dictators
-
ఆదిమ ఖండంలో... నియంత పాలనలు
సైనిక తిరుగుబాట్లతో ఆఫ్రికా ఖండం అతలాకుతలం అవుతోంది. కొన్నేళ్లుగా ఇక దేశం తర్వాత ఒక దేశంలో ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసి సైనిక నియంతలు అధికారం చేజిక్కించుకుంటున్నారు. బుర్కినా ఫాసో మొదలుకుని తాజాగా గబాన్ దాకా ఈ జాబితా నానాటికీ పెరుగుతూనే పోతోంది. ఆ సైనిక కుట్రల పట్ల ఆయ దేశాల్లో పెద్దగా వ్యతిరేకత కూడా వ్యక్తం కాకపోవడం విశేషం. పైగా యువ ఆఫ్రికన్లు ఈ పరిణామాన్ని రెండు చేతులా స్వాగతిస్తుండటం విస్మయకర వాస్తవం... ► పశ్చిమ ఆఫ్రికాలోని నైగర్‌లో సైనిక తిరుగుబాటు జరిగి నెలన్నర కూడా కాలేదు. అప్పుడే ఆదిమ ఖండంలో మరో కుట్ర. మధ్య ఆఫ్రికా దేశం గాబాన్లో గత ఆదివారమే ఎన్నికలు జరిగాయి. బుధవారం ఉదయమే ఫలితాలు వెలువడ్డాయి. 2009 నుంచీ దేశాన్ని పాలిస్తూ వస్తున్న అధ్యక్షుడు అలీ బొంగో ఒండింబా మరోసారి తన అధికారాన్ని నిలుపుకున్నారు. ఆయన పార్టీ ఘన విజయం సాధించినట్టు టీవీల్లో అధికారిక ప్రకటన వెలువడింది. దాంతో ఆయన అభిమానులు పండుగ చేసుకున్నారు. కానీ నిమిషాల్లోనే పరిస్థితి పూర్తిగా తిరగబడింది. ఈసారి సైనికాధికారులు టీవీ తెరపైకి వచ్చారు. బొంగోను అదుపులోకి తీసుకుని ఆయన అధికారిక నివాసంలోనే ఖైదు చేసినట్టు, పాలనా పగ్గాలు తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అలా మరో ఆఫ్రికా ఖండంలో ప్రజాస్వామ్యం మరోసారి పరిహాసానికి గురైంది. మరో దేశం సైనిక కుట్రను చవిచూసింది. వరుస సైనిక కుట్రలు ఆఫ్రికాలో, ముఖ్యంగా పశ్చిమ, సెంట్రల్ ఆఫ్రికాలో కొన్నేళ్లుగా సైనిక కుట్రలు పరిపాటిగా మారాయి. ► గత జూలై 26న నైగర్ అధ్యక్షుడు మొహమ్మద్ బజొమ్ను ఆయన సొంత ప్రెసిడెన్షియల్ బాడీ గార్డులే నిర్బంధంలోకి తీసుకున్నారు. ► 2022 జనవరిలో బుర్కినా ఫాసో అధ్యక్షుడు రోచ్ మార్క్ క్రిస్టియన్ కబోరేనుఆ దేశ సైన్యాధ్యక్షుడే బందీని చేసి అధికారం చేజిక్కించుకున్నాడు. అయితే 8 నెలల్లోనే కింది స్థాయి సైనికాధికారులు అతన్ని కూడా జైలుపాలు చేసి అధికారాన్ని పంచుకున్నారు! ► 2012 సెపె్టంబర్లో గినియాలో అధ్యక్షుడు ఆల్ఫా కొండేను ప్రత్యేక సైనిక బృందాలు ఖైదు చేసి పాలనా పగ్గాలను తమ చేతుల్లోకి తీసుకున్నాయి. ► 2021 మేలో మాలిలో కల్నల్ అసిమి గొయిటా కూడా సైనిక కుట్రకు పాల్పడ్డాడు. అంతకుముందు కూడా ఇలా ప్రభుత్వాన్ని పడదోసిన చరిత్ర అతనిది. ► 2021 ఏప్రిల్‌లో చాద్ రిపబ్లిక్లో కూడా అధ్యక్షుడు ఇద్రిస్ దెబీ ఇట్నో మృతి కారణంగా అనిశ్చితి ఏర్పడటంతో సైన్యం జోక్యం చేసుకుంది. అయితే, ఆయన కుమారుడే అధికార పగ్గాలు చేపట్టేలా చక్రం తిప్పి రంగం నుంచి తప్పుకుంది. పాలనపై తమ ఆధిపత్యాన్ని మాత్రం నిరి్నరోధంగా కొనసాగిస్తూనే ఉంది! ఆఫ్రికాలోనే ఎందుకిలా? కేవలం గత మూడేళ్లలో ఆఫ్రికాలో కనీసం 5 దేశాల్లో సైనిక కుట్రలు జరిగా యి. ఇందుకు పలు కారణాలు కనిపిస్థాయి కూడా... ► సంప్రదాయ పాలక వర్గపు మితిమీరిన అవినీతి, ఆశ్రిత పక్షపాతం తదితర పోకడలతో ఆఫ్రికా యువత తీవ్రంగా విసిగిపోయింది. ► అదే సమయంలో ఇటు జనాదరణలోనూ, అటు ఆర్థికంగా కూడా ఆయా ప్రభుత్వాలు బలహీనపడుతూ వచ్చాయి. ఈ పరిస్థితిని సైనిక పెద్దలు అవకాశంగా మలచుకున్నారు ► ప్రజల్లో, ముఖ్యంగా పట్టణ ప్రాంత యువతలో అధికార పారీ్టల పట్ల ఉన్న ఏహ్య భావాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ...అందుకే ఆఫ్రికా యువతలో అసంతృప్తి! ఆఫ్రికా యువతలో ప్రజాస్వామిక ప్రభుత్వాల పట్ల నెలకొన్న తీవ్ర అసంతృప్తికి కారణాలు లేకపోలేదు... ► ఉపాధి అవకాశాల లేమి ► పెచ్చరిల్లిన అవినీతి ► అధిక వర్గాల్లోనూ వారి మితిమీరిన ఆశ్రిత పక్షపాతం ► ఈ దేశాల్లో చాలావరకు మాజీ ఫ్రెంచి వలస రాజ్యాలే. దాంతో వాటిపై ఇప్పటికీ చాలా విషయాల్లో ఫ్రాన్స్ ప్రభావం కొనసాగుతోంది. ఇది కూడా యువతకు మింగుడు పడడం లేదు. ► ఎలాగైనా అధికారాన్ని నిలుపుకోవడానికి పాలక పార్టీలు చేస్తున్న అక్రమాలతో జనం మరింతగా విసిగిపోయారు. దశాబ్దాలుగా బొంగోల రాజ్యమే! గాబన్పై బొంగో కుటుంబం ఒకరకంగా అర్ధ శతాబ్దానికి పైగా గుత్తాధిపత్యం చెలాయించిందనే చెప్పాలి. ► అలీ బొంగో 14 ఏళ్లుగా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు! ఇది ఆయ నకు మూడో టర్ము. 2018లోనే స్ట్రోక్‌కు గురైనా అధికారాన్ని మాత్రం వీడలేదు. ► అయితే దేశాన్ని ఆధునీకరణ బాట పట్టించేందుకు ఆయన ప్రయత్నాలు చేయకపోలేదు. కానీ జనం ఆకాంక్షలను నెరవేర్చేందుకు అవి సరిపోలేదు. ► అలీ తండ్రి ఒమర్ బొంగో అయితే ఏకంగా 40 ఏళ్లకు పైగా నియంతలా దేశాన్ని పాలించారు! 2009లో ఆయన మరణానంతరం జరిగిన ఎన్నికల్లో అలీ తనను తాను విజేతగా ప్రకటించుకున్నారు. కానీ నిజానికి విపక్ష నేత ఆంద్రే ఎంబా ఒబామే నెగ్గారని చెబుతారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
రాహుల్ గాంధీ షాకింగ్ ట్వీట్: ట్విటర్ దుమారం
సాక్షి, న్యూఢిల్లీ : కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేదాకా, తమ ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే లేదని ఒకవైపు రైతు సంఘ నేతలు తెగేసి చెప్పారు. మరోవైపు రైతుల నిరసనలకు ప్రధాన కేంద్రమైన సింగూతో పాటు, ఖాజీపూర్ సరిహద్దు, తిక్రీ సరిహద్దు వద్ద అసాధారణ భద్రతను విధించడం చర్చకు దారి తీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీసర్కార్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ టార్గెట్‌గా ఆయన చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరలవుతోంది. ఇది బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ట్విటర్ వార్కి దారి తీసింది. దాదాపు 8వేల మంది రాహుల్ తాజా ట్వీట్‌ను రీట్వీట్ చేయగా, 34వేలకు పైగా లైకులు వచ్చాయి. ప్రపంచ నియంతల పేర్లన్నీ ‘ఎం’ తోనే ప్రారంభం అవుతాయంటూ ట్వీట్ చేసి రాహుల్ దుమారాన్ని రేపారు. ఆయా నేతల పేర్లన్నీ 'ఎం' అనే ఆంగ్ల అక్షరంతోనే ఎందుకు మొదలవుతాయంటూ బుధవారం ట్వీట్ చేశారు. మార్కోస్ ముస్సోలినీ, మిలోసెవిక్, ముబారక్, మొబుటు, ముషారఫ్, మికోంబెరో పేర్లను రాహుల్ ఉదహరించారు. కాంగ్రెస్ నేత మోతీలాల్ నెహ్రూ, మాజీ ప్రధాని మన్మోహన్ పేర్లు కూడా 'ఎం' తోనే మొదలవుతాయి కదా అంటూ కొంతమంది ప్రతి విమర్శ చేశారు. అలాగే మమతా బెనర్జీ, మాయావతి పేర్లను ప్రస్తావిస్తూ మరొకరు రాహుల్‌కి కౌంటర్ వేశారు. అసలు ప్రధాని నరేంద్రమోదీ పేరు ‘ఎన్’ తో కదా స్టార్ట్ అయ్యేదంటూ మరికొందరు రాహుల్‌పై విరుచుకు పడుతున్నారు. కాగా రైతు ఆందోళన నేపథ్యంలో వారికి మద్దతు పలుకుతున్న ట్విటర్ ఖాతాలను బ్లాక్ చేసిన అంశంతోపాటు, పోలీసులు ఏర్పాటు చేసిన మేకులు, బారికేడ్లకు సంబంధించి కూడా కేంద్రంపై రాహుల్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. Why do so many dictators have names that begin with M ? Marcos Mussolini Milošević Mubarak Mobutu Musharraf Micombero — Rahul Gandhi (@RahulGandhi) February 3, 2021 -
నియంతలకు గుణపాఠం
దేశదేశాల నియంతలనూ భయపెట్టే పరిణామాలు ప్రపంచంలో చాలా అరుదుగా సంభవిస్తాయి. ఉద్యమ పుత్రికగా, మయన్మార్ స్వేచ్ఛా ప్రతీకగా అందరి మన్ననలూ అందుకుంటున్న ఆంగ్‌సాన్ సూచీ ఆ దేశ పార్లమెంటు ఎన్నికల్లో సాధించిన ఘన విజయం అలాంటి అరుదైన సందర్భమే. ఆమె నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ(ఎన్ఎల్డీ) ఈ నెల 8న జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. అయిదురోజులుగా సాగుతున్న ఓట్ల లెక్కింపులో 440 స్థానాలున్న దిగువ సభలో శుక్రవారంనాటికి ఆమె పార్టీ 238 స్థానాలను గెల్చుకుందని...224 సభ్యులుండే ఎగువసభలో ఇంతవరకూ ఆ పార్టీకి 110 లభించాయని యూనియన్ ఎన్నికల కమిషన్(యూఈసీ) ప్రకటించింది. మొత్తంగా అక్కడి పార్లమెంటులో ఎన్ఎల్డీకి ఇంతవరకూ 348 స్థానాలు వచ్చాయి. అంతేకాదు...అక్కడున్న ఏడు రాష్ట్రాల్లోనూ, ఏడు ప్రాంతీయ సభల్లోనూ, ఆరు స్వయంపాలిత జోన్లలోనూ, ఒక స్వయంపాలిత డివిజన్‌లోనూ ఆ పార్టీదే ఆధిక్యం. వీటిలో ఇంతవరకూ 522 స్థానాల ఫలితాలు ప్రకటించగా 401 స్థానాలు ఎన్ఎల్డీ గెల్చుకుంది. సైన్యం ప్రాపకంతో ఏర్పడిన యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ(యూఎస్డీపీ) ఘోర పరాజయాన్ని చవిచూస్తోంది. పార్లమెంటు మొదలుకొని కింది స్థాయి చట్టసభల వరకూ 75 శాతం స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. మిగిలిన 25 శాతం స్థానాల్లో సైన్యం నామినేట్ చేసినవారే సభ్యులవుతారు. ఆ స్థానాలకు ఎన్నికలుండవు. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించి ఇంచుమించు మనతోపాటే స్వాతంత్య్రాన్ని సాధించుకున్న మయన్మార్(అప్పటి పేరు బర్మా) దురదృష్టవశాత్తూ స్వల్పకాలంలోనే సైనిక శాసనంలోకి వెళ్లిపోయింది. అక్రమ నిర్బంధాలు, దారుణ చిత్రహింసలు నిత్యకృత్యమైనా... అడుగడుగునా నిఘాతో ఇబ్బందులపాలు చేసినా మయన్మార్ ప్రజల్లోని స్వేచ్ఛా పిపాసను సైనిక నియంతలు చల్లార్చలేకపోయారు. బ్రిటిష్ జాతీయుణ్ణి పెళ్లాడి బ్రిటన్‌లో స్థిరపడిన సూచీ... అస్వస్థురాలైన తల్లిని చూసేందుకు 1988లో మయన్మార్ వెళ్లినప్పుడు సామాన్య పౌరుల్లో పెల్లుబుకుతున్న ఈ ఆగ్రహజ్వాలలను పసిగట్టారు. వారికి నాయకత్వంవహించి తీరాలని సంకల్పించారు. ఆమె నేతృత్వంలో సాగిన మహోద్యమానికి తలొగ్గి రెండేళ్ల తర్వాత...అంటే 1990లో సైనిక పాలకులు ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో ఎన్ఎల్డీ అపూర్వమైన విజయం సాధించింది. ఊహించని ఈ ఫలితాలతో ఖంగుతిన్న సైనిక పాలకులు ఎన్నికలను రద్దు చేసి సూచీని బంధించారు. అయిదేళ్ల జైలు జీవితం, పదిహేనేళ్ల గృహ నిర్బంధం ఆమెలోని పోరాట స్ఫూర్తిని దెబ్బతీయలేకపోయాయి. అంతర్జాతీయంగా ఏకాకిగా మారడం, నానాటికీ క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడానికి ఇతర దేశాల సహకారం తప్పనిసరికావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సైనిక నియంతలు అయిదేళ్లక్రితం ఆమెను విడుదల చేశారు. ఎన్నికలు నిర్వహిస్తామని కూడా వాగ్దానం చేశారు. అయితే దీన్నెవరూ నమ్మలేదు. 2010లో ఒకసారి ‘పోటీ’లేని ఎన్నికలు జరిపించి 80 శాతం ఓట్లు తెచ్చుకున్నామని ప్రకటించిన చరిత్రగల సైన్యంపై ఎవరికీ నమ్మకం కుదరలేదు. సైనిక పాలకులు తెలివితక్కువగా ఏమీ లేరు. సూచీ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించకుండా...తమకున్న అధికారాలు చెక్కుచెదరకుండా రాజ్యాంగంలో అన్ని ఏర్పాట్లూ చేసుకునే ఈ ఎన్నికలకు సిద్ధపడ్డారు. విదేశీయుల్ని పెళ్లాడినా, విదేశాల్లో పుట్టిన పిల్లలున్నా అలాంటివారు అధ్యక్ష పీఠానికి అనర్హులవుతారంటూ అందులో నిబంధన పెట్టారు. అలాగే అన్ని చట్టసభల్లోనూ 25 శాతం సీట్లు దఖలుపరుచుకున్నారు. రాజ్యాంగ సవరణకు పూనుకుంటే వీటో చేసే అధికారాన్ని కూడా అట్టేబెట్టుకున్నారు. మయన్మార్‌లో నాలుగు నెలల తర్వాతగానీ కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశం లేదు. ఈలోగా సైనిక పాలకులు మరెన్ని కుట్రలు రచిస్తారో తెలియదుగానీ...ఇప్పటికైతే ప్రజాతీర్పును గౌరవిస్తున్నట్టు ప్రకటించారు. అయితే వచ్చే మార్చిలో తప్ప ఎన్ఎల్డీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి అవకాశం లేదు. అధ్యక్ష పీఠానికి సూచీ ఎవరి పేరును ప్రతిపాదిస్తారో, కొత్త ప్రభుత్వానికి ఎలాంటి ఎజెండాను నిర్దేశిస్తారో అప్పటికిగానీ తేలదు. అయితే ఆమె పార్టీ ప్రభుత్వం చాలా సమస్యలనే ఎదుర్కొనవలసి ఉంటుంది. ముఖ్యంగా దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా బతుకీడుస్తున్న రోహింగ్యా ముస్లింల సమస్యకు సూచీ ఏం పరిష్కారం వెదుకుతారో, వారికి మెరుగైన భవిష్యత్తును అందించడానికి ఎలాంటి కార్యక్రమాన్ని ప్రకటిస్తారోనని ప్రపంచమంతా ఎదురుచూస్తున్నది. రోహింగ్యాల్లో అత్యధికులు ముస్లింలు. గుర్తింపు పొందిన జాతుల్లో లేరన్న నెపంతో రోహింగ్యాలకు ఓటు హక్కును రద్దు చేయడంతోపాటు ఇతర ముస్లింలను సైతం అనేకవిధాల వేధించారు. వీటిపై సూచీ మాట్లాడలేదు సరిగదా...తమ పార్టీ తరఫున ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా ఎంపిక చేయలేదు. అలా చేస్తే బౌద్ధ తీవ్రవాదుల ఆగ్రహాన్ని చవిచూడాల్సివస్తుందని, పర్యవసానంగా తమకు అధికారం చేజారవచ్చునని ఆమె భావించారు. ఈ ఎన్నికల ద్వారా మయన్మార్ ప్రజలు తిరుగులేని తీర్పునిచ్చారు. జనాభిప్రాయాన్ని గౌరవించి ప్రస్తుత అధ్యక్షుడు థీన్ సీన్, ఆర్మీ చీఫ్ ఆంగ్ హ్లెయింగ్ ఎటూ ఆమె పార్టీకి అధికారాన్ని బదలాయిస్తారు. అయితే సూచీ అధ్యక్ష పీఠం ఎక్కకుండా నిరోధిస్తున్న రాజ్యాంగ నిబంధనను సవరించడానికి వారు ముందుకు రావాలి. కొత్త ప్రభుత్వానికి ఆటంకాలు కల్పించే కుట్ర బుద్ధులను వదులుకోవాలి. సూచీ సైతం మైనారిటీ జాతులు గౌరవప్రదంగా, నిర్భయంగా జీవించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. అప్పుడే మయన్మార్ నిజమైన ప్రజాస్వామ్య దేశంగా వర్థిల్లుతుంది!