Diggings
-
కొండలు కొల్లగొడుతున్నారు
సాక్షి, మందస(శ్రీకాకుళం) : మండలంలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రకృతి సంపద అయినటువంటి కొండలను తవ్వేస్తూ అక్రమంగా రాళ్లు, గ్రావెల్‌ను తరలిస్తున్నారు. వాస్తవానికి మండలంలోని అధికారికంగా ఎటువంటి క్వారీలు లేవు. కానీ ఇటీవల విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారానికి గ్రావెల్, మట్టి అవసరం కావడంతో అక్రమార్కులు బరి తెగిస్తున్నారు. అదును చూసి శివారుల్లో ఉన్న ప్రభుత్వ భూముల్లోని కొండలను నాశనం చేస్తున్నారు. అదే సమయంలో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి చెట్లను కూడా నరికివేసి కలపను కూడా తరలిస్తూ ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. మాముళ్ల మత్తులో అధికారులు..? ఇంత జరుగుతున్నా తమకేమీ పట్టనట్లు ఒక వైపు రెవెన్యూశాఖ, మరో వైపు పోలీసులు వ్యవహరిస్తున్నారు. అక్రమ గ్రావెల్ రవాణా తమ పరిధిలోకి రాదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అధికారులకు తెలిసే అక్రమంగా గ్రావెల్ రవాణా జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులకు కాంట్రాక్టర్లు, వ్యాపారులు మామూళ్లు ఇస్తుండడంతో నిమ్మకునీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ కారణంగానే కొన్నిసార్లు రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకుంటున్న వాహనాలను కూడా వదిలేస్తున్నారని అంటున్నారు. ఇలాగే కొనసాగితే ప్రకృతి సంపదను అక్రమార్కులు నాశనం చేస్తారని వాపోతున్నారు. పర్యావరణానికి ముప్పు కొండలు, చెట్లు వంటివి ప్రకృతి సంపద. వీటి మనుగడతోనే మానవ మనుగడ ముడిపడి ఉంటుంది. అయితే మనుషులు తమ స్వార్థం కోసం కొండలను తవ్వేస్తూ, చెట్లను నరికేస్తుండడం వలన వన్య ప్రాణులకు ఆవాసం లేకుండా పోతోంది. ఫలితంగా మూగ జీవాలు జనావాసాల్లోకి వస్తూ ప్రజలను భయకంపితులను చేస్తున్నాయి. మరోవైపు చెట్లను నరికేస్తుండడం వలన వాతావరణంలో మార్పులతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అందువలన ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి విలువైన ప్రకృతి సంపదకు నష్టం కలుగకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. పర్యావరణ రక్షణ అందరి బాధ్యత ప్రభుత్వ భూముల్లోని కొండలను తవ్వేస్తుండడం వలన వన్య ప్రాణులకు ఇబ్బందులు వస్తున్నాయి. కొండలపై ఉండే చెట్లను కూడా అక్రమార్కులు నరికేస్తున్నారు. దీంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. భవిష్యత్‌లో జరిగబోయే నష్టాలు గురించి ఆలోచించి పర్యావరణాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత. – బమ్మిడి భూపతిరావు, విశ్రాంత ఆర్మీ ఉద్యోగి, మఖరజోల, అనుమతులు తప్పనిసరి ప్రభుత్వ భూములు నుంచి అక్రమంగా కంకర, మట్టి, రాళ్లను తీసుకెళ్లడం నేరం. ఎవరైనా అక్రమంగా తరలిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. సొంత భూముల నుంచి కూడా గ్రావెల్ తీసుకెళ్లాలంటే రెవెన్యూ నుంచి మైన్స్ ద్వారా అనుమతి తప్పక పొందాలి. ఎవరైనా అక్రమంగా గ్రావెల్ తరలిస్తే చర్యలు తప్పవు. – దల్లి కొండలరావు, తహసీల్దార్, మందస -
ఈ సమాధులు ప్రత్యేకమైనవి
లక్నో : భారతదేశంలో తొలిసారిగా అతి ప్రాచీన నాగరికతకు చెందిన సమాధుల్ని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బగ్‌పత్ జిల్లాలో కాంస్యయుగం నాటి సమాధులతో పాటు కొన్ని వస్తువులు పురావస్తు తవ్వకాలలో బయటపడ్డాయి. ఈ అవశేషాలు దాదాపు 4000ఏళ్ల నాటివని పురావస్తు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. క్రీస్తుపూర్వం 2000-1800 ప్రాంతానికి చెందినవిగా వారు భావిస్తున్నారు. పురావస్తు శాస్త్రవేత్త మంజుల్ మాట్లాడుతూ.. గతంలో హరప్పా, మొహంజోదారో, ధొలవీర ప్రాంతాలలో తవ్వకాలు జరిపినపుడు చాలా సమాధులు బయటపడినా సమాధులపై రాగితో అలంకరణ చేయలేదన్నారు. ప్రస్తుతం బయటపడ్డ సమాధుల్లో ఎనిమిది మానవరూపాలను, పూల బొమ్మలను రాగితో తయారుచేసి ఉంచారని తెలిపారు. సమాధుల్లో దొరికిన వస్తువులు, వాటిపై అలంకరణను బట్టి చూస్తుంటే ఆ సమాధులు రాజ కుటుంబాలకు చెంది ఉంటాయన్నారు. ఇలాంటి సమాధుల్ని కనుక్కొవటం భారతదేశ చరిత్రలో మొదటిసారన్నారు. ప్రపంచంలోనే అతిపురాతన నాగరికతలో ఒకటిగా చెప్పుకునే ‘‘మెసపుటేమియా’’ క్రీస్తుపూర్వం 3500 నాటిది. అప్పటి ప్రజలు యుద్ధ సమయంలో కత్తులు, రథాలు, శిరస్త్రాణాలు ఉపయోగించే వారు. భారతదేశంలో కూడా అలాంటి వస్తువులే బయటపడటం విశేషం. తవ్వకాలు జరిపిన ప్రాంతంలో అతి ప్రాచీనమైన నాగరికత విలసిల్లి ఉంటుందని పురావస్తు శాస్త్రజ్ఞులు విశ్వసిస్తున్నారు. మూడు నెలల పాటు కొనసాగిన తవ్వకాలలో శవపేటికలు, కత్తులు, బాకులు, దువ్వెనలు, ఆభరణాలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. -
గుప్త నిధుల కోసం తవ్వకాలు
మోత్కూరు : నల్లగొండ జిల్లా మోత్కూరు మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం గర్భగుడిలో దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. శనివారం అర్ధరాత్రి తర్వాత ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు గర్భగుడి తాళాన్ని పగులగొట్టారు. శివలింగం పక్కన కొంత మేర తవ్వకాలు చేసిన అనంతరం ప్రయత్నం ఉపసంహరించుకుని వెళ్లినట్టు సంఘటన స్థలాన్ని బట్టి తెలుస్తోంది. ఆలయం ఆవరణ అంతా కారంపొడి చల్లి ఉంది. దీనిపై ఆలయ కమిటీ అధ్యక్షుడు గుండగోని రామచంద్రు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
గుప్త నిధుల కోసం తవ్వకాలు
ధర్మవరం అర్బన్: అనంతపురం జిల్లా ధర్మవరం మండలం మల్లకాలువ సమీపంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ వేణుగోపాల్ శుక్రవారం దీనికి సంబంధించిన వివరాలు తెలిపారు. మల్లకాలువ సమీపంలో ఆంజనేయస్వామి ఆలయం పక్కన గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నట్టు గురువారం రాత్రి పోలీసులకు సమాచారం అందింది. రూరల్ ఎస్ఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో సిబ్బంది వెళ్లి ఆరుగురిని అరెస్ట్ చేశారు. గంజికుంట రవికుమార్, గడ్డం రామాంజనేయులు, బండారు శ్రీనివాసులు, ముక్తాపురం సూర్యనారాయణ, జయంత్రెడి, చిన్నగిరిలు పట్టుబడ్డారు. వీరి నుంచి జియోహంటర్ మెషీన్‌ను స్వాధీనం చేసుకున్నారు.