సమస్యలు పరిష్కరించకుంటే ప్రాజెక్ట్‌ల నిలిపివేత
ముత్తుకూరు(సర్వేపల్లి): పేదల సమస్యలు పరిష్కరించని పక్షంలో థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్‌ల్లో పనులు నిలిపివేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు హెచ్చరించారు. ముత్తుకూరు మండలంలోని నేలటూరు దళితవాడలో ఆదివారం జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ఏపీజెన్కో ప్రాజెక్ట్‌లో 300 ఉద్యోగాలు భర్తీ చేయకుండా కాంట్రాక్ట్ ఉద్యోగాలు కొనసాగిస్తూ, స్థానికులతో చప్రాసీ పనులు చేయిస్తున్నారన్నారు. థర్మల్ ప్రాజెక్ట్‌ల కాలుష్యం వల్ల పచ్చదనం మాడిపోయిందన్నారు.
పంటలు దెబ్బతిన్నాయన్నారు. బతకడమే కష్టమైపోయిందని తెలిపారు. పబ్లిక్ హియరింగ్‌లో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కనుక ఎన్సీసీ, టీపీసీఐఎల్, జెన్కో ప్రాజెక్ట్‌ల్లో పనులు నిలిపివేస్తామని హెచ్చరించారు. ఇందుకోసం సెప్టెంబర్‌లో ప్రాజెక్ట్‌ల ప్రభావిత గ్రామాల్లో 10 రోజులు పాదయాత్ర చేస్తామన్నారు. అప్పటిలోపు సమస్యలు పరిష్కరించకుంటే జెన్కో ప్రాజెక్ట్ మూసివేసేందుకు తేదీ ప్రకటిస్తామని స్ప ష్టం చేశారు. ప్రాజెక్ట్‌లపై ఆందోళనలు చేయనీయకుండా కొంతమందిని ప్రలోభాలకు గురిచేయ డం విచారకరమన్నారు. పేదలు ప్రలోభాలకు లొంగవద్దని సూచించారు.
నాలుగు రెట్ల పరిహారం ఇవ్వాలి
నేలటూరు గ్రామంతో పాటు దళి తవాడను కూడా ఒకేసారి తరలిం చాలని మధు డిమాండ్ చేశారు. గుండ్లపాళెంలోనే పునరావాసం కల్పించాలన్నారు. తరలించే ముందు 2013 పార్లమెంట్ చట్టం ప్రకారం ఇళ్లు, భూములు, చెట్లకు నాలుగు రెట్ల పరిహారం ఇవ్వాలన్నారు. ఈ సభలో సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్, నాయకులు గోగుల శ్రీనివాసులు, గడ్డం అంకయ్య, పెడకాల శ్రీని వాసులు పాల్గొన్నారు.