నో పార్కింగ్ 'జర్నీ' | Parking Issues In Metro Project | Sakshi
Sakshi News home page

నో పార్కింగ్ 'జర్నీ'

Published Tue, Nov 21 2017 8:19 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM

Parking Issues In Metro Project - Sakshi

మరో వారం రోజుల్లో సిటీలో మెట్రో రైలు కూతపెట్టనుంది. మెట్రో జర్నీకోసం కలలుగంటున్న సిటీజన్లకు.. పలు స్టేషన్ల వద్ద పార్కింగ్‌ సహా వసతుల లేమి స్వాగతం పలుకుతోంది. అరకొర పనులు..అసంపూర్తి నిర్మాణాలు చాలాచోట్ల దర్శనమిస్తున్నాయి. నాగోల్‌–అమీర్‌పేట్‌ (17 కి.మీ), మియాపూర్‌–అమీర్‌పేట్‌ (13 కి.మీ) మార్గంలో ఈ నెల 28న ప్రధాని మోదీ చేతులమీదుగా మెట్రో రైలు  ప్రారంభోత్సవం జరగనుంది. ఈనేపథ్యంలో ఆయా స్టేషన్ల వద్ద ప్రారంభానికి సన్నద్ధత ఎలా ఉంది? ప్రయాణికులకు కల్పించిన వసతులేమిటి తదితర అంశాలను రెండు కారిడార్ల పరిధిలోని 30 కి.మీ మార్గంలో  ‘సాక్షి’ బృందం సోమవారం విస్తృతంగా క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ విజిట్‌లో పలుస్టేషన్ల వద్ద సమస్యలే స్వాగతం పలికాయి. మొత్తం 24 స్టేషన్లకు గాను 11 చోట్ల మాత్రమే పార్కింగ్‌ వసతి ఉన్నట్లు తేలింది. మిగతా 13 చోట్ల వాహనాలు నిలపడం పెద్ద సమస్యే.

 

మెట్రో స్టేషన్ల వద్ద ఇదీ పార్కింగ్‌ పరిస్థితి...
మార్గం: నాగోల్‌–అమీర్‌పేట్‌ 17 కి.మీ
మొత్తం స్టేషన్లు: 14
పార్కింగ్‌ వసతి ఉన్నవి: నాగోల్, ఉప్పల్, పరేడ్‌గ్రౌండ్స్, రసూల్‌పురా, బేగంపేట్, అమీర్‌పేట్‌  
పార్కింగ్‌ వసతి లేనివి: స్టేడియం, ఎన్‌జీఆర్‌ఐ, హబ్సిగూడ, తార్నాక, మెట్టుగూడ, సికింద్రాబాద్‌ వైఎంసీఏ, ప్యారడైజ్, ప్రకాశ్‌నగర్‌  

మార్గం:మియాపూర్‌–ఎస్‌.ఆర్‌.నగర్‌ 13 కి.మీ
మొత్తం స్టేషన్లు:10
పార్కింగ్‌ వసతి ఉన్నవి: మియాపూర్‌ టర్మినల్‌ స్టేషన్, బాలానగర్, కూకట్‌పల్లి, భరత్‌నగర్‌  
పార్కింగ్‌ వసతి లేనివి: జేఎన్‌టీయూ, కేపీహెచ్‌బీ, మూసాపేట్, ఎర్రగడ్డ, ఈఎస్‌ఐ, ఎస్‌.ఆర్‌.నగర్‌

