devealopment
-
ఎయిర్‌పోర్ట్‌ల వృద్ధి కోసం కేంద్రానికి సీఎం జగన్ లేఖలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక, పర్యాటకాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే విశాఖ మరింత ఎదిగేలా నూతన అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి షరతులు లేని అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరారు. ఈమేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన లేఖ రాశారు. ఈస్టర్న్ నావల్ కమాండ్ ఐఎన్ఎస్ డేగాకు చెందిన నేవీ బేస్ నుంచి పౌర విమాన సర్వీసులు అధిక సంఖ్యలో నడిపేందుకు ఇబ్బందులు తలెత్తడంతో భోగాపురం వద్ద నూతన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించ తలపెట్టినట్లు లేఖలో ప్రస్తావించారు. 2016లో షరతులతో ఇచ్చిన నిరభ్యంతర పత్రం గడువు ముగిసిపోయినందున తాజాగా ఎటువంటి నిబంధనలు, షరతులు లేకుండా ఎన్వోసీ జారీ చేయాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు కూడా ముఖ్యమంత్రి వేర్వేరుగా లేఖలు రాశారు. ముఖ్యాంశాలు ఇవీ.. విశాఖ హబ్‌గా ఎదిగేలా.. రాష్ట్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన అంశాన్ని మీ దృష్టికి తెస్తున్నాం. విభజన చట్టం ప్రకారం విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను రాష్ట్ర విభజన తేదీ నుంచి ఆరు నెలల్లోగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలన్న అంశాలను కేంద్రం పరిశీలించాలి. ఈ 3 ఎయిర్‌పోర్టుల నుంచి విమాన సర్వీసులు పెరిగేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, పర్యాటకాభివృద్ధిలో విశాఖ పాలు పంచుకునేలా విమానాశ్రయం కీలకపాత్ర పోషిస్తోంది. మరింత వృద్ధిరేటు సాధించి విశాఖ హబ్‌గా ఎదిగేలా పౌర విమాన సర్వీసులను నడపాల్సిన ఆవశ్యకత ఉంది. ఇటు కొండలు.. అటు రద్దీ విశాఖ విమానాశ్రయానికి మూడు వైపులా కొండలున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా పౌర విమానాలను కేవలం ఒక దిశలో మాత్రమే టేకాఫ్ చేసేందుకు అనుమతిస్తున్నారు. దీనివల్ల గంటకు 10 విమాన సర్వీసులకు మించి నడిపే అవకాశం లేదు. రక్షణ రంగం, పౌర విమానయాన అవసరాలను ప్రస్తుతం ఇది తీరుస్తున్నా భవిష్యత్తులో రాకపోకలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఒకవైపు రక్షణ రంగ కార్యకలాపాలు మరోవైపు విశాఖలో పర్యాటకం అభివృద్ధి చెందుతుండటంతో పౌర, రక్షణ అవసరాలకు వినియోగిస్తున్న ఈ ఎయిర్‌పోర్టులో రద్దీ పెరుగుతోంది. రక్షణ అవసరాల దృష్ట్యా.. కొత్తగా భోగాపురం వద్ద నిర్మించే ఎయిర్‌పోర్టు వద్దకు నావల్ ఎయిర్‌స్టేషన్ ఐఎన్ఎస్ డేగాను రక్షణ అవసరాల రీత్యా తరలించలేమని నేవీ, రక్షణ శాఖ ప్రతినిధులు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు జరిపిన సంప్రదింపుల లేఖలను జత చేస్తున్నాం. తూర్పు తీర రక్షణలో ఐఎన్ఎస్ డేగా చాలా కీలకమని, రక్షణపరంగా వ్యూహాత్మకమని, రక్షణ కార్యకలాపాలకు మినహా పౌర విమాన సర్వీసులకు విశాఖ అనువు కాదని స్పష్టం చేశారు. నేవీ ఎయిర్ బేస్‌ను భోగాపురం తరలించాలనే ప్రతిపాదన ఆర్థికంగా కూడా ఆచరణ యోగ్యం కాదు. దీంతో పౌర విమాన సర్వీసులను తరలించాలని నిర్ణయించాం. ఎన్వోసీ లేకపోవడంతో.. భోగాపురం విమానాశ్రయాన్ని పీపీపీ విధానంలో అభివృద్ధి చేయనున్నాం. దీనికి సంబంధించి పౌర విమానయాన శాఖ 2016లో కొన్ని షరతులతో అనుమతులు మంజూరు చేసింది. ప్రస్తుతం ఎయిర్‌పోర్టును నిర్వహిస్తున్న ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పరిహారం చెల్లించాలని కోరింది. పౌరవిమానయాన శాఖ ఇచ్చిన నిరభ్యంతర లేఖ కాల పరిమితి ఇప్పటికే ముగిసిపోయిది. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి పీపీపీ విధానంలో భాగస్వామ్య కంపెనీని ఎంపిక చేసినప్పటికీ కొత్తగా సైట్ క్లియరెన్స్, ఎన్వోసీ ఇవ్వకపోవడంతో పనులు చేపట్టలేకపోతున్నాం. దీని ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకుని భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి పౌర విమానయాన శాఖ నిరభ్యంతర పత్రం జారీ చేసేలా చూడాలని కోరుతున్నాం. -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు: ఎంపీ
సంగెం(పరకాల) : కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. ఆదివారం మండలంలోని కృష్ణానగర్‌లో నూతనంగా రూ.16 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనం, రూ.30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ధర్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పారదర్శకంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తోందని చెప్పారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ గ్రామాలకు గతంలో ఎన్నడూ రాని విధంగా ఈ నాలుగేళ్లలో నిధులు మంజూరయ్యాయని, వాటితో చేపట్టే అభివృద్ధి ప్రతిపక్షాలకు కన్పించడం లేదా అని ప్రశ్నించారు. నాలుగైదు రోజుల్లో ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తామని, వచ్చే ఏడాది కాలేశ్వరం నీళ్లు చెరువుల్లో నింపి రెండు పంటలకు అందిస్తామని చెప్పారు. గ్రామస్తుల కోరిక మేరకు అంగన్వాడీ, యాదవ కమ్యూనిటీ భవనాలు, వాటర్ ట్యాంకు, విద్యుత్ స్తంభాలు, రేషన్‌షాపు మంజూరుకు హామీ ఇచ్చారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఎంపీపీ కట్టయ్య, సర్పంచ్ కోడారి రాజమ్మ, ఎంపీటీసీ సభ్యుడు బానోత్ బాలు, ఉపసర్పంచ్ సుబ్బారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుదర్శన్‌రెడ్డి, మండల కన్వీనర్ నరహరి, నాయకులు వెంకటేశ్వర్రావు, మోహన్ ఎంపీడీఓ భద్రునాయక్, డీఈ మంగ్యానాయక్, ఏఈలు కిష్టయ్య, రాజునాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఆటపాకను అద్భుతంగా అభివృద్ధి చేస్తాం
– నూతన ఫారెస్టు ఏసీఎఫ్ రామచంద్రరావు ఆటపాక (కైకలూరు) : విదేశీ పక్షి జాతుల ఆవాసాలకు నిలయంగా పేరొందిన ఆటపాక పక్షుల విహార కేంద్రాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని నూతనంగా బాధ్యతలు చేపట్టిన అటవీశాఖ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు (ఏసీఎఫ్) ఎన్.రామచంద్రరావు చెప్పారు. బదిలీల్లో భాగంగా ఇక్కడ పనిచేసిన ఏసీఎఫ్ వినోద్‌కుమార్ విశాఖపట్నం జిల్లా చింతపల్లి ఫారెస్టుకు వెళ్లారు. అక్కడ పనిచేసిన రామచంద్రరావు కొల్లేరులో విధులు చేపట్టారు. ఈ సందర్భంగా రేంజర్ శ్రావణ్‌కుమార్‌తో కలిసి సోమవారం ఆటపాక పక్షుల కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దశల వారీగా పక్షుల కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. కొల్లేరు వెబ్‌సైట్‌ను త్వరలో యాత్రికులకు అందుబాటులోకి తెస్తామని, చెరువులో పక్షుల ఆహారం కోసం చేపపిల్లలను విడుదల చేస్తామన్నారు. అలాగే, పర్యాటకులను ఆకట్టుకునేందుకు పక్షుల చిత్రాలతో కూడిన బోర్డులను ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేస్తామన్నారు. పర్యాటకులకు తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పక్షుల కేంద్రానికి వచ్చే పర్యాటకులు ఈఈసీ కేంద్రం వద్ద పక్షి నమూనాల మ్యూజియాన్ని తిలకించాలని కోరారు. త్వరలో పక్షుల విశేషాలను వివరించే గైడ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ఆయన బోటు షికారులో పక్షులను తిలకించారు.