dichpalli police station
-
కల్లు తాగి మత్తులో ఉంటాడు.. తిట్టారో... చచ్చారే...
డిచ్పల్లి: కల్లు తాగిన మత్తులో ఉండగా ఎవరైనా అతడిని బూతులు తిడితే మృగంలా మారిపోతాడు. తనను తిట్టిన వారిని హత్య చేస్తాడు. ఇలా మూడు హత్యలకు పాల్పడిన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ షారూఖ్ (25)ను డిచ్పల్లి పోలీసులు పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. నిజామాబాద్ సీపీ కార్తికేయ తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 5న డిచ్పల్లి మండలం ఘన్పూర్ శివారులోని శ్మశాన వాటిక ప్రహరీ పక్కన చెట్ల పొదల్లో మిట్టాపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు సుంకెట నర్సవ్వ (60) మృతదేహం లభించింది. హత్యాస్థలంలో ఆధారాల మేరకు నిందితుడు షారూఖ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నర్సవ్వ హత్యకు ముందు మరో రెండు హత్యలు కూడా చేసినట్లు తెలిపాడు. ఈనెల 5న నర్సవ్వతో కలసి శ్మశాన వాటిక వద్ద కల్లు తాగుతుండగా ఆమె తిట్టిందని, దీంతో కోపమొచ్చి ఆమెను కల్లు సీసాతో కడుపులో పొడిచి చంపానన్నాడు. ఏడాదిన్నర క్రితం డిచ్పల్లి రైల్వేస్టేషన్ వద్ద మిట్టాపల్లి గ్రామానికి చెందిన సల్మాన్ ఖాన్ అనే వ్యక్తి తిట్టినందుకు తలపై బండరాయితో కొట్టి చంపానని, ఫిబ్రవరిలో డిచ్పల్లి రైల్వే స్టేషన్ సమీపంలో షేక్ మోసిన్‌తో కల్లు తాగుతుండగా జరిగిన గొడవలో అతన్ని గ్రానైట్ రాయితో తలపై మోది హత్య చేశానన్నాడు. మూడు హత్యలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న షారూఖ్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. -
భర్తను చంపిన భార్య
సాక్షి, ఇందల్వాయి: భార్య తన భర్తను హత్య చేసిన ఘటన ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లెలో జరిగింది. స్థానిక డిచ్పల్లి సీఐ జి.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నాయిడి గంగారాం(53) నాయిడి సాయవ్వ దంపతులు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి వివాహాలు చేసి తమకున్న ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. పిల్లల పెళ్లీళ్ల నిమిత్తం దుబాయ్ వెళ్లిన గంగారాం నాలుగు నెలల క్రితమే తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో గంగారాం మద్యం తాగినప్పుడల్లా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఆదివారం రాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరిగిందని స్థానికులు తెలిపారు. తెల్లవారేసరికి గంగారాం మృతదేహం ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉందని స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. తన భర్తను తానే చంపినట్లు సాయవ్వ ఒప్పుకున్నా.. లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతుడి సొదరి గంగవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. -
బైక్‌పై కోతుల దాడి: యువతి మృతి
డిచ్పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని చంద్రాయన్పల్లి అటవీ ప్రాంతంలో 44వ నెంబరు జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం ఓ బైకుపై కోతులు చేసిన ఘటనలో ఓ యువతి మృతి చెందింది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఏఎస్ఐ నారాయణ కథనం ప్రకారం దోమకొండ మండల కేంద్రానికి చెందిన బొమ్మసాని చంద్రశేఖర్ తన సోదరి రమాదేవితో కలిసి ఓ శుభకార్యానికి హాజరైందుకు పల్సర్ బైక్‌పై సికింద్రాపూర్‌కు బయలు దేరారు. వీరు డిచ్పల్లి మండలం చంద్రాయన్పల్లి అటవీ శివారు ప్రాంతానికి చేరుకునేటప్పటికి ఓ కోతుల గుంపు రోడ్డు దాటుతోంది. బైకుపై ఎర్ర రంగులో ఉన్న బ్యాగును చూసి ఒక కోతి దానిపై దూకింది. దీంతో వేగంగా ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి కిందపడింది. వెనుక కూర్చున్న రమాదేవి తలకు తీవ్రగాయాలు కాగా, చంద్రశేఖర్ కుడి చేయి విరిగింది. వీరిని 108 అంబులెన్స్‌లో కామారెడ్డికి తరలిస్తుండగా రమాదేవి మార్గమధ్యలో మృతి చెందింది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
డిచ్పల్లి, న్యూస్‌లైన్: డిచ్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ధర్మారం(బి) గ్రామశివారులోని నిజాంసాగర్ కాలువ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ మండలం న్యాల్‌కల్‌క చెందిన మెట్టు శ్యాం(42), రైతు ఒడ్డెన్న (55) ఇద్దరు బైక్‌పై డిచ్పల్లి నుంచి నిజామాబాద్ వైపు వెళుతున్నారు. నిజామాబాద్ వైపు నుంచి డిచ్పల్లి వైపు వస్తున్న లారీ ధర్మారం(బి) శివారులో ఎదురుగా వేగంగా వచ్చి వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్యాం ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడ్డ ఒడ్డెన్నను 108లో జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతిచెందాడు. మృతుడు శ్యాంకు భార్య ఇంద్ర, ఇద్దరు కుమారులు,కూతురు ఉన్నారు. ఒడ్డెన్నకు భార్య పద్మ, కుమారుడు ఉన్నారు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. బైక్‌ను ఢీకొని లారీ రోడ్డు కిందకు దిగిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడని ఆయన తెలిపారు. న్యాల్కల్ గ్రామ సర్పంచ్ భర్తభూపతిరావు, సింగిల్ విండో చైర్మన్ గంగాప్రసాద్ జిల్లా ఆస్పత్రి వద్ద మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు.