తాగునీటి సమస్యల పరిష్కారానికి రూ.6.60కోట్లు
రంగారెడ్డి జిల్లా: జిల్లాలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 6.60 కోట్లు మంజూరు చేసింది. రెండు విభాగాల్లో పనులను ఎంచుకుని ఖర్చు చేయాలని సూచించింది. విపత్తు సహాయ నిధి (సీఆర్‌ఎఫ్) కింద రూ. 2.33 కోట్లు, విపత్తుయేతర సహాయ నిధి (నాన్ సీఆర్‌ఎఫ్) కింద రూ. 4.27 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో 572 ఆవాసాల్లో గుర్తించిన 824 పనులు పూర్తిచేయనున్నారు. జిల్లాలోని అన్ని గ్రామీణ ప్రాంతాలకు ఈ నిధులు అందిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు.
ఆదివారం ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశం నిర్వహించి ఈ నిధులకు సంబంధించిన పనుల వివరాలను తెలుసుకున్నారు. గుర్తించిన పనులను సెప్టెంబరులోగా పూర్తి చేయాలని, పనుల్లో నాణ్యత లోపిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నీటి వినియోగంలో ప్రజలు జాగ్రత్త పాటించాలని ఈయన సూచించారు. సమావేశంలో గ్రామీణ నీటిపారుదల శాఖ ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.