తెలుగులో భక్తి ప్రధాన చిత్రాల్లో ఓ అద్భుతంగా చెప్పుకునే సినిమాలోని సన్నివేశాలివి. సినిమా ప్రారంభమే అదిరిపోయే సన్నివేశాలతో ఉంటుంది. తెలుగు సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్‌ను బాగా పరిచయం చేసిన సినిమా కూడా అయిన ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం?
ఊరంతా కన్నీరు పెడుతోంది. భయంతో వణికిపోతోంది. రోజూ ప్రతి ఇంట్లో ఒకరు చనిపోతున్నారు. ఆ ఇల్లు, ఈ ఇల్లు అని లేదు. సూర్యుడు దిగిపోతున్నాడు, మళ్లీ వస్తున్నాడు. ఊర్లో జనాల ప్రాణాలు ఒక్కోటీ గాల్లో కలిసిపోతున్నాయి. ఏదో మహమ్మారి రోగం. ఎవ్వరికీ ఏదీ అంతు చిక్కడం లేదు. అమ్మవారి మీదే భారం వేసేశారు, ఆమే కాపాడాలని.‘మహమ్మారి రోగమొచ్చి ఇప్పటికే చాలామంది సచ్చిపోయి, చుట్టుపక్కల ఏడూర్లూ శ్మశానాలైపోతున్నాయ్ కాబట్టి.. మనల్ని ఆ తల్లే కాపాడాలని ఊరు మధ్యలో మూడు కుండల్లో కుంభమారమేసి, అందరూ ఈ రాతిరికి జాతర చేస్తే ఆ తల్లి కాపాడుతుందని, అంజనమేసిన పెద్ద పూజారి చెప్పారహో..’ అంటూ ఊరంతా చాటింపు వేయించారు. ఊరంతా కదిలింది. ఊరు మధ్యలో పెద్ద జాతర. ప్రజలంతా భక్తితో ఆ తల్లిని కొలుస్తున్నారు. జాతర జరుగుతున్న చోటకు ఒక పెద్దావిడ వచ్చి నిలబడింది. నిండుగా చీర కట్టుకుంది. నుదుటున పెద్ద బొట్టు. పెద్ద ముక్కు పుడక. అమ్మవారికి నైవేద్యం పెడుతోన్న వాళ్ల దగ్గరకు వెళ్లి, ‘‘చాలా దూరం నుంచి వచ్చాను. నాకు ప్రసాదం పెట్టండి.’’ అడిగింది.‘‘అమ్మో! ఇది ఆ తల్లి నైవేద్యం. ప్రసాదం కాదు. లెంపలేసుకోమ్మా!’’ అంది జాతరలో తల్లికి నైవేద్యం పెడుతోన్న ఒకామె. ‘‘బాగుందీ.. దూరం నుంచొచ్చి, ఆకలి అంటే ఈల్లేదంటారేంటీ?’’ అంటూ, ఆ పెద్దావిడ వంక చూస్తూ, ‘‘చూడమ్మా పెద్దావిడా! అది ఆ తల్లి నైవేద్యం. ఇదింకా నా చేతిలోనే ఉందిగా.. ఇది నైవేద్యం కాదులే తీసుకొని తిను..’’ అంటూ తన చేతిలోని కుండను పెద్దావిడ చేతిలో పెట్టబోయింది ఇంకొకామె. పెద్దావిడ ఈమె వంక చూసి చిన్నగా నవ్వింది. ‘‘అమ్మా తల్లి! నేను చేసేది తప్పైతే నన్నేమైనా చెయ్! ఈ ఊరి జనం చావు మహమ్మారిలో పడిపోకుండా చల్లగా రక్షించి కాపాడుతల్లీ!’’ అంటూ తన కుండను ఆ తల్లికి చూపిస్తున్నట్లుగా గాల్లో ఎత్తి చూపి, ఆ తర్వాత ‘‘తీస్కోమ్మా!’’ అంటూ పెద్దావిడకు ప్రసాదంగా పెట్టింది. ‘‘నువ్ నాకు పెట్టిన ఈ పిడికెడు మెతుకులే ఈ ఊరిని కాపాడతాయ్!’’ అంటూ ధైర్యమిస్తున్నట్లు చెప్పింది పెద్దావిడ.
