devotionly
-
నా ప్రార్థనను ఎందుకు మన్నించవు?
నిను నావాకిలి గావుమంటినొ? మరున్నీలాలక భ్రాంతి గుం టెన పొమ్మంటినొ, యెంగిలిచ్చితిను తింటేగాని కాదంటినో నిను నెమ్మిందగ విశ్వసించు సుజనానీకంబు రక్షింప చే సిన నావిన్నపమేల గైకొనవయా శ్రీకాళహస్తీశ్వరా! భావం: శ్రీకాళహస్తీశ్వరా! నా యింటిని కావలి కాయమని నిన్ను కోరానా? నిన్ను రాయబారిగా వెళ్లమన్నానా?నేను తిన్న ఎంగిలిపదార్థాన్ని నీకు పెట్టి,‘తింటావా? లేదా?‘అని, నిన్ను తొందర చేశానా? నిన్ను నమ్మిన మంచివాళ్లైన నీ భక్తులను రక్షించమని నేను వేడితే, నా ప్రార్థనను ఎందుకు మన్నించవు? ఱాలన్ రువ్వగ చేతులాడవు, కుమారా! రమ్మురమ్మంచు నే – చాలన్ చంపగ, నేత్రముల్దివియగా శక్తుండనేగాను, నా శీలంబేమని చెప్పనున్న దిక నీ చిత్తంబు, నా భాగ్యమో శ్రీలక్ష్మీపతి సేవితాంఘ్రియుగళా! శ్రీకాళహస్తీశ్వరా! భావం: శ్రీమన్నారాయణునిచే పూజించబడు శ్రీకాళహస్తీశ్వరా! ఆ బోయవానిలా పూజ చేసేందుకు నీపై రాళ్లు విసర లేను. రమ్మని పిలిచి, కన్న కొడుకును చంపలేను. నా కన్నులను ఊడబెరికి ఇవ్వలేను. నా గురించి ఇంకా నేనేం చెప్పాలి? ఇక నీదయ!!! నా భాగ్యం!!! -తెలుగు తాత్పర్యం: టేకి వీరబ్రహ్మం -
సంసార జీవితంతో వేగలేను
కాయల్గాచె వధూనఖాగ్రముల చే గాయంబు వక్షోజముల్ రాయన్రాపడె ఱొమ్ము మన్మథ విహారక్లేశవిభ్రాంతిచే ప్రాయంబాయెను బట్టగట్టెతల చెప్పన్ రోత సంసారమే చేయంజాలవిరక్తు చేయగదవే శ్రీకాళహస్తీశ్వరా ! భావం: శ్రీకాళహస్తీశ్వరా! స్త్రీల గోటిగీట్లతో నా శరీరమంతా కాయలు కాసింది. వారి వక్షోజముల రాపిడికి నా గుండె మొద్దుబారి పోయింది. మన్మథలీలల బాధలతో, మోహంతో, నా యవ్వనమంతా గడచిపోయింది. బట్టతల వచ్చేసింది. చెప్పాలంటే ఈ సంసార జీవితం నాకిపుడు అసహ్యం వేస్తోంది. ఇక నేనీ సంసార జీవితంతో వేగలేను. నన్నింక వైరాగ్య జీవితంలోనికి మళ్లించు ప్రభూ! నిన్నే రూపముగా భజింతు మదిలో, నీరూపు మోకాలొ, స్త్రీ చన్నో కుంచమొ మేకపెంటికయొ యీసందేహముల్మాన్పినా కన్నారన్భవదీయమూర్తి సగుణాకారంబుగాజూపవే చిన్నీరేజ విహార మత్త మధుపా శ్రీకాళహస్తీశ్వరా! భావం: శ్రీ కాళహస్తీశ్వరా! మనోకమలంలో విహరించే తుమ్మెదవైన ఈశ్వరా! శ్రీకాళహస్తీశ్వరా! నిన్నేరూపంతో ఆరాధించేది? నీ ఆకారము మోకాలా? స్త్రీ వక్షోజమా? మేకపెంటికయా? కుంచమా? నా యీ సందేహాన్ని తొలగించి, నీ రూపాన్ని, సగుణాకారంగా, నా కన్నులారా నేను చూసేలా, నాకు చూపించు. -తెలుగు తాత్పర్యం: టేకి వీరబ్రహ్మం -
దాస్యభక్తితో తరించిన ధన్యులు
ఎర్రని ఎండ. వయసు అరవై యేళ్లుండొచ్చు. మరాఠా దేశపు స్త్రీల వస్త్రధారణతో నిదానంగా వస్తోందామె. కుడి చేత్తో తన తల మీద బుట్టని పట్టుకుని కనిపిస్తోంది. ఆ బుట్ట పడిపోకుండా తల మీద ఒక తుండుతో (తువ్వాలు) చుట్టచుట్టిన చుట్టకుదురు ఆ బుట్ట కింద ఉంది. ఆ వెదురు బుట్టలో ఒక మంచి నీళ్ల లోటా (కూజా లాంటి రాగి పాత్ర) ఆ పక్కనే కాయగూరలతో వండిన ఓ కూర, దానిపక్కన భాకరీలు(రొట్టెలు, ఈ రోజుల్లో బేకరీ అని పిలుస్తున్నది ఇదే). ఇన్నిటినీ ఎంత కప్పుదామని ప్రయత్నించినా గాలికి ఎగిరిపోతూ ఉన్న తెల్లని వస్త్రం.తల నుండి వస్తున్న స్వేదంతో అటు ఇటు చెంపలు రెండూ దాదాపుగా తడిసిపోయాయి. నుదుటి నుండి కారుతున్న స్వేదానికి పెద్దగా గుండ్రంగా పెట్టిన కుంకుమ జారిపోతూ ఎర్రటి నీళ్లని ముక్కు మీదుగా విడుస్తోంది. గడ్డం మీద త్రిభుజాకారంలో మూడు చుక్కల పచ్చబొట్టుతో ఆమె అలా వస్తోంది. ఆమె ఎంత దూరం నడిచిందో.. ఎలాంటి మార్గంలో నడిచి వస్తోందో తెలియజేస్తూ కంపలతో, పొదలతో, ఎగుడుదిగుడులతో, చూపు సాగినంత దూరపు పొడుగుతో సన్నని పుంత మార్గం కనిపిస్తోంది. ‘ఉష్’మని ఓ మారు నిట్టూర్పు విడుస్తూ ఆమె తన నడకని ఆపి చెట్టు కింద ఉన్న చిన్న రాతి మీద అలా కూర్చుంటూ.. బుట్టని కిందికి దింపి ఆ తలగుడ్డతో ముఖాన్ని తుడుచుకుంటోంది. కానీ.. చూపుని మాత్రం ఎడమవైపుకీ, ముందువైపుకీ, కుడివైపుకీ ప్రసరింపజేస్తూ నిశితంగా చూస్తోంది. ఎవరో తనకి కనిపించవలసి ఉన్నారన్నట్టుగా. నెమలి తాననుకున్న గోడనో చెట్టునో ఎక్కి మధురకంఠ ధ్వనితో క్రీంకారాన్ని చేసినట్టుగా.. తల్లి పక్షి తన పిల్లలకి ఆహారాన్ని తేగలిగాననే ఆనందంతో పిల్లలకి తన రాకని సూచిస్తూ ఆనందంతో అరిచినట్టుగా.. ‘సాయినాథా!’ అని పెద్దగా రెండుమార్లు ఎలుగెత్తి పిలిచింది.అదంతా ఓ అడవి. ఎవరు పలుకుతారు? ఎందుకు పలుకుతారు? నిస్పృహతో మళ్లీ శక్తినంతా కూడగట్టుకుని మళ్లీ పిలిచింది. ‘సాయినాథ్!’ అని. ఏ ప్రతిధ్వనీ లేదు. కొద్దిపాటి నిరుత్సాహంతో ముందు వైపు రెండుపక్కలనీ చూసి ఒక్కమారు వెనుకవైపు కూడా చూద్దామనే ఉద్దేశంతో లేచి నిలబడి వెనుదిరిగింది. అంతే! కొద్ది దూరంలో ఓ పెద్ద గంగరావి చెట్టు. దట్టంగా నీడనిచ్చే చెట్టు అది. దానికింద చదరంగా ఉన్న పరిశుభ్రమైన నేల. అక్కడ కూర్చుని కళ్లు మూసుకుని తపోధ్యానముద్రలో సాయినాథుడు ఆమెకి కనిపించాడు. ‘మూడు మార్లు పిలిచినా, తన పిలుపు వినిపించేంత దూరంలోనే సాయి ఉన్నా పలకడేమిటి?’ అనే వ్యతిరేక భావమే ఆమెకి లేదు.తల్లి ఆవు కనిపిస్తే లేగదూడ ఎలా చెంగుచెంగున దూక్కుంటూ తల్లి వద్దకి వెళ్లిపోతుందో, మండు వేసవిలో అల్లంత దూరంలో చెరువు కనిపిస్తే ఎలా పాంథుడు వేగంగా అక్కడికి వెళ్లిపోతాడో.. అలా ఆమె వెంటనే ఆ తల చుట్టని నెత్తి మీద పెట్టుకుని వెదురుచుట్టని, ఆ పైన పెట్టుకుని, సాయినాథుని దగ్గరికి వెళ్లిపోయింది చరచరా అడుగులేసుకుంటూవెళ్లీ వెళ్లడంతోటే ఆమె బుట్టని దింపి, ఆయన పాదాల మీద తన తలనుంచి భక్తిపూర్వకంగా నమస్కరించింది. సాయినాథుడు తపస్సుని వీడి, కళ్లు తెరిచి ఆమెని చూశాడు. ఈమె కూడా ఆయనని భక్తి పారవశ్యంతో దర్శించింది. మౌన సంభాషణం ఆ ఇద్దరూ మౌనంగా కళ్లతోనే మాట్లాడుకోసాగారు. సాయి ఆమెని చూస్తూ! ‘అమ్మా! నేనా ఓ ఫకీరుని. ఎవరూ నావాళ్లంటూ లేనివాడ్ని. ఏ రోజు ఈ అడవిలో ఎక్కడుంటానో, ఎంతసేపుంటానో నాకే తెలియదు.ఆ ఊరి నుండి ఇన్ని కోసుల దూరం నడిచి ఎందుకమ్మా ఇంత శ్రమ నీకు? పోనీ ఒక రోజా రెండ్రోజులా? ఎంతో కాలం నుండి ఎందుకమ్మా ఈ శారీరక శ్రమ? అయినా ఏ సాయంత్రానికో పోనీ నీ దగ్గరకే రమ్మంటే నా జోలెతో, డబ్బాతో రాకపోయానా?’ అని ఆయన కళ్లతో పలకరించాడు.ఆమె కూడా ఆనందబాష్పాలని విడుస్తూ! ‘సాయినాథా! నువ్వే మాకు (మా కుటుంబానికి) తల్లివి. తండ్రివి. గురువువి. దైవానివీ! నీకు నైవేద్యం పెట్టకుండా మేం ఎలా తినేది? అయినా నువ్వు కనిపిస్తే చాలు ఆ శారీరకశ్రమ, మార్గాయాసం మొత్తం అలా గాలికి మేఘం చెదిరిపోయినట్టుగా అయిపోతుంది. ఇన్నాళ్ల నుండీ వస్తున్నాను కదా! ఎండైనా, వానైనా, చలైనా, మంచైనా నువ్వు నాకు కనిపిస్తూనే ఉన్నావు గాని కనిపించని ఒక్క రోజుందా? భక్తితో మేం ప్రార్థిస్తే అనుగ్రహిస్తావు కాబట్టే ఈ తపనంతా!’ అన్నట్టు చూసింది.ఆ చదరపునేల మీద చక్కగా విస్తరిని వేసింది. 3 భాకరీలని పెట్టింది. పాత్రలోని కూరని వడ్డించింది. పక్కనే మంచినీటి లోటాని పెట్టింది. ఆయన రెండు మాత్రమే తిని లేవబోతూ ఉంటే కొసరికొసరి తినిపించింది. ఇది ఈ రోజునే కాదు. ఏ రోజూ ఇదే సాగుతుంది ఆ ఇద్దరి మధ్యా. సాయి లేచి వెళ్తూ ఉంటే ఆమె మౌనంగా ఆయన్ని అనుసరించింది. ఎంతో దూరం నడిచాక ఊరొచ్చింది. సాయి ఉండే మసీదొచ్చింది. ఆయన లోపలికి వెళ్లిపోయాక ఆమె తన ఇంటికొచ్చింది. ఆమె పేరు బాయిజాబాయ్. ఆమెకి ఎప్పుడైనా చిన్న శారీరకమైన నలతగాని వస్తే ఆమె భర్త వచ్చి సాయిని వెదికి, రొట్టెల్ని తినిపించి మరీ ఇంటికి వెళ్లడమే తప్ప, ఏనాడూ సాయికి నైవేద్యాన్ని సమర్పించని రోజు లేనే లేదు ఆ ఇద్దరికీ.ఓ రోజు సాయి నోరు తెరిచి అడగనే అడిగాడు ఆమెని– ‘అమ్మా! నేను నీకు ఏం చేయగలననీ.. ఏం చేస్తాననీ.. ఈ శ్రమని ఇంతగా పడుతున్నావు? నా బుద్ధికి ఎటు తోస్తే అటుపోయే ఫకీరుని కదా! ఫలాని చోటున నేనుంటానని చెప్తే నువ్వు రావడంలో అర్థముంది గానీ, ఈ అగమ్య, అనూహ్య గమనం (వెళ్లరాని వెళ్లలేని ఊహకి అందని చోటుకి పోవడం) కల నాకు ఈ ఆహారాన్ని తేవడాన్ని ఎవరు చూసినా, విన్నా ఎంత అపహాస్యంగా ఉంటుంది? నేను చక్రవర్తితో సమాన భోగాలు కలవాడ్ని. మహా ఐశ్వర్యవంతుడ్ని. నన్ను ఈ లోకానికి పంపిన నా అల్లా నాకు తిండి లేకుండా చేస్తాడా? వద్దమ్మా! నా తిండి నేను చూసుకుంటాను. ఎందుకు రావడం?’ అని. ఆమె దుఃఖబాష్పాలని విడుస్తూ ‘సాయీశ్వరా! నువ్వు తిననిదే నేనెలా తినేది?’ అంది హృదయపూర్వకంగా. ఇక ఒప్పుకోక తప్పలేదు సాయికి.ఆ రోజు రాత్రి మసీదులో పడుకుని తీవ్రంగా ఆలోచించి ‘ఆ తపస్సునేదో ఈ మసీదులోనే చేసుకుంటూ ఉంటే ఆమెకీ, కుటుంబానికీ శ్రమ లేకుండా చేయగలుగుతాను’ అనుకుంటూ గ్రామంలోనే ఉండసాగాడు. బాయిజాబాయ్ అక్కడికే భాకరీలని తీసుకెళ్తూ, తినిపిస్తూ ఉండేది. సాయినాథుడు అన్నాడు గదా! –‘అమ్మా! రుణగ్రస్తుడ్ని కావడం ఇష్టంలేదమ్మా! నీ పుత్రుడైన తాత్యా యోగక్షేమాలని నిరంతరం నేనే చూసుకుంటూ ఉంటాను’ అని. దాంతో ఆమెకి చెప్పలేని సంతోషం కలిగింది. ఆమెకీ ఆమె కుటుంబం మొత్తానికీ దైవమంటూ మరొకడు లేడు. అంతా సాయినాథుడే! అంతటి తాదాత్మ్య స్థితిలో ఆమె దాస్యాన్ని చేస్తూ ఉండేది. లోకంలో దాస్యమనగానే – గురువులకి కాళ్లు పట్టడం, మడమలు నొక్కడం, నూనెని ఒంటికి పట్టించి మర్దన చేయడం, నలుగు పెట్టి, కుంకుడు పులుసుతో తలస్నానాన్ని చేయించడం.. వంటి ఇవన్నీ గుర్తుకొస్తుంటాయి సాధారణంగా. నిజానికి దాస్యమంటే అది కానేకాదు. దాస్యమంటే...?‘దాసస్య భావః దాస్యమ్’ అంటుంది సంస్కృత వ్యాకరణం. కొద్దిగా దీన్ని వివరించుకోవాలి. ‘దాస్యాన్ని చేసేవాడు’ అనే అర్థంలో ‘సేవకుడు భృత్యుడు దాసుడు దూత కార్మికుడు’ అని ఇన్ని పదాలున్నాయి గానీ వేటి అర్థం వాటిదే.సేవకుడు అంటే ఏ పనికోసం (సేవ) మనం అతడ్ని నియమించుకున్నామో ఆ పనిని మాత్రమే నిత్యం చేసే లక్షణమున్నవాడని అర్థం. తోటపనికి నియమించుకుంటే ‘ఉద్యానవన సేవకుడు’.... ఇలా అన్నమాట.ఇక భృత్యుడంటే మరో అర్థముంది. ‘నెలసరి జీతాన్ని (భృతి) తీసుకుంటూ పని చేసేలక్షణమున్నవాడు’ అని అర్థం. ‘భృpŠ‡ఛరణ్’ అనే ధాతువు మీద ఏర్పడిన పదం అది కాబట్టి భృత్యుడంటే తన కుటుంబాన్ని పోషించుకునేందుకు జీతాన్ని తీసుకుని పని చేసే వాడవుతాడన్నమాట.పైన చెప్పుకున్న సేవకుడు కూడా జీతాన్ని తీసుకుంటూనే పని చేస్తున్నాడు కాబట్టి ఈ భృత్యుడూ సేవకుడూ ఒకరే అవుతారు కదా! అనుకోకూడదు. సేవకుడు అంటే తనకి ఏ పనిలో నైపుణ్యముందో ఉదాహరణకి పూలతో మాలల్ని కట్టడం, మట్టితో కుండల్ని చేయడం, వాటికి రంగులని అద్ది అందమైన అరివాణపు కుండలుగా అందించడం, పందిళ్లని నిర్మించడం, తాటాకులని విసనకర్రలుగాచేయడం... వంటివి – ఆ సేవని (పనిని) భగవంతుని విషయంలో కృతజ్ఞతని ఘటిస్తూ చేసేవాడన్నమాట. అందుకే ఇప్పటికీ ‘ఆ సేవ మాది, ఈ సేవ వాళ్లది’ అనే మాటలు వినబడుతూఉంటాయి. ఆ తనకి నైపుణ్యమున్న సేవ(కర్మ–పని)ని మాత్రమే చేసేవాడు సేవకుడు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో గుడిని శుభ్రం చేయడం, ప్రతి రెండేళ్లకీ గుడికి రంగులు వేయడం, రథాన్ని లాగేవ్యయాన్ని భరించడం వంటివాటిని సేవలుగానే భావిస్తూ, ఉచితంగా, వంశవంశపారంపర్యంగా చేస్తున్నవాళ్లెందరో ఉన్నారు. సరే! ఆ మీదటి వాడు ‘దూత’ ‘స్యాత్సందేశహరో దూతః’ దైవానికి ఫలాన రోజు నుండి ఫలాన రోజు వరకూ ఉత్సవాలు సాగుతాయంటూ ఈ ఊరూ పొరుగూళ్లలో కూడా ఆ వార్తని చాటింపువేసే పనిని చేసేవాడు.అతనికి కొత్తమాటని చేర్చి చెప్పే హక్కు లేదు. ఇతడూ భృత్యుడే. కొంత పారితోషికాన్ని తీసుకుని ఆ పనిని చేసేవాడే.కార్మికుడనేది చివరిమాట. ‘కర్మ కరోతీతి కార్మికః’ ఏ పని బడితే ఆ పనిని చేయడానికి సిద్ధంగా ఉండేవాడని దానర్థం ఇతడూ భృత్యుడే.ఇదంతా ఎందుకంటే ‘దాసుడు’ అనే మాటకున్న గట్టి దనాన్నీ లోతునీ అర్థం చేసుకునేందుకు అర్థం చేసేందుకున్నూ. ఏం అపేక్షించకుండా ఆ చెప్పబడిన పనిని నిస్వార్థంగా తనంత తాను ప్రాణాలకి తెగించి కూడా చేయడానికి సిద్ధమయ్యేవాడు దానుడు. ఆంజనేయుడు దాసలక్షణం కలవాడు. సీతమ్మ గానీ రాముడు గానీ తనకి బంధువులు మిత్రులు ఆప్తులు కానేకాదు. అయితే ఎక్కడెక్కడో ఆ దంపతులు వేర్వేరు స్థలాల్లో ఉంటూ ఒకరినొకరు నిరంతరం స్మరించుకుంటూ ఎప్పటికైనా కలుసుకుంటామనే మనో ధైర్యంతో జీవిస్తున్నారనే బుద్ధితో ఆ ఇద్దరినీ ఒకచోటికి నిస్వార్థంగా చేరాలనే పవిత్రాశతో కార్యానికి నడుం బిగించిన ఆంజనేయుడు ‘దాసుడు’. అంతేకాదు. 24 వేల శ్లోకాల శ్రీమద్రామాయణంలో రావణవధ అయ్యాక పట్టాభిషేకం జరిగే వేళ కూడా నేనే ఆ ఇద్దరినీ కలిపినవాడినంటూ ఒక్క మాటని ఎవరితోనూ అని ఉండలేదు. అంత గుప్తంగా నిస్వార్థంగా సేవ చేసేవాడ్ని దాసుడనాలంది శాస్త్రం. బాయిజాబాయ్ సాయికథలో కూడా బాయిజాబాయ్ ఏనాడూ తానిలా చేస్తున్నానని గానీ, ఇంత దూరం అడవిలో సాయి ఎక్కడుంటాడో తెలియని చోటుకి వెళ్తున్నానని గాని, రోజూ భాకరీనీ కూరనీ తానే తీసుకెళ్తున్నానని గాని ఎప్పుడూ ఎక్కడా ప్రకటించనూ లేదు. ప్రతిఫలంగా సాయినాథుని నుండి దేన్నీ ఆశించి ఉండనూ లేదు... తీసుకోనూ లేదు. అదీ దాస్యలక్షణమంటే.మరో విశేషం కూడా ఇక్కడుంది. ఏదో తనకున్న దాస్యభక్తితో తానొక్కతే ఆ నిత్యకృత్యాన్ని చేస్తూ ఉండటం కాకుండా సాయినాథుని గొప్పదనాన్ని తన భర్తకీ సంతానమైన తాత్యాకి కూడా చెప్పి తాను చేస్తున్న దాస్యానికి అడ్డుపడకుండానూ ప్రోత్సహించేలాగునా కూడా చేయడమనేది నిజమైన దాస్యభక్తికి ఉదాహరణం. ఆంజనేయుడు కూడా శ్రీమద్రామాయణంలో తనని మింగడానికి సిద్ధపడుతున్న సురమతో రాముని కథని సూక్ష్మంగా చెప్పి ఆ ఇద్దరినీ కలపడం చేస్తే నీకూ మంచి జరుగుతుందన్నాడు. అంతేకాదు. ఆ ఇద్దరూ కలిసిన పక్షంలో తానే స్వయంగా ఆ సురమకి ఆహారంగా కూడా అవుతానన్నాడు(సత్యం ప్రతి శృణోమి తే!) ఆ మాటని ఒట్టుగా భావించవలసిందన్నాడు కూడా. ఎవరో తెలియని ఆ ఇద్దరి ఏకత్వం కోసం తన ప్రాణాల్ని పణంగా పెట్టడమనేది నిజమైన దాస్యభక్తి కాదూ మరీ! ఇంత దాస్యాన్ని సాయిపట్ల చూపింది బాయిజాబాయ్ ప్రతిరోజూ అనేక క్రూరజంతువులుండ వీలైన అడవికి ఒంటరిగా వెళ్తూ.కాలం మారాక బుద్ధులు చెదిరాక ‘దాస్యం’ అంటే వెట్టి చాకిరీగా భావిస్తున్నారు. అది సరికాదు. తాత్యాబాజాయ్ ఆమె భర్తా ఇలా తాము చేయగలిగిన ఆ శక్తికి తగినట్లు సాయికి ఆహారాన్ని సమర్పించుకుంటూ ఒకరి వెనుక ఒకరు కన్ను మూస్తే సాయి పెద్దపెట్టున రోదిస్తూ తానొక్కడే మసీదులోకి వెళ్లిపోయి తననెవరూ చూడటానికి అనుమతించడం లేదన్నట్లు పరదాని (కర్టెన్) వేసేసుకున్నాడు.ఆ మరుసటి రోజునుండే తల్లిదండ్రుల బాటలో పయనిస్తూ తాత్యా ఆ ఆహార సమర్పణాన్ని చేస్తూ వచ్చాడు. ఇప్పటికి కూడా గ్రామాల్లో దైవానికి అటూ ఇటూ నిలబడి కాగడాలని ఉత్సవాలకాలంలో పట్టడమనేది ఒక వంశానికి మాత్రమే చెంది ఉండి కనిపిస్తూ ఉంటుంది. అయితే నేడు మాత్రం ఇది వంశపారం పర్య హక్కుకల ఉద్యోగంగా మారి ఆ దాస్యం దానిలో అర్థం మొత్తమంతా గాలికి కొట్టుకుపోయింది. సరే! దాస స్వీకారం బాయిజాబాయ్ ఇలా తనని సేవిస్తూ ఉండేది కాగా, భాగోజీ అనే భక్తుడు నిరంతరం సాయికి గొడుగుని పడుతూ ఉండేవాడు. ‘భాగోజీ! ఎంతదూరం నేను వెళ్తూ ఉంటే అంతదూరమూ ఇలా పట్టడం ఎందుకు? శ్రమని మానెయ్’ అన్నప్పటికీ విడిచేవాడు కాదు. ఇంతవరకూ సరే.దురదృష్టవశాత్తూ భాగోజీకి కుష్టు వ్యాధి సోకింది. చీముతో రక్తంతో తెల్లని అదో దుర్వాసన ద్రవంతో అతని కాళ్ల వేళ్లూ చేతి వేళ్లూ చూడ్డానికి జుగుప్సాకరంగా ఉండేవి. భాగోజీకి మాత్రం సాయికి దాస్యాన్ని చేయాలనే తపన గట్టిగా ఉండేది కాని ఈ వ్యాధి కారణంగా సాయి సమీపానికి వెళ్లే సాహసాన్ని చేయలేదు. వెంటనే సాయి కబురు చేసి భాగోజీని పిలిచి ‘ఏమయింది? నీ పని నువ్వు కానీ!’ అన్నట్లు చూశాడు. అంతే!సాయి లెండీ తోటకి రావడమేమిటి? సాయికి ఒకసారి ధునిలో ఎగసిపడుతున్న మంటకి చేయికాలితే (ఒక పాప రక్షణకోసం అలా జరిగింది. ఆ కథ మరోసారి) ఆ చేతి కట్లని విప్పి నూనె రాసి మర్దన చేసి ఆకు పసరు వేసి చేతిపై పూసి మళ్లీ కట్టుని కడుతూ ఉండేవాడు. ఇక్కడ భాగోజీ దాస్యభక్తి కంటే దారుణమైన కుష్టు వ్యాధి పీడితుడ్ని దాసునిగా పరిగణిస్తూ అతని దాస్యభక్తిని తాను స్వీకరించడం ఎంత గొప్ప! అలా సాయి దాస్య సేవలోనే తరించాడు భాగోజీ. అంతటి గొప్పది దాస్యభక్తి. అంత గొప్పవాళ్లు తరించిన ఆ ఇద్దరు భక్తులూను. పైవారం – సాయి చేసి వేదాంతబోధ! (సాయికి తెలిసిన హిందూ సంప్రదాయాలు) - డా. మైలవరపు శ్రీనివాసరావు -
బాబా చేసే చిత్రవిచిత్రాలు అంతరార్థాలు
యోగుల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో తీరు విధానం. భక్తులైనవారికి ఆ తాదాత్మ్యబుద్ధి(ఎలాగైనా ఆ దర్శించుకుంటున్న యోగియందే బుద్ధి కలిగి ఆయన దృష్టిలోనే ఆలోచించగలిగిన తనం) గాని ఉన్న పక్షంలో తప్పక కొంత కాలానికి అర్థమౌతారు ఆ మహనీయులు. నిజాన్ని నిజంగా మాట్లాడుకుంటే భక్తులకి సహనం తక్కువ. ‘ఫలానావారి దగ్గరికి వెళ్లాను. దర్శించాను. వారం తిరక్కుండా ఈ మంచి జరిగింది...’ అనే ఈ తీరు లాభదృష్టి వారిది తప్ప మహనీయుల ద్వారా తెలుసుకోదగ్గ గొప్పదనాలేమిటనే తీరు ఆలోచన నూటికి తొంభైమందికి ఉండదనేది నూటికి నూరు పాళ్లు నిజం. అందుకే తమదైన దృష్టితో ఆలోచిస్తూ భక్తులు ‘ఫలానా స్వాములవారు ఇలా.. ఫలానా వారు అలా..’ అంటూ లో–దృష్టి లేకుండా నోరు పడేసుకుంటూ ఉంటారు. అలాంటి నిందలకి సాయి కూడా దూరంగా లేడు. ఆయన్ని ‘కోపిష్ఠి అనీ, ఎప్పుడేం చేస్తాడో అర్థం కానీయనివాడనీ, ఒకసారి గొప్పగా చూస్తూ మరోసారి తొక్కి వేస్తాడనీ..’ ఇలా మాట్లాడుతూ ఉండేవారు ఆయన ఉన్నతత్వం గురించి తెలుసుకుందామని కనీసం ప్రయత్నించనివారూ కొంతకాలం ప్రయత్నించి అర్థం చేసుకోలేనివారున్నూ. ఏదో అయిపోతుంది..! డాక్టరు పండిత్ అనే ఆయన సాయి మీది సంపూర్ణ భక్తివిశ్వాసాలతో సాయిదర్శనానికి వచ్చారు. సరిగ్గా అదే సమయానికి సాయి పూజకోసం అన్ని ఏర్పాట్లూ అయిపోయాయి. పూజా సామగ్రితో దాదాభట్ అనే భక్తుడు మసీదుకి వచ్చాడు. అతడు వెళ్తుంటే డాక్టర్ పండిత్ కూడా ఆయన వెంట సాయి వద్దకి అప్రయత్నంగా వెళ్లిపోయాడు.సాయి నుదుటికి ప్రతిరోజూ ఖండోబా అనే గ్రామదేవత ఆలయపూజారి మహల్సాపతి మాత్రమే చందనాన్ని త్రిపుండ్రాకారంలో (మూడు అడ్డగీతల రూపంలో) రాస్తూ ఉండేవాడు. దాదాభట్ సాయిపాదాల మీద పుష్పాలని వేయడం వంటివన్నీ ముగించి అలా ఉన్నంతలో అక్కడి సంప్రదాయం, పూజావిధానం గురించిన అవగాహన ఏ మాత్రమూ లేని డాక్టర్ పండిత్ వెంటనే ఆ పూజాద్రవ్యాలన్నీ ఉన్న పళ్లెంలో కన్పిస్తున్న చందనాన్ని స్వయంగా తీసి సాయి నుదుటిమీద త్రిపుండ్రాకారంలో రాసాడు. భక్తులంతా బెంబేలు పడిపోసాగారు. మహల్సాపతి తప్ప మరెవరూ ఆ పనిని చేయడానికి సాయి ఏనాడూ అంగీకరించడే! పైగా ఎవరైనా రాయబోతే అభ్యంతరాన్ని కూడా చెప్తూండేవాడే! అంతటి సాయి ఇలా చిన్నపిల్లవాని నుదుటికి తల్లి బొట్టుని పెడుతూ ఉంటే చక్కగా బుద్ధిగా పెట్టించుకున్నట్టు సాయి ఇలా మౌనంగా, ఇష్టంగా అంగీకరించడమేమిటి? అని అందరూ తమలో తాము అనుకోసాగారు. సాయి విషయంలో ఎవరికైనా లోపల అనుకోవడం మాత్రమే ఉంటుంది తప్ప, ధైర్యంగా నిలిచి అడిగే శక్తి ఉండదు. దానికి కారణం సాయి ఎక్కడా లో–అర్థం లేకుండా ఏ చేష్టనీ చేసి ఉండలేదు. చేయడు కాబట్టి.. ఎవరినీ ఆ చేష్టకారణంగా నొచ్చుకునేలా చేసి ఉండే తీరు మనస్తత్వం కలవాడు కాడు కాబట్టీ. ఆ పూట పూజంతా అయిపోయింది సవ్యంగా సక్రమంగా.ఆనాటి సాయంత్రం పూజాపళ్లెరాన్ని సాయివద్దకి ఉదయం తీసుకుని వెళ్లిన దాదాభట్టే సాయికి నమస్కరించి వినయంతో సాయీ! ఓ విషయాన్ని మనవి చేసుకోవచ్చా?’ అని అడిగి అనుమతినిచ్చినట్లుగా సాయి చిరునవ్వు నవ్వడంతో ‘ఉదయం డాక్టర్ పండిత్ తమ నుదుటన చందనాన్ని త్రిపుండ్రాకారంలో రాస్తూంటే మీరు మౌనంగానే ఉన్నారే! ఎప్పుడూ మహల్సాపతిని మాత్రమే అంగీకరిస్తూ మేం ఎవరం వచ్చినా తిరస్కరిస్తుంటే మీరు ఆ చందనలేపనాన్ని అలా ఎందుకు అంగీకరించారు?’ అని కొంత భయంతో కొంత ధైర్యంతో అడిగాడు.నిదానమైన కంఠస్వరంతో సాయి ఇలా అన్నాడు. ‘‘దాదాభట్టూ! అసలు విషయాన్ని విను. డాక్టర్ పండిత్ భక్తుడన్నమాట నిజమే. అయితే ఆయన కులవిధానం ప్రకారం బ్రాహ్మణుడు. అంతేకాదు. ఇంట్లో చక్కని సంప్రదాయాన్ని పాటించే బ్రాహ్మణుడే తప్ప కేవలం జాతికి మాత్రమే బ్రాహ్మణునిగా కన్పించే ఏ కొందరివంటి వాడో కాడు. నేను నన్ను గమనించుకుని చూస్తే, ఏ పూజలకి అతిముఖ్యమైనది ఉపవసించడమనే దాన్ని బ్రాహ్మణులు పాటిస్తారో ఆ ఉపవాసవిధిని పాటించని వాణ్ణి.. ఉపవాసం అక్కరలేదని ఆ విధానాన్ని నిరసించేవాణ్ని కూడా. రోజూ ఉదయకాలంలోనే నిద్రలేచి స్నానమైతే తప్ప ఏ నిత్యదైనందిన కార్యక్రమాల్లోకి దిగనివారు బ్రాహ్మణులో, ఆ కార్యక్రమాల్లో ప్రారంభ కార్యక్రమం దైవపూజో ఆ విధానాన్ని కచ్చితంగా పాటించే జాతి వారిది. ఒక్కో సందర్భంలో స్నానాన్ని కూడా చేయని రోజులుంటాయి నా జీవితంలో. వాళ్ల జీవితాల్లో కుటుంబాల్లో స్త్రీలు అశుచిగా ఉండే మూడురోజులూ పైగా ఆ పైరోజును కూడా అశుచిగానే ఉన్నట్లు లెక్కిస్తూ 4 వరోజు ఉదయం స్నానాన్ని ముగించినా వంటావార్పు కార్యక్రమంలో భాగస్వాములు కానేకారు, అంతే కాక ఎవరైనా దురదృష్టవశాత్తూ మరణిస్తే వారి పేరిట బాంధవ్యపు దగ్గరి దూరం తనాల లెక్క ప్రకారం ఇన్ని రోజులు, అన్ని రోజులు అంటూ అన్ని రోజులపాటు మైలుని (అంటు లేదా అశుచి) పాటించే లక్షణం వారిది.ఇలాంటి విధానం లేనేలేదు. ఎవరైనా మరణించిన సందర్భంలో మా ముసల్మానులలో. స్త్రీలకి సంబంధించిన విషయం నాకు అవసరం లేనిది కదా!ఇలా ఎన్ని విధాల పరిశీలించుకున్నా డాక్టర్ పండితానికి నాకూ ఎన్నో వ్యత్యాసాలున్నాయి. అయితే డాక్టరు పండిత్ నా వద్దకి వస్తూనే కేవలం ఆ ముఖంలో భక్తి తత్పరతని కన్పింపజేస్తూ వచ్చాడే తప్ప లోపల ఏ విధమైన బెరుకుతనమూ అతనిలో లేనే లేదు. బ్రాహ్మణుడినే ఆ ముసల్మానునికి సేవ చేయడమా? మైలపడిపోనా? ఈ తీరు ధోరణే అతనిలో లేదు.మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవం – లోదృష్టితో అంతరాంతర విశేషాలని గమనించగలిగిన అవయవమూ కన్ను మాత్రమే. ఆ కారణంగా ఆ కన్ను తనలో దాగిన ఆంతర్యాన్ని బయటపెట్టకుండా ఉండనే లేదు. ఏదో ఒక దృక్కోణంలో వచ్చిన వ్యక్తి లో–దృష్టి ఏమైయుంటుందనే స్పష్టతని ఇచ్చి తీరుతుంది. ఆ దృష్టితో చూస్తే డాక్టరు పండితుని దృష్టి కేవలం భక్తి తత్పరతే తప్ప మరొక్కటి అందులో కన్పడనేలేదు. ఏదో ఓ సద్బ్రాహ్మణుడొచ్చి నానుదుటికి చందనాన్ని రాస్తే దాన్ని గమనించి మీరంతా నన్ను మరింత గొప్పవానిగా భావించాలనే ఆలోచనా ఊహా నాకు కలలో కూడా లేవు. ఉండవు కూడా. అతనిలో నాకు నచ్చింది కేవలం నిష్కల్మష భక్తి మాత్రమే ఉండటం. ఈ నిజాన్ని మనకి తెలియజేప్పేందుకు భగవంతుడు కూడా ఏదో ఒకే ఒక్క కులాన్ని లక్ష్యంగా చేసుకుని తాను జన్మించడం కాకుండా రామచంద్రునిగా క్షత్రియకులంలో కృష్ణమూర్తిగా గోపకులంలో యాదవునిగా..... ఇలా ఉద్భవించి కన్పిస్తాడు.చందనాన్ని రాయవలసిందని నేను అతణ్ణి ఆదేశించడం గానీ మరెవ్వరు గానీ సూచించనూ లేదు. అతనంత అతనే స్వయంగా చందనాన్ని చేతికి తీసుకుని నా నుదుటికి అందునా త్రిపుండ్రాకారంలో రాసాడంటే అది కూడా మానసిక నిష్కల్మషాభావానికి సాక్ష్యంగానే నేను భావిస్తున్నాను.ఈ తీరు తారతమ్య (ఎక్కువ తక్కువ అనే భేదం) భావాలని తొలగించుకోగలిగినప్పుడే భగవంతుని సమత్వాన్ని (అందరి విషయంలోనూ ఒకేలా ఉండగలిగిన తనాన్ని) దర్శించగలం! అందుకే ఆయనకున్న పేర్లలో ఒకటి ‘సమదర్శనః’ అనేది. ఒక్కోసారి....! అవును! నన్నొక్కసారి గమనిస్తూ నా వింత చేష్టలని దర్శిస్తూ భక్తులంతా తలకిందులైపోతూ ఉంటారు. అలా ఉండడాన్ని నేను గమనిస్తూనే ఉంటాను. మరి గమనిస్తూ ఉండి కూడా అలా ఎందుకు ప్రవర్తించాలి? అనేది భక్తుల ఆలోచన. ఇదే తెలుసుకోవాల్సిన రహస్యం.అనేక జాతులు, మతాలు, కులాలు, స్త్రీ, పురుష, బాల, వృద్ధ, వితంతు అనేక వృత్తిదారులైన వాళ్లు ఇక్కడికి వారివారి సహజ జన్మసంస్కారాలతో వస్తూంటే వారందరినీ ఒకే మార్గంలో నడిపించాలంటే కావలసింది ఏకత్వమార్గం. అగ్నిలో పచ్చని, తెల్లని, నల్లని, ఎర్రని... మృదువైన, కఠినమైన... ఎండిన, తడిగా ఉన్న, లోహరూపంగా ఉన్న, శరీర రూపంలో ఉన్న, ఏ పదార్థం పడినా.. అన్నీ అగ్ని రూపంలోనే అయిపోయి చివరికి ఒకేతీరు భస్మం ఎలా వస్తోందో అదే తీరుగా మీ అందరిలోని భిన్నత్వమూ పోయి ఏకత్వమే రావాలి. అందుకే ఈ తపనంతా!కొందరిచేత చందనాన్ని రాయనీయడనీ, కొందరికి మాత్రమే ఆ అవకాశాన్నిస్తాడనీ అనుకోవద్దు! ఆ డాక్టర్ పండిత్ హృదయం సంపూర్ణ నిష్కల్మషమయంగా ఉంది కాబట్టే నా లో–అభిప్రాయాన్ని తాను అడిగి తెలుసుకున్నట్టుగా ఆ చందనాన్ని ఏ బొట్టు పెట్టడం మాదిరిగా చుక్కబొట్టు పెట్టడం కాకుండానూ, కేవలం త్రిపుండ్రాకారంలోనూ మాత్రమే పెట్టడం జరిగింది! ఇది నిజంగా ఆశ్చర్యకరం కాదూ!ఎక్కడినుండో పడిన వర్షం చుక్కచుక్కగా పడి చిన్న సెలయేరుగా మారి, ఆ సెలయేళ్లన్నీ ఓ నదిగా మారి, ఆ నదులన్నీ సముద్రం వైపుకి వేగంగా పరుగెత్తుకుని వచ్చి సముద్రంలో కలుస్తూ సముద్రానికున్న లోతుతనాన్నీ, సముద్రానికున్న ఉప్పదనాన్నీ, సముద్రానికున్న కెరటపుతనాన్నీ, సముద్రానికున్న సుడిగుండాల పద్ధతినీ, అనుక్షణం ఒడ్డుకొచ్చి వెనక్కి వెళ్లే లక్షణాన్నీ అంటే నదికి వీటిలో ఏ ఒక్క విధానమూ లేకున్న తనాలని కలిగి ఉన్న సముద్రంలో ఐక్యమైపోతూ ఉంటే వద్దువద్దని సముద్రం అంటోందా? అందా? నేను కూడా నా భక్తుల అసమానతలని తొలగించాలని ప్రయత్నించేవాడినే తప్ప ‘నా మాటే సాగాలి’ అని భావించే నిరంకుశుణ్ణి కాను. ఏదో తీవ్రమైన ఆనందం ఉత్సాహంతో అనుకున్న క్షణంలో ఏదో పెద్ద భవంతిని నిర్మించాలని భక్తులంతా అనుకున్న వేళ అది సరికాని సమయమని స్పష్టంగా తెలిసిన నేను –వారి ఉత్సాహాన్ని మరింతగా ప్రోత్సహిస్తూ పని మొత్తం పూర్తయిపోయేలా చేసి ఆ మీదట ఏవైనా తేడాలు ఉపద్రవాలూ జరిగితే ‘‘చెబుదామనే అనుకున్నానుగానీ మీ ఉత్సాహాన్ని చల్లార్చడం ఇష్టం లేక ఊరుకున్నాను’’ అని అంటే అది ఎంత ద్రోహం?? ఎంత అపచారం???నా మాటలు అప్పుడప్పుడు మీకు కఠినంగానూ పెళుసుగానూ అనిపించవచ్చు. వాటికి నేనేమీ పశ్చాత్తాపపడను. మరాఠా భాషలో ‘ఓవీ’లనే పేరిట (తెలుగులో కందం తేటగీతి పద్యాల్లా.. సంస్కృతంలో శార్దూలం మత్తేభం పద్యాల్లాగా.. ఆంగ్లంలో సానెట్స్.....) ఛందస్సులో ఒకటుంది. తెల్లబడాలనే ఉద్దేశంతో పిల్లవాడు జిల్లేడు పాలని ఒంటికి రాసుకోబోతుంటే... ఏముందో చూద్దామని పిల్లవాడు పాముల పుట్టలోకి చేతిని దూర్చబోతుంటే... చురకత్తి పదునుతో గోళ్లని తెంచుకుందామని పిల్లవాడు ప్రయత్నించబోతుంటే.. ఏ తల్లైనా ‘ఎంత ప్రయోజకుడు నా పుత్రుడు? అనుకుంటుందా? లేక చెళ్లున చెంపమీద ఒకటి వేస్తుందా?’ అని ఆ ఓవీకి అర్థం. అదే నా లక్షణం. లక్ష్యం కూడా.అల్లాహ్ అక్బర్ ఈ విధానాన్ని సరైనదని అంగీకరించాడూ అంగీకరిస్తున్నాడూ కాబట్టే ఇంత చిత్రవిచిత్ర విధానాలనీ చేష్టలనీ ప్రదర్శిస్తున్నా (నాకు తెలియని భావోద్వేగ స్థితిలోనే సుమా!) మీరంతా ఇక్కడే ఉంటూ లేదా ఎక్కడి నుండో వస్తూ అదే భక్తి తత్పరతలని చూపిస్తున్నారు.ఒక్కటి మాత్రం సత్యం.వర్షం వస్తోందనో ఎండ వేడిమి బాగా ఉందనో అలాంటి ఉద్దేశంతో బాటసారి, ఆ చెట్టు నీడని కాసేపు తలదాచుకున్నప్పుడు ఇంకా వర్షం కురుస్తోందనీ మీద పడుతున్నాయి చినుకులని అనిపించినా, చెట్టునీడ ఈ ఎండకి సరిపోలేదని అనిపించినా వెంటనే చెట్టుని విడిచిపోతాడు తప్ప చెట్టు ఆ బాటసారిని ప్రార్థించదు ఇక్కడే ఉండవలసిందని. ముగింపుగా మరోమాటని వినండి. ‘మీరు వెళ్లి ఆ డాక్టర్ పండితుడిని ‘నువ్వు ఎవరూ చెప్పకుండా ఆ చందనాన్ని అలాగే త్రిపుండ్రాకారంగా రాయాలని ఎందుకనుకున్నావు?’ అని అడగండి. అతడి దృష్టి నా దృష్టి ఆ సమయంలో ఒకేలా ప్రసరించింది కాబట్టి అతడు చెప్పేదాన్ని విని నిర్ణయించుకోండి’ అని ముగించాడు సాయి.భక్తుల్లో ఏ ఒక్కరూ ఆ సాహసాన్ని అవినయమౌతుందనే భావనతో ప్రశ్నించలేదు గానీ, దాదాభట్ మాత్రం డాక్టర్ని అడిగితే ఆయన స్పష్టంగా చెప్పాడు – ‘అప్పటివరకూ ఏదో భక్తునిగా వెళ్లాలని భావించాను గానీ ఆ సమయంలో నాకు సాయి సాక్షాత్తు నా జీవిత మార్గదర్శకుడైన గురువు’ అని అనిపించింది. అందుకే అప్రయత్నంగా ఆయన హృదయంలోనుండి ప్రసరించిన ఆ ఆజ్ఞకి అనుగుణంగా కాబోలు ఆ చందనాన్ని అలా త్రిపుండ్రాకారంలో నుదుటన రాశాను. ఈ అవకాశాన్ని ఎవరికీ సాయి ఇవ్వడనిగానీ, అందుకే మీరు (దాదాభట్) రాసి ఉండలేదని గానీ నాకు తెలియనే తెలియదు’ అన్నాడు.సాయి ప్రతి చేష్టలోనూ ఓ అంతరార్థం ఉండే ఉంటుంది. వాటి గురించి తెలుసుకోనంతకాలం ఆ చేష్టలన్నీ ఏవో ఏవోలా అనిపిస్తూ ఉండవచ్చు. కానీ అర్థం తెలిసాక, లో–అర్థం అనుభవానికొచ్చాక ‘బాబాయే మా జీవితమార్గదర్శకుడు’ అనే స్థాయి భక్తులమై తీరుతాం నూటికి నూరుపాళ్లూ ఇది నిస్సందేహమైన విషయం.భక్తులే కాక పంచభూతాలు కూడా సాయి అధీనంలో ఉంటాయా? ఎప్పుడు ఎక్కడ? చూద్దాం! – సశేషం డా. మైలవరపు శ్రీనివాసరావు -
ఆచరణలో కనిపించేదే ఆసలు విశ్వాసం!!
‘కనిపించడు కాని మా వాడు భలే భక్తిపరుడు తెలుసా?’ లాంటి వ్యాఖ్యలు వినిపిస్తుంటాయి. పైకి పొంగిపోతున్నట్టుండే భక్తితో సమస్యలేమో కాని, నిజమైన భక్తి విశ్వాసికి జీవితంలో కనిపించి తీరాలి. బబులోను చెరలో మగ్గుతున్నా తమ దేవుణ్ణి, దేవుని విధి విధానాలను మర్చిపోలేని భక్తి యూదులది, ముఖ్యంగా దానియేలు, అతని ముగ్గురు స్నేహితులది. వారి అచంచలమైన భక్తిశ్రద్ధలు చూసి అసూయపడ్డ శత్రువులు ఎలాగైనా వారిని నాశనం చేయడానికి కుట్రపన్నారు. యూదులు పరలోకమందున్న దేవునికి తప్ప మరొకరికి సాగిలపడరు. అందువల్ల బబులోను సామ్రాజ్యంలోని ప్రజలు, ప్రముఖులెవరూ ముప్ఫైరోజులపాటు చక్రవర్తి దర్యావేషుకు తప్ప మరే వ్యక్తికైనా సాగిలపడరాదని, విన్నపాలు సమర్చించరాదని ఒక శాససం చేశాడు. ఎంతో తెలివైనవాడిగా ప్రసిద్ధి పొందిన దానియేలును అప్పటికే చక్రవర్తి తన సంస్థానంలో అత్యున్నత స్థానంలో నియమించాడు. అదీ వారి అసూయకు ప్రధాన కారణం. ఇలాంటి శాసనం గురించి తెలిసి కూడా దానియేలు రోజుకు మూడుసార్లు యథాప్రకారం దేవుని ప్రార్థించాడు. శాసనోల్లంఘనకుగాను రాజుగారికిష్టం లేకున్నా శిక్షగా దానియేలును సింహాలున్న గుహలో పడదోశారు. కాని దానియేలును దేవుడు సింహాల గుహలో కూడా క్షేమంగా కాపాడుతాడని నమ్మకమున్న చక్రవర్తి మరునాడే అక్కడికెళ్లి ‘నిత్యమూ నీవు సేవిస్తున్న జీవము కలిగిన నీ దేవుడు నిన్ను రక్షించాడా?’ అని అడిగితే, ‘అవును రాజా: నన్ను రక్షించాడని దానియేలు జవాబిచ్చాడు. చక్రవర్తి వెంటనే అతన్ని బయటకి రప్పించి, అతని మీద కుట్ర చేసిన వారందరినీ సింహాల గుహలో వేశాడు. మేము రహస్య విశ్వాలసుమంటారు కొందరు. ‘రహస్యభక్తి’ అనేది క్రైస్తవమే కాదు. క్రైస్తవ సుగుణమైన సాహసం, క్షమాపణ, ప్రేమ, పేదలు నిరాశ్రయుల పక్షంగా పోరాడేందుకు తెగింపు సమాజానికి వారి జీవితాల్లో కొట్టవచ్చినట్లు కనిపించాలి. ఉద్యమాలు, విప్లవాలు క్రైస్తవ విధానం కాదు. కాని దేవుని పక్షంగా నిరుపేదలు, నిర్భాగ్యుల కోసం నిలబడేందుకు విప్లవాలు తేవాల్సిన అవసరం లేదు. దాన్ని ప్రతి క్రైస్తవుడూ తన వ్యక్తిగత కుటుంబ బాధ్యతగా చేపట్టాలి. అలాంటి నిస్వార్థసేవే క్రైస్తవాన్ని ఒక విశిష్టమైన జీవన విధానంగా తీర్చిదిద్దింది. నిస్వార్థమైన త్యాగపూరితమైన సేవ క్రైస్తవానికి పర్యాయపదంగా నిలబెట్టింది. -
నీ మీద ఒట్టు
తెలుగులో భక్తి ప్రధాన చిత్రాల్లో ఓ అద్భుతంగా చెప్పుకునే సినిమాలోని సన్నివేశాలివి. సినిమా ప్రారంభమే అదిరిపోయే సన్నివేశాలతో ఉంటుంది. తెలుగు సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్‌ను బాగా పరిచయం చేసిన సినిమా కూడా అయిన ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం? ఊరంతా కన్నీరు పెడుతోంది. భయంతో వణికిపోతోంది. రోజూ ప్రతి ఇంట్లో ఒకరు చనిపోతున్నారు. ఆ ఇల్లు, ఈ ఇల్లు అని లేదు. సూర్యుడు దిగిపోతున్నాడు, మళ్లీ వస్తున్నాడు. ఊర్లో జనాల ప్రాణాలు ఒక్కోటీ గాల్లో కలిసిపోతున్నాయి. ఏదో మహమ్మారి రోగం. ఎవ్వరికీ ఏదీ అంతు చిక్కడం లేదు. అమ్మవారి మీదే భారం వేసేశారు, ఆమే కాపాడాలని.‘మహమ్మారి రోగమొచ్చి ఇప్పటికే చాలామంది సచ్చిపోయి, చుట్టుపక్కల ఏడూర్లూ శ్మశానాలైపోతున్నాయ్ కాబట్టి.. మనల్ని ఆ తల్లే కాపాడాలని ఊరు మధ్యలో మూడు కుండల్లో కుంభమారమేసి, అందరూ ఈ రాతిరికి జాతర చేస్తే ఆ తల్లి కాపాడుతుందని, అంజనమేసిన పెద్ద పూజారి చెప్పారహో..’ అంటూ ఊరంతా చాటింపు వేయించారు. ఊరంతా కదిలింది. ఊరు మధ్యలో పెద్ద జాతర. ప్రజలంతా భక్తితో ఆ తల్లిని కొలుస్తున్నారు. జాతర జరుగుతున్న చోటకు ఒక పెద్దావిడ వచ్చి నిలబడింది. నిండుగా చీర కట్టుకుంది. నుదుటున పెద్ద బొట్టు. పెద్ద ముక్కు పుడక. అమ్మవారికి నైవేద్యం పెడుతోన్న వాళ్ల దగ్గరకు వెళ్లి, ‘‘చాలా దూరం నుంచి వచ్చాను. నాకు ప్రసాదం పెట్టండి.’’ అడిగింది.‘‘అమ్మో! ఇది ఆ తల్లి నైవేద్యం. ప్రసాదం కాదు. లెంపలేసుకోమ్మా!’’ అంది జాతరలో తల్లికి నైవేద్యం పెడుతోన్న ఒకామె. ‘‘బాగుందీ.. దూరం నుంచొచ్చి, ఆకలి అంటే ఈల్లేదంటారేంటీ?’’ అంటూ, ఆ పెద్దావిడ వంక చూస్తూ, ‘‘చూడమ్మా పెద్దావిడా! అది ఆ తల్లి నైవేద్యం. ఇదింకా నా చేతిలోనే ఉందిగా.. ఇది నైవేద్యం కాదులే తీసుకొని తిను..’’ అంటూ తన చేతిలోని కుండను పెద్దావిడ చేతిలో పెట్టబోయింది ఇంకొకామె. పెద్దావిడ ఈమె వంక చూసి చిన్నగా నవ్వింది. ‘‘అమ్మా తల్లి! నేను చేసేది తప్పైతే నన్నేమైనా చెయ్! ఈ ఊరి జనం చావు మహమ్మారిలో పడిపోకుండా చల్లగా రక్షించి కాపాడుతల్లీ!’’ అంటూ తన కుండను ఆ తల్లికి చూపిస్తున్నట్లుగా గాల్లో ఎత్తి చూపి, ఆ తర్వాత ‘‘తీస్కోమ్మా!’’ అంటూ పెద్దావిడకు ప్రసాదంగా పెట్టింది. ‘‘నువ్ నాకు పెట్టిన ఈ పిడికెడు మెతుకులే ఈ ఊరిని కాపాడతాయ్!’’ అంటూ ధైర్యమిస్తున్నట్లు చెప్పింది పెద్దావిడ. ఆ తల్లికి పెద్దఎత్తున జాతర చేసిన ఊరంతా నిద్రపోతోంది. పెద్దావిడకు అన్నం పెట్టిన వ్యక్తి, తన ఇంటి తలుపును ఎవరో కొడుతున్నట్లు అనిపించి, లేచి చూసింది. గడప ముందు మళ్లీ ఆ పెద్దావిడ. ‘‘ఏంటమ్మా పెద్దావిడా! నువ్వింకా ఎల్లిపోలేదా? అసలే రోజులు బాలేవు. రోగాల రోజులు.’’ చెప్పుకుంటూ పోతోంది ఆమె.‘‘నేను కూడా రోగానికి భయపడితే ఎలాగే! ఈ ఊరికి శాంతి చేయాలని నీ తలుపు తట్టాను..’’ అంది పెద్దావిడ. పెద్దావిడ రెండు చేతుల నిండా వేప ఆకులు. ఇంటామె పెద్దావిడను ఇంట్లోకి రమ్మంది. ఇంట్లో ఓ దగ్గర కూర్చొని, వేపాకును నూరడం మొదలుపెట్టింది పెద్దావిడ. ‘‘ఈ అర్ధరాత్రి పూట యేపాకు నూరడం ఏంటి? ఎందుకు?’’ అనడిగింది ఇంటామె. ‘‘చూడూ.. ఈ వేప నీళ్లు ఊళ్లో ప్రతీ గడప మీదా చల్లుకుంటూ.. పొలిమేర దాకా వెళ్లి, పొలిమేరలో పోసి రా!’’ అంది పెద్దావిడ.‘‘అది కాదే! నడిజాము దాటితే, మహమ్మారులు ఊరి పొలిమేరలు దాటుతున్నారే.. ఈ ఊరిని మొత్తం తినేస్తారే!’’ అంది పెద్దావిడ.‘‘మానవమాత్రులం మనమేం చేయగలం చెప్పు.. కాపాడితే.. ఆ తల్లే కాపాడాలి..’’ అంది ఆ ఇంటామె, పెద్దావిడ వంకే చూస్తూ.వేపాకు ముద్దనంతా చేతిలోకి తీసుకొని, ఆ ముద్దను బిందెలోని నీళ్లలో కలిపింది పెద్దావిడ. ఇంటామెకు ఏమీ అర్థం కాలేదు. అలాగే చూస్తూ కూర్చుంది. ‘‘చూడూ.. ఈ వేప నీళ్లు ఊళ్లో ప్రతీ గడప మీదా చల్లుకుంటూ.. పొలిమేర దాకా వెళ్లి, పొలిమేరలో పోసి రా!’’ అంది పెద్దావిడ.‘‘బాగుందీ నీ చాదస్తం. ఈ అర్ధరాత్రేల ఊరంతా నీళ్లు చల్లుతూ కూర్చుంటే.. నా గుడిసెవరు చూత్తారూ..’’ అంది ఇంటామె.‘‘చాదస్తం కాదే! ఈ నీళ్లు చల్లితే, ఏ రోగం ఈ ఊరి పొలిమేర దాటదు. తొలిజాముకల్లా చల్లిరా.. నువ్వు తిరిగొచ్చే వరకూ నేనిక్కణ్నించి వెళ్లను.’’ అంది పెద్దావిడ, ధైర్యమిస్తూ. ‘‘నిజంగా ఉంటావా మరి?’’‘‘నిజంగా ఉంటాను.. నువ్వు తిరిగి నా దగ్గరకొచ్చేవరకూ, ఈ గుడిసెనే కాదు.. ఈ ఊరి నించే వెళ్లను..’’ ‘‘నా మీదొట్టు?’’ అడిగింది ఇంటామె, అమాయకంగా. ‘‘నీ మీద ఒట్టు..’’ అంటూ ఇంటామె తలపై చెయ్యి వేస్తూ మాటిచ్చింది పెద్దావిడ. పెద్దావిడ, ఆ ఇంటామె చేతికి బిందెను అందించింది. ‘‘చూడూ.. వెనక్కి మాత్రం తిరిగి చూడకుండా వెళ్లూ..’’ చిన్నగా హెచ్చరిస్తూ చెప్పింది పెద్దావిడ. ‘‘సరే నీ మాట నమ్మి వెళ్తున్నాను. నా ఇల్లు జాగ్రత్తమ్మో! ఒట్టేసావ్.. మర్చిపోకు..’’ అంటూ బిందె అందుకొని లేచింది ఇంటామె. పెద్దావిడ చిన్నగా నవ్వింది. ఊర్లో గడపలన్నీ దాటుతూ, ఆ వేపాకు చలువ చల్లుతూ వెళుతోంది ఇంటామె.ఒక్కసారే ఏదో గుర్తొచ్చి ఆగిపోయింది. ‘అయ్యో! ముసల్ది ఎంగిలి పడిందో లేదో! ఉట్టిమీద అన్నం ఉందీ.. పెట్టుకు తినమని చెప్పొచ్చుంటే బాగుండేది. చెప్పొత్తాను..’ అనుకుంటూ వెనక్కి తిరిగింది.ఇంట్లో పెద్దావిడ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఊగిపోతోంది. కళ్లన్నీ ఎర్రబడ్డాయి. ఇల్లంతా ఆమె వెలుగు నింపుకుంది. ఇంటామెకు భయమేసింది.ఇంట్లోకి అడుగుపెట్టకుండానే, బయట కిటికీ నుంచి ఇదంతా చూస్తూ వణికిపోయింది. రెండు చేతులు జోడించి దండం పెట్టుకుంది. ‘నా ఇంటికొచ్చింది ఆ అమ్మవారేనా! ఊరిని కాపాడడానికి వచ్చిందా? ఆ తల్లి ఇక్కడే ఉంటే ఊరికి ఏ చెడూ రాదుగా!! కానీ తెల్లారితే ఆ తల్లి ఎల్లిపోద్దేమో?’ ఆలోచిస్తోంది ఇంటామె. ‘నువ్వు తిరిగొచ్చేదాకా ఈ ఊర్నించి నేను వెళ్లను..’ పెద్దావిడ మాటను గుర్తుతెచ్చుకుంది. ‘నేను తిరిగెళ్లను. ఆ తల్లిని తిరిగి ఎల్లనివ్వను..’ అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి, ఊరు పొలిమేరలో ఉన్న చెరువులో దూకేసింది ఇంటామె. పెద్దావిడ గట్టిగా ఊపిరి తీసుకుంటూ కోపంగా పైకి చూసింది. ‘అమ్మా నేనొచ్చేదాకా ఉంటానని మాటిచ్చావ్.. ఉంటావ్గా!’ పెద్దావిడకు ఆ ఇంటామె మాటొకటి వినిపించింది. ‘ఉంటానే! ఎప్పటికీ ఇక్కడే ఉంటా..’ సమాధానమిచ్చింది పెద్దావిడ. ఆ పెద్దావిడే ఇక ఆ ఊరికి తల్లి. అమ్మవారు. గ్రామదేవత. -
కృష్ణమ్మకు మహా హారతి
అమరావతి : ప్రసిద్ధ శైవక్షేత్రమైన అమరావతి అమరేశ్వరస్వామి దేవాలయంలో దేవాదాయశాఖ ఆధ్వర్యంలో కృష్ణా పుష్కరాల సందర్భంగా హారతి కార్యక్రమాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే, పుష్కరాల ప్రత్యేకాధికారి డీసీపీ ఎల్.ఎస్.చౌహాన్, స్థానిక ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌లతో పాటు పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. తొలుత నదికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పూర్ణకుంభం పూజలు చేసిన అనంతరం నదికి నక్షత్ర, కుంభ, నాగ, నంది ధూప, కర్పూర హారతులు సమర్పించారు. ఆలయ ఈవో ఎన్.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.