Disaster Relief Fund
-
‘విపత్తు’ పనులకు రూ.290 కోట్లు విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్ట్ (ఏపీడీఆర్పీ) కింద ఇప్పటివరకు జరిగిన పనులకు పెండింగు బిల్లుల చెల్లింపుతోపాటు మిగిలి ఉన్న పనులను పూర్తి చేసేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ రూ.290.10 కోట్ల అదనపు నిధులు విడుదల చేసింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో విశాఖ బీచ్ అభివృద్ధికి జీవీఎంసీ, వుడాలకు రూ.45.09 కోట్లు, రహదారులు, తుపాను పునరావాస కేంద్రాల నిర్మాణం కోసం రహదారులు–భవనాల శాఖకు రూ.30.65 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.25 కోట్లు, విశాఖ నగరంలో జరుగుతున్న భూగర్భ కేబుల్ ఏర్పాటు పనులకు రూ.128 కోట్లు, మిషనరీ, ఇతర పరికరాల కొనుగోలుకు రూ.55.60 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. -
కేంద్ర వరద సాయం రూ.224.50 కోట్లు
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం తెలంగాణ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్డీఆర్ఎఫ్)కి ముందస్తుగా రూ.224.50 కోట్లు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా పంటలు, ఇళ్లు కోల్పోయిన వారికి, ఇతర అవసరాల కోసం ఈ నిధులను వినియోగించాలని నిర్దేశించింది. నిబంధనల ప్రకారం ఈ నిధులను వచ్చే ఏడాది ఫిబ్రవరి–మార్చిలో విడుదల చేయాల్సి ఉన్నా.. పునరావాస పనులు చేపట్టి ప్రజలకు ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి సంబంధిత అధికారులతో చర్చించి తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు, నిధుల ఆవశ్యకతను వివరించేలా ప్రత్యేక నివేదిక పంపారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా కొంత మేర నిధులను విడుదల చేసేందుకు కేంద్రం ఓకే చెప్పింది. విపత్తు నిర్వహణ నిధులు విడుదల పట్ల మంత్రి కిషన్‌రెడ్డి.. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలాఉండగా, హైదరాబాద్‌ను సందర్శించి వరద నష్టాన్ని అంచనా వేసిన అధికార బృందం నివేదిక కేంద్రానికి అందాల్సి ఉంది. ఈ నివేదికకు అనుగుణంగా సమగ్ర వరద ఉపశమన ప్యాకేజీని ప్రకటించే అంశాన్ని కూడా కేంద్రం పరిశీలించనుంది. -
కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.1,050.91 కోట్లు
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నెలకు రెవెన్యూ లోటు భర్తీ కింద, అలాగే రాష్ట్ర విపత్తుల సహాయ నిధి అడ్వాన్స్ కింద కేంద్ర ప్రభుత్వం రూ.1,050.91 కోట్లను రాష్ట్రానికి విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. ► 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రానికి రెవెన్యూ లోటు భర్తీ కింద ఏప్రిల్ నెలకు కేంద్ర ప్రభుత్వం రూ.491.41 కోట్ల విడుదల చేసింది. ► 2020–21 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.5,987 కోట్లను సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలకు రూ.491.41 కోట్లు విడుదల చేసింది. ► రాష్ట్ర విపత్తుల సహాయ నిధి కింద 15వ ఆర్థిక సంఘం.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,491 కోట్లను రాష్ట్రానికి సిఫార్సు చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.1,119 కోట్లు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల సహాయ నిధికి అడ్వాన్స్‌గా రూ.559.50 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. ► దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు భర్తీ కింద కేంద్రం ఏప్రిల్ నెలకు రూ.6,157.74 కోట్లు, అన్ని రాష్ట్రాలకు విపత్తుల సహాయ నిధి కింద అడ్వాన్స్‌గా తొలి విడతగా రూ.11,092 కోట్లను విడుదల చేసింది. -
మోదీ మాటే చెల్లకపోతే ఎలా?
