పైరసీని అరికట్టండి
పైరసీని అరికట్టాలని, అందుకు పాల్పడిన వారిని గూండా చట్టం కింద అరెస్టు చేయాలని సినీ సంఘాల నేతలు సీబీసీఐడీని కోరారు. సోమవారం ఉదయం స్థానిక ఎగ్మూర్‌లోని సీబీసీఐడీ కార్యాలయానికి వెళ్లిన సినీ సంఘాల నేతలు డిజిపి అశతోస్ శుక్లాకు వినతి పత్రాన్ని అందించారు. దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్, విజయ్‌కుమార్, తమిళ నిర్మాతల సం ఘం అధ్యక్షులు కేఆర్, బుల్లితెర నటీనటుల సంఘం అధ్యక్షురాలు నళిని, తమిళ దర్శకుల సంఘాల తరపున రమేష్ ఖన్నా తదితరులు సోమవారం ఉదయం డీజీపీ అశుతోష్ శుక్లను కలిసి వినతి పత్రాన్ని అందించారు.
పైరసి కారణంగా తమిళ సినిమా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోందన్నారు. ప్రజల ముఖ్యమంత్రి జయలలిత సినీ పరిశ్రమ వర్గాల వేడుకోలు మేరకు 2001-2006 ప్రాంతంలో పైరసీదారులపై గూండా చట్టం విధించారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడే పైరసీ మహమ్మారి విజృంభించిందన్నారు. కాబట్టి మళ్లీ గూండా చట్టం ప్రయోగించి పైరసీని రూపుమాపాలన్నారు. నూతన చిత్రం విడుదలైన రోజునే కొన్ని థియేటర్లు పైరసీకి పాల్పడుతున్నాయన్నారు. అలాంటి థియేటర్ల అనుమతులను రద్దు చేస్తూ చర్యలు తీసుకోవాలని కోరారు.
అన్ని సీడీల విక్రయ దుకాణాలపై పోలీసులు తరచు సోదాలు జరిపి పైరసీని అరికట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. లోకల్ కేబుల్ టీవీల్లో కొత్త చిత్రాలను అనుమతి లేకుండా ప్రసారం చేస్తున్నారన్నారు. ఇలాంటి కేబుల్ చానెళ్లు సుమారు 300కు పైగా ఉన్నాయన్నారు. వాటి అనుమతులను కూడా రద్దు చేయాలన్నారు. అదే విధంగా తమిళనాడులో తిరుగుతున్న అని ప్రైవేటు ఆమ్నీ బస్సుల్లోనూ, అనుమతి లేకుండా కొత్త చిత్రాలను ప్రసారం చేస్తున్నారని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.