dharmaraju
-
ఈ జీవితానికి ఈ కష్టాలు చాలు
కుంతీదేవి పడిన కష్టాలు అటువంటి ఇటువంటివి కావు. ఇన్ని ఉత్థాన పతనాలు చూసినా ఎన్నడూ ధర్మం వదిలి పెట్టలేదు. అయినా పరిస్థితులు ఆమెకు ఎప్పుడూ అగ్నిపరీక్ష పెడుతూనే వచ్చాయి. ఒక ఆసనంలో ధృతరాష్ట్రుడు కూర్చున్నాడు. ఒక ఆసనంలో ధర్మరాజు కూర్చున్నాడు. చనిపోయిన వీరుల పేర్లు చదువుతూ నువ్వులు, నీళ్ళు వదులుతున్నారు. ఫలానా వీరుడి పేరు చదవగానే ధర్మరాజు ‘నాకు చెందిన వాడు’ అని ధర్మోదకాలు వదిలాడు. మరొక వీరుడి పేరు చెప్పగానే ‘నాకు చెందిన వాడు’ అని ధృతరాష్ట్రుడు నీళ్ళు నువ్వులు వదిలాడు... కార్యక్రమం ఇలా నడుస్తుండగా... కర్ణుడి పేరు చదివారు. ‘నాకు చెందిన వాడు కాడు’ అని ధర్మరాజు అన్నాడు. ధృతరాష్ట్రుడు అలాగే అన్నాడు. అక్కడే ఉన్న కుంతీదేవి అది విని తట్టుకోలేక పోయింది. యుద్ధ సమయంలో ఆమె శిబిరంలో ఉన్న కర్ణుడి దగ్గరకు వెళ్ళి ప్రాధేయపడితే..‘‘అర్జునుడు తప్ప మిగిలిన పాండవుల జోలికి రాను... ఎటుచూసినా నీకు పాండవులు ఎప్పుడూ ఉంటారు’ అని చెప్పాడు. అటువంటి ఔదార్యమున్నవాడిని... తన కుమారుడేనని, కన్యా సంతానమని ఎప్పుడూ చెప్పుకోలేక పోయింది. ఇప్పుడు చిట్టచివరన కనీసం నువ్వులు–నీళ్ళు కూడా దక్కడం లేదు. తల్లడిల్లిపోయింది. భోరున ఏడుస్తూ చెప్పేసింది. నాకు కొడుకు, నీకు సోదరుడు – అంది. ధర్మరాజన్నాడు కదా...‘‘ఎంత తప్పు చేసావమ్మా! కర్ణుడు పెద్దవాడు. పట్టాభిషేకం చేసుకోవాలి. నీవు ఈ రహస్యాన్ని దాచి అన్నను చంపించావు. కాబట్టి ఆడదాని నోట నువ్వు గింజ నానినంత సేపు కూడ నిజం దాగకుండు గాక!’’ అని శాపమిచ్చాడు తల్లికి. ఎవరికోసం అష్టకష్టాలు పడిందో ఆ బిడ్డల వలన శాపం పొంది తలదించుకుంది. మహా ఔన్నత్యం కల ఇల్లాలని భీష్మ పితామహుడి ప్రశంసలు కూడా పొందిన కుంతీదేవి చివరకు వైరాగ్యం పొంది, కృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ... ‘‘చాలు కృష్ణా, ఉత్థానపతనాలు జీవితంలో ఎన్నో చూశా. ఒక్కొక్కసారి సంతోషించా... ఒక్కొక్కసారి లోయల్లోకి జారిపోయా. ఎన్ని కష్టాలు పడ్డానో, యాదవులందు నువ్వున్నావని, నా మేనల్లుడివనీ, నేను మేనత్తననీ మమకారం వద్దు. కడుపున పుట్టిన బిడ్డలని మమకారం వద్దు. ఈ మమకారమనే పాశాలు కోసెయ్యవా కష్ణా! ఆ గంగ ఎక్కడ పుట్టిందో చివరకు సముద్రంలో చేరిపోయినట్లుగా ఇక నా జీవితం ఎప్పుడూ నిన్నే స్మరిస్తూ నీలోనే ఐక్యమయిపోయేటట్లుగా నువ్వు తప్ప నా మనసులో ఇంకొక ఆలోచన రాకుండా నన్ను అనుగ్రహించవయ్యా!’’ అని ప్రార్థన చేసింది. కలిసొచ్చినన్నాళ్ళు ధర్మం పట్టుకోవడం చాలా తేలికే. కాలం కలిసిరానప్పుడు, కాల ప్రవాహానికి ఎదురీదాల్సి వచ్చినప్పుడు చూపిన ధైర్యం, తెగువ, నిబ్బరం చెప్పనలవి కాదు. ద్రౌపదీ దేవి ఎంత గొప్ప స్త్రీ, సింహాసనానికి ఉత్తరాధికారులు కావలసిన ఉపపాండవులను రాత్రికి రాత్రి నిద్రలో అశ్వత్థామ చంపితే... అప్పుడు చూడాలి ఆమె ఆంతరంగంలోని లోతులు, ఆమె ప్రదర్శించిన ఔన్నత్యం ! -
పుణ్యాత్ముల ప్రభావం
ధర్మరాజు శాంత మూర్తి. ధర్మానికి కట్టు బడినవాడు. నెమ్మదితనం ఉన్నవాడు. ఆయన ఉన్న పరిసరాలన్నీ శాంతితో నిండిపోయేవి. మహా భారత యుద్ధానంతరం స్వర్గారోహణం చేస్తూ ధర్మరాజు వెళుతున్నప్పుడు మార్గ మధ్యంలో నరకం పక్కగుండా ఆయన నడుస్తున్నాడు. నరకం చాలా దారుణంగా వుంది. చూడడానికి భయోత్పాతంగా ఉంది. పాపులని చిత్ర హింసలు పెట్టడం, నూనెలో కాల్చడం, మంటల్లో వేయడం వంటి అనేక కఠిన శిక్షలతో నిండి ఉంది. దాంతో నరకంలో భరించలేని వేడి. ధర్మరాజు నరకం పక్కనుండి వెళుతూ ఉంటే ఆయన శరీరంలో నుంచి ఆ చలువదనం ప్రసరించి నరకలోకమంతటా పిల్లగాలి వీచింది. ఆ వాతావరణంలోని ఆహ్లాదాన్ని పాపులందరూ అనుభవించారు. ఎందుకిలా జరిగిందని చూస్తే పక్కగా ధర్మరాజు వెళుతున్నాడు. దాంతో నరక వాసులందరూ పరుగెత్తుకుంటూ వచ్చారు. ‘‘స్వామీ! మీరు అడుగుపెడితేనే మేము ఇంత హాయిని పొందాము. చల్లని ఆహ్లాదకరమైన వాతావరణంతో ఈ పరిసరాలన్నీ నిండిపోయాయి. దయచేసి మీరు కొంతకాలం ఇక్కడ ఉంటే మేము ఎంతో ప్రశాంతతని అనుభవిస్తాము స్వామీ! అనుక్షణం. చిత్రహింసలను అనుభవించే మమ్మల్ని మీరు కరుణించి ఇక్కడ ఉంటే మా పాపాల కు విముక్తి కూడా కలుగుతుంది’’ అని వేడుకొన్నారు. ధర్మరాజు చిరునవ్వుతో వారి ప్రార్థన మన్నించి అక్కడ కొంతకాలం ఉండటానికి అంగీకరించాడు. కానీ ఆయన అలా అక్కడ ఉంటే ఇంక స్వర్గానికి, నరకానికి తేడా వుండదు. పాపులకు శిక్ష ఉండదు. ధర్మరాజు వల్ల ధర్మమే తల కిందులయ్యే ప్రమాదం ఏర్పడింది. ఎంతకాలానికీ ఆయన రాకపోయేసరికి దేవదూతలు అక్కడకి వచ్చారు. ‘‘ధర్మరాజా! మీరు ఇక బయల్దేరండి, మనం స్వర్గానికి వెళదాం’’ అన్నారు. అప్పుడు ధర్మరాజు ‘‘నేను ఇక స్వర్గంలో అడుగు పెట్టలేను. నేను చేసిన పుణ్యమంతా ఈ నరకవాసులకి ధారపోశాను కాబట్టి నేను ఇక్కడే ఉండిపోతాను’’ అన్నాడు. దేవదూతలు ‘‘ధర్మరాజా! మీరు కడు పుణ్యాత్ములు, ధర్మాత్ములు. మీరెంత పుణ్యం ధారపోసినా అది తరిగేది కాదు. ఇచ్చే కొద్దీ పెరిగేది. మీ దయవల్ల ఈ నరక వాసులు కొంతకాలం పాటు ప్రశాంతత పొందారు. ఇక చాలు. దయచేసి మీరు బయల్దేరండి’’ అన్నారు. ధర్మరాజు సెలవు తీసుకుని స్వర్గయాత్రకు వెళ్ళాడు. సృష్టికి విరుద్ధంగా ఏ పనీ చెయ్యకూడదు. కానీ కొంత తను చెయ్య గలిగినది చేశాను’’ అని తృప్తి పడ్డాడు ధర్మరాజు. ఉత్తములు ఎక్కడుంటే అక్కడ ఉల్లాస భరిత వాతావరణం ఉంటుంది. సాధుస్వభావులు ఉన్న చోట శాంతం మూర్తీభవిస్తుంది. ఆ పరిసరాలూ ప్రశాంతంగా వుంటాయి. పూవుల పరిమళం పూలచుట్టూనే వున్నట్లుగా మనిషి తత్వం అతన్ని చుట్టి వుంటుంది. అతనితోబాటే సాగుతుంది. మహానుభావుల పాద ధూళి కూడా పవిత్రమైనదే. కనుక అలాంటివారికోసం ఎదురు చూస్తుండాలి.–డి.వి.ఆర్. -
వెంట ఉండేది ధర్మమొక్కటే!
కొద్దిసేపట్లోనే సహదేవుడుపడిపోవడం చూచి భీముడు హెచ్చరించగా – ‘సోదరా! మాద్రీ పుత్రుడు పాండిత్య మదపూర్ణుడు’.. అని పలికి వెనక్కి చూడక మిగిలిన వారితో ముందుకు సాగాడు. కృష్ణ నిర్యాణం తర్వాత ధర్మరాజు పరీక్షిత్తుకు పట్టం కట్టి విరక్తుడై సర్వం త్యజించి సశరీర స్వర్గప్రాప్తికై ఉత్తర దిశగా పయనమయ్యాడు. ఆహార పానీయాలు వదలి నిర్మోహిౖయె దిక్కులు చూడక, ఎక్కడా నిలవక హిమాలయంలో బదరీనాథం దాటి అవిశ్రాంతంగా ముందుకు సాగిపోతున్నాడు. నలుగురు సోదరులు, ద్రౌపది కూడా ఆయన్ను అనుసరిస్తున్నారు. అందరూ స్వర్గారోహణ దివ్యభూమిని సమీపించారు. అక్కడ ద్రౌపది కిందకు పడిపోవడం చూచి భీముడు అన్నగారికి నివేదించాడు. ధర్మారాజు వెనుకకు చూడకనే.. ‘పడిపోనీ, పాంచాలి ప్రవర్తన పక్షపాతమయం’ అంటూ నిర్లిప్తంగా ముందుకు నడిచాడు. కొద్దిసేపట్లోనే సహదేవుడు పడిపోవడం చూచి భీముడు హెచ్చరించగా – ‘సోదరా! మాద్రీ పుత్రుడు పాండిత్య మద పూర్ణుడు’.. అని పలికి వెనక్కి చూడక మిగిలిన వారితో ముందుకు సాగాడు. తర్వాత నకులుని పతనం తెలపగా ధర్మరాజు – ‘భీమా! అతనికి తాను అందరికంటే అందగాడిననే అహంకారం. అందుకే పడిపోయాడు’ అని వెనుతిరుగకనే వివరించాడు. ఇంతలోనే పాండవ మధ్యముని పతనం ప్రారంభమవగా భీముడు భయం–భయంగా, అన్నా! మన ప్రియతమ సోదరుడు గాండీవధారి పార్థుడు కూడా పడిపోతున్నాడని చెప్పగా యుధిష్ఠిరుడు.. ‘పడనీ. నేను గొప్ప విలుకాడినని, విజయుడు ఎప్పుడూ విర్రవీగేవాడు’ అంటూ ముందుకు సాగాడు.చివరకు ‘అన్నా! నేనూ పడిపోతున్నా అడ్డుపడమ’ని భీముడు ఆక్రోశించగా.. ‘భీమా! నువ్వొక పెద్ద తిండిపోతువి. ఈ లోకంలో నాకన్నా బలవంతుడు లేడని నీకు అహంకారం. దురభిమానికి పతనం తప్పదు’ అంటూ ఆగక సాగిపోయాడు. (అందుకే కదా ‘అహంకారం సురాపానం’.. అంటే అహంకారం మద్యపానంతో సమానమని శాస్త్రం హెచ్చరించింది). మృతునికి ధర్మమే మిత్రము. ధనాన్ని భూమిలో, బీరువాలలో, బ్యాంకులలో; పశువుల్ని గొడ్ల పాకల్లో, భార్యను ఇంటి గుమ్మంలో, బంధుమిత్రులను శ్మశానంలో; దేహాన్ని చితి మీదను, గోతిలో వదలి జీవుడు పరలోక మార్గంలో పోయేటప్పుడు ధర్మమొక్కటే అతని వెంట ఉంటుంది. – డి.వి.ఆర్. -
ధర్మజుని తొందరపాటు
అది మహాభారత సంగ్రామం... కురు పాండవుల మధ్య తీవ్ర పోరు సాగుతోంది. పాండు మధ్యముడైన అర్జునుడిపైనే కర్ణుని గురి. తాను ఇంద్రుని నుంచి వరంగా పొందిన శక్త్యాయుధాన్ని అర్జునుడిపై ప్రయోగించాలని వేచి ఉన్నాడు. ఇంతలో ఘటోత్కచుడు రణరంగాన ప్రవేశించాడు. అసలే రాక్షసుడు... ఆపై వీరుడు. మాయలు మంత్రాలు తెలిసిన మహా బలశాలి. దాంతో అందరూ కలిసి కర్ణుని శరణుజొచ్చారు. ఘటోత్కచుని రాక్షస మాయల ముందు కర్ణుని శక్తి సామర్థ్యాలు సరిపోలేదు. దాంతో విధిలేని పరిస్థితులలో అర్జున సంహారం కోసం దాచి ఉంచిన శక్తి ఆయుధాన్ని ఘటోత్కచుని మీద ప్రయోగించాడు. ఘటోత్కచుడు హతమయ్యాడు. ఘటోత్కచుడి మరణంతో ధర్మరాజు రథం మీద కూలబడి తీవ్రంగా రోదిస్తున్నాడు. కృష్ణుడు ధర్మజుని దగ్గరకు వెళ్ళి ‘ధర్మనందనా! ఏమిటీ వెర్రి. యుద్ధంలో వీరులు మరణించరా! అన్నీ తెలిసిన నీవే ఇలా చింతిస్తే సైన్యాన్ని నడుపగల వాడెవడు? నీ సోదరులను ఓదార్చగల వారెవరు? లేచి వారిని ఓదార్చి యుద్ధ సన్నద్ధులను చేయి‘ అన్నాడు. ఆ మాటలతో తేరుకున్న ధర్మరాజు ‘‘కృష్ణా! దీనికంతటికి కారణం కర్ణుడు. నాడు అభిమన్యుని విల్లు విరిచి అతడి మరణానికి కారణమయ్యాడు. నేడు ఘటోత్కచుడిని మట్టుపెట్టాడు. నేను కర్ణుడిని చంపుతాను, భీముడు ద్రోణుడిని చంపుతాడు’’ అంటూ తన రథాన్ని వేగంగా ముందుకు నడిపాడు. ముందు వెనకలు ఆలోచించకుండా సాగిపోతున్న ధర్మరాజు వ్యాసమహర్షి తన ఎదురుగా వచ్చి నిలవడంతో రథం దిగి, వినయంగా నమస్కరించాడు. వ్యాసుడు ‘‘ధర్మనందనా! కర్ణుడు శక్తి ఆయుధాన్ని అర్జునుడిని చంపడానికి ఉంచాడు. అది ఇప్పుడు ఘటోత్కచుడి మీద ప్రయోగించాడు. లేకుంటే, దానితో అర్జునుడిని చంపి ఉండేవాడు. అదే జరిగి ఉంటే నీ దుఃఖం వర్ణించనలవి కాదు. ఇప్పుడు నీవు కొద్ది దుఃఖంతో బయటపడ్డావు. కనుక వివేకంగా ఆలోచించి నీ వారినందరిని కలుపుకొని యుద్ధం కొనసాగించు’’ అని ఊరడించాడు. నీతి: మనం దేవుణ్ణి ఎంతగా పూజించినప్పటికీ, ఏదో ఒక ప్రమాదమో, ఆపదో కలగకమానదు. అప్పుడు మనం నిర్వేదంలో కూరుకుపోతాం. జరగవలసింది జరగకమానదు. అయితే, భగవంతుని పూజించినందువల్ల దాని తీవ్రత తగ్గుతుంది. దుఃఖోపశమనం కలుగుతుంది. అది తెలుసుకోవాలి. – డి.వి.ఆర్. భాస్కర్ -
ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ కన్నుమూత
నిజామాబాద్ : నృత్య దర్శకుడు ప్రభుదేవా గురువు బాడిగ ధర్మరాజు(97) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ధర్మరాజు శనివారం తుదిశ్వాస విడిచారు. ధర్మరాజు మృతి చెందిన వార్త తెలుసుకున్న ప్రభుదేవా, నస్రుల్లాబాద్ మండలం అంకోల్‌కు చేరుకుని గురువు భౌతికకాయానికి నివాళులర్పించారు. ధర్మరాజు కుటుంబ సభ్యులను ప్రభుదేవా పరామర్శించారు. 20వ ఏట నుంచే డ్యాన్స్‌పై ఆసక్తితో తన చిన్నాన్న బీవీ నరసింహరావు వద్ద శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత చెన్నైలో స్థిరపడ్డారు. ఎన్టీఆర్, కృష్ణ, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ఉదయభానుతో పాటు ప్రముఖ హీరోలకు క్లాసికల్ డ్యాన్స్ మాస్టర్‌గా పని చేశారు. సినిమా రంగానికి చెందిన కృపావతిని ధర్మరాజు పెళ్లి చేసుకున్నారు.