devyani ghosh
-
డీప్ టెక్ స్టార్టప్స్‌లోకి మరిన్ని పెట్టుబడులు రావాలి
బెంగళూరు: దేశీ డీప్ టెక్నాలజీ స్టార్టప్ సంస్థలు వేగంగా ఎదిగేందుకు వాటికి ప్రారంభ దశలో మరింత ఎక్కువగా పెట్టుబడులు అందాల్సిన అవసరం ఉందని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ప్రెసిడెంట్ దేవయాని ఘోష్ చెప్పారు. ప్రస్తుతం టెక్నాలజీ రంగంలోకి వచ్చే పెట్టుబడుల్లో కేవలం 11 శాతం మాత్రమే డీప్ టెక్ స్టార్టప్‌లకు లభిస్తున్నాయని తెలిపారు. చైనా, అమెరికా వంటి దేశాలు తమ డీప్ టెక్ స్టార్టప్ వ్యవస్థను పటిష్టం చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తుండగా, దేశీయంగానూ వీటి నిధుల అవసరాలపై మరింత దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) నిర్వహించిన స్టార్టప్‌లు, ఎంట్రప్రెన్యూర్షిప్ వర్క్‌షాప్‌లో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు. దేశీయంగా 25,000 పైచిలుకు టెక్ స్టార్టప్‌లు ఉండగా.. వీటిలో డీప్‌టెక్‌కు సంబంధించినవి 12 శాతం (3,000) మాత్రమే ఉన్నాయని తెలిపారు. కృత్రిమ మేథ (ఏఐ), రోబోటిక్స్, బ్లాక్‌చెయిన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), డ్రోన్లు మొదలైన టెక్నాలజీపై డీప్ టెక్ సంస్థలు పని చేస్తుంటాయి. ఇలాంటి సంస్థల పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలపై సమయం వెచ్చించాల్సి ఉంటుంది కాబట్టి వాటి ఉత్పత్తులు మార్కెట్లోకి రావడానికి ఎక్కువ సమయం పడుతుందన్న విషయాన్ని ఇన్వెస్టర్లు, నియంత్రణ సంస్థలు గుర్తించాలని దేవయాని ఘోష్ చెప్పారు. ప్రతిభావంతులు చాలా మందే ఉంటున్నప్పటికీ .. వారిని అందుకోవడం సమస్యగా మారిన నేపథ్యంలో సింగపూర్ వంటి దేశాల్లో మిలిటరీ సర్వీసును తప్పనిసరి చేసిన విధంగా ’స్టార్టప్ సర్వీసు’ను కూడా ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించవచ్చని తెలిపారు. తద్వారా మూడు, నాలుగో సంవత్సరంలోని ఇంజినీరింగ్ విద్యార్థులు ఏడాది పాటు ఏదైనా టెక్ స్టార్టప్స్‌లోకి వెళ్లి పనిచేయొచ్చని పేర్కొన్నారు. ఆ రకంగా ప్రతిభావంతుల తోడ్పాటుతో ఆయా అంకుర సంస్థలు, పెద్ద కంపెనీలతో పోటీపడవచ్చన్నారు. అవ్రా మెడికల్ రోబోటిక్స్‌లో ఎస్ఎస్ఐకి వాటాలు న్యూఢిల్లీ: దేశీ మెడ్‌టెక్ స్టార్టప్ కంపెనీ ఎస్ఎస్ ఇన్నోవేషన్ తాజాగా అమెరికాకు చెందిన నాస్డాక్ లిస్టెడ్ కంపెనీ అవ్రా మెడికల్ రోబోటిక్స్‌లో నియంత్రణ వాటాలను కొనుగోలు చేసింది. దీనితో తమకు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ప్రవేశించేందుకు అవకాశం లభించినట్లవుతుందని సంస్థ వ్యవస్థాపకుడు, చైర్మన్ సుధీర్ పి. శ్రీవాస్తవ తెలిపారు. ’ఎస్ఎస్ఐ మంత్ర’ రూపంలో ఇప్పటికే తాము మేడిన్ ఇండియా సర్జికల్ రోబో వ్యవస్థను ప్రవేశపెట్టామని ఆయన చెప్పారు. అవ్రాతో భాగస్వామ్యం .. రోబోటిక్ సర్జరీలకు సంబంధించి వైద్య సేవల్లో కొత్త మార్పులు తేగలదని శ్రీవాస్తవ వివరించారు. -
నాస్కామ్ ప్రెసిడెంట్‌గా దేవయాని ఘోష్
న్యూఢిల్లీ: భారత్ ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ ప్రెసిడెంట్‌గా దేవయాని ఘోష్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈమె ఇంతకుముందు ఇంటెల్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించారు. ఆర్.చంద్రశేఖర్ స్ధానాన్ని ఇప్పుడు దేవయాని భర్తీ చేశారు. ‘ప్రస్తుత డిజిటల్ గ్లోబలైజేషన్ యుగంలో ఐటీ పరిశ్రమకే అధిక ప్రాధాన్యత ఉంది. ఈ పరిశ్రమ మరింత ఉన్నత స్థాయికి ఎదగడానికి కృషి చేస్తాం. దీనికోసం అందరినీ కలుపుకొని ముందుకెళ్తాం’ అని దేవయాని తెలిపారు. దేశంలోని వివిధ పరిశ్రమల డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో ఐటీ–బీపీఎం కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో దేవయాని ఘోష్ బాధ్యతలు చేపట్టారు. -
ప్రాసెసర్లకు కొత్త అవకాశాలు
రూపు మార్చుకుంటున్న కంప్యూటర్లు ఇంటెల్ ప్రాసెసర్‌తో విస్తృత శ్రేణి.. త్వరలో మరిన్ని ట్యాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లలో పీసీలకు తరగని డిమాండ్ సాక్షితో ఇంటెల్ దక్షిణాసియా సేల్స్ ఎండీ దేవయాని ఘోష్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘డెస్క్‌టాప్ కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లకు గిరాకీ పడిపోయిందని అంటున్నారు. వాస్తవానికి చూస్తే రోజురోజుకూ విభిన్న మోడళ్లు దేశంలో వచ్చిపడుతూనే ఉన్నాయి. అల్ట్రాబుక్, నెట్‌బుక్, ట్యాబ్లెట్ పీసీ, ఫ్యాబ్లెట్.. ఇలా కొత్త రూపం సంతరించుకుంటున్నాయి. దేశ జనాభాలో 10-12 శాతం మంది మాత్రమే కంప్యూటర్ వాడుతున్నారు. ఈ లెక్కన ఇక్కడ అవకాశాలు అపారమని ప్రాసెసర్ల తయారీ దిగ్గజం ఇంటెల్ దక్షిణాసియా సేల్స్, మార్కెటింగ్ గ్రూప్ ఎండీ దేవయాని ఘోష్ గురువారం తెలిపారు. హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని ఐటీ మాల్‌ను సందర్శించేందుకు వచ్చిన ఆమె సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. కంప్యూటర్లకు ప్రపంచంలో ఉత్తమ మార్కెట్‌గా భారత్ అవతరిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా ఆమె ఏమన్నారంటే.. మార్కెట్‌కు అనుగుణంగా.. భారత్ వంటి దేశాల్లో డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లకు గిరాకీ ఎప్పటికీ తరగదు. అయితే వీటిని వినియోగిస్తున్న కస్టమర్లు ఇప్పుడిప్పుడే ట్యాబ్లెట్ పీసీ, ఫ్యాబ్లెట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎలాగూ స్మార్ట్ఫోన్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. ఈ ఉపకరణాల మూలంగా మార్కెట్ కొత్త పుంతలు తొక్కుతోంది. మార్కెట్‌కు అనుగుణంగా ప్రాసెసర్లను రూపొందిస్తున్నాం. ఇంటెల్ ప్రాసెసర్‌తో ఇప్పటికే కొన్ని ట్యాబ్లెట్ పీసీ, స్మార్ట్ఫోన్లు మార్కెట్లో ఉన్నాయి. ఈ ఉత్పత్తులకు అపూర్వ స్పందన వస్తోంది. 2014 డిసెంబరుకల్లా మరిన్ని కంపెనీల ఉత్పత్తుల్లో ఇంటెల్ దర్శనమీయనుంది. కంప్యూటర్ అంటే.. సోషల్ వెబ్సైట్లు, ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు కంప్యూటర్ అంటే. ఇంటర్నెట్ ఆధారంగా జీవితాన్ని అభివృద్ధి పథంవైపు నడిపించుకోవడానికి అదో సాధనం. 2020 నాటికి దేశంలో ప్రతీ కుటుంబంలో ఒకరికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా నాస్కామ్తో కలిసి నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్‌ను 2012 ఆగ స్టులో ప్రారంభించాం. విద్యార్థులు, రైతులు, గృహిణులు, చిన్న వ్యాపారస్తులకు కంప్యూటర్ వినియోగం, ప్రయోజనాలపై శిక్షణ ఇస్తున్నాం. ఈ ఏడాది ఆగస్టు నాటికి దేశవ్యాప్తంగా 17 లక్షల మందికి శిక్షణ ఇచ్చాం. డిసెంబరుకల్లా ఈ సంఖ్య 20 లక్షలకు చేరుకోనుంది. ఇంటెల్ లెర్న్ ఈజీ స్టెప్స్ పేరుతో ఆన్‌డ్రాయిడ్ అప్లికేషన్ అభివృద్ధి చేశాం. చిన్న చిన్న చిట్కాలతో వ్యక్తులు తమ నైపుణ్యం, సామర్థ్యం ఎలా పెంచుకోవాలో ఈ అప్లికేషన్ తెలియజేస్తుంది.