ఆందోళనతో ఆరంభం
షోలాపూర్, న్యూస్‌లైన్: కొత్త సంవత్సరంలో తొలిరోజే పట్టణంలో ఆందోళనలు మొదలయ్యాయి. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులోని అవినీతి, అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని, కోట్ల రూపాయల బకాయిలను వెంటనే వసూలు చేసి, డెరైక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) బ్యాంకు ఎదురుగా ధర్నా ఆందోళన నిర్వహించింది. పార్టీ నాయకులు దిలీప్ దాత్రే, మహేంద్ర భూషణ్‌కర్‌ల నేతృత్వంలో ఈ ఆందోళన జరిగింది. కార్యకర్తలు.. డెరైక్టర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పరిసరాలు దద్దరిల్లిపోయాయి.
ముస్లింల నిరసన: అమాయకులైన ముస్లిం యువకులను పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ ముస్లిం సంఘాలు కూడా బుధవారం కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగాయి. రోజంతా అక్కడే బైఠాయించాయి. కావాలనే పోలీసులు అమాయకులు, నిరపరాధులైన ముస్లిం యువకులను వేధిస్తున్నారని ఆరోపించారు. ఏటీఎస్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు ముస్లింలందరూ ఏకతాటిపైకి రావాలని ఉలేమాలు పిలుపునిచ్చారు. పలు డిమాండ్లతో కూడిన నివేదికను ఈ సందర్భంగా కలెక్టర్‌కు అందజేశారు.
డాక్టర్‌పై చర్య తీసుకోవాలని...
స్థానిక సివిల్ ఆస్పత్రికి ప్రసూతి కోసం వచ్చిన మహిళకు చికిత్స చేసేందుకు నిరాకరించిన డాక్టర్‌పై పోలీసు అధికారి చేయి చేసుకొన్నాడు. దీనిని నిరసిస్తూ రెసిడెంట్ డాక్టర్లు విధులు బహిష్కరించారు. దీంతో రోగులపై తీవ్ర ప్రభావం చూపింది. అయితే సదరు డాక్టరుపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పింజారి సమాజాం కలెక్టర్‌కు నివేదిక సమర్పించింది.
ఎస్ఎంటీ సిబ్బంది నల్లబ్యాడ్జీలతో...
షోలాపూర్ మున్సిపల్ ట్రాన్స్పోర్ట్(ఎస్ఎంటి)డెరైక్టర్.. డిపోలో షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్(ఎస్ఎంసీ) కమిషనర్ చంద్రకాంత్ గూడింవార్‌ను అసభ్య పదజాలంతో దూషించాడని ఆరోపిస్తూ డెరైక్టర్‌కు వ్యతిరేకంగా సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించారు. బుధవారం నిర్వహించతలపెట్టిన బస్సుసేవల బంద్‌ను కార్పొరేటర్ ఆనంద్ చందన్ శివే సూచన మేరకు విరమించుకున్నారు.