కానిపోని పని!
కానిపోని పని!
Published Mon, Aug 8 2016 11:19 PM | Last Updated on Thu, Aug 30 2018 4:49 PM
పుష్కర పనులు.. మరో పుష్కరానికే!
– మిగిలింది మూడు రోజులే..
– నగరంలో ఎక్కడ చూసినా తవ్విన రోడ్లే
– అధికార పార్టీ నేత సన్నిహితునికి కాంట్రాక్టు
– అనుభవ రాహిత్యంతో లోపించిన పురోగతి
– కొనసా..గుతున్న నిర్మాణాలు
– దుమ్ము లేస్తుండటంతో ప్రజలు, ప్రయాణికుల ఇక్కట్లు
– ఇది కర్నూలు నగరంలోని వై.జంక్షన్(జల మండలి) నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లే మార్గం. ఇక్కడ రోడ్డు వెడల్పు చేయడంతో పాటు రోడ్డు నిర్మాణం, డివైడర్లను ఏర్పాటు చేయాలి. కోటి రూపాయలకు పైగా నిధులతో చేపట్టిన ఈ పనులు నెమ్మదించాయి. ఇంకా రోడ్ల విస్తరణ పనులే పూర్తిచేయలేదు.
సాక్షి ప్రతినిధి, కర్నూలు:
పుష్కరాల్లో భాగంగా చేపట్టిన పనులన్నీ పూర్తి కావాలంటే మరో ‘పుష్కర’ కాలం ఆగాల్సిందే. చివరి నిమిషం వరకు వేచి చూసి కేవలం అధికార పార్టీ నాయకులకే పనులు దక్కేలా ప్లాన్ వేసి మరీ పనులకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం.. వాటిని పూర్తి చేయడంలో మాత్రం కనీస జాగ్రత్తలు తీసుకోలేకపోయింది. ఫలితంగా పుష్కరాల కోసం వచ్చే భక్తుల పేరుతో చేపట్టిన పనులు వారికి కనీస సౌకర్యాలు అందించే పరిస్థితి లేకుండా పోయింది. పైగా రోడ్లు తవ్వడంతో దుమ్మురేగుతూ స్థానికులతో పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
డివైడర్లపై మళ్లీ డివైడర్లు
కర్నూలు నగరంలో సీ.క్యాంపు నుంచి నంద్యాల చెక్‌పోస్టు వరకు రూ.3 కోట్లతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను అధికార పార్టీ ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడు చేపడుతున్నారు. ఇక్కడ రోడ్డు విస్తరణతో పాటు మధ్యలో డివైడర్లను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ పనులన్నింటికీ కలిపి రూ.3 కోట్లతో అంచనాలు రూపొందించారు. అయితే, అధికార పార్టీకి చెందిన మనిషి కావడంతో.. పాత డివైడర్లపైనే మళ్లీ కొత్తగా డివైడర్లను కాసింత వెడల్పు చేసి వేస్తున్నారు. పాత డివైడర్లను తొలగించి పనులు చేయాలి. నంద్యాల చెక్‌పోస్టు సమీపంలో కొంత దూరం వరకు తొలగించిన సదరు కాంట్రాక్టర్లు.. ఆ తర్వాత మాత్రం పాత డివైడర్లపైనే కొత్తగా డివైడర్లను వేస్తున్నారు. పాత డివైడర్ల కింద ఎల్‌ఈడీ బల్పులకు సంబంధించిన వైర్లు ఉన్నాయనే సాకుతో కొత్త పనులను కానిచ్చేస్తున్నారు.
చివరి నిమిషయంలో..
వాస్తవానికి కష్ణా పుష్కరాలు ఆగస్టు నెలలో వస్తాయని ముందుగానే తెలుసు. అందువల్ల జనవరి నుంచే ఈ పనులను ప్రారంభించి ఉంటే ఇప్పటికి అన్నీ పూర్తయ్యేవి. తద్వారా పుష్కరాలకు వచ్చే భక్తులకు సౌకర్యవంతంగానూ ఉండేది. అయితే, చివరి నిమిషంలో టెండర్లు పిలుస్తున్నారు. ఫలితంగా పనులు చేపట్టడమే ఆలస్యంగా మొదలవుతోంది. అంతేకాకుండా చివరి నిమిషంలో హడావుడిగా చేస్తున్న పనులు కావడంతో నాణ్యత పరీక్ష(క్వాలిటీ టెస్ట్)లు కూడా జరగడం లేదు. దీంతో కాంట్రాక్టర్లు ఆడిందే ఆట..పాడిందే పాటగా సాగుతోంది.
అసలు కాంట్రాక్టర్లు ఎక్కడ
పుష్కర పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లే చేపడుతున్నారు. ఇందుకోసం అసలు కాంట్రాక్టర్ 5 నుంచి 10 శాతం కమీషన్ తీసుకుని తప్పుకుంటున్నారు. సబ్ కాంట్రాక్టు తీసుకున్న వ్యక్తికి వాస్తవానికి అనుభవం లేదు. అందుకనే టెండర్‌లో కూడా పొల్గొనలేదు. అయితే, అధికార పార్టీ నేతల అండదండలతో సబ్ కాంట్రాక్టు దక్కించుకున్న వ్యక్తులు కాస్తా పనులు వేగంగా చేయలేకపోతున్నారు. మరో మూడు రోజుల్లో పుష్కరాలు ప్రారంభమవుతున్న ఈ సమయంలో ఏ ఒక్క పని వద్ద కూడా అసలు కాంట్రాక్టర్ కనీసం తొంగి చూసిన పాపాన పోలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. తద్వారా సబ్ కాంట్రాక్టు పొందిన వారు అధికార పార్టీ నేతలకు కమీషన్ ఇచ్చేసి పనులను నాసిరకంగా చేపడుతున్నారు. అయితే, అధికారులు మాత్రం ఈ పనుల్లో నాణ్యతను కనీసం పట్టించుకోవడం లేదు. ఫలితంగా అటు పనులు పూర్తికాక.. పూర్తయిన కొద్దిపాటి పనుల్లోనూ నాణ్యత లేక నిధులన్నీ కష్ణార్పణం అవుతున్నాయి.
Advertisement
Advertisement