బాబా చేసే చిత్రవిచిత్రాలు  అంతరార్థాలు | Sai patham Antarvedam 21 | Sakshi
Sakshi News home page

బాబా చేసే చిత్రవిచిత్రాలు  అంతరార్థాలు

Published Sun, Oct 14 2018 12:45 AM | Last Updated on Sun, Oct 14 2018 12:45 AM

Sai patham Antarvedam 21 - Sakshi

యోగుల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో తీరు విధానం. భక్తులైనవారికి ఆ తాదాత్మ్యబుద్ధి(ఎలాగైనా ఆ దర్శించుకుంటున్న యోగియందే బుద్ధి కలిగి ఆయన దృష్టిలోనే ఆలోచించగలిగిన తనం) గాని ఉన్న పక్షంలో తప్పక కొంత కాలానికి అర్థమౌతారు ఆ మహనీయులు. నిజాన్ని నిజంగా మాట్లాడుకుంటే భక్తులకి సహనం తక్కువ. ‘ఫలానావారి దగ్గరికి వెళ్లాను. దర్శించాను. వారం తిరక్కుండా ఈ మంచి జరిగింది...’ అనే ఈ తీరు లాభదృష్టి వారిది తప్ప మహనీయుల ద్వారా తెలుసుకోదగ్గ గొప్పదనాలేమిటనే తీరు ఆలోచన నూటికి తొంభైమందికి ఉండదనేది నూటికి నూరు పాళ్లు నిజం. అందుకే తమదైన దృష్టితో ఆలోచిస్తూ భక్తులు ‘ఫలానా స్వాములవారు ఇలా.. ఫలానా వారు అలా..’ అంటూ లో–దృష్టి లేకుండా నోరు పడేసుకుంటూ ఉంటారు. అలాంటి నిందలకి సాయి కూడా దూరంగా లేడు. ఆయన్ని ‘కోపిష్ఠి అనీ, ఎప్పుడేం చేస్తాడో అర్థం కానీయనివాడనీ, ఒకసారి గొప్పగా చూస్తూ మరోసారి తొక్కి వేస్తాడనీ..’ ఇలా మాట్లాడుతూ ఉండేవారు ఆయన ఉన్నతత్వం గురించి తెలుసుకుందామని కనీసం ప్రయత్నించనివారూ కొంతకాలం ప్రయత్నించి అర్థం చేసుకోలేనివారున్నూ.

ఏదో అయిపోతుంది..!
డాక్టరు పండిత్‌ అనే ఆయన సాయి మీది సంపూర్ణ భక్తివిశ్వాసాలతో సాయిదర్శనానికి వచ్చారు. సరిగ్గా అదే సమయానికి సాయి పూజకోసం అన్ని ఏర్పాట్లూ అయిపోయాయి. పూజా సామగ్రితో దాదాభట్‌ అనే భక్తుడు మసీదుకి వచ్చాడు. అతడు వెళ్తుంటే డాక్టర్‌ పండిత్‌ కూడా ఆయన వెంట సాయి వద్దకి అప్రయత్నంగా వెళ్లిపోయాడు.సాయి నుదుటికి ప్రతిరోజూ ఖండోబా అనే గ్రామదేవత ఆలయపూజారి మహల్సాపతి మాత్రమే చందనాన్ని త్రిపుండ్రాకారంలో (మూడు అడ్డగీతల రూపంలో) రాస్తూ ఉండేవాడు. దాదాభట్‌ సాయిపాదాల మీద పుష్పాలని వేయడం వంటివన్నీ ముగించి అలా ఉన్నంతలో అక్కడి సంప్రదాయం, పూజావిధానం గురించిన అవగాహన ఏ మాత్రమూ లేని డాక్టర్‌ పండిత్‌ వెంటనే ఆ పూజాద్రవ్యాలన్నీ ఉన్న పళ్లెంలో కన్పిస్తున్న చందనాన్ని స్వయంగా తీసి సాయి నుదుటిమీద త్రిపుండ్రాకారంలో రాసాడు. భక్తులంతా బెంబేలు పడిపోసాగారు. మహల్సాపతి తప్ప మరెవరూ ఆ పనిని చేయడానికి సాయి ఏనాడూ అంగీకరించడే! పైగా ఎవరైనా రాయబోతే అభ్యంతరాన్ని కూడా చెప్తూండేవాడే! అంతటి సాయి ఇలా చిన్నపిల్లవాని నుదుటికి తల్లి బొట్టుని పెడుతూ ఉంటే చక్కగా బుద్ధిగా పెట్టించుకున్నట్టు సాయి ఇలా మౌనంగా, ఇష్టంగా అంగీకరించడమేమిటి? అని అందరూ తమలో తాము అనుకోసాగారు.

సాయి విషయంలో ఎవరికైనా లోపల అనుకోవడం మాత్రమే ఉంటుంది తప్ప, ధైర్యంగా నిలిచి అడిగే శక్తి ఉండదు. దానికి కారణం సాయి ఎక్కడా లో–అర్థం లేకుండా ఏ చేష్టనీ చేసి ఉండలేదు. చేయడు కాబట్టి.. ఎవరినీ ఆ చేష్టకారణంగా నొచ్చుకునేలా చేసి ఉండే తీరు మనస్తత్వం కలవాడు కాడు కాబట్టీ. ఆ పూట పూజంతా అయిపోయింది సవ్యంగా సక్రమంగా.ఆనాటి సాయంత్రం పూజాపళ్లెరాన్ని సాయివద్దకి ఉదయం తీసుకుని వెళ్లిన దాదాభట్టే సాయికి నమస్కరించి వినయంతో సాయీ! ఓ విషయాన్ని మనవి చేసుకోవచ్చా?’ అని అడిగి అనుమతినిచ్చినట్లుగా సాయి చిరునవ్వు నవ్వడంతో ‘ఉదయం డాక్టర్‌ పండిత్‌ తమ నుదుటన చందనాన్ని త్రిపుండ్రాకారంలో రాస్తూంటే మీరు మౌనంగానే ఉన్నారే! ఎప్పుడూ మహల్సాపతిని మాత్రమే అంగీకరిస్తూ మేం ఎవరం వచ్చినా తిరస్కరిస్తుంటే మీరు ఆ చందనలేపనాన్ని అలా ఎందుకు అంగీకరించారు?’ అని కొంత భయంతో కొంత ధైర్యంతో అడిగాడు.నిదానమైన కంఠస్వరంతో సాయి ఇలా అన్నాడు. ‘‘దాదాభట్టూ! అసలు విషయాన్ని విను. డాక్టర్‌ పండిత్‌ భక్తుడన్నమాట నిజమే. అయితే ఆయన కులవిధానం ప్రకారం బ్రాహ్మణుడు. అంతేకాదు. ఇంట్లో చక్కని సంప్రదాయాన్ని పాటించే బ్రాహ్మణుడే తప్ప కేవలం జాతికి మాత్రమే బ్రాహ్మణునిగా కన్పించే ఏ కొందరివంటి వాడో కాడు. నేను నన్ను గమనించుకుని చూస్తే, ఏ పూజలకి అతిముఖ్యమైనది ఉపవసించడమనే దాన్ని బ్రాహ్మణులు పాటిస్తారో ఆ ఉపవాసవిధిని పాటించని వాణ్ణి.. ఉపవాసం అక్కరలేదని ఆ విధానాన్ని నిరసించేవాణ్ని కూడా. రోజూ ఉదయకాలంలోనే నిద్రలేచి స్నానమైతే తప్ప ఏ నిత్యదైనందిన కార్యక్రమాల్లోకి దిగనివారు బ్రాహ్మణులో, ఆ కార్యక్రమాల్లో ప్రారంభ కార్యక్రమం దైవపూజో ఆ విధానాన్ని కచ్చితంగా పాటించే జాతి వారిది. ఒక్కో సందర్భంలో స్నానాన్ని కూడా చేయని రోజులుంటాయి నా జీవితంలో.

వాళ్ల జీవితాల్లో కుటుంబాల్లో స్త్రీలు అశుచిగా ఉండే మూడురోజులూ పైగా ఆ పైరోజును కూడా అశుచిగానే ఉన్నట్లు లెక్కిస్తూ 4 వరోజు ఉదయం స్నానాన్ని ముగించినా వంటావార్పు కార్యక్రమంలో భాగస్వాములు కానేకారు, అంతే కాక ఎవరైనా దురదృష్టవశాత్తూ మరణిస్తే వారి పేరిట బాంధవ్యపు దగ్గరి దూరం తనాల లెక్క ప్రకారం ఇన్ని రోజులు, అన్ని రోజులు అంటూ అన్ని రోజులపాటు మైలుని (అంటు లేదా అశుచి) పాటించే లక్షణం వారిది.ఇలాంటి విధానం లేనేలేదు. ఎవరైనా మరణించిన సందర్భంలో మా ముసల్మానులలో. స్త్రీలకి సంబంధించిన విషయం నాకు అవసరం లేనిది కదా!ఇలా ఎన్ని విధాల పరిశీలించుకున్నా డాక్టర్‌ పండితానికి నాకూ ఎన్నో వ్యత్యాసాలున్నాయి. అయితే డాక్టరు పండిత్‌ నా వద్దకి వస్తూనే కేవలం ఆ ముఖంలో భక్తి తత్పరతని కన్పింపజేస్తూ వచ్చాడే తప్ప లోపల ఏ విధమైన బెరుకుతనమూ అతనిలో లేనే లేదు. బ్రాహ్మణుడినే ఆ ముసల్మానునికి సేవ చేయడమా? మైలపడిపోనా? ఈ తీరు ధోరణే అతనిలో లేదు.మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవం – లోదృష్టితో అంతరాంతర విశేషాలని గమనించగలిగిన అవయవమూ కన్ను మాత్రమే. ఆ కారణంగా ఆ కన్ను తనలో దాగిన ఆంతర్యాన్ని బయటపెట్టకుండా ఉండనే లేదు. ఏదో ఒక దృక్కోణంలో వచ్చిన వ్యక్తి లో–దృష్టి ఏమైయుంటుందనే స్పష్టతని ఇచ్చి తీరుతుంది. ఆ దృష్టితో చూస్తే డాక్టరు పండితుని దృష్టి కేవలం భక్తి తత్పరతే తప్ప మరొక్కటి అందులో కన్పడనేలేదు.
ఏదో ఓ సద్బ్రాహ్మణుడొచ్చి నానుదుటికి చందనాన్ని రాస్తే దాన్ని గమనించి మీరంతా నన్ను మరింత గొప్పవానిగా భావించాలనే ఆలోచనా ఊహా నాకు కలలో కూడా లేవు. ఉండవు కూడా. అతనిలో నాకు నచ్చింది కేవలం నిష్కల్మష భక్తి మాత్రమే ఉండటం.

ఈ నిజాన్ని మనకి తెలియజేప్పేందుకు భగవంతుడు కూడా ఏదో ఒకే ఒక్క కులాన్ని లక్ష్యంగా చేసుకుని తాను జన్మించడం కాకుండా రామచంద్రునిగా క్షత్రియకులంలో కృష్ణమూర్తిగా గోపకులంలో యాదవునిగా..... ఇలా ఉద్భవించి కన్పిస్తాడు.చందనాన్ని రాయవలసిందని నేను అతణ్ణి ఆదేశించడం గానీ మరెవ్వరు గానీ సూచించనూ లేదు. అతనంత అతనే స్వయంగా చందనాన్ని చేతికి తీసుకుని నా నుదుటికి అందునా త్రిపుండ్రాకారంలో రాసాడంటే అది కూడా మానసిక నిష్కల్మషాభావానికి సాక్ష్యంగానే నేను భావిస్తున్నాను.ఈ తీరు తారతమ్య (ఎక్కువ తక్కువ అనే భేదం) భావాలని తొలగించుకోగలిగినప్పుడే భగవంతుని సమత్వాన్ని (అందరి విషయంలోనూ ఒకేలా ఉండగలిగిన తనాన్ని) దర్శించగలం! అందుకే ఆయనకున్న పేర్లలో ఒకటి ‘సమదర్శనః’ అనేది.

ఒక్కోసారి....!
అవును! నన్నొక్కసారి గమనిస్తూ నా వింత చేష్టలని దర్శిస్తూ భక్తులంతా తలకిందులైపోతూ ఉంటారు. అలా ఉండడాన్ని నేను గమనిస్తూనే ఉంటాను. మరి గమనిస్తూ ఉండి కూడా అలా ఎందుకు ప్రవర్తించాలి? అనేది భక్తుల ఆలోచన. ఇదే తెలుసుకోవాల్సిన రహస్యం.అనేక జాతులు, మతాలు, కులాలు, స్త్రీ, పురుష, బాల, వృద్ధ, వితంతు అనేక వృత్తిదారులైన వాళ్లు ఇక్కడికి వారివారి సహజ జన్మసంస్కారాలతో వస్తూంటే వారందరినీ ఒకే మార్గంలో నడిపించాలంటే కావలసింది ఏకత్వమార్గం. అగ్నిలో పచ్చని, తెల్లని, నల్లని, ఎర్రని... మృదువైన, కఠినమైన... ఎండిన, తడిగా ఉన్న, లోహరూపంగా ఉన్న, శరీర రూపంలో ఉన్న, ఏ పదార్థం పడినా.. అన్నీ అగ్ని రూపంలోనే అయిపోయి చివరికి ఒకేతీరు భస్మం ఎలా వస్తోందో అదే తీరుగా మీ అందరిలోని భిన్నత్వమూ పోయి ఏకత్వమే రావాలి. అందుకే ఈ తపనంతా!కొందరిచేత చందనాన్ని రాయనీయడనీ, కొందరికి మాత్రమే ఆ అవకాశాన్నిస్తాడనీ అనుకోవద్దు! ఆ డాక్టర్‌ పండిత్‌ హృదయం సంపూర్ణ నిష్కల్మషమయంగా ఉంది కాబట్టే నా లో–అభిప్రాయాన్ని తాను అడిగి తెలుసుకున్నట్టుగా ఆ చందనాన్ని ఏ బొట్టు పెట్టడం మాదిరిగా చుక్కబొట్టు పెట్టడం కాకుండానూ, కేవలం త్రిపుండ్రాకారంలోనూ మాత్రమే పెట్టడం జరిగింది! ఇది నిజంగా ఆశ్చర్యకరం కాదూ!ఎక్కడినుండో పడిన వర్షం చుక్కచుక్కగా పడి చిన్న సెలయేరుగా మారి, ఆ సెలయేళ్లన్నీ ఓ నదిగా మారి, ఆ నదులన్నీ సముద్రం వైపుకి వేగంగా పరుగెత్తుకుని వచ్చి సముద్రంలో కలుస్తూ సముద్రానికున్న లోతుతనాన్నీ, సముద్రానికున్న ఉప్పదనాన్నీ, సముద్రానికున్న కెరటపుతనాన్నీ, సముద్రానికున్న సుడిగుండాల పద్ధతినీ, అనుక్షణం ఒడ్డుకొచ్చి వెనక్కి వెళ్లే లక్షణాన్నీ అంటే నదికి వీటిలో ఏ ఒక్క విధానమూ లేకున్న తనాలని కలిగి ఉన్న సముద్రంలో ఐక్యమైపోతూ ఉంటే వద్దువద్దని సముద్రం అంటోందా? అందా? నేను కూడా నా భక్తుల అసమానతలని తొలగించాలని ప్రయత్నించేవాడినే తప్ప ‘నా మాటే సాగాలి’ అని భావించే నిరంకుశుణ్ణి కాను.

