deviders
-
పుట్టగొడుగుల్లా నకిలీ డ్రైవింగ్ స్కూళ్లు!!
సాక్షి, హైదరాబాద్: ఇటీవల నగరంలో తెల్లవారుజామున రోడ్డు డివైడర్‌కు కారు ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈమధ్య కాలంలో మద్యం తాగి అపరిమితమైన వేగంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఇలా వాహనాలు నడుపుతున్న వారిలో చాలా మందికి సరైన నైపుణ్యం కూడా ఉండడం లేదని, అరకొర డ్రైవింగ్ అనుభవంతో రోడ్డుమీదకు వచ్చి ప్రమాదాలకు పాల్పడుతున్నారని రోడ్డు భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో వీధికొకటి చొప్పున పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీ డ్రైవింగ్ స్కూళ్లతో ఈ తరహా ఎలాంటి శిక్షణ, నైపుణ్యం,అనుభవం లేని డ్రైవర్లు వాహనాలతో బయటకు వస్తు న్నారు. దీంతో డ్రంకన్ డ్రైవ్‌తో పాటు, ర్యాష్ డ్రైవింగ్ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. నిబంధనలకు పాతర... డ్రైవింగ్ స్కూళ్ల నిర్వహణ ప్రహసనంగా మారింది. ఎలాంటి మౌలిక సదుపాయాలు, సాంకేతిక నైపుణ్యం లేని వ్యక్తులకు రవాణా అధికారులు ఎడాపెడా అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఇందుకోసం కొన్ని ప్రాంతీయ రవాణా కేంద్రాల్లో రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా మోటారు వాహన ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి డ్రైవింగ్ స్కూల్ నిర్వహణను క్షేత్రస్థాయిలో క్షుణ్నంగా పరిశీలించిన సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే అనుమతినివ్వాలి. ఇందుకోసంసదరు నిర్వాహకులు రూ.10 వేలు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో రవాణా శాఖకు చెల్లించాలి. మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారే డ్రైవింగ్ స్కూల్ నిర్వహణకు అర్హతను కలిగి ఉంటారు. అనుభవజ్ఞుడైన ఇన్స్ట్రక్టర్ (శిక్షణనిచ్చే వ్యక్తి) ఉండాలి. డ్రైవింగ్ స్కూల్ కోసం ప్రత్యేకంగా రెండు తరగతి గదులతో కూడిన ఆఫీస్ తప్పనిసరి. ట్రాఫిక్ నిబంధనలపై ఇక్కడ శాస్త్రీయమైన బోధన జరగాలి. వాహనాలకు చిన్నపాటి మరమ్మతులను చేసుకొనే మెకానిజంలో కూడా శిక్షణనివ్వాల్సి ఉంటుంది. చాలా మంది డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులు ఎలాంటి కార్యాలయం కూడా లేకుండానే కారుపై డ్రైవింగ్ స్కూల్ బోర్డు ఏర్పాటు చేసుకొని కొంతమంది అధికారుల సహాయంతో డ్రైవింగ్ స్కూల్ నిర్వహణకు కావాల్సిన ఫామ్–11 సంపాదిస్తున్నారు. ఇదో తరహా గొలుసుకట్టు.. అడ్డగోలు అనుమతులతో ఏర్పడుతున్న డ్రైవింగ్ స్కూళ్లు అభ్యర్ధుల నుంచి నెలకు రూ.5000 నుంచి రూ.8000 వరకు వసూలు చేసి కనీసం 30 రోజులు కూడా శిక్షణనివ్వకుండానే వదిలేస్తున్నారు. ఇలా అరకొర శిక్షణ తీసుకున్నవారు డ్రైవింగ్ లైసెన్సులు తీసుకొని యథేచ్ఛగా ఖరీదైన కార్లతో రోడ్లపైకి వస్తున్నారు. మరోవైపు ఇలాంటి నకిలీ స్కూళ్లు నగరమంతటా బ్రాంచీలు ఏర్పాటు చేసుకొని వినియోగదారులను మోసగిస్తున్నాయి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారుతూ వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గ్రేటర్లో అన్ని ప్రమాణాలతో కూడిన డ్రైవింగ్ స్కూళ్లు 120 వరకు ఉంటే నకిలీ స్కూళ్లు వెయ్యికిపైనే ఉన్నట్లు అంచనా. తీవ్రంగా నష్టపోతున్నాం: కేంద్ర మోటారు వాహన చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్ స్కూళ్లు ఏర్పాటు చేసుకున్న వాళ్లు ఇలాంటి నకిలీలతో తీవ్రంగా నష్టపోవాల్సివస్తోంది. ఇలాంటి వాటిని ఆర్టీఏ అధికారులు నియంత్రించాలి. – శ్రీకాంత్‌రెడ్డి సామల, తెలంగాణ డ్రైవింగ్ స్కూల్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్మి -
కలకలం రేపిన జూబ్లీహిల్స్ యాక్సిడెంట్
సాక్షి, సిటీబ్యూరో: ట్రాఫిక్ చిక్కులు తగ్గించేందుకు... రైట్–లెఫ్ట్ రహదారుల్ని వేరు చేసేందుకు ఉద్దేశించిన డివైడర్లు ప్రస్తుతం నగర వాసులకు భయం పుట్టిస్తున్నాయి. వీటితో పాటు మధ్యలో ఏర్పాటు చేసిన సైన్బోర్డుల్లో కొన్ని ప్రమాదహేతువులుగా మారడంతో ఏటా అనేక మంది ప్రాణాలు కోల్పోవడంతోపాటు తీవ్రంగా గాయపడుతున్నారు. వీటి నిర్మాణంలో శాస్త్రీయత కొరవడటం, అవసరమైన కనీస జాగ్రత్తలు, ప్రమాణాలు సైతం పాటించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని నిపుణులు చెప్తున్నారు. బుధవారం ఉదయం జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లో 27 ఏళ్ళ వంశీకృష్ణ ఇలానే బలైపోవడం తీవ్రకలకలం రేపింది. ఈ డివైడర్ ప్రమాదాలకు గురవుతున్న వాటిలో ద్విచక్ర వాహనాలు, మృతులు, క్షతగాత్రుల్లో యువత ఎక్కువగా ఉండటం ఆందోళనకరంగా మారుతోంది. యాక్సిడెంట్స్‌లో 30 శాతం వాటా... రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలోని ప్రధాన రహదారులతో పాటు శివారు మార్గాల్లో ఉన్న డివైడర్లు ప్రాణాంతకంగా మారుతూ వాహనచోదకుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. నగరంతో పాటు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 30 శాతం వరకు డివైడర్ల కారణంగానే జరుగుతున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవి కాంక్రీటుతో నిర్మితం కావడం, కొన్ని ప్రాంతాల్లో అవసరానికి మించి ఎత్తు, వెడల్పులతో ఉండటంతో ఢీ కొట్టిన వాహనం నుగ్గుకావడంతో పాటు చోదకుడు ప్రాణాలతో బయటపడే అవకాశం చాలా తక్కువగా ఉంటోంది. గడిచిన కొన్ని ఏళ్లుగా వీటి వల్ల జరుగుతున్న ప్రమాదాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం కొన్నిచోట్ల హఠాత్తుగా ఏర్పాటు చేస్తున్న డివైడర్లు పగటిపూట వాహనచోదకుల కళ్లలో పడకుండా రాత్రిళ్లు ప్రాణాలను హరిస్తున్నాయి. ప్రమాదాలకు కారణాలు అనేకం... డివైడర్లు డెత్స్పాట్స్గా మారడానికి అనేక కారణాలు ఉంటున్నాయి. రాత్రి వేళల్లో కనిపించక ఢీ కొట్టడం, కీలక ప్రాంతాల్లో అశాస్త్రీయంగా ఏర్పాటు చేసిన వాటి వద్ద వాహనం కంట్రోల్ తప్పి దూసుకుపోవడం జరుగుతోంది. సిటీలోని కొన్ని ఫ్లైఓవర్ల వద్ద తరచుగా ప్రమాదాలు నమోదు కావడానికి ఇవే కారణాలుగా మారుతున్నాయి. ఇక మితిమీరిన వేగంతో, మద్యం మత్తులో దూసుకుపోతున్న ‘నిషా’చరులు వీటిని పట్టించుకునే స్థితిలో ఉండట్లేదు. వాహనచోదకులు హెల్మెట్ ధరించకపోవడంతోనూ డివైడర్ ప్రమాదాలు పెరుగుతున్నాయి. వంశీకృష్ణ ప్రమాదం వెనుక ఓవర్ స్పీడింగ్, హెల్మెట్ ధరించకపోవడం కారణాలుగానే ట్రాఫిక్ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. వాణిజ్య ప్రాంతాలు, కనెక్టివిటీ ప్రాంతాలగా పరిగణించే కోఠి, అబిడ్స్, నాంపల్లిలోని ప్రధాన రహదారులతో పాటు సర్వీస్ రోడ్లు, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్‌లోని డివైడర్లు, లక్టీకపూల్, హిమాయత్‌నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కృష్ణనగర్, ఎస్సార్నగర్లతో పాటు మాదాపూర్, గచ్చిబౌలి, ఎల్బీనగర్ తదితర శివార్లలోని అనేక రహదారుల్లోని డివైడర్లు ప్రాణాంతకాలుగా మారుతున్నాయి. నిర్మాణంలో తేడానే కారణమా? సాధారణంగా 100 అడుగుల కంటే ఎక్కువ వెడల్పు ఉన్న రోడ్ల మధ్యలోనే డివైడర్లు నిర్మించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత అవసరాలు స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఇందులో సగం ఉన్న రహదారుల్లోనూ వీటిని ఏర్పాటు చేయాల్సి వస్తోంది. మరోపక్క గతంలో అనేక ప్రాంతాల్లో డివైడర్లు మాత్రమే ఉండేవి. వీటి మధ్యలో వర్షపు నీరు ఓ పక్క నుంచి మరో పక్కకు పోయే అవకాశం ఉండేది. అయితే అడ్వర్టైజ్మెంట్ బోర్డులు, లాలీపాప్స్ ఏర్పాటు చేయడం ద్వారా ఆదాయం ఆర్జించాలనే జీహెచ్ఎంసీ వైఖరి కారణంగా డివైడర్ల స్థానంలో సెంట్రల్ మీడియమ్స్ వచ్చి చేరుతుండటంతో వీటి వల్ల ఇబ్బందులు పెరుగుతున్నాయి. ఫలానా ప్రాంతం ప్రమాదకరమైంది, ప్రమాద హేతువు అని వివరించేందుకు సదరు స్పాట్‌కు కొద్దిదూరంలో కాషనరీ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి. ఆయా స్పాట్లకు రెండు వైపులా కనీసం 200 మీటర్ల దూరంలో తొలి బోర్డు (కాషన్–1), 100 మీటర్ల దగ్గర మరోటి (కాషన్–2) కచ్చితంగా ఉండాలి. అత్యంత ప్రమాదకరంగా మారిన డివైడర్ల వద్ద ఈ సైన్‌బోర్డులు అవసరమైన స్థాయిలో కనిపించట్లేదు. ఈ డెత్ స్పాట్స్ దగ్గర ఉన్న డివైడర్‌ను సక్రమంగా నిర్వహించాలి. ఆ ప్రాంతాలకు ఇరువైపులా కనీసం 400 మీటర్ల మేర అయినా నిర్ణీత ఎత్తులో దీన్ని నిర్మించాలి. దీనికి ఇరువైపులా హజార్డ్ మార్కర్స్ (ప్రమాద సూచికలు) ఏర్పాటు చేయాలి. చీకట్లోనూ వీటి ఉనికి వాహనచోదకులకు తెలిసేలా రిఫ్లెక్టివ్ మార్కర్స్ లేదా సోలార్ మార్కర్స్ పెట్టాలని నిపుణులు చెప్తున్నారు. కలర్స్, క్యాట్ ఐస్ ఏర్పాటూ అంతంతే... ప్రమాదహేతువులుగా ఉన్న ప్రాంతాల్లో డివైడర్‌తో పాటు రోడ్ మార్జిన్స్‌లోనూ పెయిటింగ్ వేయడం అవసరం. సాధారణ పెయింట్స్ కంటే రిఫ్లెక్టివ్ పెయింట్స్ వల్ల ఉపయోగాలు ఎక్కువగా ఉంటాయి. రాత్రి వేళ కూడా ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. మార్జిన్స్‌తో పాటు ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో రాత్రి పూట మెరిసే క్యాట్ ఐస్ ఏర్పాటు చేయాలి. ఇవి రాత్రి పూట వాహనచోదకుల దృష్టి ఆకర్షిస్తాయి. నగరంలో డివైడర్ల వద్ద వీటి ఏర్పాటు సైతం అంతంతగానే ఉంటోంది. డివైడర్‌ను పూర్తి శాస్త్రీయ పద్ధతిలో, ఇంజనీరింగ్ నిపుణుల సహకారంతో ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కొత్తగా వెలిసిన డివైడర్ల వద్ద వాటి ఉనికి తెలిసేలా సూచికలు కచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. రాత్రి వేళల్లో డివైడర్లను గుర్తించేందుకు వీలుగా రిఫ్లెక్టర్లు, క్యాట్‌ఐస్ వంటివి వెంటనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ప్రాణం తీసిన మ్యాన్‌హోల్: ద్విచక్రవాహనంపైనుంచి పడి ఒకరి మృతి జూబ్లీహిల్స్: ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి పడి యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బోరబండకు చెందిన కుంచాల వంశీకృష్ణ(26) ఓ ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం లింగంపల్లికి వెళ్లడానికి ద్విచక్రవాహనం ( ఏపీ09 సీహెచ్ 7103 )పై బయలుదేరి జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 10లోని వాక్స్బేకర్స్ సమీపంలోకి రాగానే మ్యాన్‌హోల్ గుంతలో వాహనంపడి అదుపుతప్పి కిందపడిపోయాడు. తల డివైడర్‌కు ఢీకొని తీవ్రగాయాలపాలై అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంవత్సరం ‘డివైడర్ ప్రమాదాల్లో’ కొన్ని... ♦ జనవరిలో మాదాపూర్ ఠాణా పరిధిలో ఐటీ మొబైల్–2 డివైడర్‌ను ఢీ కొట్టడంతో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ♦ అదే నెలలో బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలోని కేబీఆర్ పార్క్ వద్ద జరిగిన బైక్ ప్రమాదంలో ఒకరు మరణించగా మరొకరికి తీవ్రగాయాలు. ♦ ఫిబ్రవరిలో సైబరాబాద్ కమిషనరేట్‌లోని రాయదుర్గం సబ్–స్టేషన్ వద్ద చోటు చేసుకున్న ద్విచక్ర వాహన ప్రమాదంలో ఇద్దరు మృతి. ♦ మార్చిలో కేపీహెచ్‌బీ పోలీసుస్టేషన్ పరిధిలోకి వచ్చే క్లాస్రూమ్ కాంప్లెక్స్ వద్ద బైక్ ప్రమాదానికి గురై ఒకరు మృతి. -
చుట్టేసి.. దూకేసి!
