యంత్ర సాయం...సాగు లాభం
ఆరుగాలం కష్టించి సాగుచేసిన రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కావడంలేదు. గత కొన్నేళ్లుగా పంటలు కలిసిరాకపోవడంతో అన్నదాతలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటనష్టపోతున్నారు. పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. రైతన్నల సమస్యలు తెలుసుకునేందుకు వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ (జేడీ) దమ్ము ప్రమీల సాక్షి వీఐపీ రిపోర్టర్‌గా మారారు. కొండ కరకాం గ్రామంలో పొలాల్లోకి వెళ్లి రైతులు పండిస్తున్న వరి, టమాటా, మిరప, వంగ వంటి పంటలను పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకుని, తగిన సూచనలు చేశారు. ఆధునిక యంత్రాలతో వ్యవసాయం చేస్తే అధికలాభాలు పొందవచ్చని చెప్పారు.
కొండకరకాం గ్రామాంలో పలు పంటలను పరిశీలించి రైతులను సమస్యలను తెలుసుకున్నాను. వరి ఒక్కటే అయితే గిట్టుబాటు కాదని, ఇక్కడ రైతులు వరితోపాటు టమాటా, మిరప, వంగవంటి పంటలు కూడా సాగు చేస్తున్నారు. ఈ విధానాన్ని మిగతా రైతులు కూడా పాటించాలి. కూరగాయలను విజయనగరం రైతు బజార్లో విక్రయిస్తే మంచిధర వస్తుంది. రైతులకు యంత్ర పరికరాలను 50 శాతం రాయితీపై అందిస్తున్నాం. యంత్ర పరికరాలు కావాల్సిన వారు మీసేవద్వారా దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తాం. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకుని వెళ్లడంలో ఇబ్బందుల పరిష్కారానికి ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళతాను. నష్టపోయిన రైతులందరికీ పరి హారం అందేలా కృషి చేస్తాను.
రైతులతో జాయింట్ డెరైక్టర్ ప్రమీల సంభాషణ ఇలా సాగింది.
వ్యవసాయశాఖ జేడీ: నాపేరు ప్రమీల, నేను వ్యవసాయ శాఖ జాయింట్ డెరైక్టర్‌ను. మీ సమస్యలు తెలుసుకోడానికి వచ్చాను.
మీ పేరేంటి, ఏపంట వేశారు?
రైతు సత్యం: అమ్మా నాపేరు సత్యం. వరి వేశాను
జేడీ: ఎన్ని ఎకరాల్లో వేశారు?
సత్యం: ఐదు ఎకరాల్లో సాగు చేస్తున్నానమ్మ.
జేడీ: ఏరకం విత్తనాలు వేశారు ?
సత్యం: హెబ్రీడ్ రకం రకాన్ని వేశాను
జేడీ: ఎన్ని రోజుల్లో పండుతుంది. పంట వేసిఎన్ని రోజులయింది?
సత్యం: 120 రోజుల్లో పండుతుంది. పంట వేసి 25 రోజులయింది.
జేడీ: కలుపు మందు ఏమైనా వేశారా?
సత్యం: స్వాతి అనే కలుపు మందు వేశాను
జేడీ: హైబ్రీడ్ రకాన్నే ఎందుకు వేశారు?
సత్యం: మా గ్రామంలో ఓ రైతు ఖరీఫ్‌లో వేశారు. పంట బాగుంది. అందుకే నేనూ వేశాను .
జేడీ: హైబ్రీడ్ రకాలను ఏకాలంలోనైనా వేసుకోవచ్చు. అయితే రబీలో వేసుకోవడం మంచిది. ఎందుకంటే తక్కువ రోజుల్లో పంట పండుతుంది. రబీలో నీటి వసతి అన్ని వేళలా అందుబాటులో ఉండదు కాబట్టి ఇటువంటి సల్వకాలిక రకాలను వేసుకోవడం మంచిది. అంతేకాకుండా దిగుబడి కూడా పెరుగుతుంది. పంటకు అవసరమైన ఎరువులను అందిస్తాం.
జేడీ: మీ పేరేంటి?
రైతు రాములప్పడు : నాపేరు రాములప్పుడమ్మ
జేడీ:మీరేపంట వేశారు ?
రాములప్పడు : వరి వేశానమ్మ.
జేడీ: ఎన్ని ఎకరాల్లో వేశారు, ఏ రకం సాగు చేస్తున్నారు?
రాములప్పడు : ఖరీఫ్‌లో ఏడు ఎకరాల్లో హైబ్రీడ్ రకాన్ని వేశాను
జేడీ: ఎంతదిగుబడి వస్తుందనుకుంటున్నారు?
రాములప్పడు: ఎకరాకు 40 బస్తాలు వరకు వస్తాదని అనుకున్నాను. అయితే హుద్‌హుద్ తుపాను వల్ల పంట దెబ్బతింది. 25 నుంచి 30 బస్తాలు మాత్రమే దిగుబడి రావచ్చు
జేడీ: పరిహారం వచ్చిందా?
రాములప్పడు : రాలేదమ్మా
జేడీ: పంటకు ఇన్సూరెన్స్ కట్టారా?
రైతు: ఇన్సూరెన్స్ గురించి తెలియదమ్మా
జేడీ: పంటలు బీమా ఇన్సూరెన్స్ ప్రతీ రైతు కట్టుకోవాలి. ఇన్సూరెన్స్ కడితే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పంటలకు బీమా వర్తిస్తుంది. పరిహారం ఎందుకు రాలేదో విచారణ జరిపి, చర్యలు తీసుకుంటాను.
జేడీ: మీ పేరేంటి
రైతు సూర్యనారాయణ : నాపేరు సూర్యనారాయణమ్మ.
జేడీ: ఏ పంట వేశారు?
సూర్యనారాయణ : టమాటా వేశాను
జేడీ: టమాటా ఎందుకు వేశారు ?
సూర్యనారాయణ : వరి పంట కొంత వేశాను, అదనపు ఆదాయం వస్తుందని మరికొంత మేర టమాటా వేశాను.
జేడీ: ఎక్కడ అమ్ముతారు?
సూర్యనారాయణ : విజయనగరం మార్కెట్లో అమ్ముతాను
జేడీ: కూరగాయాలను మార్కెట్లో కంటే రైతుబజార్లలో నేరుగా అమ్ముకుంటే మంచి ధర వస్తుంది. రైతు బజార్లో కూరగాయాలు అమ్ముకుంటానంటే ఏడీతో మాట్లాడి కార్డులు ఇప్పిస్తాను. టమాటా సాగులో కలుపు లేకుండా చూసుకోవాలి. ఏదైనా తెగులు సోకితే తక్షణమే ఉద్యానశాఖ అధికారినిగాని, శాస్త్రవేత్తను గాని అడిగి నివారణ చర్యలు చేపట్టాలి.
జేడీ : బాబూ నీపేరేంటి?
మరో రైతు : నా పేరు సూర్యనారాయణ
జేడీ: రుణమాఫీ ఏమైనా అయిందా?
సూర్యనారాయణ: తొలివిడతలో అవలేదు. రెండో విడతలో అవుతుందన్నారు.
జేడీ: పాసుపుస్తకాలు, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతాలు వివరాలను జన్మభూమి కమిటీకి అందిస్తే సమస్య పరిష్కారమవుతుంది .
రైతు: నా పేరు బాబారావు మేడమ్.
జేడీ: ఏ పంట వేశారు, పంటనూర్పును సాధారణ పద్ధతిలో చేపడుతున్నారా, లేక యంత్రంతో చేస్తున్నారా?
బాబారావు: వరి వేశానమ్మ, సాధారణ పద్ధతిలోనే నూర్పు చేస్తున్నాం.
జేడీ: 50 శాతం రాయితీపై యంత్ర పరికరాలను అం దిస్తున్నాం. మీసేవ ద్వారా దరఖాస్తు చేస్తే పరికరాలను అందజేస్తాం. యంత్ర పరికరాలతో పనులు చేయడం వల్ల కూలీల ఖర్చు, సమయం ఆదా అవుతుంది.
జేడీ: బాబు నీ పేరేంటి ?
రైతు గోపాల్‌రావు: మేడమ్ నాపేరు పడాల గోపాల్‌రావు.
జేడీ: మీరే పంట పండిస్తున్నారు , మీసమస్య ఏంటి?
గోపాల్‌రావు: నేను కూరగాయలు పండిస్తున్నాను. నాకు కూరగాయల సాగులో కలుపుతీసే పరికరం కావాలి
జేడీ: కూరగాయల సాగును కూడా కొన్ని పరికరాలతో చేపట్టవచ్చు. వాటిని రాయితీపై అందిస్తాం.
జేడీ? ఏమండీ మీ పేరేంటి, మీసమస్య ఏంటి?
రైతు కోటేశ్వరరావు: అమ్మా... నాపేరు కోటేశ్వరావు. నేను రబీలో మూడు ఎకరాల్లో చోడి పంట వేశాను. యూరియా దొరక్క ఇబ్బంది పడుతున్నాను
జేడీ: ప్రస్తుతం యూరియా కొరత ఉన్న మాట వాస్తవమే. ఇప్పుడు జిల్లాకు 600 టన్నుల యూరియా వచ్చింది.
అన్ని సొసైటీలకు అందిస్తాం. ఎక్కడైనా అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు సమాచారమిస్తే చర్యలు తీసుకుంటాం.
జేడీ ధాన్యం: కొనుగోలు కేంద్రాల వల్ల ఉపయోగం ఉందా?
కోటేశ్వరరావు: ధాన్యం కొనుగోలు కేంద్రాల వల్ల ప్రయోజనం కంటే, ఖర్చు అదనంగా అవుతోంది
జేడీ: ఎందుకు అదనంగా ఖర్చువుతోంది?
కోటేశ్వరరావు: ధాన్యం బస్తాలను కొనుగోలు కేంద్రానికితీసుకుని వెళ్లడానికిట్రాక్టర్కు అద్దె ఇవ్వాలి. అదే విధంగా ధాన్యం బస్తాల ఆన్లోడింగ్, లోడింగ్‌కు రూ.1000 వరకు ఖర్చువుతోంది
జేడీ: మీకు కావాల్సిందేంటి?
కోటేశ్వరరావు : మా కళ్లాల దగ్గరకు వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తే బాగుంటింది. దీని వల్ల రైతులకు చాలా వరకు ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా తూనిక యంత్రాలు ఇవ్వాలి.
జేడీ: దరఖాస్తు చేసుకుంటే తూనిక యంత్రాలను రాయితీపై అందిస్తాం. ధాన్యం తరలించడానికి అవుతున్న అదనపు ఖర్చు గురించి ఉన్నత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరానికి కృషి చేస్తాను.
జేడీ : మీ పేరేంటమ్మా ?
మహిళారైతు రాజమ్మ: అమ్మా నా పేరు రాజమ్మ.
జేడీ: నీకు పొలం ఉందా, ఉంటే ఏపంట వేశావు?
రాజమ్మ: నాకు ఎకరం పొలం ఉంది. వరి వేశాను
జేడీ : హుద్‌హుద్ తుపానుకు పంట దెబ్బతిందా?, పరిహారం వచ్చిందా ?
రాజమ్మ : పంటంతా పోయిందమ్మ. పరిహారం రాలేదు
జేడీ: పరిహారం ఎందుకు రాలేదో విచారణ చేసి చర్యలు తీసుకుంటాను
జేడీ :బాబూ నీ పేరేంటి ?
రైతు రమణ: నా పేరు రమణ మేడమ్. నేను కూరగాయలు సాగు చేస్తున్నాను
జేడీ: ఎన్ని ఎకరాల్లో వేశారు, ఏఏ పంటలవేశారు?
రమణ: ఒక ఎకరంలో ముల్లంగి, గోంగూర, మొక్కజొన్న, టమాటా వేశాను మేడమ్
జేడీ: ఎక్కడ విక్రయిస్తారు ?
రమణ: విజయనగరం మార్కెట్లో విక్రయిస్తాను
జేడీ: ఎవరుతీసుకు వెళాతారు?
రమణ : నేనే తీసుకుని వెళాతాను.
జేడీ: ఎకరానికి ఎంత ఆదాయం వస్తుంది?
రమణ: ఎకరానికి 20 వేలు వరకూ వస్తుంది మేడమ్.
జేడీ : కూరగాయాలను రైతు బజారులో విక్రయిస్తే మంచి గిట్టుబాటు అవుతుంది. మార్కెట్లో అయితే దళారులు బెడద వల్ల నష్ట పోవలసి వస్తుంది.