యువదర్శకుడు కన్నుమూత
కొచ్చి: మలయాళ చిత్ర దర్శకుడు దిఫన్ చేతన్ (47) కన్నుమూశారు. గత కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
ఏడు సినిమాలకు దర్శకత్వం వహించిన యువదర్శకుడు దిఫన్ అతి చిన్నవయసులోనే కన్నుమూయడం బాధకరమని చిత్ర పరిశ్రమ వర్గాలు సంతాపం ప్రకటించాయి. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయన మృతిపట్ల సంతాపాన్ని ప్రకటించారు. ఆయన స్వస్థలం తిరువనంతపురంలో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారని తెలుస్తోంది.
అసిస్టెంట్ దర్శకుడిగా కరియర్ మొదలు పెట్టి, 2003 లో స్వతంత్ర దర్శకుడుగా మారిన దిఫన్ ఆ తర్వాత ఏడు చిత్రాలకు దర్శకత్వం వహించారు.. రాజకీయ థ్రిల్లర్ ‘లీడర్ కింగ్ మేకర్ ' ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. అనంతరం దాదాపు ఆరు సంవత్సరాలు పాటు దర్శకత్వానికి దూరంగా ఉన్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత 2009 లో పృథ్విరాజ్ నటించిన "పుతియా ముఖం" సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 2012 "హీరో", "సిమ్" సినిమాలకు దర్శకత్వం వహించారు. 2014 లో రూపొందించిన బిజెపి రాజ్యసభ సభ్యుడు సురేష్ గోపితో "డాల్ఫిన్ బార్" ను రూపొందించారు.
కాగా దర్శకుడి ఆకస్మిక మరణంపై నటుడు పృథ్వీరాజ్ ఫేస్బుక్ ద్వారా విచారాన్ని వ్యక్తం చేశారు. తన కరియర్ లో చాలా ముఖ్యమైన సినిమాలు తనకు అందించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపిన పృథ్విరాజ్ ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ పేర్కొన్నారు. దిఫన్ చివరి సినిమా సత్య ఇంకా విడుదల కావాల్సి ఉంది.
Will miss you Diphan chetan! Thank you for giving me one of the most important films in my career. Rest in peace now..rest in peace! pic.twitter.com/hiIi4dxRc1
— Prithviraj Sukumaran (@PrithviOfficial) March 13, 2017