువ ధరకు విక్రయించాలని జీసీసీ ఉన్నతాధికారులు యోచించారు. దీంతో విజయనగరంలో ఉన్న సబ్బుల తయారీ యూనిట్‌లో వీటిని ప్రయోగాత్మకంగా ఉత్పత్తి చేశారు.
వాటి నాణ్యతను నిర్ధారించుకున్నాక ఇప్పుడు తయారీకి సిద్ధమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నెలకు సగటున రెండు లక్షల డిటర్జెంట్ సబ్బుల వినియోగం జరుగుతున్నట్టు జీసీసీ అధికారులు అంచనాకు వచ్చారు. దీంతో ఆ మేరకు ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. వీటిని జీసీసీకి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డీఆర్ (డొమెస్టిక్ రిక్వైర్‌మెంట్) డిపోల ద్వారా విక్రయించాలని నిర్ణయించారు. వంద గ్రాముల సబ్బు రూ.5 ధరకే విక్రయిస్తారు. దీనివల్ల గిరిజనులకు ఆర్థికంగా లబ్ధి చేకూరనుంది.
గిరిజనుల కోసమే..: ఈ సబ్బులను బయట మార్కెట్లో కాకుండా గిరిజన ప్రాంతాల్లోని డీఆర్ డిపోల్లోనే విక్రయిస్తాం. బయటి సబ్బుల కన్నా నాణ్యంగా, తక్కువ ధరకే అందిస్తాం. విజయనగరం యూనిట్‌కి నెలకు 6లక్షల సబ్బుల తయారీ సామర్థ్యం ఉంది. ఇప్పటికే వీటిని ప్రయోగాత్మకంగా తయారు చేశాం. త్వరలో అమ్మకాలు చేపడతాం. – ఏఎస్‌పీఎస్ రవిప్రకాష్, ఎండీ, జీసీసీ
Comments
Please login to add a commentAdd a comment