ఇక ఆ ఫోన్లకు వాట్సాప్ పనిచేయదట..!
ఫేస్ బుక్ కు చెందిన పాపులర్ మెసేజింగ్ సర్వీసు వాట్సాప్, ఇక సింబియాన్ ఫోన్లకు పనిచేయదట. డిసెంబర్ 31 నుంచి ఈ సర్వీసును సింబియాన్ ఫోన్లకు ఆపివేయబోతున్నట్టు వాట్సాప్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సింబియాన్ ఫోన్ యూజర్లకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు వాట్సాప్ నుంచి అందాయి. "దురదృష్టవశాత్తు, 31/12/2016 నుంచి మీ ఫోన్లకు వాట్సాప్ పనిచేయదు. ఎందుకంటే మీ ఫోన్లకు ఈ యాప్ సపోర్టు చేయకపోతుండటంతో సర్వీసులను ఆపివేస్తున్నాం" అని వాట్సాప్ నుంచి యూజర్లు నోటిఫికేషన్లు పొందారు. వాట్సాప్ ఈ విషయాన్ని తన అధికారిక బ్లాగ్ పోస్టులో కూడా పొందుపర్చింది.
అన్ని బ్లాక్ బెర్రీ ఓఎస్ వెర్షన్లకి(బ్లాక్ బెర్రీ10కి కూడా), నోకియాస్ సింబియాన్ ఎస్40, సింబియాన్ ఎస్60 వెర్షన్, 2.1 ఎక్లైర్, 2.2 ఫ్రోయో, విండోస్ ఫోన్ 7.1 టోటింగ్ డివైజ్ లకు ఈ ఏడాది చివరి నుంచి వాట్సాప్ సర్వీసులు ఆపివేస్తున్నారు. 2009లో వాట్సాప్ ను ఆవిష్కరించిన సమయంలో, బ్లాక్ బెర్రీ, సింబియాన్ ఆపరేటింగ్ సిస్టమ్ లే వాట్సాప్ వృద్ధికి సహకరించాయి. ఆ సమయంలో కేవలం 25 శాతమే ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్ డివైజ్ లు వాట్సాప్ వృద్ధికి తోడ్పడ్డాయి. బ్లాక్ బెర్రీ, సింబియాన్ ఫోన్లకు వాట్సాప్ పనిచేయదని ఆ కంపెనీ ప్రకటించిన కొన్ని రోజులకే, బ్లాక్ బెర్రీ 10 డివైజ్ లకు మార్చి 31 నుంచి ఫేస్ బుక్ సపోర్టును ఆపివేస్తున్నామని ఫేస్ బుక్ కంపెనీ కూడా ప్రకటించింది.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ డివైజ్ విఫలమవుతుండటంలో ఈ సర్వీసును నిలిపివేయనున్నట్టు కంపెనీలు పేర్కొంటున్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ లు ప్రతి ఏడాది కొత్త వెర్షన్ లతో స్మార్ట్ ఫోన్లను తయారుచేసి, మార్కెట్లోకి ఆవిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బ్లాక్ బెర్రీ, ఆండ్రాయిడ్ ఫోన్ల తయారీకి పూనుకోగా.. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్స్ తయారీదారు ఫిన్ లాండ్ ఆధారిత హెచ్ ఎమ్డీ కంపెనీతో కలిసి నోకియా పనిచేయడం ప్రారంభించింది.