DIET colleges
-
ఎక్సలెన్స్ సెంటర్లుగా డైట్ కళాశాలలు
సాక్షి, అమరావతి: ప్రపంచ అవకాశాలను అందుకునేలా.. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన చేసే ఉపాధ్యాయులకు ఈ దిశగా శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో తొలివిడతగా మూడు జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్)లను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ఎంపిక చేసింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 125 డైట్ కళాశాలలను మోడల్ డైట్స్ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్)గా ఎంపిక చేయగా.. వాటిలో రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు జిల్లాలకు చెందిన మూడు డైట్ కళాశాలలకు అవకాశం దక్కింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు, శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయ విద్యార్థులను నూతన విద్యా విధానానికి అనువుగా శిక్షణ ఇచ్చేందుకు వీటిని తీర్చిదిద్దనున్నారు. ఈ మూడు సెంటర్ల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.24 కోట్లను మంజూరు చేసింది. రాష్ట్రంలో మొత్తం 13 డైట్ కాలేజీలు ఉండగా.. మూడు కేంద్రాలకు మోడల్ డైట్ గుర్తింపు లభించింది. మిగిలిన డైట్ కేంద్రాలను 2028 నాటికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దనున్నారు. ఎన్ఈపీకి అనుగుణంగా మార్పు జాతీయ విద్యావిధానం–2020 (ఎన్ఈపీ) ప్రకారం డైట్ కళాశాలల్లో శిక్షణ పొందే ఉపాధ్యాయ విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు ఇన్ సర్వీస్, ఇండక్షన్ శిక్షణ ఇవ్వనున్నారు. దీంతోపాటు విద్యార్థులకు, ఉపా«ద్యాయులకు విద్యా సంబంధ పరిశోధన చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తారు. వృత్తి విద్యా కోర్సులో భాగంగా పారిశ్రామిక భాగస్వాములతో సమన్వయం చేసుకుంటూ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరచడం కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అందుకు అవసరమైన సదుపాయాలను మోడల్ డైట్స్‌లో కల్పిస్తారు. ఎక్సలెన్స్ సెంటర్లుగా ఎంపికైన డైట్స్‌లో పూర్తి మౌలిక సదుపాయాలు, స్మార్ట్ తరగతి గదులు, ఐసీటీ ల్యాబ్ (కంప్యూటర్ ల్యాబ్స్), ప్రయోగశాలలు, భద్రత కోసం సీసీ కెమెరాలు, ప్రహరీ, ప్రథమ చికిత్స కిట్స్, స్టాఫ్ క్వార్టర్స్ (సిబ్బందికి వసతి), ఫర్నిచర్, కిచెన్ గార్డెన్, సోలార్ ప్యానల్స్, క్రీడా సౌకర్యాలు, విద్యార్థులకు వసతి గృహాలు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలతో తీర్చిదిద్దుతారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో 13 డైట్ సెంటర్లు ఉన్నాయని, వాటిలో ఈ ఏడాది మూడు సెంటర్లను కేంద్ర ప్రభుత్వం మోడల్ డైట్స్గా ఎంపిక చేసి 24 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని సమగ్రశిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు తెలిపారు. త్వరలో వీటిలో అన్ని సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. మిగిలిన 10 డైట్ కళాశాలలను 2028 సంవత్సరం నాటికి ఎక్సలెన్స్ సెంటర్లుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నట్టు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. -
ఫ్యాకల్టీ లేని ‘డైట్’ కళాశాల
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: భవిష్యత్తు ఉపాధ్యాయులను తయారు చేసేందుకు రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల్లో అనేక ఏళ్ల నుంచి కొనసాగుతున్న ‘డైట్’(ప్రభుత్వ జిల్లా విద్యా, శిక్షణ సంస్థ) కళాశాలలు అధ్యాపకులు లేకుండానే కొనసాగుతున్నాయి. పది ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో 1989 నుంచి ఏటా వందల మంది విద్యార్థులు తాము సాధించిన ర్యాంకుల ద్వారా డీఎడ్ కోర్సుల్లో చేరుతున్నారు. నల్లగొండ, ఖమ్మం కళాశాలల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు ఉండగా, మిగిలిన వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, వికారాబాద్ కళాశాలల్లో తెలుగు, ఆంగ్లంతో పాటు ఉర్దూ మాధ్యమం కూడా ఉంది. అయితే ఇవి గత మూడేళ్లుగా అధ్యాపకులు లేకుండానే నడుస్తున్నాయి. పది చోట్ల 290 మంది టీచింగ్ స్టాఫ్ ఉండాల్సి ఉంది. అయితే మొత్తం రాష్ట్రంలోని 10 కళాశాలల్లో కలిపి 300 మందికి గాను కేవలం 17 మంది మాత్రమే ఉన్నారు. ఉర్దూ మీడియం లేని ఖమ్మం, నల్లగొండ కళాశాలల్లో 24 మంది అధ్యాపకులు, మిగిలిన 8 కళాశాలల్లో 29 మంది చొప్పున అధ్యాపకులు ఉండాలి. అయితే ఎక్కడా కూడా సరిపడా అధ్యాపకులు లేకపోగా, ఉన్న అధ్యాపకులు, ప్రిన్సిపపాళ్లు వివిధ జిల్లాలకు ఇన్చార్జి జిల్లా విద్యాశాఖ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. దీంతో నామమాత్రంగా ఉన్న అధ్యాపకులు సైతం అందుబాటులో లేని దుస్థితి నెలకొంది. దీనివల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని విమర్శలు వస్తున్నాయి. అంతా అస్తవ్యస్తం.. నిజామాబాద్ డైట్ కళాశాలలో రెగ్యులర్ ప్రిన్సిపల్ ఉండగా, ఒకే ఒక్క అధ్యాపకుడు ఉన్నారు. ఆ అధ్యాపకుడు కూడా ఆసిఫాబాద్ డీఈవోగా వ్యవహరిస్తున్నారు. మెదక్ కళాశాలలో రెగ్యులర్ ప్రిన్సిపల్, ఒకే ఒక్క అధ్యాపకుడు ఉన్నారు. వరంగల్ కళాశాలలో అధ్యాపకులు ఎవరూ లేరు. కళాశాల ప్రిన్సిపల్ యాదాద్రి భువనగిరి డీఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ కళాశాలలో అధ్యాపకులు లేరు. రెగ్యులర్ ప్రిన్సిపల్ ఉన్నారు. వికారాబాద్ కళాశాలలో ఇద్దరు అధ్యాపకులు ఉండగా, ప్రిన్సిపల్ లేరు. నల్లగొండ కళాశాలలో ఒకే ఒక్క అధ్యాపకుడు ఉండగా, ప్రిన్సిపల్ లేరు. కరీంనగర్ కళాశాలలో ప్రిన్సిపల్ లేకపోగా, ఉన్న ముగ్గురు అధ్యాపకుల్లో ఒకరు జగిత్యాల డీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఆదిలాబాద్ కళాశాలలో ప్రిన్సిపల్ లేకపోగా ఇద్దరు అధ్యాపకులు ఉన్నారు. వీరిలో ఒకరు నిర్మల్ డీఈవోగా ఉన్నారు. ఖమ్మం కళాశాలలో ఇద్దరు అధ్యాపకులు ఉండగా, ఒకరు భద్రాద్రి కొత్తగూడెం డీఈవోగా వ్యవహరిస్తున్నారు. మహబూబ్‌నగర్ కళాశాలలో నలుగురు అధ్యాపకులు ఉండగా, అందులో ముగ్గురు వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలకు డీఈవోలుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయా కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీలు, రిటైర్డ్ లెక్చరర్లతో పాఠాలు బోధిస్తున్నప్పటికీ.. అంతంతమాత్రమేనని విమర్శలు ఉన్నాయి. నిజామాబాద్ కళాశాలలో పూర్వ విద్యార్థులతో తరగతులు చెప్పిస్తున్నారు చదవండి: అమృతోత్సాహం.. 76వ స్వాతంత్య్ర దినోత్సవాలకు దేశం సిద్ధం -
విద్యార్థులకు అన్యాయం జరగరాదు
సాక్షి, అమరావతి: డైట్‌సెట్ రాయకుండా డైట్ కళాశాలల్లో అడ్మిషన్ తీసుకుని విద్యనభ్యసించిన విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. డైట్‌సెట్ ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించని విద్యార్థులు, అసలు పరీక్షకే హాజరు కాని విద్యార్థులను సైతం ప్రైవేటు డైట్ కళాశాలల యాజమాన్యాలు చేర్పించుకున్నాయి. అలా చేరిన వేలాది మంది విద్యార్థులను ప్రస్తుతం కోర్సు పూర్తయ్యాక పరీక్షలకు అనుమతించని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఇదే అంశం గురువారం మంత్రివర్గ సమావేశంలో అధికారిక అజెండా ముగిశాక మంత్రుల మధ్య చర్చకు వచ్చింది. ముఖ్యమంత్రి వద్ద ఓ మంత్రి ఈ విషయం ప్రస్తావించగా యాజమాన్యాలు చేసిన పనికి విద్యార్థులను శిక్షించరాదని జగన్ అభిప్రాయపడినట్లు సమాచారం. అక్రమంగా విద్యార్థులను చేర్చుకున్న యాజమాన్యాలపై నిఘా పెట్టి వారిపై చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో విద్యార్థులకు నష్టం జరక్కుండా ఈ ఏడాదికి చూడాలని ముఖ్యమంత్రి అన్నారని తెలిసింది. నిబంధనలను ఉల్లంఘించి యాజమాన్యం కోటాలో అర్హత లేని విద్యార్థులను చేర్చుకున్న కళాశాలల అనుమతి రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన అన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నవంబర్ 24 తర్వాత అసెంబ్లీ? అసెంబ్లీ సమావేశాలను నిర్వహించే తేదీల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిసింది. రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు గత జూన్‌లో జరిగాయి. ఆరు నెలలలోపు అంటే ఈ ఏడాది డిసెంబర్ 14వ తేదీలోపు మళ్లీ సమావేశాలు నిబంధనల ప్రకారం జరగాల్సి ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని నవంబర్ 24వ తేదీ తర్వాత నిర్వహించే విషయం పరిశీలించాలని, ఆ మేరకు తేదీలను ఖరారు చేసే బాధ్యతను ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి అప్పగించినట్లు సమాచారం. రాష్ట్రంలో కోవిడ్–19 ముప్పు తీవ్ర స్థాయిలోనే ఉన్నందున, ఆ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని తేదీలను ఖరారు చేయాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలున్నట్లు చెబుతున్నారు. -
12న డైట్ కౌన్సెలింగ్ షెడ్యూల్?
జనవరి నుంచి తరగతులు సాక్షి, హైదరాబాద్: డైట్‌సెట్ ప్రవేశాల అంశం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. తెలంగాణలోని డైట్ కళాశాలలకు అగ్నిమాపక శాఖ జారీ చేసే నిరభ్యంతర (ఫైర్ సేఫ్టీ ఎన్వోసీ) పత్రాలు లేకపోయినా గుర్తింపును పొడిగించిన విషయం తెలిసిందే. దీంతో ఫైర్‌సేఫ్టీ పత్రాలు లేకపోతే కౌన్సెలింగ్ నిర్వహించలేమని డైట్ కన్వీనర్ పేర్కొన్నారు. అయితే ఆ కళాశాలల నుంచి కౌన్సెలింగ్ సమయంలో ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎన్వోసీలు స్వీకరించాలని తాజా నిర్ణయించారు. దీంతో కౌన్సెలింగ్‌కు మార్గం సుగమమైంది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యాశాఖలు తమ పరిధిలోని డైట్ కళాశాలల జాబితాలను సమర్పించడంతో.. కౌన్సెలింగ్ చేపట్టేందుకు డైట్‌సెట్ యం త్రాంగం కసరత్తు చేస్తోంది. తెలంగాణలోని 253, ఏపీలోని 413 డైట్ కళాశాలల్లో ఉమ్మడి ప్రవేశాల కోసం ఈ నెల 12వ తేదీన షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశాలున్నాయి. ఒకవేళ ఆలస్యమైతే 15 లేద 16వ తేదీన షెడ్యూల్ ప్రకటించాలని అధికారులు నిర్ణయించారు. షెడ్యూల్ వెలువడిన అనంతరం అందులో ప్రకటించిన తేదీ నుంచి విద్యార్థుల నుంచి ఆన్లైన్లో ఆప్షన్లు స్వీకరించి, ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయిన 15 రోజుల్లోగా కళాశాలల్లో తరగతులను ప్రారంభిస్తారు. మొత్తంగా వచ్చే ఏడాది జనవరి మొదటివారంలో తరగతులు ప్రారంభమవుతాయని డైట్ కన్వీనర్ సురేందర్‌రెడ్డి తెలిపారు.