Digital Literacy
-
పిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇస్తున్నారా? పెద్దయ్యాక ఈ సమస్యలు తప్పవు!
సాక్షి, హైదరాబాద్: పిల్లలకు డిజిటల్ పరిజ్ఞానం పెరుగుతుందని, ఆన్లైన్లో నేర్చుకుంటారని స్మార్ట్ఫోన్లుగానీ, ట్యాబ్లెట్గానీ ఇస్తే.. భవిష్యత్తులో మానసిక సమస్యల బారినపడటం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎంత చిన్న వయసులో పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇస్తే.. పెద్దయ్యాక మానసిక ఇబ్బందులతో బాధపడే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ సేపియన్ ల్యాబ్స్ ఇటీవల భారత్ సహా 40 దేశాల్లో నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. బాల్యంలోనే స్మార్ట్ఫోన్లను అందుకున్నవారు.. యుక్త వయసుకు వచ్చాక ఆత్మహత్య ఆలోచనలు పెరగడం, ఇతరుల పట్ల దూకుడుగా వ్యవహరించడం, వాస్తవికత నుంచి దూరంగా పలు రకాల భ్రాంతులకు గురికావడం వంటివి ఎదుర్కొంటున్నట్టు తేలింది. ఈ అధ్యయనం కోసం పలు దేశాల్లో 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న 27,969 మంది నుంచి డేటా సేకరించారు. అందులో మన దేశానికి చెందినవారు 4,000 మంది ఉండటం గమనార్హం. అధ్యయనంలో వెల్లడైన అంశాలివీ.. ♦ మహిళలకు సంబంధించి.. పెద్దగా ఊహ తెలియని అంటే ఆరేళ్ల వయసులోనే స్మార్ట్‌ఫోన్‌ను వినియోగించడం ప్రారంభించిన 74% మంది తీవ్రమైన మానసిక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఇక 10 ఏళ్ల వయసులో మొదటి స్మార్ట్‌ఫోన్ అందుకున్నవారిలో 61% మంది.. 15 ఏళ్లకే వాడటం మొదలుపెట్టినవారిలో 52% మంది.. 18 ఏళ్లకు వాడటం ప్రారంభించిన వారిలో 46% మంది మానసిక దుష్ప్రభావాలకు లోనయ్యారు. ♦ పురుషులకు సంబంధించి ఈ ప్రభావం కాస్త తక్కువగా ఉన్నట్టు తేలింది. ఆరేళ్ల వయసులో స్మార్ట్‌ఫోన్‌ను వాడటం మొదలుపెట్టిన వారిలో 42% మంది మానసిక సమస్యలకు గురైతే.. 18 ఏళ్లలో స్మార్ట్‌ఫోన్ చేతపట్టిన వారిలో ఇది 36 శాతమే. ♦ పిల్లలకు చిన్న వయసులోనే స్మార్ట్‌ఫోన్/ట్యాబ్లెట్ చేతికి ఇచ్చి మురిసిపోతున్న తల్లిదండ్రులు.. వారు భవిష్యత్తులో మానసిక సమస్యల బారిన పడేందుకు కారణమవు తున్నారని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. ఎంత చిన్న వయసులో స్మార్ట్‌ఫోన్/ట్యాబ్లెట్ ఇస్తే.. వారు యుక్త వయసులోకి వచ్చాక అంత ఎక్కువగా మానసిక సమస్యల బారినపడే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. చిన్నవయసులో స్మార్ట్‌ఫోన్ ఇవ్వడమంటే చేజేతులా వారి భవిష్యత్తును నాశనం చేసినట్టేనని పేర్కొంది. అంతర్జాతీయ సగటు కంటే మనమే ఎక్కువ.. గత ఏడాది విడుదలైన మెకాఫె గ్లోబల్ కనెక్టెడ్ ఫ్యామిలీ సర్వే ప్రకారం.. 10–14 ఏళ్ల వయసున్న భారతీయుల్లో స్మార్ట్‌ఫోన్ వినియో గం 83% ఉండటం గమనార్హం. అంతర్జాతీయ సగటు 76% కంటే ఇది 7% ఎక్కువ. అంటే మన దగ్గర మిగతా అన్ని వయసుల వారికన్నా.. పిల్లలు ఎక్కువగా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. వారు సగటున రోజుకు 5–8 గంటల పాటు.. అంటే సంవత్సరానికి 2,950 గంటల వరకు ఆన్లైన్లోనే గడుపుతు న్నారని వినియోగ గణాంకాలు చూపిస్తున్నాయి. తోటి వారితో కలవక ప్రవర్తన దెబ్బతింటోంది స్మార్ట్‌ఫోన్ విప్లవానికి ముందు పిల్లలు చాలా సమయం కుటుంబంతో, స్నేహితులతో గడిపేవారు. ఇప్పుడీ పరిస్థితి లేదు. సమాజంలో తమ భాగస్వామ్యానికి తగినట్టుగా సాధన లేక పోవడం, తోటివారితో కలవకపోవడంతో ప్రవర్తన తీరు సంక్లిష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌కు చిరు ప్రాయంలోనే అలవాటు పడటం అంటే పెద్దవారిగా ఎక్కువ మానసిక సమస్యలు ఎదుర్కోవడానికి దారితీసుకోవడమే. ముఖ్యంగా ఆత్మహత్య ఆలోచనలు, ఇతరుల పట్ల దూకుడు భావాలు, వాస్తవికతకు దూరమైన ఆలోచనలు, సమాజం నుంచి వేరుగా ఉన్నామన్న భావన వంటివి చుట్టు ముట్టే అవకాశాలు ఎక్కువ. యుక్త వయసు వచ్చాకే పూర్తి స్థాయిలో స్మార్ట్‌ఫోన్ వినియోగానికి అవకాశం ఇవ్వడం మంచిది. – సేపియన్ ల్యాబ్స్ వ్యవస్థాపకులు, న్యూరో సైంటిస్ట్ తారా త్యాగరాజన్ -
జియో యూజర్లకు గుడ్ న్యూస్
సాక్షి, ముంబై: ప్రపంచమంతా డిజిటల్ యుగంగా మారిపోతున్న తరుణంలో ప్రముఖ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో కొత్త ప్రోగ్రామ్‌ను ఆరంభించింది. డిజిటల్ లిటరసీ ఇనీషియేటివ్‌లో భాగంగా ‘డిజిటల్ ఉడాన్’ పేరుతో డిజిటల్ అవగాన కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. డిజిటలైజేషన్ అవసరాలకనుగుణంగా డిజిటల్ టెక్నాలజీ, ఇంటర్నెట్ వాడకంపై వినియోగదారులకు అవగాహన కల్పించనుంది. దేశ యువతకు మార్గనిర్దేశం చేసే క్రమంలో గతంలో డిజిటల్ ఛాంపియన్స్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చిన జియో ఇంటర్నెట్ తొలి వినియోగదారులకోసం మొట్టమొదటిసారి ఇలాంటి చొరవ తీసుకోవడం విశేషం. ప్రధానంగా గ్రామీణ ప్రాంత యూజర్లపై కన్నేసిన జియో అక్కడ మరింత పాగా వేసేందుకు డిజిటల్ ఉడాన్‌ను తీసకొచ్చింది. జియో ఫోన్లో ఫేస్బుక్ వాడకం, ఇతర ఆప్‌ల వినియోగంతోపాటు ఇంటర్నెట్ భద్రతపై అవగాహనకు ఈ డిజిటల్ ఉడాన్ కార్యక్రమం ఉపయోగపడనుంది. అలాగే స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉండేందుకు జియోఫోన్‌లో ఫేస్బుక్ ఉపయోగించడం లాంటివి నేర్పించనుంది. జియో యూజర్లకు ప్రతి శనివారం 10 ప్రాంతీయ భాషలలో ఆడియో-విజువల్ శిక్షణనిస్తుంది ఇందుకుగాను ఫేస్‌బుక్‌తో కలిసి డిజిటల్ ఉడాన్ కోసం ప్రత్యేక మాడ్యూల్స్‌ను రూపొందించింది రిలయన్స్ జియో 13 రాష్ట్రాలలో దాదాపు 200 ప్రదేశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. కోట్లాదిమంది జియోఫోన్ వినియోగదారులనున ఇంటర్నెట్ వినియోగంలో మరింత పటిష్టం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని త్వరలో 7,000 స్థానాలకు చేరుకుంటుందని రిలయన్స్ జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ తెలిపారు. భారతీయుల్లో ఇంటర్నెట్ వాడకాన్ని విస్తృతం చేయడంతో పాటు డిజిటల్ విప్లవం ముందుకు సాగడంలో జియో కీలక పాత్ర పోషిస్తోందని ఫేస్బుక్ ఇండియా ఎండి అజిత్ మోహన్ వ్యాఖ్యానించారు. కాగా రిలయన్స్ జియో తన 4 జి నెట్‌వర్క్‌లో 280 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉండగా గ్రామీణ చందాదారుల సంఖ్య 2018 లో 100.47 మిలియన్లుగా ఉంది. -
డిజిటల్ అక్షరాస్యతపై ఫేస్బుక్ శిక్షణ
న్యూఢిల్లీ: డిజిటల్ వ్యవహారాల్లో భద్రతపై చిట్కాలు నేర్పించేందుకు ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ఫేస్బుక్ ‘డిజిటల్ లిటరసీ లైబ్రరీ’ పేరిట ఒక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. తెలుగు, బెంగాలీ, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో శిక్షణ ఉంటుందని వెల్లడించింది. ఇప్పటికే వేర్వేరు మార్గాల ద్వారా ఫేస్బుక్ డిజిటల్ అక్షరాస్యతలో 2 లక్షల మందికి శిక్షణ ఇచ్చింది. ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్యను 3 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం స్థానిక స్వచ్ఛంద సంస్థలతో కలసి పనిచేస్తామని ఫేస్బుక్ చెప్పింది. ప్రాథమికంగా ఈ శిక్షణలో మహిళలు, యువతకు ప్రాధాన్యమిస్తామని తెలిపింది. పిల్లల భద్రతపై ఐఐటీ ఢిల్లీలో రెండ్రోజుల హ్యాకథాన్‌ను నిర్వహిస్తోంది. పిల్లల అక్రమ రవాణా కట్టడికి ఈ సమావేశంలో కనుగొనే పరిష్కార మార్గాల్ని తమ భాగాస్వామ్య ఎన్జీవోలను ఇస్తామంది. తెలిపింది. కేంద్ర మంత్రి మేనకా గాంధీ ఫేస్బుక్ ప్రతినిధులతో సమావేశమై చర్చించారు. -
‘మహిళా శక్తి’కి జై!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బాగా వెనుకబడిన 115 జిల్లాల్లో ‘ప్రధాన మంత్రి మహిళా శక్తి కేంద్రాల’ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. గ్రామీణ మహిళలకు చేరువై వారిలో ఆరోగ్యం, పోషణ, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ అక్షరాస్యత పెంపొందించేందుకు ఇవి దోహదపడతాయి. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ(సీపీఎస్ఈ)లు కార్మిక సంఘాల్లో సభ్యులైన తమ ఉద్యోగులతో వేతన సవరణపై తదుపరి చర్చలు జరిపేందుకు కూడా అంగీకరించింది. చాలా కాలంగా పెండింగులో ఉన్న సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల వేతనాల పెంపు ప్రతిపాదనకు సైతం మోక్షం లభించింది. ‘బేటీ బచావో–బేటీ పడావో’ విస్తరణ 115 జిల్లాల్లో బ్లాకు స్థాయిలో 920 మహిళా శక్తి కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది. అలాగే ప్రస్తుతం 161 జిల్లాల్లో అమలవుతున్న బేటీ బచావో–బేటీ పడావో పథకాన్ని 640 జిల్లాలకు విస్తరించారు. లైంగిక హింస బాధితులకు సాంత్వన చేకూర్చేలా మరో 150 ‘వన్‌స్టాప్ కేంద్రాల’ ఏర్పాటుకూ కేంద్రం ఓకే చెప్పింది. విస్తృత పథకమైన ‘ది నేషనల్ మిషన్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్’లో మరో ఏడు కార్యక్రమాల అమలుకు ఆమోదం తెలిపింది. ఈ పథకాలన్నింటికి 2017–20 మధ్య కాలంలో రూ.3,636.85 కోట్లు వెచ్చిస్తారు. భారం సీపీఎస్ఈల పైనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ ఉద్యోగులతో 8వ దఫా వేతన చర్చలు జరిపేందుకు రూపొందించిన విధాన ప్రక్రియకు కేంద్రం ఆమోదం తెలిపింది. ‘ఉత్పత్తితో పోలిస్తే కార్మికులకయ్యే వ్యయం పెరగకూడదన్న షరతుకు లోబడి వేతన సవరణ జరగాలి. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రం, అది కూడా సీపీఎస్ఈలు తమ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నట్లయితేనే, సంబంధిత పాలనా విభాగం డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్‌ను సంప్రదించిన తరువాతే వేతన పెంపు నిర్ణయం తీసుకోవాలి’ అని కేబినెట్ భేటీ తరువాత ప్రకటన వెలువడింది. ‘వేతనాలు పెరిగితే కేంద్రం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందదు. ఆర్థిక భారమంతా సదరు సంస్థపైనే ఉంటుంది. ఉద్యోగుల వేతనాలు పెరిగిన తరువాత తమ ఉత్పత్తులు, సేవల ధరలు పెరగకుండా సీపీఎస్ఈలు చూసుకోవాలి. ఇలా సవరించిన వేతనాలు ఎగ్జిక్యూటివ్‌లు, అధికారులు, యూనియనేతర ఉద్యోగుల వేతనాలను మించకూడదు’ అని అన్నారు. తమకున్న ఆర్థిక వనరులు, చెల్లించే స్తోమత ఆధారంగా వేతన సవరణపై కార్మికులతో చర్చలు జరిపేందుకు ఆయా సంస్థలకు పూర్తి స్వేచ్ఛ కల్పించారు. సవరించిన వేతనాలు 2017, జనవరి నుంచి అమల్లోకి వచ్చి ఐదేళ్లు లేదా పదేళ్లు (ఏది ఎంచుకుంటే అది) వర్తిస్తాయి. అటవీయేతర ప్రాంతాల్లో పెంచిన వెదురు చెట్లను నరికేయకుండా సంబంధిత చట్టంలో సవరణ చేసేలా ఆర్డినెన్స్ తేవడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. సీజేఐ వేతనం రూ.2.80 లక్షలు సుప్రీంకోర్టు, 24 హైకోర్టుల్లో పనిచేస్తున్న జడ్జీల వేతనాల పెంపునకు కేంద్ర కేబినెట్ అంగీకరించింది. ఇందుకు సంబంధించి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతామని న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. జడ్జీల వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేస్తూ 2016లో అప్పటి సీజేఐ టీఎస్ ఠాకూర్ కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజా ప్రతిపాదన ప్రకారం...సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నెలకు రూ.2.80 లక్షలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రూ. 2.50 లక్షలు, హైకోర్టు న్యాయమూర్తికి రూ.2.25 లక్షల చొప్పున వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. -
గ్రామీణ డిజిటల్ అక్షరాస్యతకు ‘కోడ్ ఉన్నతి’
సాక్షి, న్యూఢిల్లీ: యువతలో, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్లో డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడానికి ఎస్ఏపీ ఇండియా, ఎల్అండ్టీ, ఐటీసీ సంయుక్తంగా సామాజిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ‘కోడ్ ఉన్నతి’ పేరుతో ఒక కొత్త సామాజిక బాధ్యత ప్రాజెక్టును ప్రారంభించాయి. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు, యువతలో ఉద్యోగ నైపుణ్యానికి అవసరమైన కంప్యూటర్ విద్యపై శిక్షణ ఇవ్వనున్నాయి. దీని కోసం ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్‌తోపాటు నిపుణులను అందిస్తే.. ఎల్అండ్టీ, ఐటీసీ చారిటబుల్ ట్రస్ట్‌లు మారుమూల గ్రామలకు వెళ్లి కోడ్ ఉన్నతి కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తాయి. వివిధ రాష్ట్రాల్లో 100 శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని, ఇప్పటికే రాజస్తాన్‌లో 33, మహారాష్ట్రలో 3 కేంద్రాలు ప్రారంభించినట్టు ఎస్ఏపీ తెలిపింది. వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలురాష్ట్రాల్లో ప్రారంభించనున్నట్టు ఎస్ఏపీ ఇండియా అధ్యక్షుడు, ఎండీ దీప్‌సేన్ గుప్తా తెలిపారు.