రేపటి నుంచి హెల్మెట్ ధారణ తప్పనిసరి
విశాఖ రేంజి డీఐజీ రవిచంద్ర
చోడవరం: ఆగస్టు ఒకటో తేదీ నుంచి విశాఖ కార్పొరేషన్, అన్ని మున్సిపాలిటీలు, మేజర్ పంచాయతీల్లో వాహనచోదకులు విధిగా హెల్మెట్, సీట్ బెల్టు ధరించాలని విశాఖ రేంజి డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఎ.రవిచంద్ర పేర్కొన్నారు. చోడవరం పోలీసు సర్కిల్ కార్యాలయాన్ని గురువారం పరిశీలించారు. సర్కిల్ పరిధిలోని చోడవరం, బుచ్చెయ్యపేట, మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు మండలాల పోలీసు అధికారులతో నేరాలు, ఇతర అంశాలపై సమీక్షించారు. అనంతరం డీఐజీ విలేకరులతో మాట్లాడుతూ తన పరిధిలోని మూడు జిల్లాల్లో కొత్తగా పోలీసు స్టేషన్ల ఏర్పాటు ప్రతిపాదన లేదని, ఉన్న వాటిని బలోపేతానికి కృషిచేస్తున్నామన్నారు. సిబ్బంది కొరత ఉందని, వచ్చే సెప్టెంబరులో 68మంది ఎస్ఐలు, 25మంది ఆర్ఎస్ఐలు ట్రైనింగ్‌పూర్తిచేసుకొని కొత్తగా విధుల్లోకి రానున్నారన్నారు. వారిని అవసరమైన పోలీసు స్టేషన్లకు కేటాయిస్తామన్నారు.ప్రతి పోలీసు స్టేషన్లో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను నియమించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. యలమంచిలి సర్కిల్ పరిధి పెద్దదిగా ఉందని, దీనిని యలమంచిలి, నక్కపల్లిలా రెండుగా విభజించే ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపామని డీఐజీ చెప్పారు.
గిరిజనుల నాశనమే పోరాట సిద్ధాంతమా?
గిరిజనుల అభివృద్ధిని అడ్డుకోవడమే మావోయిస్టుల పోరాట సిద్ధాంతమా అని డీఐజీ ప్రశ్నించారు. గిరిజనులు పోలీసులకు ఇన్ఫార్మర్లు కాదని, మావోయిస్టులకు అన్ని విధాలా ఆశ్రయం ఇస్తున్నారన్నారు. గిరిజనులనే మావోయిస్టులు చిత్రహింసలకు గురిచేస్తూ కిడ్నాప్‌లు, కాల్చేయడాలు చేస్తున్నారన్నారు. అమాయక గిరిజనుల అభివృద్ధిని అడ్డుకోవడమే మావోయిస్టుల పోరాట లక్ష్యమా అని ప్రశ్నించారు. అభివృద్ధి పనుల కోసం వినియోగించే యంత్రాలను తగులబెట్టడం సరికాదన్నారు. ఇటీవల చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌కు ఏ ఇన్ఫార్మర్ సాయం లేదని, పోలీసుల సాధారణ కూబింగ్‌లో మావోయిస్టులు ఎదురైనప్పుడు జరిగిన కాల్పులు మాత్రమేనని ఆయన చెప్పారు. గంజాయి స్మగర్లతో పోలీసు అధికారులు కుమ్మక్కవుతున్నారనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. గంజాయి సాగును ప్రోత్సహిస్తున్నది మావోయిస్టులే అన్నారు. నిజంగా ఏజెన్సీలో గంజాయిని నిర్మూలించాలనే లక్ష్యం మావోయిస్టులకు ఉంటే వారి సమీపంలో ఉన్న తోటలను వారే ధ్వంసం చేయాలని డీఐజీ కోరారు. సమావేశంలో అనకాపల్లి డీఎస్పీ పురుషోత్తం,చోడవరం సీఐ కిరణ్‌కుమార్ ఉన్నారు.