Disha Ravi
-
ఒక చట్టం... వేల వివాదాలు
124ఏ. బ్రిటిష్ వలస పాలకుల కాలం నాటి దేశద్రోహం చట్టం. సుప్రీంకోర్టు స్టే నేపథ్యంలో దీనిపై అంతటా చర్చ జరుగుతోంది. మన దేశంలో ఇది దుర్వినియోగమవుతుండటం నిజమేనా...? సెక్షన్ 124 ఏలో ఏముంది? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంపై ఎవరైనా మాటలతో, చేతలతో, సంకేతాలతో, ప్రదర్శనలతో, విద్వేషపూరిత వ్యాఖ్యలతో శత్రుత్వాన్ని ప్రదర్శిస్తే దేశద్రోహ నేరం కిందకి వస్తుంది. దీని కింద కేసు నమోదైతే బెయిల్ లభించదు. ముందస్తు నోటీసులు లేకుండా అరెస్టు చేయవచ్చు. నేరం రుజువైతే మూడేళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. దేశ ద్రోహం కేసులు ఎదుర్కొన్న వారు ప్రభుత్వోద్యోగాలకు అనర్హులు. ఎందుకు తెచ్చారు ? స్వాతంత్య్ర పోరాట సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహ జ్వాలల్ని అణిచేసేందుకు ఈ చట్టాన్ని తెచ్చారు. బ్రిటిషిండియా తొలి లా కమిషనర్ థామస్ మెకాలే రూపొందించిన ఈ చట్టాన్ని 1890లో 124ఏ సెక్షన్ కింద భారత శిక్షా స్మృతిలో చేర్చారు. దీనికింద 1891లో తొలిసారిగా జోగేంద్ర చంద్రబోస్ అనే పత్రికా సంపాదకుడిపై కేసు పెట్టారు. తర్వాత తిలక్ మొదలుకుని గాంధీ దాకా ప్రముఖులెందరో కూడా ఈ చట్టం కింద జైలుపాలయ్యారు. బ్రిటన్ మాత్రం దీన్ని 2009లో రద్దు చేసింది. ఆస్ట్రేలియా, సింగపూర్ కూడా ఈ చట్టాన్ని రద్దు చేశాయి. దిశ రవి నుంచి వరవరరావు వరకు కేంద్రంలో మోదీ ప్రభుత్వం రాజకీయంగా ఎదురు తిరిగిన వారిపై దేశద్రోహ చట్టాన్ని విస్తృతంగా ప్రయోగిస్తోందన్న ఆరోపణలున్నాయి. కశ్మీర్‌పై వ్యాఖ్యలు చేసినందుకు అరుంధతి రాయ్, రైతు ఉద్యమానికి మద్దతుగా టూల్ కిట్ రూపొందించిన సామాజిక కార్యకర్త దిశ రవి, హత్రాస్‌లో 19 ఏళ్ల దళిత మహిళ గ్యాంగ్ రేప్ కవరేజీకి వెళ్లిన జర్నలిస్టు సిద్దిఖి కపన్, పటీదార్ కోటా ఆందోళనలో పాల్గొన్న హార్దిక్ పటేల్, భీమా–కొరెగావ్ కేసులో సామాజిక కార్యకర్తలు సుధా భరద్వాజ్, వరవరరావు, కరోనా సంక్షోభంపై వ్యాఖ్యలకు జర్నలిస్టు వినోద్ దువా తదితరులపై దేశద్రోహ ఆరోపణలు మోపారు. ► 2015–20 మధ్య దేశవ్యాప్తంగా సెక్షన్ 124ఏ కింద 356 కేసులు నమోదయ్యాయి ► ఈ ఆరేళ్లలో 548 మంది అరెస్టయ్యారు. ఆరుగురికి మాత్రమే శిక్ష పడింది. ► 2010–20 మధ్య బిహార్‌లో 168, తమిళనాడులో 139, యూపీలో 115, జార్ఖండ్‌లో 62, కర్నాటకలో 50, ఒడిశాలో 30 కేసులు నమోదయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దిశారవికి బెయిల్: కుటుంబీకులను చూసి కంటతడి
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేలా చర్యలు చేపట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పర్యావరణ ఉద్యమకారిణి దిశ రవికి బెయిల్ లభించింది. రూ.లక్ష పూచీకత్తుగా చెల్లించి బెయిల్ పొందాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. టూల్ కిట్ కేసులో దిశ రవి అరెస్టయిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందు కోర్టుకు హాజరయ్యే సమయంలో కుటుంబసభ్యులను చూసి దిశా రవి భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి దిశా రవి సామాజిక మాధ్యమాల ద్వారా మద్దతు తెలిపిందని.. గణతంత్ర దినోత్సవం రోజు రెచ్చగొట్టేలా ప్రయత్నాలు చేసినట్లు దిశ రవిపై అభియోగాలు నమోదయ్యాయి. టూల్ కిట్ పేరుతో పక్కా ప్రణాళికతో సామాజిక మాధ్యమాల్లో పంచుకుందని దిశ రవిపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బెంగళూరులోని నివాసంలో 22 ఏళ్ల దిశా రవిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు మంగళవారం ఢిల్లీ కోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. విచారణ సందర్భంగా ధర్మాసనం ‘అసలు టూల్‌కిట్ ఏమిటి’ అని ప్రశ్నించింది. ఆధారాలు అస్పష్టంగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేస్తూ దిశా రవికి కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే రూ.లక్ష పూచీకత్తు చెల్లించడం దిశా రవికి కష్టతరమని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. ఇదే కేసులో నిఖితా జాకబ్, శంతను ములుక్‌లను కూడా ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి గతంలోనే బెయిల్ మంజూరైంది. -
దిశా రవికి ఒక రోజు పోలీసు కస్టడీ
న్యూఢిల్లీ: ‘టూల్ కిట్’ కేసులో ఇటీవల అరెస్ట్ అయిన పర్యావరణ పరిరక్షణ మహిళా కార్యకర్త దిశా రవిని ఒక రోజు పోలీసు కస్టడీకి సోమవారం ఢిల్లీలోని చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు అనుమతించింది. ఇతర నిందితులతో కలిపి ఆమెను విచారించేందుకు అనుమతించాలని పోలీసులు కోరడంతో మెజిస్ట్రేట్ పంకజ్ శర్మ ఈ ఆదేశాలిచ్చారు. అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టించిన కేసు ఇదని పోలీసులు కోర్టుకు తెలిపారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరిస్తూ రూపొందిన టూల్ కిట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడానికి సంబంధించి దిశా రవితో పాటు నికిత జాకోబ్, శంతను ములుక్‌లపై ఢిల్లీ పోలీసులు దేశద్రోహం సహా ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఎవరితో కలిపి తనను విచారించాలని పోలీసులు చెబుతున్నారో.. ఆ సహనిందితులు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారని, పోలీసు కస్టడీలో లేరని, అలాంటప్పుడు తన కస్టడీని పోలీసులు ఎలా కోరుతారని దిశా రవి మెజిస్ట్రేట్ దృష్టికి తీసుకువచ్చారు. జ్యూడీషియల్ కస్టడీలో ఉంచి కూడా సహ నిందితులతో కలిపి తనను విచారించే అవకాశం ఉందని వాదించారు. మరోవైపు, దిశా రవి బెయిల్ పిటిషన్ సెషన్స్ కోర్టులో పెండింగ్‌లో ఉందని, మంగళవారం దానిపై తీర్పు వెలువడనుందని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. -
దిశ రవి.. ఎఫ్ఎఫ్ఎఫ్ అంటే ఏమిటి?
న్యూఢిల్లీ: జూలై 2020న బహు తక్కువ మందికి పరిచయం ఉన్న మూడు చిన్న పర్యావరణ పరిరక్షణా బృందాలకు చెందిన వెబ్సైట్లను మూసివేసి, వారిపైన ఉపా చట్టం ప్రయోగిస్తామని ఢిల్లీ పోలీసులు హెచ్చరించినప్పుడు మొదటసారి వీరి పేర్లు వెలుగులోకి వచ్చాయి. అందులో ఒకటి ప్రస్తుతం టూల్‌కిట్ కేసులో అరెస్టయి పోలీసు కస్టడీలో ఉన్న దిశ రవికి సంబంధించిన వెబ్సైట్. ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్’’ఇండియా చాప్టర్‌కి దిశరవి సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. ఖలిస్తానీ సానుభూతి పరులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు వీరిని అరెస్టు చేసిన విషయం తెలిసందే. ఏమిటీ ఎఫ్ఎఫ్ఎఫ్ ? అసలింతకీ ఏమిటీ ఎఫ్ఎఫ్ఎఫ్? ఎఫ్ఎఫ్ఎఫ్ ఇండియా అనేది∙పర్యావరణ పరిరక్షణా సంస్థ. ఇది ప్రాజెక్టులకు అనుమతులు తదితరాలపైనా, పర్యావరణ సమస్యలపైనా, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చే నోటిఫికేషన్లపైనా ఈమెయిల్ క్యాంపెయిన్ చేస్తుంది. మతవిద్వేష అంశాలు.. అయితే ఎఫ్ఎఫ్ఎఫ్ ఇండియా వెబ్సైట్ ‘‘భారత సార్వభౌమాధికారానికి, శాంతికి, ప్రశాంతతకు, ప్రమాదకరంగా మారింది’’అని ఢిల్లీ పోలీసులు జూలై8, 2020న వెబ్సైట్ బాధ్యులకు నోటీసులు జారీ చేశారు. అలాగే వెబ్సైట్లో ‘‘మతపరమైన విద్వేషపూరిత అంశాలు, మెటీరియల్’’ఉన్నదని, ఇది సెక్షన్ 18 ప్రకారం(తీవ్ర వాద చర్యకు ఉసిగొల్పేదిగా, లేదా అందుకు కుట్రపన్నేదిగా)ఉన్నదని, ఇది అన్‌లాఫుల్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్) యాక్ట్(యుఏపీఏ)కిందకి వస్తుందని పోలీసులు హెచ్చరించారు. అయితే ఆ తరువాత వెంటనే ఢిల్లీ పోలీసులు ఎఫ్ఎఫ్ఎఫ్ వెబ్‌సైట్‌ని తిరిగి తెరిచేందుకు అనుమతించారు. ఆ తరువాతి రోజు నుంచి వెబ్సైట్ తిరిగి ఆరంభించారు. అయితే అప్పటి నుంచి ఆ వెబ్‌సైట్‌పై పోలీసులు ఓ కన్నేసి ఉంచారు. ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ఎఫ్ఎఫ్ఎఫ్ ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ అని అర్థం. అంటే మన భవిష్యత్తు కోసం శుక్రవారాన్ని కేటాయించండి అని. ప్రభుత్వాల చైతన్యం కోసం శుక్రవారాన్ని కేటాయించండి అన అర్థం. ప్రభుత్వ వర్గాల్లో పర్యావరణ చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు ప్రతి శుక్రవారం విద్యార్థులు నిరసన తెలిపే లక్ష్యంతో స్వీడన్‌కి చెందిన పర్యావరణ ఉద్యమకారణి గ్రేటాథన్బర్గ్ 2018లో ఎఫ్ఎఫ్ఎఫ్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ తరువాత ఏడాదికి ఎఫ్ఎఫ్ఎఫ్ ఇండియా చాప్టర్‌ని స్థాపించారు. ప్రస్తుతం ఇది దేశంలోని పలు నగరాల్లో ఉంది. దేశవ్యాప్తంగా 150 మంది పూర్తిస్థాయి పర్యావరణ కార్యకర్తలు ఇందులో పనిచేస్తున్నారు. ఇతర దేశాల్లోని ఏకీభావం ఉన్న పర్యావరణ పరిరక్షణా సంస్థలతో కలిసి ఎఫ్ఎఫ్ఎఫ్ పనిచేస్తుంది. అటవీ సంరక్షణకోసం ప్రచారోద్యమం గోవాలోని మొల్లెం అటవీప్రాంత పరిరక్షణ, జమ్మూలోని రైకా ఫారెస్ట్ పరిరక్షణోద్యమం, మధ్య ప్రదేశ్‌లోని దుమ్నా నేచర్ పార్క్‌ల పరిరక్షణలు ఈ పర్యావరణ సంస్థ చేపట్టిన ప్రచారకార్యక్రమాల్లో ప్రధానమైనవి. అరే కాలనీలో మెట్రో ప్రాజెక్టుకోసం వేలాది చెట్లను నరికివేస్తున్నప్పుడు 2019, అక్టోబర్‌లో, ఎఫ్ఎఫ్ఎఫ్ కార్యకర్తలకీ పోలీసులకీ మధ్య ఘర్షణ తలెత్తడంతో ఎఫ్ఎఫ్ఎఫ్కార్యకర్తలను కొందరిని అరెస్టు చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచ ప్రజల ఉద్యమం ‘‘పర్యావరణ న్యాయం కోసం ప్రపంచ ప్రజల ఉద్యమం’’(గ్లోబల్ పీపుల్స్ మూవ్మెంట్ ఫర్ క్లైమేట్ జస్టిస్) అనే నినాదంతో తమ వెబ్సైట్ లక్ష్యాన్ని ఈ ఎఫ్ఎఫ్ఎఫ్ సంస్థ సుస్పష్టంగా వెబ్సైట్లో ఉంచింది. ‘‘సమగ్ర, పర్యావరణ సమతుల్యత కోసం నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా ఉద్యమం నిర్వహిస్తామని, పర్యవారణ సమతుల్యత కోసం అహింసా మార్గంలో క్లైమేట్ స్ట్రయిక్, లేదా శాంతియుత ప్రదర్శనలు నిర్వహిస్తామని, తద్వారా రాష్ట్రప్రభుత్వాలు పర్యావరణ సంక్షోభాన్ని నిలువరించే చర్యలు చేపట్టేలా ఎఫ్ఎఫ్ఎఫ్ ఇండియా కృషి చేస్తుందని ఈ సంస్థ తన వెబ్సైట్లో స్పష్టం చేసింది. కుట్రదారులంటోన్న పోలీసులు ఏది ఏమైనా, దిశ, నికితా జాకబ్, శాంతాను ములుక్ లు రైతుల ఆందోళనకు మద్దతు పలికే గ్రేటాథన్ బర్గ్ టూల్‌కిట్ ని ట్వీట్ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రైతుల ఆందోళనను అవకాశంగా తీసుకొని భారత దేశాన్ని అస్థిరపరిచే ‘అంతర్జాతీయ కుట్ర’గా దీన్ని పోలీసులు అభివర్ణిస్తున్నారు. గ్లోబల్ క్లైమేట్ స్ట్రయిక్ 2019 సెప్టెంబర్‌లో ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ సంస్థ వాతావరణ మార్పులపై గ్లోబల్ క్లైమేట్ స్ట్రయిక్ కార్యక్రమంలో భాగంగా భారత్‌లో సైతం పలు ప్రదర్శనలు నిర్వహించింది. మొదట పర్యావరణ పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ప్రారంభమైన ఈ సంస్థకు చెందిన కార్యకర్తలు అనంతరం ఇతర సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్, ఎన్ఆర్సీ ఉద్యమాల్లో ఎఫ్ఎఫ్ఎఫ్ కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతోన్న రైతు ఆందోళనకి సైతం తమ మద్దతు తెలిపారు. అయితే వీరి ప్రథాన లక్ష్యం మాత్రం పర్యావరణ పరిరక్షణే. వీరంతా వాతావరణ మార్పులపై చైతన్యం తీసుకొచ్చే ప్రచార కార్యక్రమాల్లో భాగమై ఉంటారు. అందులో భాగంగా వీరు సరస్సులను శుభ్రపరచడం, పార్కులను పరిశుభ్రం చేయడం, సమస్యాత్మకంగా మారిన పర్యావరణ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తారు. చదవండి: #AT21: ఆ వయసులో నేను.. చదవండి: దిశ రవి అరెస్టుపై స్పందించిన ఆమె స్నేహితుడు -
#AT21: ఆ వయసులో నేను..
ఇరవై ఏళ్ల క్రితం యూనివర్సిటీలో డీన్ ఆర్డర్ కాపీని డీన్ ఎదుటే ముక్కలు ముక్కలుగా చింపి డీన్ ముఖాన విసిరికొట్టిన విద్యార్థి ఈరోజు.. జీవితం ఏరోజుకా రోజు పాస్ చేస్తుండే ఆర్డర్స్‌ని విధేయుడై ఒబే చేస్తుండవచ్చు. **** ఇరవై ఏళ్ల క్రితం నాన్న పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటే అమ్మ సపోర్టుతో ఇంట్లోంచి జంప్ అయిపోయి ఢిల్లీ చేరుకుని హాస్టల్ లో ఉండి, చిన్న ఉద్యోగం చేసుకుంటూ సివిల్స్‌కి ప్రిపేర్ అయిన అమ్మాయి ఈరోజు.. మహిళా సంక్షేమ శాఖలో పెద్ద ఆఫీసర్ గా పని చేస్తూ ఉండొచ్చు. **** మరీ ఇంత గంభీరమైనవే కాకున్నా.. ఆ వయసులో.. 21, 22 ఏళ్ల వయసులో.. తామెలా ఉన్నదీ ట్విట్టర్లో కొందరు షేర్ చేసుకుంటున్నారు! అందుకు వాళ్లకు ప్రేరణ నిచ్చింది.. ప్రస్తుతం వార్తల్లో ఉన్న ఐదుగురు యువతులు.. దిశ, సఫూరా, ప్రియాంక, నవదీప్, నిఖిత. బయటి ప్రపంచంలో, ఇంటర్నెట్లో రెండు చోట్లా ఇప్పుడు యువ ప్రభంజనమే విప్లవిస్తోంది! బయటి ప్రపంచానికి ఒక ప్రతిఫలనంగా, ఒక ప్రతిధ్వనిగా సోషల్ మీడియా పల్లవిస్తోంది. రైతు ఉద్యమాన్నే చూడండి. ఇప్పుడిది మెల్లిగా ఒక యువ మహోద్యమంగా మలుపు తీసుకుంటున్నట్లే ఉంది. దిశ రవి, నవదీప్ కౌర్, నిఖితా జాకబ్, సఫూరా జర్గార్, ప్రియాంక పాల్.. అంతా తమ ఇరవైలలో ఉన్న గళాలు, స్వరాలు, శంఖారావాలు. వీళ్లలో కొందరు జైళ్లలో ఉన్నారు. మరికొందరు జైళ్ల బయట అక్రమ నిర్బంధాలకు వ్యతిరేకంగా నినాదాలు ఇస్తున్నారు. అకస్మాత్తుగా ఇండియా కు జవసత్వాలు వచ్చినట్లయింది. నేటి యువతరం మధ్యలోకి నాటి ఇరవైల యువతీయువకులు కూడా వచ్చేసి ఆనాటి తమ పిడికిళ్లను ఉత్సాహంగా విప్పి చూపిస్తున్నారు. రెండు దశాబ్దాల క్రితం తామెలా ఉద్యమించిందీ, తమనెలా పెద్దవాళ్లు నిరుత్సాహపరిచిందీ, తామెలా గెలిచిందీ, తామెలా నిలిచిందీ.. ట్విట్టర్లో ‘ఎట్ 21’ హ్యాండిల్‌తో.. ‘ఆ వయసులో నేను’ అంటూ అనుభవాలు షేర్ చేసుకుంటున్నారు. అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఇప్పటి యూత్‌ని ప్రశంసిస్తున్నారు. అప్రమత్తంగా ఉండమని హెచ్చరిస్తున్నారు. వాళ్లను ఇంతగా ప్రభావితం చేసి, వాళ్ల పాత జ్ఞాపకాలు గుర్తు చేసిన ఈతరం యంగ్ లీడర్స్ ఈ ఐదుగురు గురించైతే తప్పకుండా తెలుసుకోవలసిందే. దిశా రవి (21) ప్రస్తుతం ఈమెపై ఢిల్లీలో విచారణ జరుగుతోంది. స్వీడన్ టీనేజ్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌కు భారత్‌లోని రైతు ఉద్యమ ‘వ్యూహ రచన’లో సహాయం చేసిందన్న ఆరోపణ పై బెంగుళూరు నుంచి దిశను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఆమెపై ‘టూల్‌కిట్’ కేసు పెట్టారు. రైతు ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు కుట్రపూరితంగా ఒక ప్రణాళిక తయారైందని అనుమానిస్తూ ఆ ప్రణాళికకే పోలీసులు ‘టూల్‌కిట్’ అని పేరుపెట్టారు. దిశ ‘ఫ్రైడేస్ ఫర్ ఫార్యూన్ ఇండియా’ (ఎఫ్.ఎఫ్.ఎఫ్.) సంస్థ వ్యవస్థాపకురాలు. పర్యావరణ పరిరక్షణ కోసం పని చేస్తుంటారు. 2018లో ఎఫ్.ఎఫ్.ఎఫ్. ప్రారంభం అయింది. భవిష్యత్ వాతావరణ సంక్షోభంపై దిశ కాలేజీ స్టూడెంట్స్‌ని చైతన్యవంతులను చేస్తుంటారు. పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నారు. గత ఆదివారం ఆమె బెంగళూరులోని తన ఇంట్లో ఉండగా ఢిల్లీ నుంచి వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ఢిల్లీలోని పాటియాలా కోర్టులో హాజరపరిచారు. టూల్‌కిట్‌తో ఆమెకు ఉన్నాయని అనుకుంటున్న సంబంధాలపై దర్యాప్తు జరుగుతోంది. ప్రస్తుతం దిశ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆమెను విడుదల చేయాలని బెంగళూరు, ఇతర నగరాలలో విద్యార్థులు ప్రదర్శనలు జరుపుతున్నారు. సఫూరా జర్గార్ (28) సఫూరా ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియాలో ఎం.ఫిల్. విద్యార్థిని. 2019 పౌరసత్వం సవరణ చట్టం ప్రదర్శనల్లో పాల్గొన్నందుకు గత ఏడాది ఏప్రిల్‌లో అరెస్ట్ అయ్యారు. అప్పటికి ఆమె గర్భిణి. 2020 ఢిల్లీ అల్లర్లకు కుట్ర పన్నారన్నది ఆమెపై ప్రధాన అభియోగం. ఆరో నెల గర్భిణిగా ఉన్నప్పుడు మానవతా దృక్పథంతో గత జూన్‌లో ఆమెను జైలు నుంచి విడుదల చేశారు. సఫూరా కశ్మీర్ అమ్మాయి. మానవ హక్కులు, మత సామరస్యం, శాంతియుత సహజీవనం వంటి వాటి మీద ప్రసంగాలు ఇస్తుంటారు. ప్రియాంకా పాల్ (19) ప్రియాంకకు ‘ఆర్ట్వోరింగ్’ అనే వెబ్సైట్ ఉంది. ఆమె చిత్రకారిణి, కవయిత్రి, రచయిత్రి, కథావ్యాఖ్యాత. ఎల్.జి.బి.టి. సభ్యురాలిగా తనని తాను ప్రకటించుకున్నారు. కులం, లైంగిక వివక్ష, మానసిక ఆరోగ్యం, బాడీ పాజిటివిటీ (తమ దేహాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఆత్మ విశ్వాసంతో అంగీకరించడం) వంటి సామాజిక అంశాలపై తన ఇన్‌స్టాగ్రామ్‌లో, ట్విట్టర్లో స్పష్టమైన, పదునైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. గత నవంబర్‌లో ప్రియాంక, కంగనా రనౌత్ ట్విట్టర్ వేదికగా మాటా మాటా అనుకున్నారు. మొదట కంగనానే ప్రియాంకను బాడీ షేమింగ్ చేయడంతో ఘర్షణ మొదలైంది. నవ్‌దీప్ కౌర్ (23) నవదీప్ కౌర్ ‘మజ్దూర్ అధికార్ సంఘటన్’ (మాస్) కార్యకర్త. ఢిల్లీ సరిహద్దులోని సింఘులో ఆమె పని చేస్తున్న ఫ్యాక్టరీ కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడటంపై ఆమె నోరు విప్పారు. ఫలితంగా ఫ్యాక్టరీ యాజమాన్యం ఆమెపై కేసులు పెట్టింది. జనవరి 12 నుంచి కౌర్ పంజాబ్‌లోని కర్నాల్ జైల్లో ఉన్నారు. ఈ దళిత యువతిపై జైల్లో లైంగిక అకృత్యాలు జరిగాయని, ఆమె లేవలేని పరిస్థితిలో ఉన్నారని సహ ఖైదీల నుంచి సమాచారం బయటికి పొక్కడంతో దేశవ్యాప్తంగా నవ్‌దీప్ కౌర్ విడుదల కోసం ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇప్పటికి మూడుసార్లు ఆమె బెయిల్ నిరాకరణకు గురైంది. ఢిల్లీలో పీహెచ్.