సాక్షి, న్యూఢిల్లీ : వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న ఈశాన్య రాష్ట్రాల్లో సహాయక చర్యల కోసం 2,350 కోట్ల రూపాయల ప్యాకేజీని విడుదల చేస్తున్నామని, అందులో భాగంగా 250 కోట్ల రూపాయలను అస్సాంకు తక్షణమే విడుదల చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2017, జూలై 31వ తేదీన ప్రకటించారు. అలాగే మృతుల కుటుంబాలకు రెండేసి లక్షల రూపాయల చొప్పున, తీవ్రంగా గాయపడిన వ్యక్తులకు 50 వేల రూపాయల చొప్పున విడుదల చేస్తామని కూడా ఆయన తెలిపారు. అయితే ప్రధాని ప్రకటించిన డబ్బులో ఇంతవరకు నయాపైసా కూడా అస్సాం రాష్ట్రానికి ముట్టలేదు. 2014 నుంచి వరుస వరదలతో అస్సాం రాష్ట్రం తీవ్రంగా నష్టపోతున్నప్పటికీ అదనపు సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక్క ఏడాదికి కూడా ప్రకటించలేదు. 2005లో కేంద్రం తీసుకొచ్చిన చట్టం ప్రకారం ‘స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్’, ‘నేషనల్ డిజాస్టర్ రెస్సాన్స్ ఫండ్’లను ఏర్పాటు చేశారు. సాధారణంగా స్టేట్ డిజాస్టర్ ఫండ్‌కు కేంద్రం 75 శాతం నిధులను కేటాయిస్తే రాష్ట్రం 25 శాతం నిధులను సమకూర్చాలి. అస్సాంకు ప్రత్యేక హోదా ఉండడం వల్ల కేంద్రం 90 శాతం నిధులను కేటాయిస్తే పది శాతం నిధులను మాత్రమే రాష్ట్రం భరించాల్సి ఉంటుంది. ఏ రాష్ట్రంలో వరదలు సంభవించినా ఆ రాష్ట్రంలోని స్టేట్ డిజాస్టర్ ఫండ్ నుంచి కేంద్రమే నిధులను విడుదల చేస్తుంది. అందుబాటులో ఉన్న నిధులకన్నా నష్టం ఎక్కువగా ఉంటే రాష్ట్రాలు కేంద్రం నుంచి అదనపు నిధులను కోరవచ్చు. అలాంటి సందర్భాల్లో కేంద్రం ‘నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్’ నుంచి అదనపు నిధులను విడుదల చేస్తుంది. 2014లో సంభవించిన వరదల్లో 70 మంది మరణించగా, 40 లక్షల మంది నష్టపోయారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 9, 370 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని కోరగా, 288 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని స్టేట్ దిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి కేంద్రం విడుదల చేసింది. 2015 సంవత్సరంలో కూడా వరదల కారణంగా భారీ నష్టం సంభవించగా 2,100 కోట్ల రూపాయల అదనపు నిధులను అస్సాం కోరగా కేంద్రం స్పందించలేదు. అలాగే 2016 సంవత్సరంలో 5,038 కోట్ల రూపాయల సహాయాన్ని కోరింది. అప్పుడు కూడా 434 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిన కేంద్రం అదనపు నిధులను ఇవ్వడానికి నిరాకరించింది. 2017 సంవత్సరంలో వరదల వల్ల అస్సాం రాష్ట్రానికి దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అయినా అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్రం నుంచి ఒక్క పైసా సహాయాన్ని కోరులేదు. కేంద్రం ఇవ్వలేదు. అప్పుడు నరేంద్ర మోదీ పలు ఈశాన్య రాష్ట్రాల్లో వరదల వల్ల జరిగిన నష్టాన్ని సమీక్షించిన ప్రధాని మోదీ 2,350 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. అందులో భాగంగా 250 కోట్ల రూపాయలను తక్షణ సహాయం కింద అస్సాంకు అందజేస్తామని హామీ ఇచ్చారు. అందులో ఒక్క పైసా కూడా రాష్ట్రానికి ఇప్పటి వరకు అందలేదని ఆర్టీఐ కింద అడిగిన ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వంమే సమాధానం చెప్పింది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాన్నే పట్టించుకోకపోతే, కేంద్రం ఇంకే రాష్ట్రాన్ని పట్టించుకుంటుంది? -
తాగునీటి సమస్యల పరిష్కారానికి రూ.6.60కోట్లు
రంగారెడ్డి జిల్లా: జిల్లాలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 6.60 కోట్లు మంజూరు చేసింది. రెండు విభాగాల్లో పనులను ఎంచుకుని ఖర్చు చేయాలని సూచించింది. విపత్తు సహాయ నిధి (సీఆర్ఎఫ్) కింద రూ. 2.33 కోట్లు, విపత్తుయేతర సహాయ నిధి (నాన్ సీఆర్ఎఫ్) కింద రూ. 4.27 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో 572 ఆవాసాల్లో గుర్తించిన 824 పనులు పూర్తిచేయనున్నారు. జిల్లాలోని అన్ని గ్రామీణ ప్రాంతాలకు ఈ నిధులు అందిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశం నిర్వహించి ఈ నిధులకు సంబంధించిన పనుల వివరాలను తెలుసుకున్నారు. గుర్తించిన పనులను సెప్టెంబరులోగా పూర్తి చేయాలని, పనుల్లో నాణ్యత లోపిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నీటి వినియోగంలో ప్రజలు జాగ్రత్త పాటించాలని ఈయన సూచించారు. సమావేశంలో గ్రామీణ నీటిపారుదల శాఖ ఎస్ఈ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.