 సాక్షి గ్రౌండ్‌ రిపోర్ట్‌
కలల మెట్రో కళ్ల ముందుకొస్తుంటే... స్టేషన్లలో వసతుల లేమి ప్రయాణికులకు నిరాశే మిగిల్చనుంది. మెట్రో స్టేషన్లలో పార్కింగ్‌ సమస్య ప్రధానంగా మారింది. కొన్ని చోట్ల ప్రయాణికుల వాహనాలకు పార్కింగ్‌ స్థలమున్నా... బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు నిలిపేందుకు మాత్రం తగిన ఏర్పాట్లు లేవు. ఇక ముహూర్తం ముంచుకొస్తున్నా చాలా స్టేషన్లలో పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని స్టేషన్లలో ఫుట్‌పాత్‌లు నిర్మించనే లేదు. సుందరీకరణ పనులూ అంతంత మాత్రంగానే జరిగాయి. వ్యర్థాలు పేరుకుపోయి స్టేషన్లు డంపింగ్‌ యార్డును తలపిస్తున్నాయి. నవంబర్‌ 28న మెట్రో రైలు ప్రారంభం నేపథ్యంలో నాగోల్‌–అమీర్‌పేట్‌ (17 కి.మీ), మియాపూర్‌–అమీర్‌పేట్‌(13 కి.మీ) మార్గంలోని 24 స్టేషన్లలో ‘సాక్షి’ సోమవారం విజిట్‌ నిర్వహించగా.. ఈ అసౌకర్యాలు కళ్లకు కట్టాయి.  

అమీర్‌పేట్‌ స్టేషన్‌
ఇంటర్‌ఛేంజ్‌ మెట్రో స్టేషన్‌గా ఉన్న అమీర్‌పేటలో పూర్తి చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి.  
ఫుట్‌పాత్‌ పనులు ఇంకా చేపట్టలేదు.  
సుందరీకరణ పనుల ఊసే లేదు.  
స్టేషన్‌ కింది భాగంలో వ్యర్థాలు పేరుకుపోయి డంపింగ్‌యార్డులా మారింది.  
మెట్రో కింది భాగంలో లైటింగ్‌ వ్యవస్థ పూర్తి చేయాల్సి ఉంది.
ప్రయాణికుల వాహనాల నిలుపుదలకు సారథి స్టూడియో సమీపంలో పార్కింగ్‌ కేటాయించారు. కానీ లింక్‌ బస్సులు నిలిపేందుకు ప్రత్యేక పార్కింగ్‌ లేదు.  
అమీర్‌పేట్‌ రహదారి ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఒకేసారి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రహదారిపైకి వస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.  

మియాపూర్‌ స్టేషన్‌
పార్కింగ్‌ ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయలేదు.  
కొన్ని ప్రాంతాల్లో టైల్స్‌ వేసినా... ఎక్కువ భాగం ఇంకా చదును చేయాల్సి ఉంది.  
పచ్చదనం పనులు కొంతమేర మాత్రమే చేపట్టారు.  
హెలీ ప్యాడ్, పైలాన్‌ నిర్మాణం కొనసాగుతోంది.  
ఎంట్రీ, ఎగ్జిట్‌ మార్గాలు, ఎస్కలేటర్‌ ఏర్పాటు చేశారు.

బాలానగర్‌
స్టేషన్‌కు సమీపంలో ఎక్కడా పార్కింగ్‌  సౌకర్యం లేదు. రైలు ఎక్కేందుకు ట్యాక్సీలు, ఇతర ప్రైవేట్‌ వాహనాల్లో వచ్చే ప్రయాణికులు స్టేషన్‌ సమీపంలోకి వస్తే ట్రాఫిక్‌ చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది.  సమీప కాలనీల నుంచి మెట్రో స్టేషన్‌ వరకు వచ్చేందుకు మినీ బస్సులు నడపాల్సిన అవసరం ఉంది.
స్టేషన్‌ సమీపంలో ఫుట్‌పాత్‌ పనులు కొనసాగుతున్నాయి.  

జేఎన్‌టీయూ
పార్కింగ్‌ పనులు ఇప్పుడే ప్రారంభించారు.  
పచ్చదనం ఏర్పాటు చేసేందుకు స్థలం కూడా లేదు.  
ఎంట్రీ, ఎగ్జిట్‌ మార్గాలు ఏర్పాటు  చేశారు.

ఎర్రగడ్డ
ప్రయాణికుల వాహనాలకు పార్కింగ్‌ వసతి లేదు.
బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు నిలిపేందుకు తగిన ఏర్పాట్లు లేవు.  
ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేయలేదు.
ప్రయాణికులు ఒక్కసారిగా బయటకు వస్తే ట్రాఫిక్‌ తప్పదు.

ఈఎస్‌ఐ
ఈ స్టేషన్‌లోనూ పార్కింగ్‌కు అవకాశం లేదు.
స్టేషన్‌ నిర్మాణం కారణంగా ప్రధాన రహదారి రెండు వైపులా 30 ఫీట్లకు తగ్గిపోవడంతో బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు నిలిపేందుకు చిక్కులు తప్పవు.
ఎంట్రీ, ఎగ్జిట్‌ మార్గాలు, ఫుట్‌పాత్‌లు నిర్మించారు.
స్టేషన్‌కు ఒకేసారి అధిక సంఖ్యలో జనం తరలివస్తే ట్రాఫిక్‌ తప్పదు.  

మూసాపేట్‌  
బైక్‌లు, కార్లకు పార్కింగ్‌ లేదు. బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు నిలిపేందుకు తగిన ఏర్పాట్లు చేయలేదు. వీటిని ఎక్కడ నిలపాలనే దానిపై ఇంకా ఓ క్లారిటీ లేనట్టు తెలుస్తోంది.  
టైల్స్‌ నిర్మాణం కొనసాగుతోంది. అనుకున్నంత స్థాయిలో హరితం లేదు.  
పారిశుధ్య లోపం కనిపిస్తోంది.  
ఫుట్‌పాత్‌లు ఇంకా ఏర్పాటు చేయలేదు.

కేపీహెచ్‌బీ  
ఈ మెట్రో స్టేషన్‌కు పార్కింగ్‌ సౌకర్యం లేకపోవడం పెద్ద లోటే. ఇక్కడ స్టేషన్‌ లోపల అన్ని వసతులు ఏర్పాటు చేశారు కానీ పార్కింగ్‌పై అధికారులు దృష్టి సారించలేదు.
ట్యాక్సీలు, ఇతర ప్రైవేట్‌ వాహనాల్లో వచ్చే ప్రయాణికులు స్టేషన్‌ సమీపంలో దిగడానికి వస్తే ట్రాఫిక్‌ జామయ్యే అవకాశం ఉంది.  
సమీప కాలనీల నుంచి మెట్రో స్టేషన్‌ వరకు వచ్చేందుకు మినీ బస్సులు నడపాల్సిన అవసరం ఉంది.
స్టేషన్‌ సమీపంలో ఫుట్‌పాత్‌ పనులు కొనసాగుతున్నాయి.  

ఎస్‌ఆర్‌ నగర్‌
పార్కింగ్‌ స్థలం లేదు.
ప్రధాన రహదారి కుంచించుకుపోవడంతో ఈ మార్గంలో బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు నిలిపేందుకు వీలుగా ప్రత్యేక మార్గాలు లేవు.
ఎంట్రీ, ఎగ్జిట్‌ మార్గాలు, ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేశారు.
ఒకేసారి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఇక్కడ దిగి ప్రధాన రహదారిపైకి తరలివస్తే ట్రాఫిక్‌ చిక్కులు తప్పవు.   

కూకట్‌పల్లి
ఈ స్టేషన్‌కు పార్కింగ్‌ వసతి లేదు. ఇదే ఇక్కడ పెద్ద సమస్య. బయట నుంచి వచ్చే వాహనాలు ఎక్కడ నిలపాలో తెలియని పరిస్థితి ఉంది.  
ఈ స్టేషన్‌ సమీపంలో బస్‌స్టేషన్లు ఉండడం కొంత అనుకూలం. బస్సుల్లో వచ్చి ఇక్కడి నుంచి మెట్రో రైలులో ప్రయాణించవచ్చు.
సమీప కాలనీలకు కనెక్టివిటీ వాహనాలు నడపాల్సిన అవసరం ఉంది. లేకుంటే ప్రైవేట్‌ క్యాబ్‌లు, ఆటోలు ఆశ్రయించాల్సి వస్తుంది.

భరత్‌నగర్‌  
ప్రయాణికుల వాహనాలకు పార్కింగ్‌ సదుపాయం లేదు.  
బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు నిలిపేందుకు తగినంత స్థలం లేదు.  
ఫుట్‌పాత్‌లు, పచ్చదనం కానరాలేదు.  
ఎక్కడి టైల్స్‌ అక్కడే పడేసి ఉన్నాయి.  
ప్రయాణికులు చాలా జాగ్రత్తగా బయటకు వెళ్లాలి. పక్కన మూసీ నది నాలా ఉంది. చిన్నపాటి రక్షణ ఏర్పాట్లు చేసి వదిలేశారు.  

బేగంపేట్‌
స్టేషన్‌కు ఒకవైపే మెట్ల మార్గం ఏర్పాటు చేశారు. రెండు రైళ్లు ఒకేసారి వస్తే.. ప్రయాణికులందరూ ఒకే మార్గం గుండా రోడ్డు మీదకు రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో బ్రిడ్జి కింది నుంచే వాహనాలతో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది.  
ఇక ఫుట్‌పాత్‌ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
ప్రయాణికుల వాహనాలకు సరిపడా పార్కింగ్‌ స్థలం లేదు.  
స్టేషన్‌ కింది భాగం వ్యర్థాలు, చెత్తాచెదారంతో నిండిపోయింది.  
లైఫ్‌స్టైల్‌ బిల్డింగ్‌ వైపున్న లిఫ్ట్‌ ఎదుట కేబుళ్లు వదిలేశారు.   

ప్రకాష్‌నగర్‌
పేరుకే ప్రకాష్‌నగర్‌ మెట్రో స్టేషన్‌. ఇది ఆ ప్రాంతానికి సుమారు అర కిలోమీటర్‌ దూరంలో ఉంది.
పార్కింగ్‌ స్థలం లేనే లేదు. పార్కింగ్‌ కోసం రసూల్‌పురా చౌరస్తాలో కేటాయించిన ప్రాంతానికి వెళ్లాల్సిందే.  
ఫుట్‌పాత్‌ పనులు కొనసాగుతున్నాయి.
నిర్మాణ వ్యర్థాలు, చెత్తా చెదారం షరామామూలే.
బేగంపేట్‌ రహదారి మధ్యలో మెట్ల మార్గం ఉండడంతో ప్రయాణికులు ఒకేసారి రోడ్డు మీదకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

మెట్టుగూడ
స్టేషన్‌కు ఓ వైపు రైల్వే క్వార్టర్లు, మరోవైపు ప్రైవేట్‌ భవనాలు, అపార్టుమెంట్లు ఉన్నాయి. దీంతో పార్కింగ్‌ స్థలం లేకుండా పోయింది.  
ఫుట్‌పాత్‌ పనులు జరుగుతున్నాయి.  
ట్రాఫిక్‌జామ్‌తో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.   

 హబ్సిగూడ
ప్రత్యేకంగా పార్కింగ్‌ లేదు. అయితే బస్టాప్‌ నుంచి మరికొంత దూరం వరకు వాహనాలు నిలుపుకోవచ్చు.
స్టేషన్‌కు రెండు వైపులా బస్టాపులు ఉన్నాయి.  
సారథి స్టూడియోను ఆనుకొని విశాలమైన బస్‌బే ఉంది.
సుప్రభాత్‌ హోటల్‌ దగ్గర ఇంకా ఫుట్‌పాత్‌ పనులు జరుగుతున్నాయి.  

