సాక్షి, సిటీబ్యూరో: ట్రాఫిక్ చిక్కులు తగ్గించేందుకు... రైట్–లెఫ్ట్ రహదారులను వేరు చేసేందుకు ఉద్దేశించిన డివైడర్లు ప్రస్తుతం నగర వాసులకు దడ పుట్టిస్తున్నాయి. వీటిలో కొన్ని ప్రమాదహేతువులుగా మారడంతో ఏటా అనేక మంది ప్రాణాలు కోల్పోవడం, తీవ్రంగా గాయపడటం జరుగుతోంది. వీటి నిర్మాణంలో శాస్త్రీయత కొరవడటం, అవసరమైన కనీస జాగ్రత్తలు, ప్రమాణాలు పాటించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. శుక్రవారం తెల్లవారుజామున పేట్ బషీరాబాద్ పరిధిలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు, శామీర్‌పేటలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు మారేడ్‌పల్లి వాసులు మృత్యువాతపడ్డారు. ఈ రెండు ప్రమాదాలకూ అతివేగం కారణమని పోలీసులు చెబుతున్నా... వీరి వాహనాలు డివైడర్లనే ఢీ కొట్టడం గమనార్హం.
ప్రమాదాల్లో 30 శాతం వాటా...
మూడు కమిషనరేట్ల పరిధిలోని ప్రధాన రహదారులతో పాటు శివారు మార్గాల్లో ఉన్న డివైడర్లు ప్రాణాంతకంగా మారుతూ వాహనచోదకుల గుండెల్లో వెహికిల్స్ పరిగెత్తిస్తున్నాయి. సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్లలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 30 శాతం డివైడర్ల కారణంగానే జరుగుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇవి కాంక్రీటుతో నిర్మితం కావడం, కొన్ని ప్రాంతాల్లో అవసరానికి మించి ఉండటంతో ఢీ కొట్టిన వాహనం నుజ్జుకావడంతో పాటు చోదకుడు ప్రాణాలతో బయటపడే అవకాశం చాలా తక్కువగా ఉంటోంది. గత కొన్నేళ్లుగా వీటి వల్ల జరుగుతున్న ప్రమాదాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం కొన్నిచోట్ల హఠాత్తుగా ఏర్పాటు చేస్తున్న డివైడర్లు రాత్రిళ్లు ప్రాణాలను హరిస్తున్నాయి.
కారణాలు అనేకం...
డివైడర్లు డెత్‌స్పాట్స్‌గా మారడానికి అనేక కారణాలు ఉంటున్నాయి. రాత్రి వేళల్లో కనిపించక ఢీ కొట్టడం, కీలక ప్రాంతాల్లో అశాస్త్రీయంగా ఏర్పాటు చేసిన వాటి వద్ద వాహనం కంట్రోల్ తప్పి దూసుకుపోవడం జరుగుతోంది. సిటీలోని కొన్ని ఫ్లైఓవర్ల వద్ద తరచూ ప్రమాదాలు నమోదు కావడానికి ఇవే కారణాలుగా మారుతున్నాయి. ఇక మద్యం మత్తులో దూసుకుపోతున్న ‘నిషా’చరులు వీటిని పట్టించుకునే స్థితిలో ఉండట్లేదు. సిటీ శివార్లతో పాటు ఔటర్, ఇన్నర్ రింగ్‌రోడ్స్‌లోని డివైడర్లు ప్రాణాంతకాలుగా మారుతున్నాయి.
నిర్మాణంలో తేడా..
సాధారణంగా 100 అడుగుల కంటే ఎక్కువ వెడల్పు ఉన్న రోడ్ల మధ్యలోనే డివైడర్లు నిర్మించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత అవసరాల దృష్ట్యా ఇందులో సగం ఉన్న రహదారుల్లోనూ వీటిని ఏర్పాటు చేయాల్సి వస్తోంది. మరోపక్క గతంలో అనేక ప్రాంతాల్లో డివైడర్లు మాత్రమే ఉండేవి. వీటి మధ్యలో వర్షపు నీరు ఓ పక్క నుంచి మరో పక్కకు పోయే అవకాశం ఉండేది. అయితే అడ్వర్‌టైజ్‌మెంట్ బోర్డులు, లాలీపాప్స్ ఏర్పాటుతో ఆదాయం ఆర్జించాలనే జీహెచ్‌ఎంసీ వైఖరి కారణంగా డివైడర్ల ప్లేస్‌లో సెంట్రల్ మీడియమ్స్ వచ్చి చేరుతుండటంతో ఇబ్బందులు పెరుగుతున్నాయి.
కలర్స్, క్యాట్ ఐస్ ఏర్పాటూ అంతంతే...
ప్రమాదహేతువులుగా ఉన్న ప్రాంతాల్లో డివైడర్‌తో పాటు రోడ్ మార్జిన్స్‌లోనూ పెయిటింగ్ వేయడం అవసరం. సాధారణ పెయింట్స్ కంటే రిఫ్లెక్టివ్ పెయింట్స్ వల్ల ఉపయోగాలు ఎక్కువగా ఉంటాయి. రాత్రి వేళ కూడా ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. మార్జిన్స్‌తో పాటు ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో రాత్రి పూట మెరిసే క్యాట్ ఐస్ ఏర్పాటు చేయాలి. ఇవి రాత్రి పూట వాహనచోదకుల దృష్టిని ఆకర్షిస్తాయి. నగరంలో డివైడర్ల వద్ద వీటి ఏర్పాటు సైతం అంతంతగానే ఉంటోంది. డివైడర్‌ను పూర్తి శాస్త్రీయ పద్దతిలో, ఇంజనీరింగ్ నిపుణుల సహకారంతో ఏర్పాటు చేయాలి. కొత్తగా వెలిసిన డివైడర్ల వద్ద వాటి ఉనికి తెలిసేలా సూచికలు కచ్చితంగా ఉండాలి. రాత్రి వేళల్లో డివైడర్లను గుర్తించేందుకు వీలుగా రిఫ్లెక్టర్లు, క్యాట్‌ఐస్ వంటివి వెంటనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. ఈ చర్యలు తీసుకుంటేనే డివైడర్ ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చు.
డివైడర్ ప్రమాదాల్లో మరికొన్ని...
♦ మేడ్చెల్‌లో జ్ఞానాపూర్ సమీపంలో కారు ప్రమాదంలో హన్మంతు మరణించగా... మాధవి, శ్రీయ గాయపడ్డారు.
♦ సైఫాబాద్ ఠాణా పరిధిలో ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌పై జరిగిన ప్రమాదంలో సురేందర్ మరణించగా.. సురేఖ తీవ్రంగా గాయపడ్డారు.
♦ బోయిన్‌పల్లి–తాడ్‌బంద్ రహదారిలో జరిగిన యాక్సిడెంట్‌లో అనిరుధ్, విశ్వాచారి మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
♦ చందానగర్ పరిధిలో జరిగిన ప్రమాదంలో విష్ణుమూర్తి, కిరణ్‌కుమార్ కన్నుమూశారు. రస్తారంగ్ తీవ్రంగా గాయపడ్డారు.
♦ బంజారాహిల్స్ ఠాణా పరిధిలోని కేబీఆర్ పార్క్ వద్ద జరిగిన ప్రమాదంలో వీరాస్వామి, యుగల్ క్షతగాత్రులయ్యారు.
♦ మాదాపూర్ పరిధిలో చోటు చేసుకున్న ప్రమాదంలో రిత్‌రాజ్, బులెటిన్‌రే మరణించారు.
♦ నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలోని ఇంద్రారెడ్డి కంచ వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
కనిపించని కాషనరీ సైన్‌బోర్డ్స్
ఫలానా ప్రాంతం ప్రమాదకరమైంది, ప్రమాద హేతువు అని వివరించేందుకు సదరు స్పాట్‌కు కొద్దిదూరంలో కాషనరీ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి. ఆయా స్పాట్లకు రెండు వైపులా కనీసం 200 మీటర్ల దూరంలో తొలి బోర్డు (కాషన్–1), 100 మీటర్ల దగ్గర మరోటి (కాషన్–2) కచ్చితంగా ఉండాలి. అత్యంత ప్రమాదకరంగా మారిన డివైడర్ల వద్ద ఈ సైన్‌బోర్డులు మచ్చుకైనా కనిపించవు. ఈ డెత్ స్పాట్స్ దగ్గర ఉన్న డివైడర్‌ను సక్రమంగా నిర్వహించాలి. ఆ ప్రాంతాలకు ఇరువైపులా కనీసం 400 మీటర్ల మేర అయినా నిర్ణీత ఎత్తులో దీన్ని నిర్మించాలి. దీనికి ఇరువైపులా హజార్డ్ మార్కర్స్ (ప్రమాద సూచికలు) ఏర్పాటు చేయాలి. చీకట్లోనూ వీటి ఉనికి వాహనచోదకులకు తెలిసేలా రిఫ్లెక్టివ్ మార్కర్స్ లేదా సోలార్ మార్కర్స్ పెట్టాలి.
Comments
Please login to add a commentAdd a comment