
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్ట్ (ఏపీడీఆర్‌పీ) కింద ఇప్పటివరకు జరిగిన పనులకు పెండింగు బిల్లుల చెల్లింపుతోపాటు మిగిలి ఉన్న పనులను పూర్తి చేసేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ రూ.290.10 కోట్ల అదనపు నిధులు విడుదల చేసింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో విశాఖ బీచ్ అభివృద్ధికి జీవీఎంసీ, వుడాలకు రూ.45.09 కోట్లు, రహదారులు, తుపాను పునరావాస కేంద్రాల నిర్మాణం కోసం రహదారులు–భవనాల శాఖకు రూ.30.65 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.25 కోట్లు, విశాఖ నగరంలో జరుగుతున్న భూగర్భ కేబుల్ ఏర్పాటు పనులకు రూ.128 కోట్లు, మిషనరీ, ఇతర పరికరాల కొనుగోలుకు రూ.55.60 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.