వైద్య కళాశాలకు మరో 50 సీట్లు
నిజామాబాద్అర్బన్ : ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అదనంగా మరో 50 ఎంబీబీఎస్ సీట్లు రానున్నాయి. దీనికి సంబంధించి డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారుల విన్నపం మేరకు ఎంసీఐ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారు. వచ్చే విద్యాసంవత్స రం నుండి అదనంగా 50 ఎంబీబీఎస్ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రభుత్వ మెడికల్ కళాశాల అధికారులు డీఎంఈకి ప్రతిపాదనలు పంపించారు. ఇటీవలే మెడికల్ కళాశాలలో ఎంసీఐ బృం దం మూడవ సంవత్సరం అనుమతి కోసం పరిశీలన చేపట్టింది.
అనంతరం పరిశీలన ముగిసినమూడు రోజుల తరువాత డీఎంఈ అధికారులు అదనపు సీట్ల కోసం ప్రతిపాదనలు సూచించారు. పరిశీలన అనంతరం అదనపు 50 సీట్లకు ఎంసీఐ ఇటీవలే సానుకూలంగా స్పందించినట్లు వైద్యాధికారులు తెలిపారు. దీంతో ప్రస్తుతం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 100 సీట్లు అదనంగా 50 సీట్లతో మొత్తం 150 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇదివరకే డీఎన్బీ(డిప్లొమా నేషనల్ బోర్డు) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇవి 15 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 150 సీట్లతో ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్వహణ జరిగే అవకాశం ఉంది.
మూడవ సంవత్సరానికి మార్గం సుముగం..
మెడికల్ కళాశాలలో మూడవ సంవత్సరం అనుమతికి మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. ఇటీవల పరిశీలన చేపట్టిన ఎంసీఐ బృందం అదనపు సీట్లకు అనుమతి ఇవ్వడంతో మూడవ సంవత్సరానికి అనుమతి క్లియర్ అయినట్లు తెలుస్తుంది. అన్ని సౌకర్యాలు సక్రమంగా ఉంటేనే, ఎంసీఐ నిబంధనలు పూర్తిస్థాయిలో అమలైతేనే ఈ అదనపు సీట్లకు అనుమతి రావడం, మూడవ సంవత్సరానికి అనుమతి ఇచ్చే అవకాశాన్ని ఎంసీఐ పరిశీలిస్తుంది. అనుమతి ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కళాశాల అనుమతికి కష్టాలు తొలగిపోయాయి. త్వరలోనే అధికారికంగా ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.