విద్యార్థి అదృశ్యం
* రూ. 500 చోరీ చేశాడని తోటి విద్యార్థుల ఆరోపణ
* తనకు ఏ పాపం తెలియదంటూ సూసైడ్‌నోట్ రాసి అదృశ్యమైన నాగార్జునరెడ్డి
* హుజూర్‌నగర్‌లో కలకలం
* పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు.. కేసు నమోదు
హుజూర్నగర్ : విద్యార్థి అదృశ్యం హుజూర్‌నగర్‌లో తీవ్ర కలకలం రేపింది. విద్యార్థుల మధ్య రూ. 500 లకు చెలరేగిన వివాదం.. చివరకు విద్యార్థి అదృశ్యానికి దారితీసింది. పోలీసు లు, విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం..
మేళ్లచెరువు మండలం తమ్మారం గ్రామ పంచాయతీ పరిధి కొత్తూరుకు చెందిన గాయం నాగార్జునరెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి విద్యనభ్యసిస్తూ హస్టల్లో ఉంటున్నాడు. అయితే గత ఆదివారం స్వగ్రామానికి వెళ్లిన నాగార్జునరెడ్డి సోమవారం పాఠశాలకు చేరుకున్నాడు. బుధవారం అదే తరగతి విద్యార్థి ముప్పారపు గణేష్ తన వద్దగల రూ.500లను ఎవరో చోరీ చేశారని స్నేహితులకు తెలి పాడు. అయితే అదే తరగతికి చెందిన మరో నలుగురు విద్యార్థులు ఎస్.సాయికిరణ్, పి.రమేష్, ఏ.పవన్, జి.నవీన్‌లు నీ స్కూల్ బ్యాగ్‌ను నాగార్జునరెడ్డి తెరిచాడని, సదరు నగదును అతనేచోరీ చేశాడని గణేష్‌కు చెప్పారు. దీంతో విద్యార్థులంతా కలిసి హా స్టల్లోని నాగార్జునరెడ్డి ఇనుపపెట్టెను తెరిచి వెతికారు. అయితే సదరు పెట్టెలో 500ల నోటు లభించింది.
అది గణేష్‌కు చెందిన నోటుగా ఇతర విద్యార్థులు నాగార్జునరెడ్డితో వాదించారు. దీంతో నాగార్జునరెడ్డి తాను చోరీకి పాల్పడలేదని సోమవారం రోజు ఇంటి వద్ద నుంచి వచ్చే సమయంలో తల్లిదండ్రులకు చెప్పకుండా క్రీడాదుస్తులు కొనుగోలు చేసేందుకు బీరువా నుంచి *500లు తెచ్చుకున్నట్లు తెలిపాడు. అయినప్పటికీ ఇతర విద్యార్థులు ఆ నోటుపై ఆర్‌జెఎన్ అనే ఇంగ్లిష్ పదాలను గణేష్ మిత్రుడు ప్రవీణ్ రాశాడని కచ్చితంగా అది గణేష్దేనని నాగార్జునరెడ్డిని నిలదీశారు. నాగార్జునరెడ్డి చోరీ చేసినట్లు ఒప్పుకోకపోగా గురువారం సాయంత్రం పాఠశాల సమయం ముగియగానే బయటకు వెళ్లిపోయాడు.
వార్డెన్ ఆరా తీయగా..
హాస్టల్ విద్యార్థులను పర్యవేక్షించే వార్డెన్ నాగార్జునరెడ్డి కనపడకపోవడంతో విద్యార్థులను ఆరా తీశాడు. అయితే విద్యార్థులు పాఠశాల సమయం ముగిశాక హాస్టల్‌కు రాలేదని తమకు తెలియదని తెలిపారు. దీంతో నాగార్జునరెడ్డి ఆచూకీ కోసం ప్రయత్నిస్తుండగా నాగార్జునరెడ్డి ఇనుపపెట్టె వద్దగల పుస్తకాలలో సూసైడ్‌నోట్ లభించింది. వెంటనే హాస్టల్ వార్డెన్ పాఠశాల యాజమాన్యానికి సమాచారమందించి ఆత్మహత్యా పత్రాన్ని అప్పజెప్పాడు.
పురుగులమందు తాగి చనిపోతున్నా..
స్నేహితులు అకారణంగా తనపై దొంగతనం నిందమోపారని.. నువాక్రాన్ పురుగుల మందు కొనుగోలు చేసి చనిపోతున్నానని, తన తల్లిదండ్రులకు చెప్పకుండా బీరువా నుంచి రూ.500లు తెచ్చుకున్నందుకు క్షమించాలని కోరడంతో పాటు అంతకు ముందు విద్యార్థుల మ ద్య జరిగిన ఘర్షణను నాగార్జునరెడ్డి సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నాడు. పాఠశాల యాజమాన్యం విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా గురువారం రాత్రి పట్టణానికి చేరుకున్నారు.
విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో గాలించారు. అయినప్పటికీ విద్యార్థి ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ సత్యం,ఎస్ఐ రంజిత్‌రెడ్డిలు స్థానిక పాఠశాలకు చేరుకుని విద్యార్థులను విచారించారు. నాగార్జునరెడ్డి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.