కళాపిపాసి కేవీఆర్
సాక్షి, సిటీబ్యూరో: ఆధునిక సాహిత్య, సాంస్కతిక భోజ్యుడు డాక్టర్ కేవీ రమణాచారి అని ఏపీ శాసన సభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ కొనియాడారు. గురువారం నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ పి. సావిత్రి సాయి సిద్ధాంత గ్రంథం, ‘డాక్టర్ కేవీ రమణాచారి సాంస్కతికోద్యమదక్పథం’ పుస్తకావిష్కరణ సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్తు తెలుగు సమాజానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి పెద్ద దిక్కుగా మారారని ఆయన ప్రశంసించారు. భాషా, సాహిత్యం, సంస్కతి, కళలకు తోడ్పాటు అందించిన ఏకైక మహానీయమూర్తి కేవీ అని చెప్పారు.
ఈ రోజుల్లో కళలు పరిరక్షించబడుతున్నాయంటే డాక్టర్ కేవీ రమణాచారి లాంటి వారు చేయూత నివ్వటంతోనేనని చెప్పారు. టీటీడీ ఈవోగా అనే సంస్కరణలు తీసుకవచ్చిన మహానుభావుడు డాక్టర్ కేవీ రమణాచారి అని చెప్పారు. తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగు యూనివర్సిటీలో టెక్నాలజీకి అనుగుణంగా ప్రత్యేక కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.
ఇప్పటికే మల్టీ మీడియా చక్కగా నడుస్తుందన్నారు. దీనికి తోడుగా సోషల్ మీడియా నెట్ వర్క్ ద్వారా సర్టిఫికెట్ కోర్సులు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. సిద్దాంత గ్రంధం రచయిత డాక్టర్ పి. సావిత్రి సాయి మాట్లాడుతూ చీకోలు సందరయ్య రచించిన ప్రజలు, ప్రభుత్వం, ఒక ఐఏఎస్ గ్రంధం స్ఫూర్తితోనే డాక్టర్ కేవీ రమణాచారి సాంస్కతికోద్యమదక్పథం రచించినట్లు చెప్పారు. డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ ప్రతి మనిషిలో మంచితనం ఉంటుందన్నారు. అది చూచే చూపును బట్టి ప్రయోజనం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ నాటక రచయిత డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు, తెలుగు వర్సిటీ రంగస్థల కళల శాఖ అధిపతి డాక్టర్ కోట్ల హనుమంతరావు, కిన్నెర ఆర్ట్ థియేటర్స్ కార్యదర్శి ఎం రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.