డీ చేస్తున్న ఆమె చెల్లెలు రజ్వీర్ కౌర్ అక్కను విడిపించుకునేందుకు న్యాయ పోరాటం చేస్తున్నారు. సోమవారం ఒక కేసులో మాత్రం ఆమెకు బెయిలు లభించింది. 50 వేల రూపాయలు కట్టి, అవసరమైన పత్రాలు అందజేస్తే ఆ కేసులో బెయిలు లభించినప్పటికీ, రెండో కేసులో కూడా బెయిల్ వచ్చేంతవరకు నవ్‌దీప్ విడుదల అయ్యే అవకాశం లేదు. నిఖితా జాకబ్ (29) టూల్‌కిట్ కేసులో ఏ క్షణాన్నయినా అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్న మరో యువతి నిఖితా జాకబ్. ముంబైలో ఆమె లాయర్. దిశా రవితో కలిసి పుణెకు చెందిన శంతను, నిఖిత టూల్ కిట్ తయారు చేశారని.. వీళ్లంతా ఖలిస్తాన్ సాను భూతి సంస్థ ‘పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్’ నిర్వహించిన జూమ్ సమావేశానికి హాజరయ్యారని పోలీసుల ప్రధాన ఆరోపణ. ముందస్తు బెయిలు కోసం నిఖిత బాంబే కోర్టును ఆశయ్రించారు. -
దిశ రవికి గోవధ ఇష్టం ఉండదు.. అందుకే
న్యూఢిల్లీ/బెంగళూరు: ‘‘దిశ వాళ్లకు సాఫ్ట్ టార్గెట్. తను ఒక పోస్టర్ గర్ల్ లాంటిది. కాబట్టి తనను అరెస్టు చేస్తే మిగతా వాళ్లు గొంతెత్తాలంటే కాస్త వెనకడుగు వేస్తారు కదా. అందుకే ఇలా చేశారు’’ అని బెంగళూరుకు చెందిన యువ పర్యావరణవేత్త దిశ రవి స్నేహితుడు వినీత్ విన్సెంట్ అన్నారు. మ్యుజీషియన్‌గా పనిచేస్తున్న ఆయన, తన ఫ్రెండ్‌ను అరెస్టు చేయడం తనకు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదని పేర్కొన్నారు. కాగా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలో భాగంగా, ఢిల్లీలో జనవరి 26న జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్వీడిష్ యువకెరటం గ్రెటా థంబర్గ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ టూల్‌కిట్ వివాదానికి దారి తీసింది. ఈ అంశంపై దృష్టి సారించిన ఢిల్లీ పోలీసులు దిశ రవి, శాంతను ములుక్, నికితా జాకబ్ అనే ముగ్గురు యువతులపై అనుమానాలు వ్యక్తం చేశారు. గ్రెటా షేర్ చేసిన టూల్‌ను ఎడిట్ చేసి హింసకు ప్రేరేపించారన్న ఆరోపణలతో దిశ రవి, నికితను అరెస్టు చేశారు. శాంతను కోసం గాలిస్తున్నారు. వీరి అరెస్టు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన దిశ రవి ఫ్రెండ్ విన్సెంట్.. ‘‘దిశ అరెస్టు విషయం నన్ను షాక్‌కు గురిచేసింది. అదే సమయంలో జరిగేది ఇదే కదా అని కూడా అనిపించింది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలను అంతతేలికగా తీసుకోలేం. సోషల్ మీడియాలో ఓ పోస్టు పెడితే మీరు అరెస్టు అవుతారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మిమ్మల్ని జైళ్లో పెడతారు. అంతే కదా. దిశకు ఇలా జరిగిందంటే.. మనం కూడా ఏదో ఒకరోజు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోక తప్పదని అర్థమవుతోంది. ఏదేమైనా, అన్యాయానికి వ్యతిరేకంగా గళం విప్పిన దిశకు ఈ సందర్భంగా ధన్యవాదాలు చెబుతున్నా. దిశకు జీవ హింస ఇష్టం ఉండదు. గోవులను వధిస్తే తను తట్టుకోలేదు. అంతేకాదు, వాటి నుంచి పాలు సేకరిస్తూ, ఓ వస్తువులా భావించడం వంటి అంశాలకు తను వ్యతిరేకం. అందుకే మొక్కల ఉత్పత్తుల ద్వారానే ఇలాంటి అవసరాలు తీరే ఉద్దేశంతో నెలకొల్పిన కంపెనీలో తను పనిచేస్తోంది. దయచేసి యువత ఉద్దేశం ఏమిటో మీరు అర్థం చేసుకోండి. ప్రభుత్వానికి నేను చేసే విజ్ఞప్తి ఇదొక్కటే. దిశ లాంటి వాళ్లను అరెస్టు చేయాల్సిన అవసరం లేదు. తనతో ఒక్కసారి మాట్లాడి చూడండి. తనేమీ ఎక్కడికి పారిపోవడం లేదు కదా. తను అలాంటి పిరికి మనస్తత్వం కలది కాదు. ఆలోచించండి’’ అని విన్సెంట్ ఉద్వేగపూరితంగా మాట్లాడారు. దిశ అరెస్టును ఆయన ఈ సందర్భంగా ఖండించారు. చదవండి: టూల్‌కిట్ కేసు : కీలక విషయాలు వెల్లడి -
టూల్‌కిట్ వివాదం: కీలక విషయాలు వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ : టూల్‌కిట్ వ్యవహారంలో ముగ్గురు యువతుల అరెస్ట్ దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. రిపబ్లిక్ డే (జనవరి 26) సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై విచారణను వేగవంతం చేసిన పోలీసులు.. అరెస్ట్‌ల ప్రక్రియను షూరు చేశారు. తొలుత ఓ యువతిని అరెస్ట్ చేయగా.. అనంతరం మరో ఇద్దరిని అరెస్ట్ చేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ పర్యవరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన టూల్‌కిట్‌తో ఈ ముగ్గురు యువతులు (దిశరవి, శాంతాను, నికితా జాకబ్) ఎడిట్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం బెంగళూరుకు చెందిన యువ యాక్టివిస్ట్ దిశరవిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయగా.. 24 గంటలు గడవకముందే శాంతాను, నికితాలపై ఢిల్లీ హైకోర్టు నాన్‌బెయిల్‌వారెట్ జారీచేసింది. దీంతో ఢిల్లీ పోలీసులు నికితను అరెస్ట్ చేయగా.. శాంతాను పరారిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అరెస్ట్ నుంచి నాలుగు వారాల పాటు తనకు విముక్తి కల్పించాలని కోరుతూ నికితా బాంబే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలావుండగా.. రిపబ్లిక్ డే నాడు ఢిల్లీలో చోటుచేసుకున్న హింసకు సంబంధించిన ఘటనలో ఈ ముగ్గురు యువతుల పాత్రపై ఢిల్లీ పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశం ద్వారా వివరాలు తెలిపారు. ‘జనవరి 26న జరిగిన హింసాత్మక ఘటనతో దిశరవి, శాంతాను, నికితా జాకబ్‌కు ప్రత్యక్షంగా సంబంధముందని భావిస్తున్నాము. దీనికి సంబంధించిన పలు ఆధారాలను స్వాధీనం చేసుకున్నాం. స్వీడన్ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ తయారుచేసిన టూల్‌కిట్‌ను తొలుత దిశరవి ఎడిట్ చేశారు. అనంతరం శాంతాను, నికితా దీనిలో భాగస్వామ్యం అయ్యారు. కెనడాకు చెందిన చెందిన ఓ యువతి అందించిన సలహాలు, సూచనల ఆధారంగా సోషల్ మీడియాలో ఆ టూల్‌కిట్‌ను షేర్ చేశారు. టూల్‌కిట్‌ను టెలిగ్రామ్ ద్వారా గ్రెటా వీరికి షేర్ చేశారు. టూల్‌కిట్ గూగుల్ డాక్యుమెంట్‌ను ఎడిట్ చేసిన వారిలో దిశ ఒకరు. ఆ డాక్యుమెంట్లో మార్పులు చేర్పులతోపాటు వ్యాప్తి చేయడంలో దిశ కీలక కుట్రదారు. అంతేకాకుండా జనవరి 11న వీరంతా జూమ్ యాప్‌ద్వారా వీడియో కాల్లో మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలను త్వరలోనే కోర్టులో ప్రవేశపెడతాం. మరికొన్న విషయాల కోసం విచారణ జరుపుతున్నాం’ అని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. కాగా గ్రెటా థన్‌బర్గ్ షేర్ చేసిన టూల్‌కిట్‌ను ఖలికిస్తాన్ ఉగ్రవాదులు తయారుచేసినట్లుగా ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ టూల్‌కిట్ రైతులను రెచ్చగొట్టేలా ఉందంటూ ఈనెల 4న ఢిల్లీ పోలీసులు ఆమెపై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 120ఏ, 153ఏ కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు ముగ్గురు యువతుల అరెస్ట్‌పై విపక్షాలు భగ్గుమంటున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్రపూరింతగానే వీరిని అరెస్ట్ చేసిందని విపక్ష నేతలు మండిపడుతున్నారు. టూల్‌కిట్ వివాదం: పాక్ కీలక వ్యాఖ్యలు -
ఢిల్లీ పోలీసుల అదుపులో దిశ
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: బెంగళూరు ఐటీ సిటీకి చెందిన పర్యావరణ, సామాజిక కార్యకర్త దిశా రవి (22)ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దేశంలో జరుగుతున్న రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతూ స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన టూల్ కిట్‌ను దిశా రవి అప్లోడ్ చేశారు. ఈ టూల్‌కిట్ రైతులను రెచ్చగొట్టేలా ఉందంటూ ఈనెల 4న ఢిల్లీ పోలీసులు ఆమెపై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 120ఏ, 153ఏ కింద కేసులు నమోదు చేశారు. ‘టూల్‌కిట్ గూగుల్ డాక్యుమెంట్‌ను ఎడిట్ చేసిన వారిలో దిశ ఒకరు. ఆ డాక్యుమెంట్లో మార్పులు చేర్పులతోపాటు వ్యాప్తి చేయడంలో దిశ కీలక కుట్రదారు’అని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ డాక్యుమెంట్లో ట్విట్టర్లో తీవ్ర ప్రచారోద్యమం సహా రైతు సంఘాలకు మద్దతుగా చేపట్టాల్సిన వివిధ చర్యలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత దౌత్యకార్యాలయాల వద్ద నిరసనలు వంటివి ఉన్నాయి. దేశంలో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చేందుకు ఆమె కుట్ర పన్నిందనే ఆరోపణలకు అసలైన సాక్ష్యం ఆ టూల్‌కిట్‌నేనని అంటున్నారు. ఆమె ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని, విచారణ చేపట్టారు. దిశను ఢిల్లీ పోలీసులు బెంగళూరులోని నివాసంలో ఉండగా శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ కోర్టులో హాజరు పరిచారు. టూల్‌కిట్‌ను ఈ నెల 3వ తేదీన దిశ ఎడిట్ చేశారనీ, ఈ వ్యవహారంలో మరికొందరి పాత్ర కూడా ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. విచారణ సమయంలో దిశ కన్నీరు పెట్టుకున్నారు. రైతు ఆందోళనలకు మద్దతు తెలిపేందుకు టూల్‌కిట్ డాక్యుమెంట్‌లోని రెండు లైన్లను మాత్రమే ఎడిట్ చేశానని ఆమె తెలిపారు. డాక్యుమెంట్‌లోని అంశాలు అభ్యంతకరంగా ఉన్నందున దానిని తొలగించాలంటూ థన్‌బర్గ్‌ను కోరినట్లు కూడా వెల్లడించారు. మేజిస్ట్రేట్ దేవ్ సరోహా ఆమెను ఐదు రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. జనవరి 26వ తేదీన ఢిల్లీలో రైతుల ఆందోళన సమయంలో జరిగిన హింసాత్మక ఘటనలకు టూల్‌కిట్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. దీంతో టూల్‌కిట్ రూపకర్తల సమాచారం అందించాలంటూ గూగుల్, ట్విట్టర్లను కోరారు. ఆ రెండు సంస్థలు ఇచ్చిన వివరాల మేరకు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలో సామాజిక, సాంస్కృతిక, ఆర్థికపరమైన అలజడులను సృష్టించేందుకు కుట్ర పన్నారంటూ ఈనెల 4వ తేదీన ఖలిస్తాన్ అనుకూల పోయెటిక్ జస్టిస్ ఫౌండేషన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, దిశా రవి ‘ఫ్రైడే ఫర్ ఫ్యూచర్’అనే క్యాంపెయిన్‌కు సహ వ్యవస్థాపకురాలు. బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ చేసి ఒక ప్రైవేటు కంపెనీలో మేనేజర్ పనిచేస్తున్నారు. బెంగళూరులోని సోలదేవనహళ్లిలో దిశా నివాసం ఉంటున్నారు. కాగా, దిశ అరెస్టును సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) తీవ్రంగా ఖండించింది. ఆమెను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది.