దాస్యభక్తితో తరించిన ధన్యులు | Sai Patham Interchange 45 | Sakshi
Sakshi News home page

దాస్యభక్తితో తరించిన ధన్యులు

Published Sun, Apr 21 2019 12:31 AM | Last Updated on Sun, Apr 21 2019 12:31 AM

Sai Patham  Interchange 45 - Sakshi

ఎర్రని ఎండ. వయసు అరవై యేళ్లుండొచ్చు. మరాఠా దేశపు స్త్రీల వస్త్రధారణతో నిదానంగా వస్తోందామె. కుడి చేత్తో తన తల మీద బుట్టని పట్టుకుని కనిపిస్తోంది. ఆ బుట్ట పడిపోకుండా తల మీద ఒక తుండుతో (తువ్వాలు) చుట్టచుట్టిన చుట్టకుదురు ఆ బుట్ట కింద ఉంది. ఆ వెదురు బుట్టలో ఒక మంచి నీళ్ల లోటా (కూజా లాంటి రాగి పాత్ర) ఆ పక్కనే కాయగూరలతో వండిన ఓ కూర, దానిపక్కన భాకరీలు(రొట్టెలు, ఈ రోజుల్లో బేకరీ అని పిలుస్తున్నది ఇదే). ఇన్నిటినీ ఎంత కప్పుదామని ప్రయత్నించినా గాలికి ఎగిరిపోతూ ఉన్న తెల్లని వస్త్రం.తల నుండి వస్తున్న స్వేదంతో అటు ఇటు చెంపలు రెండూ దాదాపుగా తడిసిపోయాయి. నుదుటి నుండి కారుతున్న స్వేదానికి పెద్దగా గుండ్రంగా పెట్టిన కుంకుమ జారిపోతూ ఎర్రటి నీళ్లని ముక్కు మీదుగా విడుస్తోంది. గడ్డం మీద త్రిభుజాకారంలో మూడు చుక్కల పచ్చబొట్టుతో ఆమె అలా వస్తోంది.

ఆమె ఎంత దూరం నడిచిందో.. ఎలాంటి మార్గంలో నడిచి వస్తోందో తెలియజేస్తూ కంపలతో, పొదలతో, ఎగుడుదిగుడులతో, చూపు సాగినంత దూరపు పొడుగుతో సన్నని పుంత మార్గం కనిపిస్తోంది. ‘ఉష్‌’మని ఓ మారు నిట్టూర్పు విడుస్తూ ఆమె తన నడకని ఆపి చెట్టు కింద ఉన్న చిన్న రాతి మీద అలా కూర్చుంటూ.. బుట్టని కిందికి దింపి ఆ తలగుడ్డతో ముఖాన్ని తుడుచుకుంటోంది. కానీ.. చూపుని మాత్రం ఎడమవైపుకీ, ముందువైపుకీ, కుడివైపుకీ ప్రసరింపజేస్తూ నిశితంగా చూస్తోంది. ఎవరో తనకి కనిపించవలసి ఉన్నారన్నట్టుగా. నెమలి తాననుకున్న గోడనో చెట్టునో ఎక్కి మధురకంఠ ధ్వనితో క్రీంకారాన్ని చేసినట్టుగా.. తల్లి పక్షి తన పిల్లలకి ఆహారాన్ని తేగలిగాననే ఆనందంతో పిల్లలకి తన రాకని సూచిస్తూ ఆనందంతో అరిచినట్టుగా.. ‘సాయినాథా!’ అని పెద్దగా రెండుమార్లు ఎలుగెత్తి పిలిచింది.అదంతా ఓ అడవి. ఎవరు పలుకుతారు? ఎందుకు పలుకుతారు? నిస్పృహతో మళ్లీ శక్తినంతా కూడగట్టుకుని మళ్లీ పిలిచింది. ‘సాయినాథ్‌!’ అని. ఏ ప్రతిధ్వనీ లేదు. కొద్దిపాటి నిరుత్సాహంతో ముందు వైపు రెండుపక్కలనీ చూసి ఒక్కమారు వెనుకవైపు కూడా చూద్దామనే ఉద్దేశంతో లేచి నిలబడి వెనుదిరిగింది.

అంతే! కొద్ది దూరంలో ఓ పెద్ద గంగరావి చెట్టు. దట్టంగా నీడనిచ్చే చెట్టు అది. దానికింద చదరంగా ఉన్న పరిశుభ్రమైన నేల. అక్కడ కూర్చుని కళ్లు మూసుకుని తపోధ్యానముద్రలో సాయినాథుడు ఆమెకి కనిపించాడు. ‘మూడు మార్లు పిలిచినా, తన పిలుపు వినిపించేంత దూరంలోనే సాయి ఉన్నా పలకడేమిటి?’ అనే వ్యతిరేక భావమే ఆమెకి లేదు.తల్లి ఆవు కనిపిస్తే లేగదూడ ఎలా చెంగుచెంగున దూక్కుంటూ తల్లి వద్దకి వెళ్లిపోతుందో, మండు వేసవిలో అల్లంత దూరంలో చెరువు కనిపిస్తే ఎలా పాంథుడు వేగంగా అక్కడికి వెళ్లిపోతాడో.. అలా ఆమె వెంటనే ఆ తల చుట్టని నెత్తి మీద పెట్టుకుని వెదురుచుట్టని, ఆ పైన పెట్టుకుని, సాయినాథుని దగ్గరికి వెళ్లిపోయింది చరచరా అడుగులేసుకుంటూవెళ్లీ వెళ్లడంతోటే ఆమె బుట్టని దింపి, ఆయన పాదాల మీద తన తలనుంచి భక్తిపూర్వకంగా నమస్కరించింది. సాయినాథుడు తపస్సుని వీడి, కళ్లు తెరిచి ఆమెని చూశాడు. ఈమె కూడా ఆయనని భక్తి పారవశ్యంతో దర్శించింది.

మౌన సంభాషణం
ఆ ఇద్దరూ మౌనంగా కళ్లతోనే మాట్లాడుకోసాగారు. సాయి ఆమెని చూస్తూ! ‘అమ్మా! నేనా ఓ ఫకీరుని. ఎవరూ నావాళ్లంటూ లేనివాడ్ని. ఏ రోజు ఈ అడవిలో ఎక్కడుంటానో, ఎంతసేపుంటానో నాకే తెలియదు.ఆ ఊరి నుండి ఇన్ని కోసుల దూరం నడిచి ఎందుకమ్మా ఇంత శ్రమ నీకు? పోనీ ఒక రోజా రెండ్రోజులా? ఎంతో కాలం నుండి ఎందుకమ్మా ఈ శారీరక శ్రమ? అయినా ఏ సాయంత్రానికో పోనీ నీ దగ్గరకే రమ్మంటే నా జోలెతో, డబ్బాతో రాకపోయానా?’ అని ఆయన కళ్లతో పలకరించాడు.ఆమె కూడా ఆనందబాష్పాలని విడుస్తూ! ‘సాయినాథా! నువ్వే మాకు (మా కుటుంబానికి) తల్లివి. తండ్రివి. గురువువి. దైవానివీ! నీకు నైవేద్యం పెట్టకుండా మేం ఎలా తినేది? అయినా నువ్వు కనిపిస్తే చాలు ఆ శారీరకశ్రమ, మార్గాయాసం మొత్తం అలా గాలికి మేఘం చెదిరిపోయినట్టుగా అయిపోతుంది. ఇన్నాళ్ల నుండీ వస్తున్నాను కదా! ఎండైనా, వానైనా, చలైనా, మంచైనా నువ్వు నాకు కనిపిస్తూనే ఉన్నావు గాని కనిపించని ఒక్క రోజుందా? భక్తితో మేం ప్రార్థిస్తే అనుగ్రహిస్తావు కాబట్టే ఈ తపనంతా!’ అన్నట్టు చూసింది.ఆ చదరపునేల మీద చక్కగా విస్తరిని వేసింది. 3 భాకరీలని పెట్టింది. పాత్రలోని కూరని వడ్డించింది. పక్కనే మంచినీటి లోటాని పెట్టింది. ఆయన రెండు మాత్రమే తిని లేవబోతూ ఉంటే కొసరికొసరి తినిపించింది. ఇది ఈ రోజునే కాదు. ఏ రోజూ ఇదే సాగుతుంది ఆ ఇద్దరి మధ్యా. సాయి లేచి వెళ్తూ ఉంటే ఆమె మౌనంగా ఆయన్ని అనుసరించింది. ఎంతో దూరం నడిచాక ఊరొచ్చింది. సాయి ఉండే మసీదొచ్చింది. ఆయన లోపలికి వెళ్లిపోయాక ఆమె తన ఇంటికొచ్చింది.

ఆమె పేరు బాయిజాబాయ్‌. ఆమెకి ఎప్పుడైనా చిన్న శారీరకమైన నలతగాని వస్తే ఆమె భర్త వచ్చి సాయిని వెదికి, రొట్టెల్ని తినిపించి మరీ ఇంటికి వెళ్లడమే తప్ప, ఏనాడూ సాయికి నైవేద్యాన్ని సమర్పించని రోజు లేనే లేదు ఆ ఇద్దరికీ.ఓ రోజు సాయి నోరు తెరిచి అడగనే అడిగాడు ఆమెని– ‘అమ్మా! నేను నీకు ఏం చేయగలననీ.. ఏం చేస్తాననీ.. ఈ శ్రమని ఇంతగా పడుతున్నావు? నా బుద్ధికి ఎటు తోస్తే అటుపోయే ఫకీరుని కదా! ఫలాని చోటున నేనుంటానని చెప్తే నువ్వు రావడంలో అర్థముంది గానీ, ఈ అగమ్య, అనూహ్య గమనం (వెళ్లరాని వెళ్లలేని ఊహకి అందని చోటుకి పోవడం) కల నాకు ఈ ఆహారాన్ని తేవడాన్ని ఎవరు చూసినా, విన్నా ఎంత అపహాస్యంగా ఉంటుంది? నేను చక్రవర్తితో సమాన భోగాలు కలవాడ్ని. మహా ఐశ్వర్యవంతుడ్ని. నన్ను ఈ లోకానికి పంపిన నా అల్లా నాకు తిండి లేకుండా చేస్తాడా? వద్దమ్మా! నా తిండి నేను చూసుకుంటాను. ఎందుకు రావడం?’ అని. ఆమె దుఃఖబాష్పాలని విడుస్తూ ‘సాయీశ్వరా! నువ్వు తిననిదే నేనెలా తినేది?’ అంది హృదయపూర్వకంగా. ఇక ఒప్పుకోక తప్పలేదు సాయికి.ఆ రోజు రాత్రి మసీదులో పడుకుని తీవ్రంగా ఆలోచించి ‘ఆ తపస్సునేదో ఈ మసీదులోనే చేసుకుంటూ ఉంటే ఆమెకీ, కుటుంబానికీ శ్రమ లేకుండా చేయగలుగుతాను’ అనుకుంటూ గ్రామంలోనే ఉండసాగాడు. బాయిజాబాయ్‌ అక్కడికే భాకరీలని తీసుకెళ్తూ, తినిపిస్తూ ఉండేది. సాయినాథుడు అన్నాడు గదా! –‘అమ్మా! రుణగ్రస్తుడ్ని కావడం ఇష్టంలేదమ్మా! నీ పుత్రుడైన తాత్యా యోగక్షేమాలని నిరంతరం నేనే చూసుకుంటూ ఉంటాను’ అని. దాంతో ఆమెకి చెప్పలేని సంతోషం కలిగింది. ఆమెకీ ఆమె కుటుంబం మొత్తానికీ దైవమంటూ మరొకడు లేడు. అంతా సాయినాథుడే! అంతటి తాదాత్మ్య స్థితిలో ఆమె దాస్యాన్ని చేస్తూ ఉండేది.

లోకంలో దాస్యమనగానే – గురువులకి కాళ్లు పట్టడం, మడమలు నొక్కడం, నూనెని ఒంటికి పట్టించి మర్దన చేయడం, నలుగు పెట్టి, కుంకుడు పులుసుతో తలస్నానాన్ని చేయించడం.. వంటి ఇవన్నీ గుర్తుకొస్తుంటాయి సాధారణంగా. నిజానికి దాస్యమంటే అది కానేకాదు. దాస్యమంటే...?‘దాసస్య భావః దాస్యమ్‌’ అంటుంది సంస్కృత వ్యాకరణం. కొద్దిగా దీన్ని వివరించుకోవాలి. ‘దాస్యాన్ని చేసేవాడు’ అనే అర్థంలో ‘సేవకుడు భృత్యుడు దాసుడు దూత కార్మికుడు’ అని ఇన్ని పదాలున్నాయి గానీ వేటి అర్థం వాటిదే.సేవకుడు అంటే ఏ పనికోసం (సేవ) మనం అతడ్ని నియమించుకున్నామో ఆ పనిని మాత్రమే నిత్యం చేసే లక్షణమున్నవాడని అర్థం. తోటపనికి నియమించుకుంటే ‘ఉద్యానవన సేవకుడు’.... ఇలా అన్నమాట.ఇక భృత్యుడంటే మరో అర్థముంది. ‘నెలసరి జీతాన్ని (భృతి) తీసుకుంటూ పని చేసేలక్షణమున్నవాడు’ అని అర్థం. ‘భృpŠ‡ఛరణ్‌’ అనే ధాతువు మీద ఏర్పడిన పదం అది కాబట్టి భృత్యుడంటే తన కుటుంబాన్ని పోషించుకునేందుకు జీతాన్ని తీసుకుని పని చేసే వాడవుతాడన్నమాట.పైన చెప్పుకున్న సేవకుడు కూడా జీతాన్ని తీసుకుంటూనే పని చేస్తున్నాడు కాబట్టి ఈ భృత్యుడూ సేవకుడూ ఒకరే అవుతారు కదా! అనుకోకూడదు. సేవకుడు అంటే తనకి ఏ పనిలో నైపుణ్యముందో ఉదాహరణకి పూలతో మాలల్ని కట్టడం, మట్టితో కుండల్ని చేయడం, వాటికి రంగులని అద్ది అందమైన అరివాణపు కుండలుగా అందించడం, పందిళ్లని నిర్మించడం, తాటాకులని విసనకర్రలుగాచేయడం... వంటివి – ఆ సేవని (పనిని) భగవంతుని విషయంలో కృతజ్ఞతని ఘటిస్తూ చేసేవాడన్నమాట. అందుకే ఇప్పటికీ ‘ఆ సేవ మాది, ఈ సేవ వాళ్లది’ అనే మాటలు వినబడుతూఉంటాయి. ఆ తనకి నైపుణ్యమున్న సేవ(కర్మ–పని)ని మాత్రమే చేసేవాడు సేవకుడు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో గుడిని శుభ్రం చేయడం, ప్రతి రెండేళ్లకీ గుడికి రంగులు వేయడం, రథాన్ని లాగేవ్యయాన్ని భరించడం వంటివాటిని సేవలుగానే భావిస్తూ, ఉచితంగా, వంశవంశపారంపర్యంగా చేస్తున్నవాళ్లెందరో ఉన్నారు. సరే!

ఆ మీదటి వాడు ‘దూత’ ‘స్యాత్సందేశహరో దూతః’ దైవానికి ఫలాన రోజు నుండి ఫలాన రోజు వరకూ ఉత్సవాలు సాగుతాయంటూ ఈ ఊరూ పొరుగూళ్లలో కూడా ఆ వార్తని చాటింపువేసే పనిని చేసేవాడు.అతనికి కొత్తమాటని చేర్చి చెప్పే హక్కు లేదు. ఇతడూ భృత్యుడే. కొంత పారితోషికాన్ని తీసుకుని ఆ పనిని చేసేవాడే.కార్మికుడనేది చివరిమాట. ‘కర్మ కరోతీతి కార్మికః’ ఏ పని బడితే ఆ పనిని చేయడానికి సిద్ధంగా ఉండేవాడని దానర్థం ఇతడూ భృత్యుడే.ఇదంతా ఎందుకంటే ‘దాసుడు’ అనే మాటకున్న గట్టి దనాన్నీ లోతునీ అర్థం చేసుకునేందుకు అర్థం చేసేందుకున్నూ. ఏం అపేక్షించకుండా ఆ చెప్పబడిన పనిని నిస్వార్థంగా తనంత తాను ప్రాణాలకి తెగించి కూడా చేయడానికి సిద్ధమయ్యేవాడు దానుడు. ఆంజనేయుడు దాసలక్షణం కలవాడు. సీతమ్మ గానీ రాముడు గానీ తనకి బంధువులు మిత్రులు ఆప్తులు కానేకాదు. అయితే ఎక్కడెక్కడో ఆ దంపతులు వేర్వేరు స్థలాల్లో ఉంటూ ఒకరినొకరు నిరంతరం స్మరించుకుంటూ ఎప్పటికైనా కలుసుకుంటామనే మనో ధైర్యంతో జీవిస్తున్నారనే బుద్ధితో ఆ ఇద్దరినీ ఒకచోటికి నిస్వార్థంగా చేరాలనే పవిత్రాశతో కార్యానికి నడుం బిగించిన ఆంజనేయుడు ‘దాసుడు’. అంతేకాదు. 24 వేల శ్లోకాల శ్రీమద్రామాయణంలో రావణవధ అయ్యాక పట్టాభిషేకం జరిగే వేళ కూడా నేనే ఆ ఇద్దరినీ కలిపినవాడినంటూ ఒక్క మాటని ఎవరితోనూ అని ఉండలేదు. అంత గుప్తంగా నిస్వార్థంగా సేవ చేసేవాడ్ని దాసుడనాలంది శాస్త్రం.

బాయిజాబాయ్‌
సాయికథలో కూడా బాయిజాబాయ్‌ ఏనాడూ తానిలా చేస్తున్నానని గానీ, ఇంత దూరం అడవిలో సాయి ఎక్కడుంటాడో తెలియని చోటుకి వెళ్తున్నానని గాని, రోజూ భాకరీనీ కూరనీ తానే తీసుకెళ్తున్నానని గాని ఎప్పుడూ ఎక్కడా ప్రకటించనూ లేదు. ప్రతిఫలంగా సాయినాథుని నుండి దేన్నీ ఆశించి ఉండనూ లేదు... తీసుకోనూ లేదు. అదీ దాస్యలక్షణమంటే.మరో విశేషం కూడా ఇక్కడుంది. ఏదో తనకున్న దాస్యభక్తితో తానొక్కతే ఆ నిత్యకృత్యాన్ని చేస్తూ ఉండటం కాకుండా సాయినాథుని గొప్పదనాన్ని తన భర్తకీ సంతానమైన తాత్యాకి కూడా చెప్పి తాను చేస్తున్న దాస్యానికి అడ్డుపడకుండానూ ప్రోత్సహించేలాగునా కూడా చేయడమనేది నిజమైన దాస్యభక్తికి ఉదాహరణం. ఆంజనేయుడు కూడా శ్రీమద్రామాయణంలో తనని మింగడానికి సిద్ధపడుతున్న సురమతో రాముని కథని సూక్ష్మంగా చెప్పి ఆ ఇద్దరినీ కలపడం చేస్తే నీకూ మంచి జరుగుతుందన్నాడు. అంతేకాదు. ఆ ఇద్దరూ కలిసిన పక్షంలో తానే స్వయంగా ఆ సురమకి ఆహారంగా కూడా అవుతానన్నాడు(సత్యం ప్రతి శృణోమి తే!) ఆ మాటని ఒట్టుగా భావించవలసిందన్నాడు కూడా. ఎవరో తెలియని ఆ ఇద్దరి ఏకత్వం కోసం తన ప్రాణాల్ని పణంగా పెట్టడమనేది నిజమైన దాస్యభక్తి కాదూ మరీ! ఇంత దాస్యాన్ని సాయిపట్ల చూపింది బాయిజాబాయ్‌ ప్రతిరోజూ అనేక క్రూరజంతువులుండ వీలైన అడవికి ఒంటరిగా వెళ్తూ.కాలం మారాక బుద్ధులు చెదిరాక ‘దాస్యం’ అంటే వెట్టి చాకిరీగా భావిస్తున్నారు. అది సరికాదు. తాత్యాబాజాయ్‌ ఆమె భర్తా ఇలా తాము చేయగలిగిన ఆ శక్తికి తగినట్లు సాయికి ఆహారాన్ని సమర్పించుకుంటూ ఒకరి వెనుక ఒకరు కన్ను మూస్తే సాయి పెద్దపెట్టున రోదిస్తూ తానొక్కడే మసీదులోకి వెళ్లిపోయి తననెవరూ చూడటానికి అనుమతించడం లేదన్నట్లు పరదాని (కర్టెన్‌) వేసేసుకున్నాడు.ఆ మరుసటి రోజునుండే తల్లిదండ్రుల బాటలో పయనిస్తూ తాత్యా ఆ ఆహార సమర్పణాన్ని చేస్తూ వచ్చాడు. ఇప్పటికి కూడా గ్రామాల్లో దైవానికి అటూ ఇటూ నిలబడి కాగడాలని ఉత్సవాలకాలంలో పట్టడమనేది ఒక వంశానికి మాత్రమే చెంది ఉండి కనిపిస్తూ ఉంటుంది. అయితే నేడు మాత్రం ఇది వంశపారం పర్య హక్కుకల ఉద్యోగంగా మారి ఆ దాస్యం దానిలో అర్థం మొత్తమంతా గాలికి కొట్టుకుపోయింది. సరే!