ఏదో తీవ్రమైన ఆనందం ఉత్సాహంతో అనుకున్న క్షణంలో ఏదో పెద్ద భవంతిని నిర్మించాలని భక్తులంతా అనుకున్న వేళ అది సరికాని సమయమని స్పష్టంగా తెలిసిన నేను –వారి ఉత్సాహాన్ని మరింతగా ప్రోత్సహిస్తూ పని మొత్తం పూర్తయిపోయేలా చేసి ఆ మీదట ఏవైనా తేడాలు ఉపద్రవాలూ జరిగితే ‘‘చెబుదామనే అనుకున్నానుగానీ మీ ఉత్సాహాన్ని చల్లార్చడం ఇష్టం లేక ఊరుకున్నాను’’ అని అంటే అది ఎంత ద్రోహం?? ఎంత అపచారం???నా మాటలు అప్పుడప్పుడు మీకు కఠినంగానూ పెళుసుగానూ అనిపించవచ్చు. వాటికి నేనేమీ పశ్చాత్తాపపడను. మరాఠా భాషలో ‘ఓవీ’లనే పేరిట (తెలుగులో కందం తేటగీతి పద్యాల్లా.. సంస్కృతంలో శార్దూలం మత్తేభం పద్యాల్లాగా.. ఆంగ్లంలో సానెట్స్‌.....) ఛందస్సులో ఒకటుంది. తెల్లబడాలనే ఉద్దేశంతో పిల్లవాడు జిల్లేడు పాలని ఒంటికి రాసుకోబోతుంటే... ఏముందో చూద్దామని పిల్లవాడు పాముల పుట్టలోకి చేతిని దూర్చబోతుంటే... చురకత్తి పదునుతో గోళ్లని తెంచుకుందామని పిల్లవాడు ప్రయత్నించబోతుంటే.. ఏ తల్లైనా ‘ఎంత ప్రయోజకుడు నా పుత్రుడు? అనుకుంటుందా? లేక చెళ్లున చెంపమీద ఒకటి వేస్తుందా?’ అని ఆ ఓవీకి అర్థం. అదే నా లక్షణం. లక్ష్యం కూడా.అల్లాహ్‌ అక్బర్‌ ఈ విధానాన్ని సరైనదని అంగీకరించాడూ అంగీకరిస్తున్నాడూ కాబట్టే ఇంత చిత్రవిచిత్ర విధానాలనీ చేష్టలనీ ప్రదర్శిస్తున్నా (నాకు తెలియని భావోద్వేగ స్థితిలోనే సుమా!) మీరంతా ఇక్కడే ఉంటూ లేదా ఎక్కడి నుండో వస్తూ అదే భక్తి తత్పరతలని చూపిస్తున్నారు.ఒక్కటి మాత్రం సత్యం.వర్షం వస్తోందనో ఎండ వేడిమి బాగా ఉందనో అలాంటి ఉద్దేశంతో బాటసారి, ఆ చెట్టు నీడని కాసేపు తలదాచుకున్నప్పుడు ఇంకా వర్షం కురుస్తోందనీ మీద పడుతున్నాయి చినుకులని అనిపించినా, చెట్టునీడ ఈ ఎండకి సరిపోలేదని అనిపించినా వెంటనే చెట్టుని విడిచిపోతాడు తప్ప చెట్టు ఆ బాటసారిని ప్రార్థించదు ఇక్కడే ఉండవలసిందని.

ముగింపుగా మరోమాటని వినండి. ‘మీరు వెళ్లి ఆ డాక్టర్‌ పండితుడిని ‘నువ్వు ఎవరూ చెప్పకుండా ఆ చందనాన్ని అలాగే త్రిపుండ్రాకారంగా రాయాలని ఎందుకనుకున్నావు?’ అని అడగండి. అతడి దృష్టి నా దృష్టి ఆ సమయంలో ఒకేలా ప్రసరించింది కాబట్టి అతడు చెప్పేదాన్ని విని నిర్ణయించుకోండి’ అని ముగించాడు సాయి.భక్తుల్లో ఏ ఒక్కరూ ఆ సాహసాన్ని అవినయమౌతుందనే భావనతో ప్రశ్నించలేదు గానీ, దాదాభట్‌ మాత్రం డాక్టర్‌ని అడిగితే ఆయన స్పష్టంగా చెప్పాడు – ‘అప్పటివరకూ ఏదో భక్తునిగా వెళ్లాలని భావించాను గానీ ఆ సమయంలో నాకు సాయి సాక్షాత్తు నా జీవిత మార్గదర్శకుడైన గురువు’ అని అనిపించింది. అందుకే అప్రయత్నంగా ఆయన హృదయంలోనుండి ప్రసరించిన ఆ ఆజ్ఞకి అనుగుణంగా కాబోలు ఆ చందనాన్ని అలా త్రిపుండ్రాకారంలో నుదుటన రాశాను. ఈ అవకాశాన్ని ఎవరికీ సాయి ఇవ్వడనిగానీ, అందుకే మీరు (దాదాభట్‌) రాసి ఉండలేదని గానీ నాకు తెలియనే తెలియదు’ అన్నాడు.సాయి ప్రతి చేష్టలోనూ ఓ అంతరార్థం ఉండే ఉంటుంది. వాటి గురించి తెలుసుకోనంతకాలం ఆ చేష్టలన్నీ ఏవో ఏవోలా అనిపిస్తూ ఉండవచ్చు. కానీ అర్థం తెలిసాక, లో–అర్థం అనుభవానికొచ్చాక ‘బాబాయే మా జీవితమార్గదర్శకుడు’ అనే స్థాయి భక్తులమై తీరుతాం నూటికి నూరుపాళ్లూ ఇది నిస్సందేహమైన విషయం.భక్తులే కాక పంచభూతాలు కూడా సాయి అధీనంలో ఉంటాయా? ఎప్పుడు ఎక్కడ? చూద్దాం!
– సశేషం
డా. మైలవరపు శ్రీనివాసరావు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement