ఫెడరేషన్లు లేని బీసీ కులాలకు సొసైటీలు నియమించాలి
వైఎస్సార్ సీపీ బీసీ విభాగం డిమాండ్
పార్టీ బీసీ విభాగం ఏపీ అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణదాస్
సాక్షి, హైదరాబాద్: ఫెడరేషన్లు లేని బీసీ కులాలకు సొసైటీలను ఏర్పాటు చేసి వెనుకబడిన తరగతులకు రుణ సదుపాయం కల్పించాలని వైఎస్సార్సీపీ బీసీ ఆంధ్రప్రదేశ్ విభాగం డిమాండ్ చేసింది. పార్టీ బీసీ విభాగం అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన సోమవారం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. మరో ఐదు తీర్మానాలను కూడా సమావేశం ఆమోదించింది. అనంతరం కృష్ణదాస్ మీడియాతో మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయూంలో బీసీల్లోని వివిధ కులాల కోసం 9 ఫెడరేషన్లు ఏర్పాటు చేశారని, వెనకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఫెడరేషన్లు లేని ఇతర బీసీ కులాలకు కొత్తగా సొసైటీలు ఏర్పాటు చేయాలని తాము కోరుతున్నామన్నారు. ఇప్పటికే ఉన్న బీసీ ఫెడరేషన్లకు తగినన్ని నిధులు మంజూరు చేయాలని అన్నారు. బీసీ వృత్తిదారుల రుణాలన్నింటినీ రద్దు చేయాలని తీర్మానించినట్లు తెలిపారు. చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లతోపాటు ప్రభుత్వోద్యోగాలు, ప్రమోషన్లలో బీసీ రిజర్వేషన్లను విధిగా అమలు చేయాలని తీర్మానించినట్లు చెప్పారు. ఫీజు రీరుుంబర్స్మెంట్ పథకానికి పరిమితులు విధించకుండా అమలు చేయాలని కోరుతూ తీర్మానం చేసినట్లు తెలిపారు.
పార్టీ పర్యవేక్షణ కమిటీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ బీసీ విభాగం అధ్యక్షుడిగా వ్యవహరించిన గట్టు రామచంద్రరావు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యూరు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ బీసీ విభాగం అధ్యక్షుడిగా పదవీ ప్రమాణం చేశారు. జిల్లా నేతలు జి.రమాదేవి, అవ్వారు ముసలయ్య, దేవరకొండ శ్రీనివాసరావు, కె.గురవాచార్య, ఎం.రాజాయాదవ్, డాక్టర్ ఎ.మధుసూదన్, టి.పుల్లయ్య , ఎం.పురుషోత్తం, ఎం.ప్రభాకర్, బి.రాజశేఖర్, ఎం.హరి, కె.ఎన్.రాజా, కత్తి రాజకుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.