గ్రేటర్ వాసులకు మెట్రో డివైడర్లు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్న నాగోల్–అమీర్‌పేట్ (17 కి.మీ), అమీర్‌పేట్–మియాపూర్(13 కి.మీ)మార్గంలో మెట్రో పిల్లర్ల మధ్యన ఎత్తయిన గోడలతో డివైడర్లు, పలు చోట్ల దూరంగా యూటర్న్లు ఏర్పాటు చేశారు. దీంతో పాదచారులకు రోడ్డు దాటడం కష్టంగా మారింది. వాహనదారులు రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి యూటర్న్ తీసుకోవాల్సి వస్తోంది. ఆయా యూటర్న్ల వద్ద జీబ్రా క్రాసింగ్స్, పాదచారుల మార్గం లేకపోవడం శాపంగా పరిణమిస్తోంది. రాకపోకలు కష్టమై మెట్రో రూట్లో రహదారికి ఇరువైపులా వ్యాపారాలు సైతం పడిపోయాయి. బుధవారం ‘సాక్షి’ బృందం పరిశీలనలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. సాక్షి నెట్వర్క్: మెట్రో మార్గాల్లో డివైడర్ల నిర్మాణంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా ఎత్తులో డివైడర్లు ఉండడం, అర కిలోమీటర్‌కు పైగా దూరంలో యూటర్న్లు ఏర్పాటు చేయడం, జీబ్రాక్రాసింగ్‌లు లేకపోవడంతోసిటీజనులు అవస్థలు పడుతున్నారు. దీంతో కస్టమర్లు రాక వ్యాపారాలు దివాళాతీస్తున్నాయని రోడ్‌సైడ్ వ్యాపారులు వాపోతున్నారు. నాగోల్–అమీర్‌పేట్ (17 కి.మీ), అమీర్‌పేట్–మియాపూర్ (13 కి.మీ) మార్గాల్లో ‘సాక్షి’ బుధవారం విజిట్ నిర్వహించగా ఈ ఇబ్బందులు కళ్లకు కట్టాయి. సిగ్నల్స్ లేవ్... మలేసియాటౌన్‌షిప్:కూకట్పల్లి నుంచి మియాపూర్ మార్గంలో కొన్నిచోట్ల జిబ్రాక్రాసింగ్లు ఉన్నప్పటికీ సిగ్నల్స్, ట్రాఫిక్ సిబ్బంది లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వాహనాలు, పాదచారులు ఏక కాలంలో రోడ్డు దాటుతుండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ♦ కేపీహెచ్‌బీ కాలనీ రైల్వే స్టేషన్ దాటాక రామ్‌దేవ్‌రావ్ ఆసుపత్రి దగ్గర జిబ్రాక్రాసింగ్ ఏర్పాటు చేశారు. కానీఇక్కడ సిగ్నలింగ్ వ్యవస్థ లేదు. దీంతో ఇప్పటికే చాలా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ♦ కూకట్పల్లి, కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్లు, నిజాంపేట్ క్రాస్‌రోడ్ ప్రాంతాల్లో సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసిన్పటికీ.. ట్రాఫిక్ సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ♦ ఇక్కడ ప్రధాన రహదారికి ఇరువైపులా వస్త్ర, వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. డివైడర్ల ఏర్పాటుతో వ్యాపారం తగ్గుముఖం పట్టిందని వ్యాపారులు వాపోతున్నారు. ఉప్పల్‌లో వ్యాపారులకు తిప్పలు.. ఉప్పల్: మెట్రో రైలు మార్గంలో పిల్లర్ల కింద నిర్మించిన డివైడర్లు స్థానిక వ్యాపారులకు శాపంగా మారాయి. దూరంగా యూటర్న్ ఏర్పాటు చేయడంతో ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న వాణిజ్య సముదాయాలకు 50 శాతం వరకు గిరాకీ తగ్గిందని వాపోతున్నారు. ఇలానే కొనసాగితే వ్యాపారాలు మూసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హబ్సిగూడ వీధి నెంబర్–8 నుంచి చౌరస్తా వరకు 1.5 కిలోమీటర్ల దూరంలో రెండే యూటర్న్లు ఉన్నాయి. దీంతో పాదచారులు చాలా దూరం నడవాల్సి వస్తోంది. దివాళా... డివైడర్ల కారణంగా మా వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. వీధి నెంబర్–8 వద్ద దారిని మూసేయడంతో మా పరిస్థితి మరింత దారుణంగా మారింది. దారి లేక కస్టమర్లు రాలేకపోతున్నారు. మాగోడు ఎవరూ వినడం లేదు. – ప్రసాద్, వ్యాపారస్తుడు ట్రాఫిక్ జంఝాటం.. గచ్చిబౌలి: జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం నుంచి హైటెక్ సిటీలోని సైబర్ టవర్స్ వరకు 2.7 కిలోమీటర్ల మార్గంలో ఐదు యూటర్న్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లో తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఈ మార్గంలో 26 క్రాసింగ్స్ ఏర్పాటు చేసినప్పటికీ.. అవన్నీ ఇరుకుగా మారడంతో సిటీజనులు రోడ్డు దాటేందుకు అవస్థలు పడుతున్నారు. ఇక ఈ రూట్లో ప్రధాన రహదారి ఇరుకుగా మారడంతో పార్కింగ్ సమస్యలతో కస్టమర్లు రావడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర కిలోమీటర్ నడవాల్సిందే.. సనత్‌నగర్/అమీర్‌పేట: అమీర్‌పేట్–ప్యారడైజ్ వరకు ఆరు యూటర్న్లు, అమీర్‌పేట్–ఎర్రగడ్డ వరకు మూడు యూటర్న్లు ఉన్నాయి. ఒక్కో యూటర్న్‌కు అరకిలోమీటరు పైగానే దూరం ఉంది. దీంతో పాదచారులు రోడ్డు దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంత దూరం నడవలేక డివైడర్లు ఎక్కి ప్రమాదకరంగా రోడ్డు దాటుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారు. ♦ ముఖ్యంగా అమీర్‌పేట్, ఎస్ఆర్నగర్, ఈఎస్ఐ మెట్రో స్టేషన్లకు దూరంలో యూటర్న్లు ఉండడంతో ప్రయాణికులు ఆటోకు రూ.50 చెల్లించి రోడ్డు దాటాల్సి వస్తోంది. ♦ యూటర్న్ల వద్ద లైటింగ్, రేడియం స్టిక్కర్లతో ఇండికేషన్ బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. ♦ అమీర్‌పేట్–సికింద్రాబాద్ మార్గంలో రోడ్డుకు ఇరువైపులా వ్యాపార, వాణిజ్య సముదాయాలే ఉంటాయి. ఈ మార్గం మొత్తం డివైడర్లు ఏర్పాటు చేయడంతో అటు.. ఇటు వెళ్లే దారిలేక షాపులకు వచ్చే వారి సంఖ్య తగ్గిందని వ్యాపారులు వాపోతున్నారు. ఇక్కడ కాస్త బెటర్ సికింద్రాబాద్: సికింద్రాబాద్ ఈస్ట్ – పరేడ్‌గ్రౌండ్స్ – ప్యారడైజ్ – రసూల్‌పురా మార్గంలో పరిస్థితి కొంచెం బెటర్‌గా ఉంది. సికింద్రాబాద్ ఈస్ట్ – పరేడ్‌గ్రౌండ్స్ వరకు మినహా మిగతా మార్గంలో డివైడర్ల సమస్య లేదు. ♦ ఈ మార్గంలో ప్యాట్నీ, ప్యారడైజ్ ఫ్లైఓవర్లకు సమాంతరంగా రోడ్డుకిరువైపులా ఫుట్‌పాత్ వెంబడి మెట్రో లైన్ ఏర్పాటు చేశారు. దీంతో గతంతో పోలిస్తే రోడ్డు దాటేందుకు పాదచారులకు కొత్తగా ఇబ్బందులేవీ లేవు. ♦ ఇక పరేడ్‌గ్రౌండ్స్ – సికింద్రాబాద్ ఈస్ట్ మార్గంలో పెద్దగా కమర్షియల్ జోన్ లేనందున వ్యాపారులకు ఎలాంటి సమస్యలు లేవు. ♦ ప్యారడైజ్ – రసూల్‌పురా స్టేషన్ల మధ్య దగ్గర్లోనే యూటర్న్ ఉంది. వ్యాపారం తగ్గింది.. డివైడర్ల ఏర్పాటుతో వ్యాపారం బాగా తగ్గింది. సుదూర ప్రాంతాల్లో యూటర్న్లు ఏర్పాటు చేయడంతో.. అంత దూరం వెళ్లలేక కస్టమర్లు షాపులకు రావడం లేదు. డివైడర్ల ఎత్తు తగ్గించి పాదచారులు రోడ్డు దాటేందుకు వీలు కల్పించాలి. అమీర్‌పేట్ స్టేషన్ దగ్గర ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేసినా పాదచారులను అనుమతించడం లేదు. – గులాబ్‌సింగ్, వ్యాపారవేత్త, అమీర్‌పేట్ సౌకర్యాలేవీ? మెట్రో మార్గాల్లో రోడ్డు దాటాలంటే నరకమే.! అసలు రోడ్డు దాటేందుకు వీలుగా దారి ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. చాలా దూరంగా యూటర్న్ ఉన్నాయి. ఇక జిబ్రాక్రాసింగ్లే లేవు. పాదచారులు, వాహనదారులకు సౌకర్యాలు కల్పించాలి. – మంకయ్య, బల్కంపేట -
డీవై‘డర్’!
సాక్షి, సిటీబ్యూరో: ట్రాఫిక్ చిక్కులు తగ్గించేందుకు... రైట్–లెఫ్ట్ రహదారులను వేరు చేసేందుకు ఉద్దేశించిన డివైడర్లు ప్రస్తుతం నగర వాసులకు దడ పుట్టిస్తున్నాయి. వీటిలో కొన్ని ప్రమాదహేతువులుగా మారడంతో ఏటా అనేక మంది ప్రాణాలు కోల్పోవడం, తీవ్రంగా గాయపడటం జరుగుతోంది. వీటి నిర్మాణంలో శాస్త్రీయత కొరవడటం, అవసరమైన కనీస జాగ్రత్తలు, ప్రమాణాలు పాటించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. శుక్రవారం తెల్లవారుజామున పేట్ బషీరాబాద్ పరిధిలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు, శామీర్‌పేటలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు మారేడ్‌పల్లి వాసులు మృత్యువాతపడ్డారు. ఈ రెండు ప్రమాదాలకూ అతివేగం కారణమని పోలీసులు చెబుతున్నా... వీరి వాహనాలు డివైడర్లనే ఢీ కొట్టడం గమనార్హం. ప్రమాదాల్లో 30 శాతం వాటా... మూడు కమిషనరేట్ల పరిధిలోని ప్రధాన రహదారులతో పాటు శివారు మార్గాల్లో ఉన్న డివైడర్లు ప్రాణాంతకంగా మారుతూ వాహనచోదకుల గుండెల్లో వెహికిల్స్ పరిగెత్తిస్తున్నాయి. సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్లలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 30 శాతం డివైడర్ల కారణంగానే జరుగుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇవి కాంక్రీటుతో నిర్మితం కావడం, కొన్ని ప్రాంతాల్లో అవసరానికి మించి ఉండటంతో ఢీ కొట్టిన వాహనం నుజ్జుకావడంతో పాటు చోదకుడు ప్రాణాలతో బయటపడే అవకాశం చాలా తక్కువగా ఉంటోంది. గత కొన్నేళ్లుగా వీటి వల్ల జరుగుతున్న ప్రమాదాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం కొన్నిచోట్ల హఠాత్తుగా ఏర్పాటు చేస్తున్న డివైడర్లు రాత్రిళ్లు ప్రాణాలను హరిస్తున్నాయి. కారణాలు అనేకం... డివైడర్లు డెత్స్పాట్స్గా మారడానికి అనేక కారణాలు ఉంటున్నాయి. రాత్రి వేళల్లో కనిపించక ఢీ కొట్టడం, కీలక ప్రాంతాల్లో అశాస్త్రీయంగా ఏర్పాటు చేసిన వాటి వద్ద వాహనం కంట్రోల్ తప్పి దూసుకుపోవడం జరుగుతోంది. సిటీలోని కొన్ని ఫ్లైఓవర్ల వద్ద తరచూ ప్రమాదాలు నమోదు కావడానికి ఇవే కారణాలుగా మారుతున్నాయి. ఇక మద్యం మత్తులో దూసుకుపోతున్న ‘నిషా’చరులు వీటిని పట్టించుకునే స్థితిలో ఉండట్లేదు. సిటీ శివార్లతో పాటు ఔటర్, ఇన్నర్ రింగ్రోడ్స్లోని డివైడర్లు ప్రాణాంతకాలుగా మారుతున్నాయి. నిర్మాణంలో తేడా.. సాధారణంగా 100 అడుగుల కంటే ఎక్కువ వెడల్పు ఉన్న రోడ్ల మధ్యలోనే డివైడర్లు నిర్మించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత అవసరాల దృష్ట్యా ఇందులో సగం ఉన్న రహదారుల్లోనూ వీటిని ఏర్పాటు చేయాల్సి వస్తోంది. మరోపక్క గతంలో అనేక ప్రాంతాల్లో డివైడర్లు మాత్రమే ఉండేవి. వీటి మధ్యలో వర్షపు నీరు ఓ పక్క నుంచి మరో పక్కకు పోయే అవకాశం ఉండేది. అయితే అడ్వర్టైజ్మెంట్ బోర్డులు, లాలీపాప్స్ ఏర్పాటుతో ఆదాయం ఆర్జించాలనే జీహెచ్ఎంసీ వైఖరి కారణంగా డివైడర్ల ప్లేస్‌లో సెంట్రల్ మీడియమ్స్ వచ్చి చేరుతుండటంతో ఇబ్బందులు