సునందా పుష్కర్ది ఆత్మహత్య కాదా?
సునంద పుష్కర్ మృతి కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. కేంద్ర మంత్రి శశిథరూర్ మూడో భార్య సునందా పుష్కర్ది ఆత్మహత్య కాదా? ఆమె ఏ కారణం వల్ల మరణించారు? పోస్టుమార్టం చేసిన వైద్యులు చెప్పే విషయాలను చూస్తే ఈ విషయంలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించిన సునందా పుష్కర్ మృతదేహానికి ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో శనివారం మధ్యాహ్నం పోస్టుమార్టం పూర్తయింది.
ఆమె విషం తీసుకోలేదని పోస్టుమార్టం చేసిన వైద్య నిపుణులు నిర్ధారించారు. అలాగే, ఆమె శరీరంపై ఉన్న గాయాల కారణంగానే మరణించారని కూడా చెప్పలేమని అన్నారు. రెండు మూడు రోజుల తర్వాత మాత్రమే ఆమె మృతికి గల కారణాలపై ఓ అంచనాకు రాగలమని తెలిపారు. పోస్టుమార్టం ప్రక్రియ మొత్తాన్ని పారదర్శకత కోసం వీడియో తీశారు.
కాగా సునదా పుష్కర్ శరీరంపై కొన్ని గాయాలున్నాయని, అవి కొంత అనుమానాన్ని కలిగిస్తున్నాయని ఎయిమ్స్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ హెడ్ సుధీర్ గుప్తా తెలిపారు. పూర్తి స్థాయిలో విశ్లేషించిన తర్వాతే అన్ని వివరాలు వెల్లడిస్తామని ఆయన చెప్పారు.