బేగంపేటలో మెట్రో డివైడర్ దాటేందుకు మహిళల అవస్థలు...
గ్రేటర్ వాసులకు మెట్రో డివైడర్లు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్న నాగోల్–అమీర్‌పేట్ (17 కి.మీ), అమీర్‌పేట్–మియాపూర్(13 కి.మీ)మార్గంలో మెట్రో పిల్లర్ల మధ్యన ఎత్తయిన గోడలతో డివైడర్లు, పలు చోట్ల దూరంగా యూటర్న్‌లు ఏర్పాటు చేశారు. దీంతో పాదచారులకు రోడ్డు దాటడం కష్టంగా మారింది. వాహనదారులు రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి యూటర్న్ తీసుకోవాల్సి వస్తోంది. ఆయా యూటర్న్‌ల వద్ద జీబ్రా క్రాసింగ్స్, పాదచారుల మార్గం లేకపోవడం శాపంగా పరిణమిస్తోంది. రాకపోకలు కష్టమై మెట్రో రూట్లో రహదారికి ఇరువైపులా వ్యాపారాలు సైతం పడిపోయాయి. బుధవారం ‘సాక్షి’ బృందం పరిశీలనలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
సాక్షి నెట్‌వర్క్: మెట్రో మార్గాల్లో డివైడర్ల నిర్మాణంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా ఎత్తులో డివైడర్లు ఉండడం, అర కిలోమీటర్‌కు పైగా దూరంలో యూటర్న్‌లు ఏర్పాటు చేయడం, జీబ్రాక్రాసింగ్‌లు లేకపోవడంతోసిటీజనులు అవస్థలు పడుతున్నారు. దీంతో కస్టమర్లు రాక వ్యాపారాలు దివాళాతీస్తున్నాయని రోడ్‌సైడ్ వ్యాపారులు వాపోతున్నారు. నాగోల్–అమీర్‌పేట్
(17 కి.మీ), అమీర్‌పేట్–మియాపూర్ (13 కి.మీ) మార్గాల్లో ‘సాక్షి’ బుధవారం విజిట్ నిర్వహించగా ఈ ఇబ్బందులు కళ్లకు కట్టాయి.
సిగ్నల్స్ లేవ్...
మలేసియాటౌన్‌షిప్:కూకట్‌పల్లి నుంచి మియాపూర్ మార్గంలో కొన్నిచోట్ల జిబ్రాక్రాసింగ్‌లు ఉన్నప్పటికీ సిగ్నల్స్, ట్రాఫిక్ సిబ్బంది లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వాహనాలు, పాదచారులు ఏక కాలంలో రోడ్డు దాటుతుండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
♦ కేపీహెచ్‌బీ కాలనీ రైల్వే స్టేషన్ దాటాక రామ్‌దేవ్‌రావ్ ఆసుపత్రి దగ్గర జిబ్రాక్రాసింగ్ ఏర్పాటు చేశారు. కానీఇక్కడ సిగ్నలింగ్ వ్యవస్థ లేదు. దీంతో ఇప్పటికే చాలా రోడ్డు ప్రమాదాలు జరిగాయి.
♦ కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్లు, నిజాంపేట్ క్రాస్‌రోడ్ ప్రాంతాల్లో సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసిన్పటికీ.. ట్రాఫిక్ సిబ్బంది లేకపోవడంతో
ఇబ్బందులు తప్పడం లేదు.
♦ ఇక్కడ ప్రధాన రహదారికి ఇరువైపులా వస్త్ర, వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. డివైడర్ల
ఏర్పాటుతో వ్యాపారం తగ్గుముఖం పట్టిందని వ్యాపారులు వాపోతున్నారు.
ఉప్పల్‌లో వ్యాపారులకు తిప్పలు..
ఉప్పల్: మెట్రో రైలు మార్గంలో పిల్లర్ల కింద నిర్మించిన డివైడర్లు స్థానిక వ్యాపారులకు శాపంగా మారాయి. దూరంగా యూటర్న్ ఏర్పాటు చేయడంతో ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న వాణిజ్య సముదాయాలకు 50 శాతం వరకు గిరాకీ తగ్గిందని వాపోతున్నారు. ఇలానే కొనసాగితే వ్యాపారాలు మూసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హబ్సిగూడ వీధి నెంబర్–8 నుంచి చౌరస్తా వరకు 1.5 కిలోమీటర్ల దూరంలో రెండే యూటర్న్‌లు ఉన్నాయి. దీంతో పాదచారులు చాలా దూరం నడవాల్సి వస్తోంది.
దివాళా...
డివైడర్ల కారణంగా మా వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. వీధి నెంబర్–8 వద్ద దారిని మూసేయడంతో మా పరిస్థితి మరింత దారుణంగా మారింది. దారి లేక కస్టమర్లు రాలేకపోతున్నారు. మాగోడు ఎవరూ వినడం లేదు. – ప్రసాద్, వ్యాపారస్తుడు
ట్రాఫిక్ జంఝాటం..
