యథేచ్ఛగా కొనసాగుతున్న గ్రావెల్ అక్రమ రవాణా
సాక్షి, మందస(శ్రీకాకుళం) : మండలంలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రకృతి సంపద అయినటువంటి కొండలను తవ్వేస్తూ అక్రమంగా రాళ్లు, గ్రావెల్‌ను తరలిస్తున్నారు. వాస్తవానికి మండలంలోని అధికారికంగా ఎటువంటి క్వారీలు లేవు. కానీ ఇటీవల విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారానికి గ్రావెల్, మట్టి అవసరం కావడంతో అక్రమార్కులు బరి తెగిస్తున్నారు. అదును చూసి శివారుల్లో ఉన్న ప్రభుత్వ భూముల్లోని కొండలను నాశనం చేస్తున్నారు. అదే సమయంలో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి చెట్లను కూడా నరికివేసి కలపను కూడా తరలిస్తూ ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు.
మాముళ్ల మత్తులో అధికారులు..?
ఇంత జరుగుతున్నా తమకేమీ పట్టనట్లు ఒక వైపు రెవెన్యూశాఖ, మరో వైపు పోలీసులు వ్యవహరిస్తున్నారు. అక్రమ గ్రావెల్ రవాణా తమ పరిధిలోకి రాదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అధికారులకు తెలిసే అక్రమంగా గ్రావెల్ రవాణా జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులకు కాంట్రాక్టర్లు, వ్యాపారులు మామూళ్లు ఇస్తుండడంతో నిమ్మకునీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ కారణంగానే కొన్నిసార్లు రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకుంటున్న వాహనాలను కూడా వదిలేస్తున్నారని అంటున్నారు. ఇలాగే కొనసాగితే ప్రకృతి సంపదను అక్రమార్కులు నాశనం చేస్తారని వాపోతున్నారు.
పర్యావరణానికి ముప్పు
కొండలు, చెట్లు వంటివి ప్రకృతి సంపద. వీటి మనుగడతోనే మానవ మనుగడ ముడిపడి ఉంటుంది. అయితే మనుషులు తమ స్వార్థం కోసం కొండలను తవ్వేస్తూ, చెట్లను నరికేస్తుండడం వలన వన్య ప్రాణులకు ఆవాసం లేకుండా పోతోంది. ఫలితంగా మూగ జీవాలు జనావాసాల్లోకి వస్తూ ప్రజలను భయకంపితులను చేస్తున్నాయి. మరోవైపు చెట్లను నరికేస్తుండడం వలన వాతావరణంలో మార్పులతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అందువలన ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి విలువైన ప్రకృతి సంపదకు నష్టం కలుగకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.
పర్యావరణ రక్షణ అందరి బాధ్యత
ప్రభుత్వ భూముల్లోని కొండలను తవ్వేస్తుండడం వలన వన్య ప్రాణులకు ఇబ్బందులు వస్తున్నాయి. కొండలపై ఉండే చెట్లను కూడా అక్రమార్కులు నరికేస్తున్నారు. దీంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. భవిష్యత్‌లో జరిగబోయే నష్టాలు గురించి ఆలోచించి పర్యావరణాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత. – బమ్మిడి భూపతిరావు, విశ్రాంత ఆర్మీ ఉద్యోగి, మఖరజోల,
అనుమతులు తప్పనిసరి
ప్రభుత్వ భూములు నుంచి అక్రమంగా కంకర, మట్టి, రాళ్లను తీసుకెళ్లడం నేరం. ఎవరైనా అక్రమంగా తరలిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. సొంత భూముల నుంచి కూడా గ్రావెల్ తీసుకెళ్లాలంటే రెవెన్యూ నుంచి మైన్స్ ద్వారా అనుమతి తప్పక పొందాలి. ఎవరైనా అక్రమంగా గ్రావెల్ తరలిస్తే చర్యలు తప్పవు.
– దల్లి కొండలరావు, తహసీల్దార్, మందస
Comments
Please login to add a commentAdd a comment