పెరుగుతున్నాయి. కలర్స్, క్యాట్ ఐస్ ఏర్పాటూ అంతంతే... ప్రమాదహేతువులుగా ఉన్న ప్రాంతాల్లో డివైడర్‌తో పాటు రోడ్ మార్జిన్స్‌లోనూ పెయిటింగ్ వేయడం అవసరం. సాధారణ పెయింట్స్ కంటే రిఫ్లెక్టివ్ పెయింట్స్ వల్ల ఉపయోగాలు ఎక్కువగా ఉంటాయి. రాత్రి వేళ కూడా ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. మార్జిన్స్‌తో పాటు ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో రాత్రి పూట మెరిసే క్యాట్ ఐస్ ఏర్పాటు చేయాలి. ఇవి రాత్రి పూట వాహనచోదకుల దృష్టిని ఆకర్షిస్తాయి. నగరంలో డివైడర్ల వద్ద వీటి ఏర్పాటు సైతం అంతంతగానే ఉంటోంది. డివైడర్‌ను పూర్తి శాస్త్రీయ పద్దతిలో, ఇంజనీరింగ్ నిపుణుల సహకారంతో ఏర్పాటు చేయాలి. కొత్తగా వెలిసిన డివైడర్ల వద్ద వాటి ఉనికి తెలిసేలా సూచికలు కచ్చితంగా ఉండాలి. రాత్రి వేళల్లో డివైడర్లను గుర్తించేందుకు వీలుగా రిఫ్లెక్టర్లు, క్యాట్‌ఐస్ వంటివి వెంటనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. ఈ చర్యలు తీసుకుంటేనే డివైడర్ ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చు. డివైడర్ ప్రమాదాల్లో మరికొన్ని... ♦ మేడ్చెల్‌లో జ్ఞానాపూర్ సమీపంలో కారు ప్రమాదంలో హన్మంతు మరణించగా... మాధవి, శ్రీయ గాయపడ్డారు. ♦ సైఫాబాద్ ఠాణా పరిధిలో ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌పై జరిగిన ప్రమాదంలో సురేందర్ మరణించగా.. సురేఖ తీవ్రంగా గాయపడ్డారు. ♦ బోయిన్పల్లి–తాడ్బంద్ రహదారిలో జరిగిన యాక్సిడెంట్లో అనిరుధ్, విశ్వాచారి మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ♦ చందానగర్ పరిధిలో జరిగిన ప్రమాదంలో విష్ణుమూర్తి, కిరణ్‌కుమార్ కన్నుమూశారు. రస్తారంగ్ తీవ్రంగా గాయపడ్డారు. ♦ బంజారాహిల్స్ ఠాణా పరిధిలోని కేబీఆర్ పార్క్ వద్ద జరిగిన ప్రమాదంలో వీరాస్వామి, యుగల్ క్షతగాత్రులయ్యారు. ♦ మాదాపూర్ పరిధిలో చోటు చేసుకున్న ప్రమాదంలో రిత్‌రాజ్, బులెటిన్రే మరణించారు. ♦ నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలోని ఇంద్రారెడ్డి కంచ వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కనిపించని కాషనరీ సైన్‌బోర్డ్స్ ఫలానా ప్రాంతం ప్రమాదకరమైంది, ప్రమాద హేతువు అని వివరించేందుకు సదరు స్పాట్‌కు కొద్దిదూరంలో కాషనరీ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి. ఆయా స్పాట్లకు రెండు వైపులా కనీసం 200 మీటర్ల దూరంలో తొలి బోర్డు (కాషన్–1), 100 మీటర్ల దగ్గర మరోటి (కాషన్–2) కచ్చితంగా ఉండాలి. అత్యంత ప్రమాదకరంగా మారిన డివైడర్ల వద్ద ఈ సైన్‌బోర్డులు మచ్చుకైనా కనిపించవు. ఈ డెత్ స్పాట్స్ దగ్గర ఉన్న డివైడర్‌ను సక్రమంగా నిర్వహించాలి. ఆ ప్రాంతాలకు ఇరువైపులా కనీసం 400 మీటర్ల మేర అయినా నిర్ణీత ఎత్తులో దీన్ని నిర్మించాలి. దీనికి ఇరువైపులా హజార్డ్ మార్కర్స్ (ప్రమాద సూచికలు) ఏర్పాటు చేయాలి. చీకట్లోనూ వీటి ఉనికి వాహనచోదకులకు తెలిసేలా రిఫ్లెక్టివ్ మార్కర్స్ లేదా సోలార్ మార్కర్స్ పెట్టాలి. -
కానిపోని పని!
పుష్కర పనులు.. మరో పుష్కరానికే! – మిగిలింది మూడు రోజులే.. – నగరంలో ఎక్కడ చూసినా తవ్విన రోడ్లే – అధికార పార్టీ నేత సన్నిహితునికి కాంట్రాక్టు – అనుభవ రాహిత్యంతో లోపించిన పురోగతి – కొనసా..గుతున్న నిర్మాణాలు – దుమ్ము లేస్తుండటంతో ప్రజలు, ప్రయాణికుల ఇక్కట్లు – ఇది కర్నూలు నగరంలోని వై.జంక్షన్(జల మండలి) నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లే మార్గం. ఇక్కడ రోడ్డు వెడల్పు చేయడంతో పాటు రోడ్డు నిర్మాణం, డివైడర్లను ఏర్పాటు చేయాలి. కోటి రూపాయలకు పైగా నిధులతో చేపట్టిన ఈ పనులు నెమ్మదించాయి. ఇంకా రోడ్ల విస్తరణ పనులే పూర్తిచేయలేదు. సాక్షి ప్రతినిధి, కర్నూలు: పుష్కరాల్లో భాగంగా చేపట్టిన పనులన్నీ పూర్తి కావాలంటే మరో ‘పుష్కర’ కాలం ఆగాల్సిందే. చివరి నిమిషం వరకు వేచి చూసి కేవలం అధికార పార్టీ నాయకులకే పనులు దక్కేలా ప్లాన్ వేసి మరీ పనులకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం.. వాటిని పూర్తి చేయడంలో మాత్రం కనీస జాగ్రత్తలు తీసుకోలేకపోయింది. ఫలితంగా పుష్కరాల కోసం వచ్చే భక్తుల పేరుతో చేపట్టిన పనులు వారికి కనీస సౌకర్యాలు అందించే పరిస్థితి లేకుండా పోయింది. పైగా రోడ్లు తవ్వడంతో దుమ్మురేగుతూ స్థానికులతో పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డివైడర్లపై మళ్లీ డివైడర్లు కర్నూలు నగరంలో సీ.క్యాంపు నుంచి నంద్యాల చెక్‌పోస్టు వరకు రూ.3 కోట్లతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను అధికార పార్టీ ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడు చేపడుతున్నారు. ఇక్కడ రోడ్డు విస్తరణతో పాటు మధ్యలో డివైడర్లను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ పనులన్నింటికీ కలిపి రూ.3 కోట్లతో అంచనాలు రూపొందించారు. అయితే, అధికార పార్టీకి చెందిన మనిషి కావడంతో.. పాత డివైడర్లపైనే మళ్లీ కొత్తగా డివైడర్లను కాసింత వెడల్పు చేసి వేస్తున్నారు. పాత డివైడర్లను తొలగించి పనులు చేయాలి. నంద్యాల చెక్‌పోస్టు సమీపంలో కొంత దూరం వరకు తొలగించిన సదరు కాంట్రాక్టర్లు.. ఆ తర్వాత మాత్రం పాత డివైడర్లపైనే కొత్తగా డివైడర్లను వేస్తున్నారు. పాత డివైడర్ల కింద ఎల్ఈడీ బల్పులకు సంబంధించిన వైర్లు ఉన్నాయనే సాకుతో కొత్త పనులను కానిచ్చేస్తున్నారు. చివరి నిమిషయంలో.. వాస్తవానికి కష్ణా పుష్కరాలు ఆగస్టు నెలలో వస్తాయని ముందుగానే తెలుసు. అందువల్ల జనవరి నుంచే ఈ పనులను ప్రారంభించి ఉంటే ఇప్పటికి అన్నీ పూర్తయ్యేవి. తద్వారా పుష్కరాలకు వచ్చే భక్తులకు సౌకర్యవంతంగానూ ఉండేది. అయితే, చివరి నిమిషంలో టెండర్లు పిలుస్తున్నారు. ఫలితంగా పనులు చేపట్టడమే ఆలస్యంగా మొదలవుతోంది. అంతేకాకుండా చివరి నిమిషంలో హడావుడిగా చేస్తున్న పనులు కావడంతో నాణ్యత పరీక్ష(క్వాలిటీ టెస్ట్)లు కూడా జరగడం లేదు. దీంతో కాంట్రాక్టర్లు ఆడిందే ఆట..పాడిందే పాటగా సాగుతోంది. అసలు కాంట్రాక్టర్లు ఎక్కడ పుష్కర పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లే చేపడుతున్నారు. ఇందుకోసం అసలు కాంట్రాక్టర్ 5 నుంచి 10 శాతం కమీషన్ తీసుకుని తప్పుకుంటున్నారు. సబ్ కాంట్రాక్టు తీసుకున్న వ్యక్తికి వాస్తవానికి అనుభవం లేదు. అందుకనే టెండర్లో కూడా పొల్గొనలేదు. అయితే, అధికార పార్టీ నేతల అండదండలతో సబ్ కాంట్రాక్టు దక్కించుకున్న వ్యక్తులు కాస్తా పనులు వేగంగా చేయలేకపోతున్నారు. మరో మూడు రోజుల్లో పుష్కరాలు ప్రారంభమవుతున్న ఈ సమయంలో ఏ ఒక్క పని వద్ద కూడా అసలు కాంట్రాక్టర్ కనీసం తొంగి చూసిన పాపాన పోలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. తద్వారా సబ్ కాంట్రాక్టు పొందిన వారు అధికార పార్టీ నేతలకు కమీషన్ ఇచ్చేసి పనులను నాసిరకంగా చేపడుతున్నారు. అయితే, అధికారులు మాత్రం ఈ పనుల్లో నాణ్యతను కనీసం పట్టించుకోవడం లేదు. ఫలితంగా అటు పనులు పూర్తికాక.. పూర్తయిన కొద్దిపాటి పనుల్లోనూ నాణ్యత లేక నిధులన్నీ కష్ణార్పణం అవుతున్నాయి.