ప్రాసెసర్లకు కొత్త అవకాశాలు
- రూపు మార్చుకుంటున్న కంప్యూటర్లు
- ఇంటెల్ ప్రాసెసర్‌తో విస్తృత శ్రేణి..
- త్వరలో మరిన్ని ట్యాబ్లెట్లు, స్మార్ట్‌ఫోన్లలో
- పీసీలకు తరగని డిమాండ్
- సాక్షితో ఇంటెల్ దక్షిణాసియా సేల్స్ ఎండీ దేవయాని ఘోష్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘డెస్క్‌టాప్ కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లకు గిరాకీ పడిపోయిందని అంటున్నారు. వాస్తవానికి చూస్తే రోజురోజుకూ విభిన్న మోడళ్లు దేశంలో వచ్చిపడుతూనే ఉన్నాయి. అల్ట్రాబుక్, నెట్‌బుక్, ట్యాబ్లెట్ పీసీ, ఫ్యాబ్లెట్.. ఇలా కొత్త రూపం సంతరించుకుంటున్నాయి. దేశ జనాభాలో 10-12 శాతం మంది మాత్రమే కంప్యూటర్ వాడుతున్నారు. ఈ లెక్కన ఇక్కడ అవకాశాలు అపారమని ప్రాసెసర్ల తయారీ దిగ్గజం ఇంటెల్ దక్షిణాసియా సేల్స్, మార్కెటింగ్ గ్రూప్ ఎండీ దేవయాని ఘోష్ గురువారం తెలిపారు. హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని ఐటీ మాల్‌ను సందర్శించేందుకు వచ్చిన ఆమె సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. కంప్యూటర్లకు ప్రపంచంలో ఉత్తమ మార్కెట్‌గా భారత్ అవతరిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా ఆమె ఏమన్నారంటే..
మార్కెట్‌కు అనుగుణంగా..
భారత్ వంటి దేశాల్లో డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లకు గిరాకీ ఎప్పటికీ తరగదు. అయితే వీటిని వినియోగిస్తున్న కస్టమర్లు ఇప్పుడిప్పుడే ట్యాబ్లెట్ పీసీ, ఫ్యాబ్లెట్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎలాగూ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. ఈ ఉపకరణాల మూలంగా మార్కెట్ కొత్త పుంతలు తొక్కుతోంది. మార్కెట్‌కు అనుగుణంగా ప్రాసెసర్లను రూపొందిస్తున్నాం. ఇంటెల్ ప్రాసెసర్‌తో ఇప్పటికే కొన్ని ట్యాబ్లెట్ పీసీ, స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లో ఉన్నాయి. ఈ ఉత్పత్తులకు అపూర్వ స్పందన వస్తోంది. 2014 డిసెంబరుకల్లా మరిన్ని కంపెనీల ఉత్పత్తుల్లో ఇంటెల్ దర్శనమీయనుంది.
కంప్యూటర్ అంటే..
సోషల్ వెబ్‌సైట్లు, ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు కంప్యూటర్ అంటే. ఇంటర్నెట్ ఆధారంగా జీవితాన్ని అభివృద్ధి పథంవైపు నడిపించుకోవడానికి అదో సాధనం. 2020 నాటికి దేశంలో ప్రతీ కుటుంబంలో ఒకరికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా నాస్కామ్‌తో కలిసి నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్‌ను 2012 ఆగ స్టులో ప్రారంభించాం. విద్యార్థులు, రైతులు, గృహిణులు, చిన్న వ్యాపారస్తులకు కంప్యూటర్ వినియోగం, ప్రయోజనాలపై శిక్షణ ఇస్తున్నాం. ఈ ఏడాది ఆగస్టు నాటికి దేశవ్యాప్తంగా 17 లక్షల మందికి శిక్షణ ఇచ్చాం. డిసెంబరుకల్లా ఈ సంఖ్య 20 లక్షలకు చేరుకోనుంది. ఇంటెల్ లెర్న్ ఈజీ స్టెప్స్ పేరుతో ఆన్‌డ్రాయిడ్ అప్లికేషన్ అభివృద్ధి చేశాం. చిన్న చిన్న చిట్కాలతో వ్యక్తులు తమ నైపుణ్యం, సామర్థ్యం ఎలా పెంచుకోవాలో ఈ అప్లికేషన్ తెలియజేస్తుంది.