గచ్చిబౌలి: జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం నుంచి హైటెక్ సిటీలోని సైబర్ టవర్స్ వరకు 2.7 కిలోమీటర్ల మార్గంలో ఐదు యూటర్న్‌లు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లో తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఈ మార్గంలో 26 క్రాసింగ్స్ ఏర్పాటు చేసినప్పటికీ.. అవన్నీ ఇరుకుగా మారడంతో సిటీజనులు రోడ్డు దాటేందుకు అవస్థలు పడుతున్నారు. ఇక ఈ రూట్‌లో ప్రధాన రహదారి ఇరుకుగా మారడంతో పార్కింగ్ సమస్యలతో కస్టమర్లు రావడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అర కిలోమీటర్ నడవాల్సిందే..
సనత్‌నగర్/అమీర్‌పేట: అమీర్‌పేట్–ప్యారడైజ్ వరకు ఆరు యూటర్న్‌లు, అమీర్‌పేట్–ఎర్రగడ్డ వరకు మూడు యూటర్న్‌లు ఉన్నాయి. ఒక్కో యూటర్న్‌కు అరకిలోమీటరు పైగానే దూరం ఉంది. దీంతో పాదచారులు రోడ్డు దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంత దూరం నడవలేక డివైడర్లు ఎక్కి ప్రమాదకరంగా రోడ్డు దాటుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారు.
♦ ముఖ్యంగా అమీర్‌పేట్, ఎస్‌ఆర్‌నగర్, ఈఎస్‌ఐ మెట్రో స్టేషన్లకు దూరంలో యూటర్న్‌లు ఉండడంతో ప్రయాణికులు ఆటోకు రూ.50 చెల్లించి రోడ్డు దాటాల్సి వస్తోంది.
♦ యూటర్న్‌ల వద్ద లైటింగ్, రేడియం స్టిక్కర్లతో ఇండికేషన్ బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు.
♦ అమీర్‌పేట్–సికింద్రాబాద్ మార్గంలో రోడ్డుకు ఇరువైపులా వ్యాపార, వాణిజ్య సముదాయాలే ఉంటాయి. ఈ మార్గం మొత్తం డివైడర్లు ఏర్పాటు చేయడంతో అటు.. ఇటు వెళ్లే దారిలేక షాపులకు వచ్చే వారి సంఖ్య తగ్గిందని వ్యాపారులు వాపోతున్నారు.
ఇక్కడ కాస్త బెటర్
సికింద్రాబాద్: సికింద్రాబాద్ ఈస్ట్ – పరేడ్‌గ్రౌండ్స్ – ప్యారడైజ్ – రసూల్‌పురా మార్గంలో పరిస్థితి కొంచెం బెటర్‌గా ఉంది. సికింద్రాబాద్ ఈస్ట్ – పరేడ్‌గ్రౌండ్స్ వరకు మినహా మిగతా మార్గంలో డివైడర్ల సమస్య లేదు.
♦ ఈ మార్గంలో ప్యాట్నీ, ప్యారడైజ్ ఫ్లైఓవర్లకు సమాంతరంగా రోడ్డుకిరువైపులా ఫుట్‌పాత్ వెంబడి మెట్రో లైన్ ఏర్పాటు చేశారు. దీంతో గతంతో పోలిస్తే రోడ్డు దాటేందుకు పాదచారులకు కొత్తగా ఇబ్బందులేవీ లేవు.
♦ ఇక పరేడ్‌గ్రౌండ్స్ – సికింద్రాబాద్ ఈస్ట్ మార్గంలో పెద్దగా కమర్షియల్ జోన్ లేనందున వ్యాపారులకు ఎలాంటి సమస్యలు లేవు.
♦ ప్యారడైజ్ – రసూల్‌పురా స్టేషన్‌ల మధ్య దగ్గర్లోనే యూటర్న్ ఉంది.
వ్యాపారం తగ్గింది..
డివైడర్ల ఏర్పాటుతో వ్యాపారం బాగా తగ్గింది. సుదూర ప్రాంతాల్లో యూటర్న్‌లు ఏర్పాటు చేయడంతో.. అంత దూరం వెళ్లలేక కస్టమర్లు షాపులకు రావడం లేదు. డివైడర్ల ఎత్తు తగ్గించి పాదచారులు రోడ్డు దాటేందుకు వీలు కల్పించాలి. అమీర్‌పేట్ స్టేషన్ దగ్గర ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేసినా పాదచారులను అనుమతించడం లేదు. – గులాబ్‌సింగ్, వ్యాపారవేత్త, అమీర్‌పేట్
సౌకర్యాలేవీ?
మెట్రో మార్గాల్లో రోడ్డు దాటాలంటే నరకమే.! అసలు రోడ్డు దాటేందుకు వీలుగా దారి ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. చాలా దూరంగా యూటర్న్ ఉన్నాయి. ఇక జిబ్రాక్రాసింగ్‌లే లేవు. పాదచారులు, వాహనదారులకు సౌకర్యాలు కల్పించాలి. – మంకయ్య, బల్కంపేట
Comments
Please login to add a commentAdd a comment