రసూల్‌పురా
పార్కింగ్‌ స్థలం కేటాయించినప్పటికీ అందులో చెత్తాచెదారం పేరుకుపోయింది. చదును చేయాల్సి ఉంది.  
ఫుట్‌పాత్‌ల నిర్మాణం అసంపూర్తిగా ఉంది.  
అందమైన పూల మొక్కలు తెచ్చారు. కానీ నాటలేదు.  
నిర్మాణ వ్యర్థాలు ఎక్కడికక్కడే గుట్టులుగా ఉన్నాయి.  

 ప్యారడైజ్‌
స్టేషన్‌కు కిలోమీటర్‌ దూరంలో పార్కింగ్‌ స్థలం ఉంది.  
ఫుట్‌పాత్‌ పనులు 20 శాతమే పూర్తయ్యాయి.  
హరితం ఊసే లేదు.  
చాలా పనులు చేయాల్సి ఉంది.   

పరేడ్‌గ్రౌండ్‌
 ఈ స్టేషన్‌లో ప్రయాణికులకు అనువైన వసతులున్నాయి.  
జీహెచ్‌ఎంసీ కార్యాలయ భవనం, రక్షణశాఖ స్థలం, మరోవైపు పెట్రోలుబంక్‌ స్థలాన్ని మెట్రో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.    
అయితే విశాలమైన పార్కింగ్‌ ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైనంత స్థలం ఉన్నప్పటికీ... ఆ దిశగా పనులు నేటికీ ప్రారంభం కాలేదు.

సికింద్రాబాద్‌ ఈస్ట్‌
చాలా ఇరుకైన ప్రదేశంలో ఈ స్టేషన్‌ ఉంది.
ఫుట్‌పాత్‌లు నిర్మించలేదు.  
క్యాబ్‌లు, కార్లలో వచ్చి ప్రయాణికులు చాలా దూరంలో దిగి రావాల్సిందే.  
మెట్రో అధికారులు స్వాధీనం చేసుకున్న గోపాలపురం పోలీస్‌ స్టేషన్‌ భవనం స్థలాన్ని పార్కింగ్‌కి కేటాయిస్తారని ప్రచారం జరిగినా... నేటికీ ఆ దిశగా పనులు జరుగలేదు. సదరు స్థలాన్ని చదును చేసి ప్రస్తుతం స్క్రాప్‌ వస్తువుల కేంద్రంగా వాడుతున్నారు.  

తార్నాక
ప్రయాణికులు తమ వాహనాలు పార్క్‌ చేసేందుకు స్థలం లేదు.   
స్టేషన్‌ నుంచి ఉప్పల్‌ వెళ్లే మార్గం చాలా ఇరుగ్గా ఉంది. మున్సిపల్‌ వాటర్‌ ట్యాంకర్‌ ఉంది.
వాహనాలను తీసుకెళ్లేందుకు ట్రాక్టర్‌లు, డీసీఎంలు  వందలాదిగా వస్తాయి.
దీంతో ప్రయాణికులు ఎటువైపు వెళ్లాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది.
ట్రాఫిక్‌ రద్దీకి అవకాశం ఉంది. ఫుట్‌పాత్‌ పనులు ఇంకా జరుగుతున్నాయి.

ఎన్‌జీఆర్‌ఐ
ద్విచక్ర వాహనాలకు మాత్రమే పార్కింగ్‌ సదుపాయం ఉంది.
పెద్ద వాహనాలు నిలిపేందుకు అవకాశం లేదు.
స్టేషన్‌కు రెండు వైపులా ఫుట్‌పాత్‌లు లేవు.
వర్షాకాలం ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున నీళ్లు నిలుస్తాయి.  