ఆ తల్లికి పెద్దఎత్తున జాతర చేసిన ఊరంతా నిద్రపోతోంది. పెద్దావిడకు అన్నం పెట్టిన వ్యక్తి, తన ఇంటి తలుపును ఎవరో కొడుతున్నట్లు అనిపించి, లేచి చూసింది. గడప ముందు మళ్లీ ఆ పెద్దావిడ. ‘‘ఏంటమ్మా పెద్దావిడా! నువ్వింకా ఎల్లిపోలేదా? అసలే రోజులు బాలేవు. రోగాల రోజులు.’’ చెప్పుకుంటూ పోతోంది ఆమె.‘‘నేను కూడా రోగానికి భయపడితే ఎలాగే! ఈ ఊరికి శాంతి చేయాలని నీ తలుపు తట్టాను..’’ అంది పెద్దావిడ. పెద్దావిడ రెండు చేతుల నిండా వేప ఆకులు. ఇంటామె పెద్దావిడను ఇంట్లోకి రమ్మంది. ఇంట్లో ఓ దగ్గర కూర్చొని, వేపాకును నూరడం మొదలుపెట్టింది పెద్దావిడ. ‘‘ఈ అర్ధరాత్రి పూట యేపాకు నూరడం ఏంటి? ఎందుకు?’’ అనడిగింది ఇంటామె. ‘‘చూడూ.. ఈ వేప నీళ్లు ఊళ్లో ప్రతీ గడప మీదా చల్లుకుంటూ.. పొలిమేర దాకా వెళ్లి, పొలిమేరలో పోసి రా!’’ అంది పెద్దావిడ.‘‘అది కాదే! నడిజాము దాటితే, మహమ్మారులు ఊరి పొలిమేరలు దాటుతున్నారే.. ఈ ఊరిని మొత్తం తినేస్తారే!’’ అంది పెద్దావిడ.‘‘మానవమాత్రులం మనమేం చేయగలం చెప్పు.. కాపాడితే.. ఆ తల్లే కాపాడాలి..’’ అంది ఆ ఇంటామె, పెద్దావిడ వంకే చూస్తూ.వేపాకు ముద్దనంతా చేతిలోకి తీసుకొని, ఆ ముద్దను బిందెలోని నీళ్లలో కలిపింది పెద్దావిడ. ఇంటామెకు ఏమీ అర్థం కాలేదు. అలాగే చూస్తూ కూర్చుంది. ‘‘చూడూ.. ఈ వేప నీళ్లు ఊళ్లో ప్రతీ గడప మీదా చల్లుకుంటూ.. పొలిమేర దాకా వెళ్లి, పొలిమేరలో పోసి రా!’’ అంది పెద్దావిడ.‘‘బాగుందీ నీ చాదస్తం. ఈ అర్ధరాత్రేల ఊరంతా నీళ్లు చల్లుతూ కూర్చుంటే.. నా గుడిసెవరు చూత్తారూ..’’ అంది ఇంటామె.‘‘చాదస్తం కాదే! ఈ నీళ్లు చల్లితే, ఏ రోగం ఈ ఊరి పొలిమేర దాటదు. తొలిజాముకల్లా చల్లిరా.. నువ్వు తిరిగొచ్చే వరకూ నేనిక్కణ్నించి వెళ్లను.’’ అంది పెద్దావిడ, ధైర్యమిస్తూ. ‘‘నిజంగా ఉంటావా మరి?’’‘‘నిజంగా ఉంటాను.. నువ్వు తిరిగి నా దగ్గరకొచ్చేవరకూ, ఈ గుడిసెనే కాదు.. ఈ ఊరి నించే వెళ్లను..’’ ‘‘నా మీదొట్టు?’’ అడిగింది ఇంటామె, అమాయకంగా.
‘‘నీ మీద ఒట్టు..’’ అంటూ ఇంటామె తలపై చెయ్యి వేస్తూ మాటిచ్చింది పెద్దావిడ. పెద్దావిడ, ఆ ఇంటామె చేతికి బిందెను అందించింది. ‘‘చూడూ.. వెనక్కి మాత్రం తిరిగి చూడకుండా వెళ్లూ..’’ చిన్నగా హెచ్చరిస్తూ చెప్పింది పెద్దావిడ. ‘‘సరే నీ మాట నమ్మి వెళ్తున్నాను. నా ఇల్లు జాగ్రత్తమ్మో! ఒట్టేసావ్.. మర్చిపోకు..’’ అంటూ బిందె అందుకొని లేచింది ఇంటామె. పెద్దావిడ చిన్నగా నవ్వింది. ఊర్లో గడపలన్నీ దాటుతూ, ఆ వేపాకు చలువ చల్లుతూ వెళుతోంది ఇంటామె.ఒక్కసారే ఏదో గుర్తొచ్చి ఆగిపోయింది. ‘అయ్యో! ముసల్ది ఎంగిలి పడిందో లేదో! ఉట్టిమీద అన్నం ఉందీ.. పెట్టుకు తినమని చెప్పొచ్చుంటే బాగుండేది. చెప్పొత్తాను..’ అనుకుంటూ వెనక్కి తిరిగింది.ఇంట్లో పెద్దావిడ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఊగిపోతోంది. కళ్లన్నీ ఎర్రబడ్డాయి. ఇల్లంతా ఆమె వెలుగు నింపుకుంది. ఇంటామెకు భయమేసింది.ఇంట్లోకి అడుగుపెట్టకుండానే, బయట కిటికీ నుంచి ఇదంతా చూస్తూ వణికిపోయింది. రెండు చేతులు జోడించి దండం పెట్టుకుంది. ‘నా ఇంటికొచ్చింది ఆ అమ్మవారేనా! ఊరిని కాపాడడానికి వచ్చిందా? ఆ తల్లి ఇక్కడే ఉంటే ఊరికి ఏ చెడూ రాదుగా!! కానీ తెల్లారితే ఆ తల్లి ఎల్లిపోద్దేమో?’ ఆలోచిస్తోంది ఇంటామె. ‘నువ్వు తిరిగొచ్చేదాకా ఈ ఊర్నించి నేను వెళ్లను..’ పెద్దావిడ మాటను గుర్తుతెచ్చుకుంది. ‘నేను తిరిగెళ్లను. ఆ తల్లిని తిరిగి ఎల్లనివ్వను..’ అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి, ఊరు పొలిమేరలో ఉన్న చెరువులో దూకేసింది ఇంటామె. పెద్దావిడ గట్టిగా ఊపిరి తీసుకుంటూ కోపంగా పైకి చూసింది. ‘అమ్మా నేనొచ్చేదాకా ఉంటానని మాటిచ్చావ్.. ఉంటావ్‌గా!’ పెద్దావిడకు ఆ ఇంటామె మాటొకటి వినిపించింది. ‘ఉంటానే! ఎప్పటికీ ఇక్కడే ఉంటా..’ సమాధానమిచ్చింది పెద్దావిడ. ఆ పెద్దావిడే ఇక ఆ ఊరికి తల్లి. అమ్మవారు. గ్రామదేవత.
Comments
Please login to add a commentAdd a comment