Devender Rana
-
కశ్మీర్‌పై నేడు ప్రధాని అఖిలపక్ష సమావేశం
జమ్మూకశ్మీర్‌లో భద్రత కట్టుదిట్టం న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ భవిష్యత్‌పై ప్రణాళిక రూపొందించడానికి ప్రధాని మోదీ ఆధ్వర్యంలో గురువారం కశ్మీర్‌కు చెందిన అఖిలపక్ష నేతలతో సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని నివాసంలో ఈ సమావేశం ప్రారంభమవుతుంది. కశ్మీర్‌కు చెందిన వివిధ పార్టీ నాయకులు 14 మందిని కేంద్రం ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశానికి హాజరవడానికి ఒక్కొక్కరుగా నేతలు ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, ఎన్నికల నిర్వహణ వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశాలున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా బుధవారం పార్టీ నేతలతో ఈ సమావేశంపై చర్చించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇలాంటి సమావేశాలు జరగడం మంచిదేనని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. కశ్మీర్ ప్రజల ఆకాంక్షలు తీర్చేలా ఈ ప్రాంత ఐక్యత, సమగ్రత కాపాడేలా చర్యలు తీసుకునే దిశగా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని సమావేశానంతరం నేషనల్ కాన్ఫరెన్స్ జమ్మూ ప్రాంత అధ్యక్షుడు దేవందర్æ రాణా చెప్పారు. పీడీపీ చీఫ్ మెహబూబా కశ్మీర్‌కు తిరిగి స్వతంత్ర ప్రతిపత్తిని కట్టబెట్టాలని సమావేశంలో గట్టిగా డిమాండ్ చేస్తామని ఇప్పటికే స్పష్టం చేశారు. కశ్మీర్‌కి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా తిరిగి కట్టబెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. కశ్మీర్ స్వయంప్రతిపత్తిని నిర్వీర్యం చేసే ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగే తొలి సమావేశం కావడంతో దీనిపై అందరికీ ఆసక్తి ఏర్పడింది. కశ్మీర్లో 48 గంటల హై అలర్ట్ ప్రధానితో కశ్మీర్ నేతల సమావేశం నేపథ్యంలో నియంత్రణ రేఖ వెంబడి భద్రతను కేంద్రం మరింతగా పెంచింది. 48 గంటలు హై అలర్ట్ ప్రకటించింది. సరిహద్దుల వెంబడి పాక్‌తో కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ కేంద్రం భద్రతను కట్టుదిట్టం చేసింది. కశ్మీర్ లోయలో ఇంటర్నెట్ను కూడా కట్ చేసే అవకాశాలున్నాయి. -
అసెంబ్లీ సాక్షిగా మంత్రి సంచలన వ్యాఖ్యలు
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర మంత్రి ఇమ్రాన్ అన్సారీ ప్రతిపక్ష పార్టీ నేత దేవేందర్ రాణాను సభలోనే చంపి పాతరేస్తానంటూ బెదిరించారు. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) విషయంపై అసెంబ్లీలో మంగళవారం చర్చ జరగగా.. చివరికి అది వ్యక్తిగత బెదిరింపులకు దారితీసింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. శుక్రవారం అర్ధరాత్రి నుంచి దేశంలో అంతటా జీఎస్టీ అమలు అయినా, జమ్మూకశ్మీర్ లో మాత్రం జీఎస్టీ అమలు చేయడం లేదు. ఇంత వరకూ జీఎస్టీని ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించకపోవడంతో దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానం అమలు వాయిదా పడింది. దీనిపై జుమ్మూకశ్మీర్ అసెంబ్లీలో నిన్న ప్రతిపక్ష నేషనల్ కాన్ఫరెన్స్ నేత దేవేందర్ రాణా ఆసంతృప్తి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిన ఏకపన్ను విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే యత్నం చేశారు. తాను పన్నులు ఎగ్గొట్టలేదని, చీకటి వ్యాపారాలు చేయాల్సిన ఖర్మ తనకు పట్టలేదని అధికార పక్ష నేతలకు బదులిచ్చారు. ఓ వైపు ఎమ్మెల్యే రాణా మాట్లాడుతుండగా.. రాష్ట్ర ఐటీ, సాంకేతిక విద్య శాఖలమంత్రి ఇమ్రాన్ అన్సారీ కలుగజేసుకుని 'నేను తలుచుకుంటే నిన్ను ఇక్కడే చంపేయగలను. నీ దొంగ వ్యాపారాలు నాకు తెలుసు. రాష్ట్రంలో నీ కంటే పెద్ద దొంగ ఎవరూ లేరు. మోబిల్ ఆయిల్ అమ్ముతూ వ్యాపారాలు మొదలుపెట్టావ్. నీకు అన్ని ఆస్తులు ఎక్కడినుంచి వచ్చాయో మాకు తెలియదనుకున్నావా' అంటూ బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు. మంత్రి అన్సారీ వ్యాఖ్యలతో సభలో కాసేపు గందరగోళ పరిస్థితి తలెత్తింది. ఏకంగా అసెంబ్లీలోనే మంత్రి చేసిన తీవ్ర వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యాయి.