Directed Shankar
-
సూపర్‌స్టార్‌తో నయన
సూపర్‌స్టార్ తాజా చిత్రం ఎట్టకేలకు ఖరారైంది. మొదట శంకర్ దర్శకత్వం వహించనున్నారనే ప్రచారం జరిగింది. అలాగే లారెన్స్ పేరు కూడా తెరపైకి వచ్చింది. చివరికి మెడ్రాస్ చిత్రం ఫేమ్ రంజిత్ దర్శకత్వం వహించనున్నారనే వార్తలు ప్రచారం అయ్యాయి. అంతలోనే రంజిత్ ఆశలకు నిర్మాత జ్ఞానవేల్ రాజా గండికొట్టారని కారణం మెడ్రాస్ చిత్రం తరువాత సూర్య హీరోగా చేస్తానని దర్శకుడు తమ సంస్థతో కమిట్ అయ్యారని నిర్మాత జ్ఞానవేల్ రాజా పేర్కొన్నారు. అయితే ఆ తరువాత ఆయన కాస్త పట్టు విడిచి దర్శకుడు రంజిత్‌కు పచ్చజెండా ఊపడంతో ఆయన సూపర్‌స్టార్ చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో అమితాబ్‌బచ్చన్ తరహాలో రజనీకాంత్ తన వయసుకు తగ్గ పాత్రలో నటించనున్నారని సమాచారం. అలాగే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తమిళ నిర్మాత మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను నిర్మించనున్నారనే ప్రచారం జరిగింది. అయితే అందులో నిజం లేదన్నది తాజా సమాచారం. ఇప్పుడీ చిత్రాన్ని విజయ్ హీరోగా ఇంతకుముందు కత్తి చిత్రాన్ని నిర్మించిన లైకా సంస్థ ఈరోస్ ఎంటర్టైన్ సంస్థ సంయుక్తంగా నిర్మించడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన నయనతార నటించనున్నారన్నది కోలీవుడ్ సమాచారం. ఈమె ఇంతకుముందు సూపర్‌స్టార్‌తో చంద్రముఖి, కుచేలన్ చిత్రాల్లో నటించారన్నది గమనార్హం. శివాజీ చిత్రంలో రజనీతో సింగిల్ సాంగ్‌కు ఆడారు. -
అందుకే...56తో ఆపేశా : విక్రమ్
‘‘సినిమా అంటే నాకు ఇష్టం అనేకన్నా, పిచ్చి అంటే సబబు. అందుకే, సినిమా కోసం ఎలాంటి సాహసం చేయడానికైనా నేను రెడీ అయిపోతా’’ అని చెప్పారు విక్రమ్. శంకర్ దర్శకత్వంలో విక్రమ్, అమీ జాక్సన్ జంటగా నటించిన ‘ఐ’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రచారంలో భాగంగా విక్రమ్, అమీ జాక్సన్ హైదరాబాద్‌లో పత్రికల వారితో ముచ్చటించారు. తొలుత విక్రమ్ మాట్లాడుతూ -‘‘చూసినవాళ్లందరూ బాగుందంటున్నారు. కొంతమంది క్రిటిక్స్, సినిమా పరిశ్రమకు చెందినవాళ్ల స్పందన వేరే విధంగా ఉంది. అయినా ప్రేక్షకులు బాగా చూస్తున్నారు కాబట్టి, రికార్డ్ స్థాయి వసూళ్లు సాధిస్తోంది. ఒకవేళ చెత్త సినిమా అయితే ప్రేక్షకులు ఎందుకు ఆదరిస్తారు? సినిమాలో సందేశం లేదంటున్నారు. కానీ, ప్రేమకు అందంతో పని లేదన్నది సందేశమే కదా. అయినా శంకర్ సినిమా అంటే సందేశం ఉండి తీరాల్సిందే అనుకోవడం సబబు కాదు’’ అన్నారు. ఈ చిత్రంలో బాడీ బిల్డర్‌గా, మోడల్‌గా, గూనివాడిగా కనిపించడానికి మీరు చేసిన కసరత్తులు గురించి చెబుతారా? అన్న ప్రశ్నకు -‘‘బాడీ బిల్డింగ్ కోసం మామూలుగా ఏడాది పడుతుంది. కానీ, నేను ఐదు నెలల్లోనే చేశాను. అలాగే, స్లిమ్ లుక్ కోసం చాలా కసరత్తులు చేశాను. గూనివాడి పాత్రను మేకప్‌తో సరిపెట్టేద్దాం అని శంకర్ అన్నప్పటికీ, నేను వినకుండా 56 కిలోల బరువుకు చేరుకున్నాను. ఇంకో ఆరు కిలోలు తగ్గుతానంటే, ‘శరీరం అనేది ఓ అద్భుతం. ఆ అద్భుతాన్ని పదిలంగా కాపాడుకోవాలి. ఇంతకన్నా బరువు తగ్గితే అవయవాలు ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది’ అని డాక్టర్ హెచ్చరించారు. అందుకే 56తో ఆపాను. దాదాపు ఎనిమిది నెలల పాటు సరైన తిండి తినలేదు. ఇంట్లో అయితే మా ఆవిడ బిర్యానీ చేసినప్పుడల్లా తెగ బాధపడేది. జిహ్వ చాపల్యాన్ని నియంత్రించుకునేవాణ్ణి. ఒకానొక దశలో కొంచెం బాధగానే అనిపించింది. కానీ, సినిమా మీద ఉన్న ప్రేమ ఆ బాధను అధిగమించేసింది’’ అన్నారు. ఈ సినిమా కోసం మూడేళ్లు కేటాయించడంవల్ల చాలా సినిమాలు వదులుకుని ఉంటారు కదా? అనడిగితే ‘‘అవును. ఈ మూడేళ్లల్లో ఓ ఆరు సినిమాలు చేసి ఉండొచ్చు. కానీ, ‘ఐ’లాంటి అద్భుతమైన సినిమా కోసం ఆరు చెత్త సినిమాలు వదులుకున్నానని సరిపెట్టుకుంటున్నా’’ అని చెప్పారు. ఈ చిత్రం నటిగా తన అభివృద్ధికి ఉపయోగపడిందని అమీ చెబుతూ -‘‘ఇప్పటి వరకు ఏ సినిమాకీ అందుకోనన్ని అభినందనలు ఈ చిత్రానికి అందుకున్నాను. నా పాత్రకు కూడా నటనకు అవకాశం ఉండటంతో సంతృప్తిగా ఉంది’’ అన్నారు. ‘ఎవడు’ తర్వాత తెలుగులో అవకాశాలు వచ్చాయనీ, అయితే అవి పూర్తి సంతృప్తినివ్వకపోవడంతో అంగీకరించలేదనీ, ఒకవేళ మంచి అవకాశాలు వస్తే తెలుగులో తప్పకుండా చేస్తాననీ అమీ చెప్పారు. -
శంకర్‌పై హిజ్రాల ధ్వజం
దర్శకుడు శంకర్‌పై హిజ్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ఐ. ఎమిజాక్సన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సంతానం హాస్యపాత్ర పోషించారు. ఆస్కార్ ఫిలింస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో హిజ్రాపాత్రను ప్రతినాయకుల్లో ఒకరిగా శంకర్ చిత్రీకరించారు. ఆ పాత్రను నిజమైన హిజ్రా ఓఐఎస్ రాజాణితోనే నటింప చేశారు. ఈమె ప్రముఖ మోడల్ మాత్రమే కాకుండా ప్రముఖ నటీమణులు ఐశ్వర్యారాయ్ తదితరులకు ప్యాషన్ డిజైనర్ కూడా. ఐ చిత్రంలో విక్రమ్‌ను మోడల్‌గా తీర్చిదిద్దే పాత్రలో నటించిన రాజాణి ఆయన్ని ప్రేమిస్తున్నట్లు విక్రమ్ ఆమెను అసహ్యించుకున్నట్లు చిత్రీకరించారు. దీంతో ఆమె ప్రతినాయకులతో కలసి ఆయన్ని నాశనం చేసే కుట్రలో పాలుపంచుకుంటుంది. ఈ సన్నివేశాలు హిజ్రాలను కించపరిచే విధంగాను, మనోభావాలు దెబ్బతినేలాగా ఉన్నాయంటూ హిజ్రా సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. అందులో అనాది నుంచి సమాజం హిజ్రాలను చిన్న చూపు చూస్తూనే ఉందన్నారు. చాలా సినిమాల్లోనూ హిజ్రాలను అవమానిస్తూ చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఐ చిత్రంలో హాస్యనటుడు సంతానం హిజ్రాలను అవహేళన చేసే విధంగా సంభాషణలు చెప్పి కించపరిచారని వాపోయారు. అందుకే ఈ వ్యవహారంపై దర్శకుడు శంకర్ ఇంటిని ముట్టడించి ఆందోళన చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ఇతర ప్రాంతాల నుంచి హిజ్రాలు చెన్నైకి రానున్నారని సమాచారం.