దాస స్వీకారం
బాయిజాబాయ్‌ ఇలా తనని సేవిస్తూ ఉండేది కాగా, భాగోజీ అనే భక్తుడు నిరంతరం సాయికి గొడుగుని పడుతూ ఉండేవాడు. ‘భాగోజీ! ఎంతదూరం నేను వెళ్తూ ఉంటే అంతదూరమూ ఇలా పట్టడం ఎందుకు? శ్రమని మానెయ్‌’ అన్నప్పటికీ విడిచేవాడు కాదు. ఇంతవరకూ సరే.దురదృష్టవశాత్తూ భాగోజీకి కుష్టు వ్యాధి సోకింది. చీముతో రక్తంతో తెల్లని అదో దుర్వాసన ద్రవంతో అతని కాళ్ల వేళ్లూ చేతి వేళ్లూ చూడ్డానికి జుగుప్సాకరంగా ఉండేవి. భాగోజీకి మాత్రం సాయికి దాస్యాన్ని చేయాలనే తపన గట్టిగా ఉండేది కాని ఈ వ్యాధి కారణంగా సాయి సమీపానికి వెళ్లే సాహసాన్ని చేయలేదు. వెంటనే సాయి కబురు చేసి భాగోజీని పిలిచి ‘ఏమయింది? నీ పని నువ్వు కానీ!’ అన్నట్లు చూశాడు. అంతే!సాయి లెండీ తోటకి రావడమేమిటి? సాయికి ఒకసారి ధునిలో ఎగసిపడుతున్న మంటకి చేయికాలితే (ఒక పాప రక్షణకోసం అలా జరిగింది. ఆ కథ మరోసారి) ఆ చేతి కట్లని విప్పి నూనె రాసి మర్దన చేసి ఆకు పసరు వేసి చేతిపై పూసి మళ్లీ కట్టుని కడుతూ ఉండేవాడు. ఇక్కడ భాగోజీ దాస్యభక్తి కంటే దారుణమైన కుష్టు వ్యాధి పీడితుడ్ని దాసునిగా పరిగణిస్తూ అతని దాస్యభక్తిని తాను స్వీకరించడం ఎంత గొప్ప! అలా సాయి దాస్య సేవలోనే తరించాడు భాగోజీ. అంతటి గొప్పది దాస్యభక్తి. అంత గొప్పవాళ్లు తరించిన ఆ ఇద్దరు భక్తులూను.
పైవారం – సాయి చేసి వేదాంతబోధ! (సాయికి తెలిసిన హిందూ సంప్రదాయాలు) 
- డా. మైలవరపు శ్రీనివాసరావు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement