
సాక్షి, ముంబై: ప్రపంచమంతా డిజిటల్ యుగంగా మారిపోతున్న తరుణంలో ప్రముఖ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో కొత్త ప్రోగ్రామ్‌ను ఆరంభించింది. డిజిటల్ లిటరసీ ఇనీషియేటివ్‌లో భాగంగా ‘డిజిటల్ ఉడాన్’ పేరుతో డిజిటల్ అవగాన కార్యక్రమాన్ని ఆవిష‍్కరించింది. డిజిటలైజేషన్ అవసరాలకనుగుణంగా డిజిటల్ టెక్నాలజీ, ఇంటర్నెట్ వాడకంపై వినియోగదారులకు అవగాహన కల్పించనుంది. దేశ యువతకు మార్గనిర్దేశం చేసే క్రమంలో గతంలో డిజిటల్ ఛాంపియన్స్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చిన జియో ఇంటర్నెట్ తొలి వినియోగదారులకోసం మొట్టమొదటిసారి ఇలాంటి చొరవ తీసుకోవడం విశేషం.
ప్రధానంగా గ్రామీణ ప్రాంత యూజర్లపై కన్నేసిన జియో అక్కడ మరింత పాగా వేసేందుకు డిజిటల్ ఉడాన్‌ను తీసకొచ్చింది. జియో ఫోన్‌లో ఫేస్‌బుక్ వాడకం, ఇతర ఆప్‌ల వినియోగంతోపాటు ఇంటర్నెట్ భద్రతపై అవగాహనకు ఈ డిజిటల్ ఉడాన్ కార్యక్రమం ఉపయోగపడనుంది. అలాగే స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉండేందుకు జియోఫోన్‌లో ఫేస్‌బుక్ ఉపయోగించడం లాంటివి నేర్పించనుంది. జియో యూజర్లకు ప్రతి శనివారం 10 ప్రాంతీయ భాషలలో ఆడియో-విజువల్ శిక్షణనిస్తుంది ఇందుకుగాను ఫేస్‌బుక్‌తో కలిసి డిజిటల్ ఉడాన్ కోసం ప్రత్యేక మాడ్యూల్స్‌ను రూపొందించింది
రిలయన్స్ జియో 13 రాష్ట్రాలలో దాదాపు 200 ప్రదేశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. కోట్లాదిమంది జియోఫోన్ వినియోగదారులనున ఇంటర్నెట్ వినియోగంలో మరింత పటిష్టం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని త్వరలో 7,000 స్థానాలకు చేరుకుంటుందని రిలయన్స్ జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ తెలిపారు. భారతీయుల్లో ఇంటర్నెట్ వాడకాన్ని విస్తృతం చేయడంతో పాటు డిజిటల్ విప్లవం ముందుకు సాగడంలో జియో కీలక పాత్ర పోషిస్తోందని ఫేస్‌బుక్ ఇండియా ఎండి అజిత్ మోహన్ వ్యాఖ్యానించారు. కాగా రిలయన్స్ జియో తన 4 జి నెట్‌వర్క్‌లో 280 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉండగా గ్రామీణ చందాదారుల సంఖ్య 2018 లో 100.47 మిలియన్లుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment