మీరిక వెళ్లొచ్చు
కోల్‌కతా: రోజంతా హైడ్రామా తర్వాత బెంగాల్ ప్రభుత్వం, జూనియర్ డాక్టర్లకు మధ్య శనివారం చర్చలు అసలు ప్రారంభమే కాలేదు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యర్థన మేరకు ‘ప్రత్యక్ష ప్రసారం’ డిమాండ్‌ను పక్కనబెట్టి చర్చలకు సిద్ధపడ్డ జూనియర్ డాక్టర్లను ఆకస్మాత్తుగా సీఎం నివాసం దగ్గర నుంచి పంపేశారు. చాలా మొరటుగా మీరికి వెళ్లిపోవచ్చని చెప్పారని జూడాలు ఆరోపించారు. ‘చర్చలకు ఆహ్వానించడంతో సీఎం నివాసానికి వచ్చాం. ప్రత్యక్షప్రసారం లేదా వీడియో రికార్డింగు ఉండాలని డిమాండ్ చేశాం. సీఎం మమతా బెనర్జీ బయటకు వచ్చి చర్చలకు రావాలని విజ్ఞప్తి చేశారు. సమావేశం మినిట్స్‌ను మాకు ఇస్తామని హామీ ఇచ్చారు. మాలో మేము చర్చింకున్నాం. సీఎం విజ్ఞప్తి మేరకు ప్రత్యక్షప్రసారం, వీడియో రికార్డింగు లేకుండా చర్చలకు అంగీకరించాం. ఇదే విషయాన్ని ఆరోగ్యమంత్రి చంద్రిమ భట్టాచార్యకు తెలుపగా.. ఇక చాలు మీరు వెళ్లిపోండని ఆమె చెప్పారు. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది, మీకోసం మూడు గంటలుగా వేచిచూస్తున్నామని తెలిపారు. అర్ధంతరంగా మమ్మల్ని పంపేశారు’ అని సీఎం నివాసం వద్ద జూనియర్ డాక్టర్లు మీడియాతో వాపోయారు. చర్చలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ‘ఈ ఉదంతం ప్రభుత్వం అసలు రంగును బయటపెట్టింది. చర్చలపై ఎవరికి చిత్తశుద్ధి లేదో తెలుపుతోంది’ అని ఒక జూనియర్ డాక్టర్ కన్నీరుపెట్టుకుంటూ అన్నారు. ‘ఈ రోజుకు ఇక ముగిసినట్లే. మూడు గంటలుగా మేం వేచిచూస్తున్నాం. మీరు సీఎం నివాసం లోపలికి రాలేదు. ఇప్పటికే బాగా ఆలస్యమైపోయింది (రాత్రి అయిందని)’ అని ఆరోగ్యమంత్రి చంద్రిమ అంటున్న వీడియోను జూడాలు మీడియాకు షేర్ చేశారు. ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న పీజీ ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారాన్ని నిరసిస్తూ పశ్చిమబెంగాల్ జూనియర్ డాక్టర్లు నెలరోజులకు పైగా విధులను బహిష్కరిస్తున్న విషయం తెలిసిందే. సెపె్టంబరు 10న సాయంత్రానికల్లా విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ సమ్మె కొనసాగిస్తున్నారు. చర్చలపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. జూడాల డిమాండ్ మేరకు స్వయంగా చర్చల్లో పాల్గొనడానికి మమత అంగీకరించారు. ప్రత్యక్షప్రసారంపై పీటముడి పడినా.. చివరకు శనివారం జూడాలు దానిపై వెనక్కితగ్గారు. అయినా సర్కారు వైఖరితో చర్చలు సాధ్యపడలేదు. ఎన్నిసార్లు నన్నిలా అవమానిస్తారు: మమత అంతకుముందు సీఎం నివాసం వద్దకు చేరుకొని జూనియర్ డాక్టర్లు చర్చల ప్రత్యక్షప్రసారం డిమాండ్‌తో బయటే నిలబడిపోయా రు. వర్షంలో తడుస్తూ అలాగే నిలబడ్డారు. దాంతో సీఎం మమత బయటకు వచి్చ.. ‘మీరందరూ లోపలికి వచ్చి చర్చల్లో పాల్గొనాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. వైద్యురాలి హత్యాచారం కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ప్రత్యక్షప్రసారం సాధ్యం కాదు. చర్చలను వీడియో రికార్డు చేసి.. సుప్రీంకోర్టు అనుమతితో మీకొక కాపీ అందజేస్తాం. ఈ రోజు సమావేశమవుదామని మీరే కోరారు. మీకోసం వేచిచూస్తున్నా. మీరెందుకు నన్నిలా అవమానిస్తున్నారు. దయచేసి నన్నిలా అవమానించొద్దు. ఇదివరకు కూడా మూడుసార్లు మీకోసం ఎదురుచూస్తూ కూర్చున్నా. కానీ మీరు రాలేదు’ అని మమత జూడాలతో అన్నారు. జూడాల శిబిరం వద్ద ప్రత్యక్షం శనివారం ఉదయం అందరినీ ఆశ్చర్యపరుస్తూ సీఎం మమతా బెనర్జీ స్వయంగా జూనియర్ డాక్టర్ల వద్దకు వచ్చారు. ఐదురోజులుగా జూడాలు బైఠాయించిన స్వాస్థ్య భవన్ (ఆరోగ్యశాఖ కార్యాలయం) వద్దకు చేరుకున్నారు. జూడాల డిమాండ్లను పరిశీలిస్తానని, ఎవరైనా తప్పుచేశారని తేలితే వారిపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మెడికోలు వర్షాలకు తడుస్తూ రోడ్డుపై ఆందోళనలు కొనసాగిస్తుంటే తాను నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని చెప్పారు. తానిక్కడి రావడం సమస్య పరిష్కారం దిశగా చివరి ప్రయత్నమని తెలిపారు. సమ్మె చేస్తున్న జూడాలపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలుండవని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యయుత ఆందోళనను అణిచివేయడానికి ఇది ఉత్తరప్రదేశ్ కాదు, బెంగాల్ అని సీఎం వ్యాఖ్యానించారు.