స్టేడియం
ఈ స్టేషన్‌కు రెండు వైపులా రోడ్డు ఇరుకుగా ఉంది.  
ప్రయాణికుల రాకపోకలకు ఫుట్‌పాత్‌లు ఉన్నప్పటికీ, ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో స్టేషన్‌ దిగి వెళ్లేటప్పుడు వాహనాల రద్దీ నెలకొనే అవకాశం ఉంది.
హబ్సిగూడ వైపు వెళ్లే మార్గంలో ఫుట్‌పాత్‌ పనులు ఇంకా కొనసాగుతున్నాయి.
స్టేడియానికి ఇరువైపులా మిషన్‌ భగీరథ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి.
రోడ్ల తవ్వకాల కోసం భారీ క్రేన్‌లను ఏర్పాటు చేశారు. అటు వైపు ప్రయాణికులు ఎక్కడం, దిగడం చాలా కష్టం.
పైపులైన్‌ పనులతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.  

ఉప్పల్‌
ఇక్కడ ద్విచక్ర వాహనాలకు మాత్రమే పార్కింగ్‌ సదుపాయం ఉంది.  
కార్లు, బస్సులు, ఆటోలు తదితర పెద్ద వాహనాలు నిలిపేందుకు పార్కింగ్‌ స్థలాలు లేవు.
రెండువైపులా బస్టాపులు ఉన్నాయి. ప్రయాణికులు నేరుగా బస్టాపులకు వెళ్లేందుకు అవకాశం ఉంది.  
ఫుట్‌పాత్‌లు, గ్రీనరీ ఏర్పాటు చేశారు.  

నాగోల్‌  
వాహనాలకు పార్కింగ్‌ సదుపాయం లేదు.  
స్టేషన్‌కు ఎదురుగా రెండకరాల్లో డంపింగ్‌ యార్డ్‌ ఉంది. దుర్గంధంతో ప్రయాణికులు ముక్కు మూసుకోవాల్సిందే.  
స్టేషన్‌కు సమీపంలోనే ఆర్టీఏ కార్యాలయం ఉంది. ప్రతిరోజు వందలాది వాహనాలతో ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది.
జనం ఒకేసారి రోడ్డు మీదకు వస్తే ఎక్కడి వాహనాలు అక్కడ ఆగిపోవాల్సిందే. ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఎక్కువ.

అదే పెద్ద సమస్య..  
అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే మెట్రోకు పార్కింగ్‌ సదుపాయం లేకపోవడం శోచనీయం. మెట్రో ప్రయాణానికి ఇదే పెద్ద సమస్యగా మారింది. అలాగే చార్జీలపై స్పష్టత లేదు. అందరికీ అందుబాటులో చార్జీలుండాలి.   – ఎస్‌.అనిల్‌రెడ్డి, ఉప్పల్‌

పార్కింగ్‌ ఏదీ?  
మెట్రో రైలులో ప్రయాణించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం. అయితే కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీలోని మెట్రో స్టేషన్లలో పార్కింగ్‌ సౌకర్యం లేదు. దీంతో మాకు ఇబ్బందలు తప్పేలా లేవు.    
– స్వామి, కూకట్‌పల్లి

ఇప్పటికైనా..?  
కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ ప్రాంతాల్లో ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ పార్కింగ్‌ సదుపాయం కల్పించకపోవడం దారుణం. అధికారులు ఇప్పటికైనా స్పందించి పార్కింగ్‌ ఏర్పాటు చేయాలి.   – నరసింహ, కేపీహెచ్‌బీ

పనుల్లో జాప్యం..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ముహూర్తం ఖరారైన పనులు ఇంకా పూర్తి కాలేదు. పార్కింగ్, షాపింగ్‌ మాల్‌ల పనులు ఎప్పడో చేయాల్సి ఉంది. ఇక సౌకర్యాలు ఎలా ఉంటాయో చూడాలి. పార్కింగ్‌ ఫీజు సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా నిర్ణయించాలి.   – కిరణ్, గచ్చిబౌలి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement