Dharmasagar Mandal
-
విషాదం : విద్యుత్‌షాక్‌తో దంపతుల మృతి
సాక్షి, వరంగల్ : బతుకుదెరువు కోసం వచ్చిన దంపతులు విద్యుత్‌షాక్‌తో మృతి చెందిన విషాద ఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ధర్మసాగర్ మండలం కాశగూడెంకు చెందిన సయ్యద్ హైదర్ (40), గోరిభి (38) భార్యభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. మంగళవారం రాత్రి వర్షం కురుస్తుండడంతో గోరిభి బయట తీగలపై ఉన్న బట్టలు తీయడానికి వెళ్లింది. అప్పటికే వర్షం కురువడంతో తీగలకు విద్యుత్ సరఫరా అయింది. ఆ విషయం తెలియని గోరిభి తీగను పట్టుకోవడంతో షాక్‌కు గురై మృతి చెందింది. బయట శబ్దం రావడంతో భర్త సయ్యద్ బయటికి వచ్చి తన భార్యకు ఏమైందోనని ఆమెను పట్టుకునేసరికి అతనూ కూడా షాక్‌కు గురై మృతి చెందాడు. దీంతో ఒకేసారి దంపతులిద్దరు మృత్యువాత పడడంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
ధర్మసాగర్ వరంగల్ జిల్లాలో కొనసాగుతుంది
స్పష్టం చేసిన ఎమ్మెల్యే రాజయ్య ధర్మసాగర్ : ధర్మసాగర్ మండలం యథావిధిగా వరంగల్ జిల్లాలోనే కొనసాగుతుందని ఎమ్మెల్యే రాజయ్య స్పష్టం చేశారు. వరంగల్ జిల్లాలోనే కొనసాగించాలని బుధవారం ధర్మసాగర్ మండలానికి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు కీర్తి వెంకటేశ్వర్లు, పీఏసీఎస్ చైర్మన్ వీరన్న, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు ఎమ్మెల్యే రాజయ్యను హన్మకొండలోని ఆయన నివాసంలో కలిసి కోరారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ జనగామ జిల్లా ఏర్పాటు ను మాత్రమే సమర్థించినట్లు తెలిపారు. లింగాలఘన్పూర్, రఘునాథ్‌పల్లి మండలాల ప్రజల అభిప్రాయాలను గౌరవించి జనగామ జిల్లాలో కలపాలని కోరినట్లు పేర్కొన్నారు. మంత్రివర్గ ఉపసంఘానికి తాను ఇచ్చిన లేఖలో విషయా న్ని వక్రీకరించొద్దన్నారు. ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్ మండలాలు వరంగల్ జిల్లాలోనే కొనసాగుతాయని చెప్పారు. అనంతరం మండల ప్రజాప్రతినిధులు, నాయకులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుండ్రెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు చాడ నర్సింహారెడ్డి, కాంగ్రెస్ నాయకులు గుర్రపు ప్రసాద్, బీజేపీ నాయకుడు కొలిపాక రమేష్, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
పసిపాప నోట్లో కిరోసిన్ పోసిన నాయనమ్మ
వరంగల్: సమాజం ఎంత ముందుకు వెళ్లిన ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతోంది. ఆధునిక యుగంలోనూ ఆడపిల్లలకు అనాదరణే ఎదురవుతోంది. మూర్కత్వంతో పసిపాపల ప్రాణాలు తీసుసేందుకు కూడా వెనుకాడడం లేదు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల అనుబంధ గ్రామం బుగ్గతండాలో దారుణం జరిగి 24 గంటలు గడవకముందే వరంగల్ జిల్లాలో మరో ఘటన వెలుగు చూసింది. రెండో కాన్పులోనూ తనకు మనవరాలే పుట్టిందన్న అక్కసుతో ఓ నాయనమ్మ పసిపాప ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించింది. నెలన్నర వయసున్న పాప నోట్లో కిరోసిన్ పోసి హత్యాయత్నం చేసింది. ధర్మసాగర్ మండలం కమ్మరిపేట శివారు చింతల్ తండాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. పాప పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇలాంటి ఘటనే సోమవారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల అనుబంధ గ్రామం బుగ్గతండాలో జరిగింది. రెండోమారూ ఆడపిల్ల పుట్టిందనే కోపంతో పసిపాపకు సబ్బునీళ్లు తాగించి చంపాలని తల్లిదండ్రులు ప్రయత్నించారు. అదృష్టవశాత్తు పాప ప్రాణాలతో బయటపడింది.