‘గొలుసు’ కత
సాంకేతికత అంతగా లేని రోజులలో అప్పటి పాలకులు వాన నీటిని నిల్వ చేయడం ద్వారా రైతులకు సాగు నీరందించేందుకు పెద్ద ఎత్తున గొలుసు చెరువులను నిర్మించారు. ఇవి ప్రతి ఊరిలో ఉండడంతో అప్పుడు రైతులు సాగునీటికి ఎలాంటి కష్టాలను ఎదుర్కొనలేదు. వర్షాధార పంటలతో పాటు ఆయా చెరువు లు, కుంటల కింద తిండిగింజలు పండించుకునేవారు. ఏటా చెరువులలోని సారవంతమైన మట్టిని పొలాలకు తరలించడంతో పూడిక తొలగిపోయేది. ఇదే సమయంలో చెరువు కట్టలు, అలుగులు, తూములను రైతులు మరమ్మతు చేసుకునేవారు. దీంతో చెరువులు, కుంటలు ఆ ప్రజలకు ఆదరువుగా నిలిచేవి. ఇదంతా గతం.
* చెరువులు, కుంటలకు ఆదరణ కరువు
- పూడిక ఒక వైపు, ఆక్రమణలు మరోవైపు
⇒ఆనవాళ్లు కోల్పోయిన ఫీడర్ చానళ్లు
- నిధులెన్ని వచ్చినా కాంట్రాక్టర్ల జేబులలోకే
* ‘మిషన్ కాకతీయ’ జీవం పోస్తుందా?
⇒జిల్లాలో 3,250 చెరువులలో 650 ఎంపిక
కామారెడ్డి: కాలం మారింది. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. యాంత్రీకరణ ప్రభావంతో వ్యవసాయం ఆధునికతను సంతరించుకుంది. రైతులు ఎద్దులు, నాగలికి బదులు ట్రాక్టర్లను ఆశ్రయించడం మొదలు పె ట్టారు. భూములను అభివృద్ధి చేసుకున్నారు. వర్షాలపై ఆధారపడిన చెలక భూములు సైతం పంట భూములుగా మారాయి. వాటికి నీటినందించేందుకు రైతులు భూగర్భజలాల అన్వేషణ మొదలుపెట్టారు. వందల అడుగుల లోతులలోకి వెళ్లి నీటిని తోడే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలోవిచ్చలవిడిగా బోర్ల తవ్వకాలు జరిగాయి. భూగర్భజలాల అన్వేషణలో రైతులు చెరువు, కుంటలను మరిచిపోయారు. శిఖం భూములు కబ్జాలకు గురయ్యాయి. వాటికి ఆధారమైన ఫీడర్ చానళ్లు, కాలువలు, ఒర్రెలు కూడా అన్యాక్రాంతమైపోయి చెరువులు, కుంటలు నిండే పరిస్థితి లేకుండాపోయింది. పూడిక కూడా సమస్యగా తయారైంది. రెండు దశాబ్దాలుగా చెరువుల అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు విడుదలయ్యాయి. అవి ఏ రైతుకూ ఉపయోగపడలేదు.
పనుల కాంట్రాక్టులు దక్కించుకున్న రాజకీయ నాయకులు, వాటిని పర్యవేక్షించే అధికార యంత్రాంగం అందినంత దండుకున్నారు. దీంతో చెరువులు, కుంటల అభివృద్ధి కుంటుబడిపోయింది. కామారెడ్డి డివిజన్లో అతిపెద్ద ఆయకట్టు కలిగి, ఏడు గ్రామాలకు నీరందించే బీబీపేట చెరువు దశాబ్దాల కాలంగా నిండిన దాఖలాలు లేవు. కానీ, ఆ చెరువు పేరుమీద రెండు దశాబ్దాల కాలంలో రూ. 3.50 కోట్లకు పైగా నిధులు ఖర్చయ్యాయి. ఈ చెరువు కింద 1,718 ఎకరాల ఆయకట్టు ఉంది.
చెరువులోకి నీటిని తీసుకువచ్చే ప్రధాన కాలువలు ఎప్పుడో ఆక్రమణలకు గురయ్యాయి. మెదక్ జిల్లా నుంచి భిక్కనూ రు, దోమకొండ మండలాల మీదుగా బీబీపేట చెరువుకు చేరే ప్రధాన కాలువ కనుమరుగై ఆనవాళ్లు కో ల్పోయింది. భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డిలో ని పెద్ద చెరువు కింద 884 ఎకరాల ఆయకట్టు, జంగంపల్లి ఊర చెరువు కింద 505 ఎకరాల ఆయకట్టు, ఇదే మండలంలోని కాచాపూర్ పెద చెరువు ఆయకట్టు 664 ఎకరాల ఆయకట్టు ఉంది. ఆయా చెరువుల అభివృద్ధి పేరుతో ఏటా నీటిపారుదల శాఖ ద్వారా రూ. లక్షల నిధులు మంజూరవుతున్నా అవి వాటికి జీవం పోయలేకపోయాయి. ‘‘నీళ్లు లేని చెరువులను మరమ్మతుల పేరుతో కోట్లు మింగుతున్నరు. నీళ్లు అచ్చే తొవ్వ జూడకుండా మరమ్మతులు జేసుడెందుకో’’ అని బీబీపేటకు చెందిన రైతు నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశాడు.
ఆశలు రేకెత్తిస్తున్న ‘మిషన్ కాకతీయ’
సాగునీటి సమస్యతో అల్లాడుతున్న రైతులు సాగును వదులుకునే పరిస్థితులలో తెలంగాణ ప్రభుత్వం ‘మిషన్ కాకతీయ’ పేరుతో చెరువులకు జీవం పోస్తామని ప్రక టించింది. ఈ నేపథ్యంలో రైతులలో ఆశలు రేకెత్తాయి. గతంలో చెరువుల అభివృద్ధికి ఎన్ని నిధులు వ చ్చినా వాటి గురించి రైతులకు వివరించిన దాఖలాలు లేవు.
‘మిషన్ కాకతీయ’ పేరుతో నిర్వహించే అభివృ ద్ధి పనుల విషయంలో రైతులను భాగస్వాములను చే యాలనే ఆలోచనతో చెరువులు భాగుపడతాయని భా విస్తున్నారు. జిల్లాలో 3,250 చెరువులు, కుంటలు ఉం డగా మొదటి విడతగా 650 చెరువులను ఎంపిక చేసినట్టు నీటిపారుదల శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ రహమాన్ తెలిపారు. ‘కాకతీయ మిషన్’ కార్యక్రమం లో ఫీడర్ చానళ్లు, ఇరిగేషన్ చానళ్లు, అలుగులు, తూ ముల మరమ్మతులు, కట్టను బలోపేతం చేయడం వంటి పనులన్నీ ఉంటాయన్నారు.
చెరువు నిండా నీళ్లుంటే ఇంటి నిండా దినుసున్నట్టే
చెరువుల నిండా నీళ్లున్నపుడు బాయిలు, బోర్లు మంచిగ బోసేటివి. ఇయ్యెడు వానలు లేకపోవుట్ల మా ఊళ్లె రామేశ్వరం చెరువు, కాన చెరువులు నిండలేదు. బాయిలు, బోర్లల్ల ఊటలు తగ్గినై. ఎన్కట చెరువు నిండ నీళ్లుంటే ఇంటి నిండా దినుసులు ఉన్నట్టని ధైర్యంతో ఉండెటోళ్లు. ఇప్పుడు చెరువులు నిండకుంటయినయి. దాంతోని బాయిలు, బోర్లల్ల నీళ్లు తగ్గుతున్నయి. తెలంగాణ సర్కారు చెరువుల గురించి మంచిగనె సెప్పుతున్నది. చెరువులకు నీళ్లు అచ్చెటట్టు జేస్తే ఎంతన్న మంచిగుంటది. -బోడ పోశవ్వ, మహిళా రైతు, అన్నారం, మాచారెడ్డి మం.
ఏ పథకమైనా చెరువుకు జీవం బోస్తేనే మంచిది
కామారెడ్డి డివిజన్లోనే బీబీపేట చెరువు పెద్ద ది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 1,718 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువుకు నీరందించే కాలువలు ఎప్పుడో ఆక్రమణలకు గురయ్యా యి. ఎన్నో ఏండ్లుగా మేం ఉద్యమాలు జేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. మీదికెళ్లి ఉద్యమాలు చేస్తే నీళ్లస్తయా అని ఎక్కిరించిండ్రు. గోదావరి జలాలతో బీబీపేట చెరువునేగాదు అన్ని చెరువులకు నీటిని మళ్లించే కార్యక్రమం చేపట్టాలి. ‘మిషన్ కాకతీయ’ పేరుతో ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమం మంచిదే. ఏదైనా చెరువులకు జీవం పోసేదిగా ఉంటే మంచిది.
-వెంకట్రాంరెడ్డి, రిటైర్డ్ టీచర్, సాగునీటి ఉద్యమ నేత, బీబీపేట