డిస్కవరీలో ముంబై ‘లోకల్’
ముంబై: ముంబైకర్ల లైఫ్ లైన్‌గా ప్రఖ్యాతి చెందిన లోకల్ రైళ్ల చరిత్ర ఈ నెల 7 న ప్రముఖ డిస్కవరీ చానెల్లో ప్రసారం కానుంది. ప్రయాణికుల రాకపోకలు, రైల్వే సేవల తీరు, రైల్వే సిబ్బంది పనితీరు, రైళ్ల సంఖ్య వంటి ముఖ్యమైన విషయాలు ప్రసారం చేయనుంది. అంతేగాకుండా ముంబైలో అత్యంత కీలకమైన, రద్దీ స్టేషన్లలో ఒకటైన ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ) నుంచి ప్రతిరోజు 1,250 రైళ్లు బయలు దేరుతాయి. రోజు 30 లక్షల మంది ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తారు. ప్రతి మూడు నిమిషాలకో లోకల్ రైలు నడపటం ఎలా సాధ్యం..? రైళ్లను సమయానుసారంగా (టైం టేబుల్ ప్రకారం) నడిపేందుకు కృషి చేస్తున్న స్టేషన్ మేనేజరు మొదలుకుని ఆపరేషన్ రూంలోని కంట్రోలర్లు, సిగ్నల్ మెన్, మోటర్‌మెన్ (డ్రైవర్లు), గార్డులు, ప్లాట్‌పాంలపై విధులు నిర్వహించే రైల్వే పోలీసులు, కూలీల వివరాలు, ఇతర అనేక అంశాలు ప్రపంచానికి తెలియజేయనున్నట్లు డిస్కవరీ నెట్ వర్క్ (ఆసియా) కార్యనిర్వాహక ఉపాధ్యాక్షుడు, జీఎం రాహుల్ జొహరీ చెప్పారు.
ముంబై లోకల్ రైళ్లే ఎందుకంటే..
రోజూ దాదాపు 70.5 లక్షల మంది ప్రయాణికులను తమ తమ గమ్యస్థానాలకు చేరవేస్తున్న ఘనత ముంబై లోకల్ రైళ్లు దక్కించుకున్నాయి. ప్రపంచ దేశాల్లో ఈ స్థాయిలో ప్రయాణికులను చేరవేసే రైల్వే వ్యవస్థ కేవలం ముంబైలో మాత్రమే ఉంది. రోజులో రెండు గంటలు మాత్రమే ఈ రైళ్లకు విరామం ఉంటుంది. ఇందుకే లోకల్ రైళ్లంటే ముంబైకర్లకు ప్రీతి. ఇదే విషయాన్ని గ్రహించిన డిస్కవరీ.. ముంబైకర్ల హృదయాలను దోచుకున్న లోకల్ రైళ్ల చరిత్ర ప్రసారం చేయాలని నిర్ణయించింది.